విలనిజం నా డ్రీమ్‌ రోల్‌ | Thank You all for Receiving me as Well in Telugu Says Harshita | Sakshi
Sakshi News home page

విలనిజం నా డ్రీమ్‌ రోల్‌

Published Wed, Apr 24 2019 4:49 AM | Last Updated on Wed, Apr 24 2019 4:49 AM

Thank You all for Receiving me as Well in Telugu Says Harshita - Sakshi

అక్కగా, అర్ధాంగిగా, కోడలిగా.. ‘మా’ టీవీలో వచ్చే ‘లక్ష్మీకళ్యాణం’ సీరియల్‌ ద్వారా తెలుగు బుల్లితెరకు ఆమె సుపరిచితమే. లక్ష్మీ, రంగీ, కృష్ణవేణిగా ఇప్పటివరకు ఆకట్టుకున్న ఈ చిరునవ్వుల రాణి అసలు పేరు హర్షిత వెంకటేష్‌. కన్నడ ఇంటిలో పుట్టి, తెలుగింటి అభిమానాన్ని పొందిన హర్షిత చిరునవ్వుతోనే తన విషయాలు ఇలా చెప్పుకొచ్చింది.

‘‘లక్ష్మీకళ్యాణం సీరియల్‌లో అక్కగా, భార్యగా, కోడలిగా లక్ష్మి పోషించే పాత్రలు.. వాటి చుట్టూ అల్లుకున్న అనుబంధాలతో కథ నడుస్తుంది. రెండేళ్లుగా వస్తున్న ఈ సీరియల్‌ నాకెంతో మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా, ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. కన్నడ అమ్మాయిని అయినా తెలుగులో నన్ను ఇంత బాగా రిసీవ్‌ చేసుకున్నందుకు అందరికీ థ్యాంక్స్‌. ఇప్పటికే కన్నడలో నాలుగు సీరియల్స్‌ చేశాను. తమిళ్‌లోనూ ఒక సీరియల్‌ చేశాను. తెలుగులో ‘లక్ష్మీకళ్యాణం’ చేస్తూనే ‘అత్తారింటికి దారేది’ సీరియల్‌కీ వర్క్‌ చేశాను. కొత్త భాష, కొత్త ప్రాంతం, అక్కడి సంస్కృతుల గురించి తెలుసుకోవడం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆ ఇష్టమే నన్నింత దూరం తీసుకొచ్చింది. అయితే, ఈ ప్రొఫెషన్‌లో చాలా చాలా ఓపిక ఉండాలి. ఎండలో, నీడలో, రాత్రి, పగలు.. వర్క్‌ చేస్తాం. లొకేషన్‌ ఎక్కడంటే అక్కడ ఉండాలి. టఫెస్ట్‌ జాబ్‌. కానీ, హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా వందలో ఒకరు యూనిక్‌గా ఉంటారు. ఆ యూనిక్‌ని నేను అనుకుంటే హ్యాపీ కదా! 

సీరియల్స్‌కి రాకముందు
మా అమ్మానాన్నలు చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎంబీయే పూర్తి చేశాను. కాలేజీ టైమ్‌ నుంచే థియేటర్‌లో నటించిన అనుభవం ఉంది. ముందు సీరియల్‌లో ఆఫర్‌ వచ్చినప్పుడు మా పేరెంట్స్‌ వెంటనే ఓకే చేయలేదు. మా ఫ్యామిలీలోనూ ఎవరూ ఆర్టిస్టులు లేరు. కొంచెం ఆలోచనలో పడ్డారు. నేనూ సీరియల్‌ ఆర్టిస్టు ప్రొఫెషన్‌గా తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఒక సీరియల్‌ చేసి చూద్దాం అని ట్రై చేశాను. కన్నడలో రెండు సీరియల్స్‌ చేసిన తర్వాత ఈ వర్కే సీరియస్‌ అయిపోయింది. అమ్మానాన్న కూడా హ్యాపీ అయ్యారు. కన్నడ సీరియల్‌ చేసే టైమ్‌లోనే ‘మా’టీవీ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘లక్ష్మీకళ్యాణం’ సీరియల్‌కి వాళ్లు వేరేవాళ్లతోనూ చాలా ఆడిషన్స్‌ చేశారంట. కానీ, నేను ఆ రోల్‌కి బాగా సూటవుతాను అనుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌ చాలా త్వరగా ఫైనల్‌ అయిపోయింది. 

వర్క్‌ బ్యాలెన్స్‌
నేను, అమ్మ, నాన్న.. ఇదే మా ఫ్యామిలీ. పుట్టి పెరిగింది బెంగుళూరులోనే. నాన్న వెంకటేష్‌ గవర్నమెంట్‌ జాబ్‌. ఇటీవలే వాలెంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. అమ్మ గాయత్రి టీచర్‌. ఒక్కత్తే కూతురినని ఎంత గారాబంగా చూసుకుంటారో అంతే ఇండిపెండెంట్‌గా పెంచారు. చదువుతోపాటు ఇంటిపనుల్లోనూ పర్‌ఫెక్ట్‌. ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వచ్చినా ఇండివిడ్యువల్‌గా ఎలా ఉండాలో నేర్పించారు. అందుకే బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చినా ఇండిపెండెంట్‌గా ఉండగలుగుతున్నాను. వర్క్‌ ఇంపార్టెన్స్‌ పెరిగే కొద్దీ ఫ్యామిలీని మిస్‌ అవుతాం. ఒక్కోసారి నా వర్క్‌ షెడ్యూల్‌ వల్ల రెండు మూడు నెలలకోసారి కూడా ఇంటికి వెళ్లలేను. ఫంక్షన్స్‌కి అటెండ్‌ అవ్వడం అంత సులువు కాదు. ఎంత ముఖ్యమైన ఫంక్షన్‌ అయినా అటు నుంచి అటే లొకేషన్‌కి వచ్చేసిన రోజులున్నాయి. ఫ్యామిలీ–వర్క్‌ బ్యాలెన్సింగ్‌ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. 
– నిర్మలారెడ్డి

విలన్‌ రోల్‌
‘లక్ష్మీ కళ్యాణం’లో లక్ష్మీగా, రంగీగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. ఈ సీరియల్‌లో రంగీ రోల్‌ చాలా పాపులర్‌ అయ్యింది. ఈ పాత్రకు ఇదే పరిమితి అంటూ హద్దుల్లేవు. నా మనస్తత్వానికి పూర్తి డిఫరెంట్‌గా ఉండే పాత్ర అది. ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించడం అంటే చాలా చాలా ఇష్టం. అలా ఆ పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. నెక్ట్స్‌ అంధురాలిగా, విలన్‌గా, దేవత పాత్రలు.. యాక్ట్‌ చేయాలని ఉంది. లక్ష్మీకళ్యాణంలోని రంగీ పాత్రలో కొంచెం విలనిజం ఉంది. కానీ, ఇంకా పూర్తి విలన్‌ కాదు(నవ్వుతూ). నా టాలెంట్‌ చూపించాలనుకుంటే అలాంటి ఛాలెంజింగ్‌ రోల్స్‌ అయితే బాగుంటుందనుకుంటున్నాను. సీరియల్స్‌ కాకుండా డ్యాన్స్, మ్యూజిక్, షాపింగ్‌ చేయడం అంటే బాగా ఇష్టం.’’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement