స్మైలీ అండ్ స్టైలీ | tapsi special interview for pink movie release in this month | Sakshi
Sakshi News home page

స్మైలీ అండ్ స్టైలీ

Published Sun, Sep 11 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

స్మైలీ అండ్ స్టైలీ

స్మైలీ అండ్ స్టైలీ

తాప్సీ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు.  స్మైలింగ్ ఫేస్.
తాప్సీ ఎప్పుడూ కొత్తగా కనబడతారు.  స్టైలింగ్ లుక్.
ఈ స్మైలింగ్, స్టైలింగ్...  సినిమాలకు కొత్త ఫ్లేవర్‌ను తెచ్చాయి.
ఇప్పుడు మరో కొత్త ఫ్లేవర్‌తో  తాప్సీ స్క్రీన్ మీదకు వస్తున్నారు.
వచ్చే శుక్రవారం ‘పింక్’ రిలీజ్.  అందులో తాప్సీ స్మైల్‌ని, స్టైల్‌ని మించి...
ఓ కొత్త యాంగిల్‌ని మీరు చూస్తారు.  ఇంటర్వ్యూ చదవండి.
ఆ కొత్తదనం ఏమిటో సినిమా రిలీజ్‌కు ముందే...  మీకు తెలుస్తుంది!

హలో తాప్సీ... చాన్నాళ్లయింది మిమ్మల్ని చూసి.. కొత్త హెయిర్ స్టైల్‌తో కొత్తగా కనిపిస్తున్నారు..
తాప్సీ: (నవ్వుతూ). ఈ స్టైల్ బాగుందనే అనుకుంటున్నా. ఓ సినిమా కోసం జుత్తుని కురచగా కత్తిరించు కున్నా. సినిమా కోసం ఏ హెయిర్ స్టైల్ అయినా నాకు ఓకే. అవసరమైతే డీ-గ్లామరైజ్డ్‌గా కూడా మారిపోతాను.

చేసే క్యారెక్టర్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టే, ఈ మధ్య ఏ సినిమా పడితే అది చేయడం లేదేమో?
నిజమేనండి. గ్లామరస్ రోల్స్ చాలా చేశా. ఇప్పుడూ అలాంటివి చేస్తా. కానీ, ఎక్కువగా నటనకు చాన్స్ ఉన్నవి మాత్రమే చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య హిందీలో చేసిన ‘బేబీ’ మంచి పేరు తెచ్చింది. ఇప్పుడీ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ‘పింక్’ ఇంకా మంచి పేరు తెస్తుంది.

‘పింక్’ అంత గొప్పగా ఉంటుందా?
అమితాబ్ బచ్చన్‌గారి కాంబినేషన్ లో ఈ సినిమా చేయడం ఓ మరచిపోలేని అనుభూతి. ఇందులో నాది చాలెంజింగ్ రోల్. లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి క్యారెక్టర్. రియల్ లైఫ్‌లో నాకలాంటి అనుభవాలు లేవు. కనీసం నాకు తెలిసినవాళ్ల లైఫ్‌లోనూ జరగలేదు. అందుకే ఓ విక్టిమ్ (బాధితురాలు)లా నేను ఫీలవలేను. అందువల్ల, ఈ క్యారెక్టర్ చేయడం సవాల్‌గా అనిపించింది. కోర్ట్‌లో సాగే సీన్స్‌లో ఎక్కువగా ఎమోషన్ అవడం, ఎక్కువ సీన్స్‌లో ఏడవడం.. ఇలా రియల్ లైఫ్‌లో నేను కానిది చేశాను. బాగా చేశాననే అనుకుంటున్నా. ఆడియన్స్ బాగా అప్రిషియేట్ చేస్తారని నమ్ముతున్నా.

రియల్ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నట్లే కనిపిస్తారు. సినిమా కోసం అందుకు విరుద్ధంగా చేసినప్పుడు ఏమనిపిస్తుంది?
యాక్టర్స్‌కి బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే.. స్క్రీన్‌పై డిఫరెంట్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్‌గా కనిపించవచ్చు. కాకపోతే మా మనస్తత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు వచ్చినప్పుడు చేయడానికి ఈజీగా ఉంటుంది. ‘పింక్’లో నేను చేసిన అరోరా క్యారెక్టర్ నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది.

