
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో, తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో విస్తారంగా సాగయ్యే దానిమ్మ పంటకు వివిధ రకాల బాక్టీరియా, శిలీంధ్ర మచ్చ తెగుళ్ల బెడద ఎక్కువ. ముఖ్యంగా బాక్టీరియా ఆకుమచ్చ తెగులు.. సర్కోస్పోరా ఆకుమచ్చ, ఆంత్రాక్నోస్, తదితర శిలీంధ్ర మచ్చ తెగుళ్లు సోకుతున్నాయి. ఈ తెగుళ్ల వల్ల ఆకులు, పండ్లపై నల్లటి మచ్చలు ఏర్పడటం, గింజలు పాడవడం వల్ల రైతులకు తీవ్ర దిగుబడుల నష్టం జరుగుతున్నది. ఈ తెగుళ్లకు వాడుతున్న రసాయనిక మందుల అవశేషాల వల్ల వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతింటున్నది.
ఈ నేపథ్యంలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వృక్ష శాస్త్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ డి.సంధ్యా దీపిక పర్యవేక్షణలో పరిశోధకురాలు మొట్టాడి లక్ష్మిశ్రీ రైతులకు సులువుగా అందుబాటులో ఉండే మొక్కల కషాయాలతో దానిమ్మలో బాక్టీరియా, శిలీంధ్ర తెగుళ్ల నియంత్రణపై గత రెండున్నరేళ్లుగా చేసిన ప్రయోగాలు ఫలించాయి. విభిన్న మొక్కలతో పాటు మట్టిలో ఉండే బాసిల్లస్ జాతికి చెందిన బాక్టీరియాలతో దానిమ్మ తెగుళ్లను నియంత్రించే విధానాలను అభివృద్ధి చేశారు. ఇందుకు గాను లక్ష్మిశ్రీకి ఏయూ డాక్టరేట్ అందించింది.
మన ఊళ్లలో విరివిగా కనిపించే 50 రకాల పశువుల తినని మొక్కలను ఆమె పరిశోధనకు ఎంపిక చేసుకొని, ప్రయోగశాల(ఇన్‌విట్రో పద్ధతి)లో ప్రయోగాలు జరిపారు. 5 రకాల మొక్కలు చక్కని ఫలితాలనిచ్చాయి. దిరిశెన/నిద్రగన్నేరు (Albezzia lebbeck) చెట్టు ఆకులతో బాక్టీరియా, శిలీంధ్ర తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రించవచ్చని నిర్ధారణకు వచ్చినట్లు డా. లక్ష్మిశ్రీ తెలిపారు. చిన్న పల్లేరు (Tribulus terristris) మొక్కతో శిలీంధ్ర తెగుళ్లను అరికట్టవచ్చని తేలిందన్నారు. వీటితోపాటు బిళ్ల గన్నేరు (Catharanthus roseus) కాండం, ఆకులు.. బోడసరం (Shperanthus indicus) మొక్క, తమలపాకు (beetle wine) లతో కూడా దానిమ్మ తెగుళ్ల నియంత్రణలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
రైతులకు భారం కాకుండా, రసాయన రహితంగా దానిమ్మ పంట సాగు జరగాలనేది ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యమని ఆచార్య డి.సంధ్యా దీపిక తెలిపారు. దిరిశెన ఆకుల్లోని లుపియోల్ అనే రసాయనిక సమ్మేళనం వలన బాక్టీరియా నియంత్రణ సాధ్యపడినట్లు గుర్తించామన్నారు. మట్టిలో ఉండే బేసిల్లస్ జాతికి చెందిన ఎనిమిది రకాల సూక్ష్మజీవులను సేకరించి ప్రయోగాలు చేశారు. వీటిలో నాలుగు బాసిల్లస్ సూక్ష్మజీవులు దానిమ్మకు వ్యాపించిన బాక్టీరియాను నాశనం చేయడంలో సమర్ధవంతంగా పనిచేశాయి.
అక్టోబర్ నాటికి కషాయం మోతాదులు తెలుస్తాయి!
దిరిసెన తదితర ఐదు రకాల మొక్కల కషాయాలను, బాసిల్లస్ సూక్ష్మజీవులను ఈ ఏడాది మే నెల నుంచి రైతుల దానిమ్మ తోటల్లో ప్రయోగాత్మకంగా పిచికారీ చేసి, అధ్యయనం చేయబోతున్నాం. అక్టోబర్ నాటికి తుది ఫలితాలు వస్తాయి. ఏయే తెగుళ్లకు ఏయే మొక్కల కషాయాన్ని ఎంతెంత మోతాదులో వాడాల్సిందీ తెలుస్తుంది. భవిష్యత్తులో మరింత లోతైన పరిశోధనలు జరపాలని ఉంది.
డా. మొట్టాడి లక్ష్మిశ్రీ, వృక్ష శాస్త్ర విభాగం, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
– వేదుల నరసింహం సాక్షి, ఏయూ క్యాంపస్
Comments
Please login to add a commentAdd a comment