కన్నీళ్లూ... తాగలేదు..!
వీక్షణం
తిండి లేకపోయినా కొన్ని రోజులు ఉండవచ్చు కానీ, మంచినీళ్లు తాగకుండా కొన్ని గంటలు ఉండాలన్నా కష్టమే. కానీ బార్బరా వార్‌డ (43)కి మాత్రం యేళ్లుగా నీళ్లు తాగకుండానే బతుకుతోంది. ఎందుకంటే... నీళ్లు తాగితే ఆమె ప్రాణాలే పోతాయి. అందరూ ప్రాణాలు నిలబెట్టుకోవడానికి నీళ్లు తాగితే, బార్బరా మాత్రం తన ప్రాణాలు కాపాడుకోవడానికి నీటికి దూరంగా ఉంటోంది.
కొన్నేళ్ల క్రితం స్నానం చేస్తుండగా బార్బరా షాక్ తిన్నట్టుగా అయిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే, ఆమె ఓ అరుదైన వ్యాధితో బాధ పడుతోందని వైద్యులు చెప్పారు. కొన్ని కోట్ల మందిలో ఒకరికి వచ్చే ఆ వ్యాధి లక్షణాలు విచిత్రంగా ఉంటాయి. వాళ్లు నీటికి దూరంగా ఉండాలి. నీరు తాగకూడదు. అసలు నీటిని ముట్టనే కూడదు. కాస్త నీరు తగిలినా ఒళ్లంతా ర్యాషెస్ వస్తాయి. తుమ్ముల్లా మొదలై చివరకు ఊపిరాడదు. వెంటనే మందులు తీసుకోకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంది.
ఈ సమస్యతో కొన్నేళ్లుగా నరకం చూస్తోంది బార్బరా. స్నానం చేయడానికి లేదు. బాడీ స్ప్రే వేసుకున్నా ప్రమాదమే. నీళ్లు తాగడానికి లేదు. బాధ కలిగితే కనీసం మనసారా ఏడవడానికి కూడా లేదు. ఏడిస్తే ఆ కన్నీళ్లే ఆమె ప్రాణాలు తీసేస్తాయి. చెమట పట్టినా రిస్కే. దాంతో ప్రతిక్షణం భయపడుతూ బతుకుతోంది. భర్తతో, పిల్లలతో సంతోషంగా గడపడానిక్కూడా లేదని కుమిలిపోతోంది!