భువన సుందరి | Tejaswini Completes All Stages of The Miss Earth India Contest | Sakshi
Sakshi News home page

భువన సుందరి

Published Mon, Sep 16 2019 12:22 AM | Last Updated on Mon, Sep 16 2019 12:22 AM

Tejaswini Completes All Stages of The Miss Earth India Contest - Sakshi

అమ్మాయి పుట్టింది.లక్ష్మీదేవి పుట్టిందనలేదెవ్వరూ..‘బ్యూటీ క్వీన్‌’ పుట్టిందన్నారు.అంతా సంతోషించారు.ఆ తర్వాత మర్చిపోయారు.కానీ... ఆ అమ్మాయి మర్చిపోలేదు.ఎంబీబీఎస్‌ పట్టా పుచ్చుకున్న తర్వాత పీజీకి వెళ్లేలోపు ఒక ప్రయత్నం చేసింది.ఢిల్లీలో బ్యూటీ కాంటెస్ట్‌కి వెళ్లింది.‘మిస్‌ ఎర్త్‌ ఇండియా’ కిరీటంతో తిరిగొచ్చింది.

‘‘మా అమ్మానాన్నలకు నా మీద నమ్మకం ఉంది. నేను సరైన మార్గంలోనే నడుస్తానని వాళ్లకు తెలుసు. ఆడపిల్లను అయిన కారణంగా ఏదైనా అవాంఛనీయమైన పరిస్థితి ఎదురైతే, ఆ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోగలిగిన ధైర్యం నాలో ఉందని కూడా మా అమ్మానాన్నలకు తెలుసు. అందుకే వాళ్లు నన్ను నా స్వభావానికి అనుగుణంగా నడుచుకోనిస్తున్నారు. కాబట్టి నేను నా మనసు చెప్పినట్లు అనుసరించడమే నాకు సంతోషం. నేను సంతోషంగా ఉండడమే మా అమ్మానాన్నలకు సంతోషం’’ ఇది తేజస్విని మనోజ్ఞకు ‘మిస్‌ ఎర్త్‌ ఇండియా’ కిరీటం పెట్టిన సమాధానం. ఈ ఏడాది ఆగస్టులో న్యూఢిల్లీలో జరిగిన ‘మిస్‌ ఎర్త్‌ ఇండియా’ పోటీల్లో విజయం సాధించిన ఈ 23 ఏళ్ల అమ్మాయి వచ్చే నెల (అక్టోబర్‌)లో జరిగే మిస్‌ ఎర్త్‌ 2019 పోటీ కోసం ఫిలిప్పీన్స్‌ వెళ్లడానికి సమాయత్తమవుతోంది.

మిస్‌ ఎర్త్‌ ఇండియా పోటీలో అన్ని దశలనూ పూర్తి చేసుకున్న తేజస్విని మనోజ్ఞను నిర్వహకులు చివరగా ‘మీ టూ... ఉద్యమం విస్తృతమైన నేపథ్యంలో ఆ ప్రభావం మీ కుటుంబం మీద ఎలా ఉంది? ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఈ పోటీలో పాల్గొనడానికి మీ తల్లిదండ్రులు సమ్మతించారా’ అని అడిగినప్పుడు తేజస్విని మనోజ్ఞ పై సమాధానమిచ్చారు. ఆమె సమాధానంలో వ్యక్తమైన పరిణతి అమ్మాయిలకు మార్గదర్శనం. సమాధానమిచ్చేటప్పుడు ఆమెలో తొణికిసలాడిన ఆత్మవిశ్వాసం అమ్మానాన్నల గొప్ప పెంపకానిది. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి బ్యూటీ కాంటెస్ట్‌కు వెళ్లడమే ఓ ఆశ్చర్యం, కిరీటాన్ని గెలుచుకుని రావడం ఓ అద్భుతం. అంతర్జాతీయ వేదిక మీద భారతదేశానికి ప్రతినిధిగా మెరవడం తెలుగువాళ్లందరికీ గర్వకారణం. ఇందుకు బీజం పడింది సుస్మితాసేన్‌ మిస్‌ యూనివర్స్‌ కిరీటం గెలుచుకున్నప్పుడు.

అది ఎప్పటి మాట అని... విడ్డూరంగా అనిపించినా సరే ఇదే నిజం. 1994లో మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని గెలుచుకున్నప్పటి సంగతి. అసలు 1992లో మధుసప్రే మిస్‌ యూనివర్స్‌ సెకండ్‌ రన్నర్‌ అప్‌గా నిలిచినప్పుడే... ఈ అందాల కిరీటం సామాన్య భారతీయుల దృష్టిని ఆకర్షించింది. తర్వాత రెండేళ్లకే ఆ కలను సుస్మితా సేన్‌ నిజం చేసింది. ఆ కిరీటాన్ని భారతదేశం మొత్తం ఆస్వాదించింది. అప్పుడు పుట్టింది తేజస్విని మనోజ్ఞ. చూడడానికి వచ్చిన వాళ్లు పుత్తడిబొమ్మలా ఉన్న మనోజ్ఞను చేతుల్లోకి తీసుకుని ‘మీ ఇంట్లో మిస్‌ యూనివర్స్‌ పుట్టింది’ అనేవాళ్లు. పాపాయి పెరిగి పెద్దవుతున్న క్రమంలో ఫంక్షన్‌లలో కలిసిన బంధువులు, స్నేహితులు ‘బ్యూటీ క్వీన్‌ పెద్దవుతోంది’ అని బుగ్గలు పుణికేవాళ్లు. ఈ పలకరింపులు, ప్రశంసలు పాపాయి మెదడులో నాటుకుంటున్నాయని వాళ్ల అమ్మానాన్నలు కూడా అనుకోలేదు.

ఎంబీబీఎస్‌ తర్వాత
మనోజ్ఞ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఆల్‌ రౌండర్‌. ఒక వండర్‌ కిడ్‌. యూత్‌ అంబాసిడర్‌గా అంతర్జాతీయ స్థాయిలో సార్క్‌ సమావేశాల్లో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. భరతనాట్యం కళాకారిణి, గాయని, క్రీడాకారిణి, మోటివేషనల్‌ స్పీకర్, యోగ ఎక్స్‌పర్ట్, ఎన్‌సిసిలో భారతదేశంలో బెస్ట్‌ క్యాడెట్‌తోపాటు బెస్ట్‌ షూటర్‌ అవార్డు గ్రహీత. రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మనోజ్ఞ ఎన్‌సిసి టీమ్‌కి కంటింజెంట్‌ కమాండర్‌గా వ్యవహరించింది. మనోజ్ఞ 2010లో ప్రధానమంత్రి అవార్డు అందుకున్న సందర్భంలో డాక్టర్‌ మన్‌మోహన్‌ సింగ్‌ గారు తేజస్విని తల్లి అనితతో ‘‘దేశానికి అద్భుతమైన బిడ్డనిచ్చారు.

ఇలాంటి బిడ్డల చేతిలో దేశం క్షేమంగా ఉంటుంది’’ అన్నారు. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ గారైతే ‘‘తేజస్విని విద్యార్థులకు మార్గదర్శనం. ఒక కళాకారిణి డాక్టర్‌ అయితే... ఆ కరుణ భవిష్యత్తులో పేషెంట్‌లకు వైద్యం చేయడంలో ప్రతిబింబించి తీరుతుంది’’ అని వైద్య విద్యార్థుల సదస్సులో అభినందించారు. ఇన్ని సాధించిన తర్వాత ఎంబీబీఎస్‌ పూర్తయి పీజీ ఎంట్రన్స్‌ కోసం ప్రిపేర్‌ కావడానికి తీసుకున్న విరామంలో ఒక రోజు ‘మిస్‌ ఇండియా యూనివర్స్‌ కాంపిటీషన్స్‌లో పాల్గొంటాను’ అని అనుమతి కోసం తల్లి ముఖంలోకి చూసింది.