అదేంటీ.. నిజజీవితంలో మీపై లైంగిక దాడులు జరగలేదన్నారు.. ఇప్పుడీ పాత్ర మీకు దగ్గరగా ఉందంటున్నారు?
చదువుకునే రోజుల్లో భయం భయంగా ఉండేదాన్ని. ఆ తర్వాత మైండ్ సెట్ మారింది. నేనెలా బతకాలని కోరుకుంటున్నానో అలానే ఉంటున్నాను. సొసైటీ గురించి పట్టించుకోను. ‘మనం ఇలా ఉంటే వాళ్లేమనుకుంటారో’ అని నా ఇష్టాలను మానుకోను. అలాగని, నేను లెక్కలేనితనంగా, ఇష్టం వచ్చినట్లుగా ఉండను. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అన్నది నా అభిప్రాయం. ఈ సినిమాలో నేను చేసిన అరోరా పాత్ర ఫీలింగ్ కూడా అదే. న్యాయం కోసం పోరాడుతుంది.

మీరు సినిమాలో పోరాడారు. రియల్‌గా లైంగిక దాడులు ఎదుర్కొనే అమ్మాయిలు పోరాటం చేస్తూనే ఉన్నారు..  అంతెందుకు మీ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన పెద్ద షాక్...
నేను ఢిల్లీ అమ్మాయినే. కానీ, నా చేతిలో ఏం ఉంటుంది? ఒకవేళ ఉంటే మాత్రం క్రిమినల్స్‌కి టఫ్ పనిష్‌మెంట్ ఇచ్చేదాన్ని. యాక్చువల్లీ.. మొత్తం ఇండియాలో ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. కానీ, క్యాపిటల్ సిటీ కాబట్టి ఢిల్లీలో మాగ్జిమమ్ వెలుగులోకొచ్చేస్తాయ్. చదువు లేకపోవడంవల్లనా? సరిగ్గా పెరగకపోవడం వల్లనా? దేనివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో అర్థం కావడంలేదు. కానీ, ఇలాంటి దారుణాల గురించి విన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది.

ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం మన రాజ్యాంగంలో రాసినవే దాదాపు ఇప్పటికీ పాటిస్తున్నాం. చట్టంలో సవరణలు జరిగితే ఏదైనా ఉపయోగం ఉంటుందా?
‘లా’ గురించి మాట్లాడడానికి నేను చాలా చిన్న వ్యక్తిని. నా అభిప్రాయం ఏంటంటే... పట్టుబడితే పనిష్‌మెంట్ కఠినంగా ఉండాలి. అప్పుడు తప్పు చేయాలనే ఆలోచన వచ్చినవాళ్ల వెన్నులో వణుకు పుడుతుంది. కానీ, ఎక్కడ భయపడుతున్నారు? తప్పు చేసినవాళ్లు (నిర్భయ కేసులో దోషులు) చట్టానికి భయపడలేదు. మృగాల్లా ప్రవర్తించారు. ‘చట్టం మనల్ని ఏం చేస్తుందిలే. నచ్చింది చేసేద్దాం, ఏమీ జరగదు’ అని రెచ్చిపోయారు. తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరి ఆలోచనా ఇలానే ఉండి ఉంటుంది. చట్టానికి ఎప్పుడైతే భయపడతారో.. అప్పుడే వీటన్నిటికి అడ్డుకట్ట పడుతుంది.

మీరు సెలబ్రిటీ కనుక చుట్టూ బాడీగార్డ్స్‌తో సేఫ్‌గా ఉంటారు.. నార్మల్ గాళ్స్‌కి సేఫ్టీ తక్కువే?
ఏదైనా ప్రెస్‌మీట్స్, ఈవెంట్స్ అప్పుడే మాకు బాడీగార్డ్స్ ఉంటారు. విడిగా ఉండరు కదా. ముంబయ్, ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు బాడీగార్డ్స్ ఉండరు. నార్మల్ గాళ్‌లానే ఉంటాను. ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు ఒంటరిగానే వెళతాను. అప్పుడు సేఫ్టీ చాలా తక్కువ.

సెలబ్రిటీలు బయటికొస్తే చాలు.. జనాలు గుమిగూడతారు. ఉదాహరణకు మొన్న మీరు బెంగళూరు వెళ్లినప్పుడు కొంతమంది చుట్టుముట్టేశారు...
సెలబ్రిటీల లైఫ్‌లో ఇలాంటివి కామన్. మమ్మల్ని దగ్గరగా చూడాలనుకుంటారు. వీలైతే తాకాలనుకుంటారు. అదంతా అభిమానంతోనే అని నా ఫీలింగ్. ఫ్యాన్స్ ఎప్పుడూ హాని చేయాలనుకోరు. కానీ, కొంతమంది మాత్రం ఎక్కడెక్కడో టచ్ చేయాలని చూస్తారు. ఎగ్జైట్‌మెంట్ వలన వాళ్లను వాళ్లు కంట్రోల్ చేసుకోలేరు. అత్యుత్సాహంతో సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నామనే విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటారు. హద్దులు దాటనంతరవకూ మాకు బాగానే ఉంటుంది. అభిమానం హద్దులు దాటితేనే అసౌకర్యంగా ఉంటుంది.

ఆ సమయాల్లో మీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు?
కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుంటా. ‘టికెట్ కొని నీ సినిమా చూసే ప్రేక్షకులు వీళ్లే. తిట్టకు. వీలైతే పెదాల పైకి నవ్వు తెచ్చుకో. కోపాన్ని కంట్రోల్ చేసుకో. వీళ్లంతా నీవాళ్లే’ అనుకుంటాను. కోపం ఎగిరిపోతుంది.


నా కూతుర్ని అలా పెంచుతా!

ఐదు, పదేళ్ల తర్వాత మీరు తల్లవుతారు కదా. అప్పుడు మీకు పాప కావాలా? బాబా?
నాకు పాప కావాలి. బాబు ఇష్టం కాదని కాదు. పాపని ఎందుకు కోరుకుంటున్నానంటే నేను చేయలేనివన్నీ నా కూతురు చేయాలి. చాలా హ్యాపీగా ఉండాలి.

ఏంటి మీరు చేయలేకపోయినవి?
నా టీనేజ్‌లో నేను భయపడుతూ బతికాను. ఎవరైనా అబ్బాయిలు కామెంట్ చేస్తే, నన్ను తప్పుగా అనుకుంటారేమోనని సంకోచం. కానీ, నా కూతురు అలా భయపడకూడదు. ‘తప్పు చేసినవాడు భయపడాలి? మనం కాదు’ అని క్లియర్‌గా చెబుతాను. మా ఇంట్లో నాకు మా అమ్మానాన్న కొన్ని హద్దులు పెట్టారు. సమాజంలో పరిస్థితులకు భయపడి అలా చేశారు. నేను వాళ్లని తప్పు పట్టడంలేదు. కానీ, నా కూతురికి మాత్రం నేను లేని పోని హద్దులు పెట్టను. స్వేచ్ఛగా బతకమంటాను. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకునేంత కాన్ఫిడెన్స్‌గా పెంచుతాను.

సెలబ్రిటీ కాకముందు ఎలా రియాక్ట్ అయ్యేవారు?
భయపడేదాన్ని. బస్‌లో వెళుతున్నప్పుడో, పబ్లిక్ ప్లేసెస్‌లోనో ఎవరైనా టచ్ చేస్తే వణికిపోయేదాన్ని. ఎందుకంటే, ‘మనదే తప్పు, అందుకే ఇలా జరిగింది’ అనుకునేదాన్ని. స్టార్టింగ్ నుంచీ పేరెంట్స్ అమ్మాయిలకు ఆంక్షలు పెట్టడం  వల్లే  అమ్మాయిల్లో ఇలా భయం పెరుగుతుంది. అబ్బాయిలు తాకినప్పుడు ఆ అమ్మాయి మీద జాలిపడేవాళ్లు చాలా తక్కువ, అమ్మాయిదే తప్పనడానికి రెడీ అయ్యేవాళ్లు ఎక్కువ ఉంటారు. అందుకే, అబ్బాయి తప్పు చేసినా అమ్మాయి తాను తప్పు చేసినట్లుగా ఫీలవుతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే అమ్మాయిలు తిరగబడాలి. బుద్ధి చెప్పడం మొదలుపెడితే... తాకడానికి కాదు కదా.. కనీసం కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడతారు.

