కాలం మారింది. అయ్యో కొడుకు పుట్టకపాయె.. ఆడ పిల్లలే సంతానమాయె.. మరణం తరువాత తమను పున్నామ నరకం నుంచి తప్పించే బాధ్యత ఎవరు మోస్తారోనన్న బెంగ నుంచి తల్లిదండ్రులు ఉపశమనం పొందుతున్నారు. మగ సంతానమే పున్నామ నరకం నుంచి తప్పించే బాధ్యతలను మోయాలని చెబుతున్న గరుఢ పురాణాన్ని అతివలు తిరగరాస్తున్నారు. మహిళలే ముందుండి తల్లిదండ్రుల అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఆయుష్షు తీరి కాలం చేసిన వ్యక్తిని పున్నామ నరకం నుంచి తప్పించడం ఎంతో ముఖ్యమని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రప్రకారం పున్నామ నరకం తప్పించే బాధ్యత పురుషులపైనే ఉంది. కాని శాస్త్రాలను, పురాణాలను కాదని కాలం చేసిన తమ తల్లిదండ్రులకు పున్నామ నరకం బాధను తప్పించే బాధ్యతను అతివ కూడా మోస్తోంది. మగ సంతానం లేకుండా ఆడపిల్లలు ఉన్నవారు కాలం చేసిన సమయంలో వారికి అంత్యక్రియలను మనుమడు, లేదా అల్లుడు, కాక పోతే తోబుట్టువైన మగవారు, వారి సంతానంలో ఎవరైనా నిర్వహించడం ఆనవాయితీ. పున్నామ నరకం తప్పించే బాధ్యతను తలకెత్తుకోవడం అంటే.. శాస్త్రం ప్రకారం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిం చాలి.
పండుగలు, శుభకార్యాలకు కొంత కాలం పాటు దూరంగా ఉండాలి. ఇలాంటి తరుణంలో మగ దిక్కులేని తమ సంబంధీకులు మరణిస్తే పున్నామ నరకం తప్పించే బాధ్యతలను ఎంతో మంది నెత్తినేసుకోవడం లేదు. కాలం మారింది, దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతోంది. మారిన కాలంతోపాటే మనవారు మారుతున్నారు. ఆకాశం లో సగం అంతటా సగం అనే నినాదంతో అతివ ఎంతో పరిణతి చెందిం ది. పురాణాలు, శాస్త్రాలు పాటించాలి అంటూనే పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనేవారి నోళ్లను మూయిస్తున్నారు ఎందరో మహిళలు. కన్నవారి ఆస్తిలో వాటానే ప్రధానం కాదు కడదాకా తోడు నీడగా మెదలుతాం అంటూ మహిళలు ముందుకు సాగుతున్నారు.
తల్లిదండ్రులు మరణిస్తే వారిని పున్నామ నరకం నుంచి తప్పించే బాధ్యతలను సంప్రదాయ బద్ధంగా నెత్తినెత్తుకుంటున్నారు. అంత్యక్రియలను ముందుండి జరిపిస్తున్నారు. మనిషి పుట్టుక నుంచి మరణం వరకు జరిగే సంఘర్షణల సారాంశాన్ని ఎంతో విఫులంగా వివరించే గరుఢ పురాణంలోను పున్నామ నరకం తప్పించే కార్యక్రమం గురించి ప్రత్యేకంగా పెద్దలు వివరించారు. పురాణ ఇతిహాసాలను, శాస్త్రాలను ఎంతో భక్తితో చదువుతూనే కొన్ని కొత్త మార్పులకు మహిళలు శ్రీకారం చుడుతున్నారు. పున్నామ నరకం తప్పించే బాధ్యతల్లో మహిళలు పాలు పంచుకోవడాన్ని కొట్టి పారేయలేం.
భారం కాదు.. బాధ్యతెరిగిన నేటి మహిళ
Published Sun, Oct 5 2014 10:15 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement