అవకాయ సాంబార్ | telugu heros tamil directors | Sakshi
Sakshi News home page

అవకాయ సాంబార్

Published Mon, Nov 14 2016 11:43 PM | Last Updated on Mon, Aug 20 2018 3:40 PM

అవకాయ సాంబార్ - Sakshi

అవకాయ సాంబార్

‘మనకు కథ ఇంపార్టెంటప్పా... డెరైక్టర్ లాంగ్వేజ్ ఏదైతే ఏంటి?’అనుకుంటారు పవన్ కల్యాణ్.

కొన్ని కొన్ని ‘అప్పడి నడక్కుమ్’!
‘మనకు కథ ఇంపార్టెంటప్పా... డెరైక్టర్ లాంగ్వేజ్ ఏదైతే ఏంటి?’ అనుకుంటారు పవన్ కల్యాణ్. అందుకే ఇప్పటికే ఎస్.జె. సూర్య, ధరణి, కరుణాకరన్, విష్ణువర్ధన్ వంటి తమిళ దర్శకులతో సినిమాలు చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆర్.టి. నేసన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. వీళ్లల్లో సూర్య, ధరణి, నేసన్‌లు తమిళ హీరో విజయ్‌తో సినిమాలు చేసినవాళ్లే. అలాగే వీళ్ల సినిమాలను నిర్మించింది తెలుగు వారైన ఎ.యం.రత్నం. ఇప్పుడు నేసన్-పవన్ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. కొన్ని కొన్ని అప్పడి నడక్కుమ్ (అలా జరిగిపోతాయ్). అంతే.

‘ఒరు కల్లుల.. రెండు మాంగా..’
మహేశ్‌బాబు చెన్నైలో చదువుకున్నారు. తమిళ్ బాగా వచ్చు. ఇప్పుడా యన ‘ఒరు కల్లుల.. రెండు మాంగా’ దక్కించుకున్నారు. అంటే.. ఒక్క రాయి (దెబ్బ)కి రెండు మామిడికాయలు అని అర్థం. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో ద్విభాషా చిత్రం చేస్తున్నారు. మహేశ్‌కి రెండో తమిళ దర్శకుడీయన. ఆల్రెడీ ఎస్.జె. సూర్యతో ‘నాని’ సినిమా చేశారు. తంబీ (తమ్ముడూ) ఇక్కడ విశేషం ఏంటంటే... మణిరత్నం, శంకర్, లింగుస్వామి వంటి పేరున్న దర్శకులు మహేశ్‌తో సినిమా తీయాలనుకున్నారు. అవేవీ ముడియల (కుదరలేదు). ఇప్పుడు మురుగదాస్‌తో ముడింజిచ్చు (కుదిరింది). మరి.. మిగతా తమిళ దర్శకులతో ‘ఎప్ప పణ్ణువారో?’ (ఎప్పుడు చేస్తారో). ఆ.. అన్నట్లు.. నితిన్ ‘ఇష్క్’, అక్కినేని కుటుంబంతో ‘మనం’ చిత్రాలు తీసిన మలయాళీ విక్రమ్ కె. కుమార్ చెప్పిన లైన్‌కి మహేశ్ ఓకే చెప్పారు. కానీ, ఆ చిత్రం సెట్స్‌కి వెళ్లడానికి ఇంకా బోలెడంత సమయం పట్టేట్లు కనిపిస్తోంది.

మల్లు అర్జున్... కోలీ అర్జున్ ‘ఆగువారా’?
మన తెలుగు అల్లు అర్జున్ మలయాళంలో ఎంత అభిమానం సంపాదించుకున్నారంటే అక్కడివాళ్లంతా ‘మల్లు’ అర్జున్ అంటారు. ఇప్పుడు తమిళ దర్శకుడు లింగుస్వామితో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు భాషలవాళ్లను మెప్పించిన బన్నీకి కోలీవుడ్ వాళ్లను ఆకట్టుకోవడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. త్వరలోనే... కోలీ అర్జున్ కూడా ఆగువారా? (అవుతారా?) వెయిట్ చేద్దాం.

మనం బెస్టప్పా!
‘మనం’లో అఖిల్ ఎంట్రీ షార్ట్ అండ్ క్యూట్‌గా ఉంటుంది. జస్ట్ అలా చూపించి, ‘అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ డా’ అనిపించేశారు ఆ చిత్రదర్శకుడు విక్రమ్ కుమార్. శాంపిలే అదిరితే.. ఇక ఫుల్ లెంగ్త్‌లో చూపిస్తే.. ఏ రేంజ్‌లో ఉంటుందనుకున్నారేమో ‘అఖిల్’ తర్వాత హీరోగా తన రెండో సినిమాకి మలయాళీ విక్రమ్ కుమార్‌ని సెలక్ట్ చేసుకున్నారు. మనం బెస్టప్పా.. కలసి చేద్దాం అని మాట్లాడుకుని ఫిక్సయ్యారు. డిసెంబర్‌లో అఖిల్ పెళ్లి. ఆ వేడుక అయ్యాక రెండో సినిమా పట్టాలెక్కిస్తారని చెప్పొచ్చు.

‘యారుడా’ సందీప్ అంటారా?
‘యారుడా మహేశ్’ అనే సినిమాతో సందీప్ కిషన్ తమిళ తెరకు పరిచయమయ్యారు. ఆ ఒక్క సినిమాతో అక్కడ ఎంత పాపులార్టీ తెచ్చుకున్నారంటే ‘యారుడా సందీప్’ అని ఎవరూ అడగరు. యారుడా అంటే తమిళంలో ఎవర్రా అని అర్థం. ఇప్పుడు తమిళంలో అతను చేసిన ‘మాయవన్’, ‘మానగరమ్’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం తమిళ దర్శకుడు సుశీంద్రన్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలతో సందీప్ కెరీర్ తమిళంలో పీక్స్‌కి వెళుతుందా? చూద్దాం.

‘ఇప్ప’ బాహుబలి అసిస్టెంట్...
తెలుగు, తమిళాల్లో తీస్తున్న ‘బాహుబలి’కి పళని అసిస్టెంట్ డెరైక్టర్. ఈ పక్కా తమిళ ‘పయ్య’ (కుర్రాడు) ‘ఇప్ప’(ఇప్పుడు) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అదీ మన తెలుగు సినిమాతోనే. ‘వినవయ్యా రామయ్య’ ఫేమ్ నాగ అన్వేష్, ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ హెబ్బా పటేల్ జంటగా ‘ఏంజిల్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు పళని. మొత్తానికి, ఇప్పుడు కృష్ణానగర్ మరో పాండీ బజార్‌లా మారింది. అవును... ఆవకాయ్ ఘాటుకు... సాంబార్ రుచి తగిలింది.

సెట్స్‌లో... అరవ సందడి
‘రండి సార్.. రండి.. శ్రీదేవి ఇక్కడదా డ్రెస్సు ఎత్తింది... మీరు కూడా’... ఓ బట్టల దుకాణం ముందు అరుస్తున్నాడొకడు. మద్రాసు వెళ్లే తెలుగువాళ్లను ఎట్రాక్ట్ చేయడం కోసం షాపింగ్ సెంటర్స్‌లో ఒకప్పుడు జరిగిన తంతు ఇది. వచ్చీ రాని ఆ తమిళ - తెలుగుకు అర్థం... ‘అక్కడ బట్టలు కొంది’ అని. వచ్చీ రాని తెలుగులో అరవోళ్లు చేసే ఈ సందడి ఇప్పుడు మద్రాసు పాండీ బజారు నుంచి మన కృష్ణా నగర్‌కు తరలి వచ్చేసింది. ఇప్పుడు కొన్ని తెలుగు సినిమాల లొకేషన్స్‌లో ఇలాంటి వచ్చీ రాని తమిళ - తెలుగు పదాలు బోల్డన్ని వినబడుతున్నాయి. అవును మరి... మన సినిమాల్లో అరవ ‘ఇయక్కునర్’లు (దర్శకులు), ‘ఒళిప్పదివాళర్’లు (కెమేరామన్లు) అదరగొడుతున్నారు.

‘ఇదు నడక్కుమా?’
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులైన తమిళ దర్శకులు మణిరత్నం, గౌతమ్ మీనన్‌లతో రామ్‌చరణ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. మణిరత్నంతో ఈ హీరో రెండుసార్లు సమావేశయ్యారు కూడా. అప్పట్లో చిరంజీవి 150వ సినిమా కోసమే ఈ చర్చలు జరిగినట్టు వార్తలొచ్చాయి. కానీ, చరణ్‌తోనే మణిరత్నం సినిమా చేసే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య ‘ఏ మాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ చేశారు. అందులో రెండో సినిమా గత వారమే విడుదలైంది. చైతూ తండ్రి నాగార్జున కోసం ఈ దర్శకుడు ఓ కథ రెడీ చేశారట. నెగిటివ్ క్యారెక్టర్ చేస్తారా? అని అడిగితే నాగ్ ‘యస్’ అన్నారట. ‘గౌతమ్.. నీతో సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నాను’ అని ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆడియో వేడుకలో నాగ్ బహిరంగంగా అన్నారు. మరి.. ఇదు నడక్కుమా? (ఇది జరుగుతుందా?). వేచి చూడాలి.

ఇవంగ ఎల్లామ్ ఎప్ప వరువాంగళో?
ఆ తరంలో కె.బాలచందర్, భారతీరాజా వంటివారు, తర్వాతి తరంలో పి.వాసు, మణిరత్నం, ఈతరంలో గౌతమ్ మీనన్, మురుగదాస్, ఎస్.జె. సూర్య, విష్ణువర్థన్, కరుణాకరన్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, విక్రమ్ కుమార్ వంటి తమిళ దర్శకులు తెలుగులో సినిమాలు చేశారు. ఇప్పుడు మరికొంతమంది తమిళ దర్శకులు వస్తున్నారు. ఇక.. శంకర్, హరి వంటి తమిళ దర్శకులతో పని చేయడానికి పలువురు తెలుగు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. మరి.. ఇవంగ ఎల్లామ్ ఎప్ప వరువాంగళో?.. అంటే.. వీళ్లంతా ఎప్పుడు వస్తారో? అని అర్థం.

 - డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement