జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని సూత్రాలు రెండున్నాయి. ఒకటి.. డబ్బు పోగొట్టుకోవద్దు. రెండు... మొదటి సూత్రాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దు.- వారెన్ బఫెట్
టెక్ హెల్ప్..
బడ్జెట్ అదుపులో ఉండాలంటే ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవాల్సిందే. ఆర్థిక లక్ష్యాల సాధనలో ఇదే కీలకం. ఇందుకోసం పర్సనల్ ఫైనాన్స్ ప్రణాళికలకు కాస్త టెక్నాలజీని కూడా తోడు చేయండి. అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్లు, స్మార్ట్‌ఫోన్ యాప్స్ మీ కోసం..
Expensify
తరచు ప్రయాణాలు చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. దీంతో ఖర్చులు, క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లు, బ్యాంక్ ఖాతాల లావాదేవీలు అన్నిటినీ ట్రాక్ చేసుకోవచ్చు. అంతే కాదు, దీన్లో బిల్ట్ ఇన్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా ఉంది. దీంతో రసీదులను స్కాన్ చేసుకుని వివరాలను రికార్డు చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన కోసం కావాలంటే ఖర్చుల వివరాలతో కూడిన రిపోర్టు కూడా ఇది తయారు చేసిపెడుతుంది.
TOSHL Finance
వారంవారీ, నెలవారీ బడ్జెట్‌లను దీన్లో సెట్ చేసి ఉంచుకోవచ్చు. ఖర్చులను ట్రాక్ చేసుకుంటూ, బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దీన్లోని బిల్స్ ఆర్గనైజర్లో ప్రతి నెలా కట్టాల్సిన బిల్లులు వగైరా వాటి గురించి ఫీడ్ చేసి ఉంచితే... గడువుకు కాస్త ముందుగా అలర్ట్ చేస్తుంది. విదేశాల్లో ప్రయాణించేటప్పుడు కూడా దేశీ కరెన్సీలో ఖర్చులపై కన్నేసి ఉంచేందుకు కరెన్సీ కన్వర్టర్ ఫీచర్ ఉంది. మొత్తం ఆర్థిక లావాదేవీలు గ్రాఫ్ రూపంలో కూడా చూపిస్తుంది.
Daily Expence Manager
పేరుకి తగినట్లే రోజువారీ ఖర్చులు, ఆదాయాలను ట్రాక్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ యాప్. కేటగిరీ ప్రకారం ఖర్చులు చూసుకోవచ్చు. కట్టాల్సిన బిల్లులు మొదలైన వాటి గురించి ముందుగా రిమైండర్లు పెట్టుకోవచ్చు.
Expence Tracker
ఆదాయాలు, వ్యయాలపై కన్నేసి ఉంచడానికి ఉపయోగపడే మరో యాప్ ఇది. ఇందులో ముందుగానే కొన్ని కేటగిరీలు (ఫుడ్, ఎంటర్‌టైన్‌మెంట్, వైద్యం మొదలైనవి) పొందుపరిచి ఉంటాయి. కావాలంటే మరికొన్ని జోడిం చుకోవచ్చు. ఆదాయం ఎంత? ఖర్చెంత? మిగిలిందెంత? అనేది చిటికెలో తెలుసుకోవచ్చు.