అమ్మాయిలకు బోల్డన్ని హద్దులు.. అబ్బాయిలకు కావల్సినంత స్వేచ్ఛ. అబ్బాయిలకూ హద్దులు విధిస్తే బాగుంటుంది కదా?
నిజంగా బాగుంటుంది. అమ్మాయిలపై దాడులు తగ్గుతాయని నా అభిప్రాయం. ఓ అమ్మాయి ఇవి చేయాలి. ఇవి చేయకూడదు. ఇక్కడికి వెళ్లాలి, అక్కడికి వెళ్లకూడదు. సన్‌సెట్ తర్వాత, లేట్ నైట్ పార్టీలకు వెళితే అంతే సంగతులు.. అంటూ అమ్మాయిలు ఏం చేయకూడదో పెద్ద లిస్ట్ ఉంది. ఇలాంటి లిస్ట్ అబ్బాయిలకు ఇవ్వలేదు. అబ్బాయిలకూ ఇస్తే, వాళ్లు విచ్చలవిడిగా తిరగరు. లేట్ నైట్స్‌లో ఇంటి పట్టునే ఉంటారు. చాలా సమస్యలు తగ్గుతాయి.

ప్రొఫెషనల్‌గా హ్యాపీ. పర్సనల్‌గా సింగిల్‌గానే ఉన్నారు?
పెళ్లి గురించే అడుగుతున్నారు కదా. బాలీవుడ్‌లో ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను. ఇంకా చాలా సాధించాలి.

మ్యారేజ్‌కి రైట్ టైమ్ అనేది ఉంటుందేమో?
నా దృష్టిలో పెళ్లికి టైమ్ అంటూ లేదు. ఎప్పుడనిపిస్తే అప్పుడు చేసుకోవాలి. నాకిప్పుడు అనిపించడంలేదు. ప్రొఫెషనల్‌గా బాగా వర్క్ చేశాం అనే తృప్తి లభించాక పెళ్లి చేసుకునేంత టైమ్ ఉంటుంది. అదే నాకు రైట్ టైమ్.

అంటే.. పాతిక నుంచి 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం మంచిదంటారు కదా?
ఆ ఆలోచనలో మార్పు రావాలి. ఏజ్ దాటుతోంది కదా అని బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పుడు, అది వర్కవుట్ అయితే ఓకే. ఫోర్డ్స్ మ్యారేజెస్ ఎప్పుడూ సమస్యాత్మకంగానే సాగుతాయి. అది మంచిది కాదు. మ్యారీడ్ లైఫ్  బాగుండాలంటే ఇష్టం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి.

ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నట్లుగా... ఇష్టం వచ్చినప్పుడు పిల్లల్ని కనేంతగా ఫిజికల్ సిస్టమ్ సపోర్ట్ చేయదు?
ఇది ఒకప్పటి మాట. 20 ఏళ్లల్లోనే కాదు.. 60 ఏళ్లల్లోనూ పిల్లల్ని కనే సామర్థ్యం ఉంది. సైన్స్ పరంగా మంచి మార్పొచ్చింది. టెక్నాలజీ అభివృద్ధి చెందింది. సైన్స్, టెక్నాలజీ సపోర్ట్‌తో హ్యాపీగా తల్లి కావచ్చు. మొన్నీ మధ్యే ఓ అరవయ్యేళ్ల మహిళ తల్లయ్యారు.

ఫైనల్లీ తెలుగుకి ఎందుకు దూరమయ్యారు?
నేను దూరం కాలేదండి బాబూ. ప్లీజ్.. మంచి అవకాశాలివ్వండి. ఇప్పుడు నేను చేస్తున్నవాటిలో తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘ఘాజి’ అనే సినిమా ఒకటి. హైదరాబాద్ నా సెకండ్ హోమ్. నటిగా నాకు సవాల్‌గా నిలిచే క్యారెక్టర్స్ ఆశిస్తున్నా. ఎవరైనా ఇస్తే, తప్పకుండా చేస్తా.  - డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement