
డాక్టర్ కల్పన
పద్నాలుగేళ్ల క్రితం నేను హౌజ్‌వైఫ్‌ని. ఇద్దరు చిన్న పిల్లల తల్లిని. వారిని వదిలి ఉద్యోగానికి వెళ్లడం కష్టంగా ఉండేది. ఏదైనా సొంతంగా స్కిల్ ప్రోగ్రామ్ కోర్సు మొదలుపెడితే బాగుంటుందని అనిపించింది. అన్ని రంగాలను గమనించాను. ఏ రంగంలోనైనా సరే ఇంట గెలిచి, రచ్చగెలవాలంటారు. అలా గెలవాలంటే ఎదుటి మనిషిని ఆకట్టుకునేలా మాట్లాడాలి. చాలా మంది ‘మాట’ నైపుణ్యం లేని కారణంగా ప్రతిభ ఉండీ వెనుకబడటం గమనించాను. సమాజంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత అవసరమో గుర్తించి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశాను. నెలలో రెండు సెషన్స్ తీసుకుంటాను. ప్రతి ఆదివారం పూర్తి క్లాస్ ఉంటుంది. ప్రతీ బ్యాచ్‌లోనూ సగం మంది మహిళలు ఉంటున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకునేవారు, ఉన్నతి సాధించాలనుకునేవారూ క్లాసులకు అటెండ్ అవుతుంటారు. సాధారణంగా రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళల దగ్గర చాలా సమాచారం ఉంటుంది. కానీ, మైక్ దగ్గరకు రాగానే ఒక రకమైన భయంతో వెనక్కి వెళ్లిపోతుంటారు. వారికి ఎన్నో సూచనలు ఇస్తుంటాం. వాటిలో...
∙‘మాట’ రాజకీయ రంగంలో ఉన్నవారికి మరింత అవసరం. ఏ భాషలో మాట్లాడినా సరే ఎదుటివారికి మనం చెప్పదలుచుకున్న విషయం స్పష్టంగా చేరాలి. ∙ఇంట్లో మాట్లాడటం వేరు. నలుగురిలో ఆకట్టుకునేలా మాట్లాడటం వేరు. ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ల ద్వారా మనల్ని మనం ఎలా నిరూపించుకోవచ్చో తెలుస్తుంది, ఎలా కమ్యూనికేట్ చేయవచ్చో తెలుస్తుంది. సుష్మాస్వరాజ్, నిర్మలాసీతారామన్, స్మృతి ఇరానీ.. వంటి మహిళా నేతల ప్రసంగాలను చూపిస్తూ, వారి ఆత్మవిశ్వాసాన్ని పరిశీలించమంటాను. గ్రామాలలో సర్పంచ్‌గా, పట్టణాల్లో కార్పోరేటర్‌గా ఉన్నవాళ్లూ మా దగ్గర క్లాస్‌లు తీసుకున్నవారిలో ఉన్నారు. ‘మేం ఇప్పుడు బాగా మాట్లాడగలుగుతున్నాం’ అని చెబుతుంటారు. వారు ‘మాట’ నైపుణ్యాలను ఎలా పెంచుకున్నారో క్లాసులో వారి చేతనే చెప్పిస్తాం. ∙కాన్ఫిడెంట్‌గా ఉండటం ముఖ్యం. దీని వల్ల బెరుకు, భయం దూరం అవుతాయి. ∙ముందుగా 5 పాయింట్స్ నోట్ చేసుకొని చెప్పమంటాం, దీంట్లో పంచ్ డైలాగ్‌తో మీటింగ్‌ని ఎండ్ చేయమంటాం. ఆ తర్వాత పాయింట్స్ సంఖ్య పెంచుతూ, మధ్య మధ్యలో డైలాగ్స్ స్థాయి పెంచుతూ మాటలో నైపుణ్యాలు పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ∙కాలేజీ అమ్మాయిలకు కూడా ఈ శిక్షణా తరగతులు ఇప్పిస్తే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారు వెలుగులోకి వస్తారు. తమ సత్తా చాటుతారు.
– డాక్టర్ కల్పన, డైరెక్టర్, మీడియా జంక్షన్, ముషీరాబాద్, హైదరాబాద్