తొలిసారి నిరాశ
అది 2017, ముంబయిలో మిస్‌ యూనివర్స్‌ ఇండియా పోటీల్లో తేజస్విని మనోజ్ఞ ‘మిస్‌ టాలెంటెడ్‌’ కేటగిరీలో అవార్డు గెలుచుకుంది. నిర్వహకులలో కొందరు ‘బ్యూటీ క్వీన్‌ కావడానికి అర్హతలన్నీ ఉన్నాయి’ అని, ‘కాదనడానికి వీల్లేని గ్రేట్‌ ప్రొఫైల్‌’ అని...  కాంప్లి మెంట్స్‌ ఇచ్చారు. తుది ఫలితాలు వెల్లడయ్యాయి. బ్యూటీ క్వీన్‌ కిరీటం మాత్రం ఆమె తల మీదకు రాలేదు. తేజస్విని మనోజ్ఞను నిరాశకు గురి చేసిన తొలి క్షణాలవి. అప్పటి వరకు చదువులో, ఆటల్లో, కళల్లో మేటిగా రాణించింది. ఆటలు, కళలతో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం వికసించిన అమ్మాయి కావడంతో మానసికంగా కుంగిపోలేదు. కానీ మనసులో ఒక మూల ఆ కొరత ఉండిపోయింది అన్నది తేజస్విని అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ.

ఢిల్లీ నుంచి పిలుపు...  అమ్మ వద్దంది
‘‘యూనివర్స్‌ పోటీలను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉంటాయి. మిస్‌ ఎర్త్‌ పోటీల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడడం, రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన భూమిని ఇవ్వడానికి అవసరమైన పరిరక్షణ పద్ధతుల మీద పని చేయడం కూడా ప్రధానంగా ఉంటుంది. నేను అప్పటికే కొన్ని ఎన్‌జీవోలతో కలిసి ఎయిర్‌ పొల్యూషన్, గ్రౌండ్‌ వాటర్‌ లెవెల్‌ మెయింటెనెన్స్, అమ్మాయిలకు పర్సనల్‌ హైజీన్, టాయిలెట్‌ల వాడకం సెషన్స్‌ ఇచ్చాను. నేను ఎర్త్‌ ప్రొటెక్షన్, సొసైటీకి అవసరమైన పనులు చేస్తున్నాను కాబట్టి మిస్‌ ఎర్త్‌ పోటీల్లో నా సర్వీస్‌కి ప్రాధాన్యం ఉంటుందనిపించి, ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేశాను. దేశవ్యాప్తంగా 26 వేల అప్లికేషన్‌లను పరిశీలించి 30 మందిని ఎంపిక చేశారు. ఆగస్ట్‌ 22వ తేదీన ఢిల్లీ నుంచి ఫోన్‌ కాల్‌... ‘మిస్‌ ఎర్త్‌ పోటీలకు ఎంపికైనట్లు, ఫైనల్‌ పోటీల కోసం 23వ తేదీ ఢిల్లీకి రావాలని’ చెప్పారు. కానీ అమ్మ ఒప్పుకోలేదు. ముంబయి అనుభవం రిపీట్‌ అయితే నేను నిరాశ చెందుతానేమోనని అమ్మ బెంగ.

