ముంబైకి చెందిన 21 ఏళ్ల తేజస్వీ ప్రభుల్కర్ తన ఒంటి మీద 103 పచ్చబొట్లతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. అయితే దాని ప్రతిఫలంగా సమాజం నుంచి ఎదుర్కొంటున్న స్పందన అంత ప్రోత్సాహకరంగా లేదు.
ఇదే ఏ అమెరికాయో, ఫ్రాన్సో అయితే పెద్ద పట్టించుకునేవారు కాదేమో కాని భారతదేశంలో పచ్చబొట్టును ఆడపిల్ల వేసుకోవడం మచ్చగానే భావిస్తారు. అదీ ఒకటో రెండో కాకుండా ఏకంగా 103 సార్లంటే గుండెలు బాదుకుంటారు. అయినప్పటికీ తేజస్వీ అలా ఎందుకు చేసింది? ‘నేను చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసేదాన్ని. మా అమ్మ ఈ కళను ఉపయోగించుకో అని చెప్పింది. 17 ఏళ్ల వయసులో మొదటిసారి నా పేరును పచ్చబొట్టు వేయించుకున్నా. ఆ తర్వాత పచ్చబొట్ల మీద మోజు పెరిగింది. నేనే టాటూ ఆర్టిస్ట్‌గా మారుదామని నిశ్చయించుకున్నా. టాటూ ఆర్టిస్ట్‌కు డిగ్రీతో ఏం పని అని మానేశా.చదువు మానేసి 20 ఏళ్లకు దాదాపు 30 పచ్చబొట్లతో తయారయ్యేసరికి మా ఇంట్లో వాళ్లు దాదాపు నన్ను వదిలేశారు. ఇరుగు పొరుగు పిచ్చిదాన్నని అనుకున్నారు. చాలామంది ఇలాగైతే నీకు పెళ్లెలా అవుతుంది అని దిగులు పడుతుంటారు. ముందు కొంత ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అలవాటైపోయింది’ అంటుంది తేజస్వి.
తేజస్వి పూర్తి బట్టలు ధరించి వెళ్లినా ఆమె మిగిలిన శరీరంలో ఉన్న పచ్చబొట్లు జనాన్ని ఆకర్షిస్తాయి. ఇక తక్కువ బట్టలు వేసుకొని వెళితే దారిన పోయేవారంతా ఆమెనే చూస్తూ ఉంటారు.‘చాలామంది నన్ను ఈ దేశం అమ్మాయిని కాదనుకుంటారు. తెలిశాక చీవాట్లు పెడతారు. కొందరైతే ఇంత నొప్పిని ఎలా తట్టుకుంటావ్ అంటారు. నాకు మాత్రం పచ్చబొట్లతో ఉన్న నా శరీరం ఇష్టం. నన్ను ఇలాగే చూడండి. నా రూపం ద్వారా నన్ను జడ్జ్ చేయకండి’ అంటుంది తేజస్వి. తేజస్వి ఇంకా కొన్ని శరీర భాగాలను మరిన్ని పచ్చబొట్ల కోసం వదిలేసిందట. వాటిని కూడా పచ్చబొట్లతో నింపుతాను అంటోంది. ‘నేనూ అందరిలాంటి అమ్మాయినే. వంట చేస్తాను. నా పనులు నేను చేసుకుంటాను. నా జీవితం ఇప్పుడే మొదలైంది. ముగిసిపోలేదు. నా టాటూలు నా వ్యక్తిగత విషయంగా వదిలేయండి’ అంటుంది తేజస్వి.భారతదేశంలో ఇలాంటి విషయాలు అంత తొందరగా మింగుడు పడవు. ఆమె వార్తల్లోకి ఎక్కడానికి ఈ పచ్చబొట్లు ఉపయోగపడ్డాయి కాని జీవితంలో స్థిరపడటానికి ఎలా ఉపయోగపడతాయా అని కొందరికి సందేహంగా ఉంది. సందేహాలను జనానికి వదిలి తేజస్వి మాత్రం తాను వేయించుకోబోయే తర్వాతి పచ్చబొట్టు కోసం ఆలోచిస్తూ ఉంది.ఇష్ట కామ్య సిద్ధి రస్తు.
Comments
Please login to add a commentAdd a comment