ఫలితం ఏదైనా నేను బాధ పడను. జీవితంలో నేను ఇంత వరకు దేనినీ గివప్‌ చేయలేదు. దీనిని కూడా నా వైపు నుంచి వదిలిపెట్టను. ప్రయత్నం చేయకుండా వదిలేశాననే రిగ్రెట్‌ జీవితంలో నన్ను వెంటాడకూడదు... అని నచ్చచెప్పాను. ఢిల్లీలో వారం రోజులు పోటీలు జరిగాయి. ఆగస్ట్‌ 31వ తేదీన ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ డ్రీమ్‌నెస్‌’ ఆడిటోరియమ్‌లో నా కల నిజమైంది. గత ఏడాది మిస్‌ ఎర్త్‌ విజేత ఫంగ్‌ ఖాన్‌ నాకు మిస్‌ ఇండియా ఎర్త్‌ కిరీటాన్ని పెట్టారు. సాధారణంగా మిస్‌ ఎర్త్‌గా ఎన్నికైన వాళ్లకే గత ఏడాది విజేతలు కిరీటధారణ చేస్తారు. మనదేశంలో మిస్‌ ఎర్త్‌ ఇండియా పోటీలు జరుగుతున్న సమయంలో ఆమె మనదేశ పర్యటనలో ఉండడంతో నాకు ఆ అదృష్టం కూడా కలిసొచ్చింది’’ అని మెరుస్తున్న కళ్లతో చెప్పింది మనోజ్ఞ.

నాన్నకు భారం కాలేదు
‘‘అందాల పోటీలకు ప్రిపరేషన్‌ చాలా ఖర్చుతో కూడినదే. మా లాంటి మధ్య తరగతి వాళ్లకు అస్సలు సాధ్యమయ్యే పని కాదు. నాన్న బ్యాంకు ఉద్యోగి. ఈ ఖర్చులను నాన్నకు బరువు కానివ్వలేదు నేను. నా అవార్డుల డబ్బు, స్టైఫండ్, డాన్స్‌ ప్రదర్శన రెమ్యూనరేషన్‌లు, యోగా క్లాసుల ఫీజులు... ఇలా నాకు నేనే సంపాదించుకున్నాను.  నేను నేర్చుకున్న జీవితపాఠం హార్డ్‌వర్క్‌ ఒక్కటే. ఈ హార్డ్‌ వర్క్‌తోనే మిస్‌ ఎర్త్‌ పోటీలో భారతదేశాన్ని రిప్రజెంట్‌ చేయగలుగుతున్నాను’’ అన్నది ఈ తెలుగమ్మాయి. మనోజ్ఞ అమ్మానాన్నలది మహబూబ్‌నగర్, కానీ ఈ అమ్మాయి పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. 1997లో హైదరాబాద్‌ అమ్మాయి డయానా హైడెన్‌ ‘మిస్‌ ఇండియా వరల్డ్‌’ కిరీటంతో అంతర్జాతీయ పోటీలకు వెళ్లి ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటంతో తిరిగొచ్చింది. ఇప్పుడు మన బ్యూటీ క్వీన్‌ తేజస్విని మనోజ్ఞ మిస్‌ ఎర్త్‌ విజయాన్ని హైదరాబాద్‌కి తీసుకురావాలని కోరుకుందాం. బెస్టాఫ్‌ లక్‌ తేజస్వినీ, విష్‌ యూ హ్యాపీ జర్నీ.
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: మోహనాచారి

భూమాత కోసం పని చేస్తాను
మనవంతుగా ఎక్కడా రాజీ పడకుండా శ్రమిస్తుంటే... ఎప్పుడో ఒకప్పుడు అవకాశం తలుపు తడుతుంది. మిస్‌ ఇండియా యూనివర్స్‌ మిస్‌ అయినందుకు బాధలేదు. నా పుట్టుక ఒక సోషల్‌ కాజ్‌ కోసం అయి ఉండవచ్చు. భూమాత కోసం పని చేయాల్సిన బాధ్యత నా మీద ఉండడం వల్లనే అది మిస్‌ అయి నా ప్రయాణం ఇటు వైపు మళ్లిందనుకుంటున్నాను. మిస్‌ ఎర్త్‌  2019 పోటీలు ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 26 వరకు ఫిలిప్పీన్స్‌ దేశం, నాగ సిటీలో జరుగనున్నాయి. మొత్తం 107 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. అందరి మధ్య మనదేశానికి ప్రాతినిధ్యం వహించడం అనే భావన ఉద్వేగానికి గురి చేస్తోంది.

– డాక్టర్‌ తేజస్విని మనోజ్ఞ,
మిస్‌ ఎర్త్‌ ఇండియా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement