Harshita
-
నిరుపేద మెడిసిన్ విద్యార్థికి దాతల ఆర్థికసాయం
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు దిద్దిపూడి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని పానెం శ్రీహర్షిత ఇటీవల ప్రకటించిన మెడిసిన్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించింది. ఆమె దీనస్థితిని గమనించి ‘సాక్షి’ ఈ నెల 3వ తేదీన ‘చదువుల తల్లిని కనికరించని లక్ష్మీదేవి’ అంటూ కథనాన్ని ప్రచురించింది. దీంతో దాతలు విరివిగా స్పందించారు. ఇప్పటివరకు రూ. 1,10,000 ఆర్థిక సాయాన్ని శ్రీహర్షిత బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. ఆదివారం ఖమ్మంకు చెందిన సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఎ.నర్సింహారావు, సభ్యులు నాగరాజు, సైదులు, సతీశ్‌లు రూ. 12 వేల ఆర్థిక సాయంతో పాటు రూ.30 వేలు విలువ చేసే వైద్యవిద్యకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. అంతేకాకుండా కొణిజర్ల, బోనకల్ హెల్త్ సూపర్వైజర్లు వి.భాస్కర్‌రావు, ఎం.దానయ్యలు రూ. 10 వేలు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. విజయవాడకు చెందిన మరో వైద్యుడు నాలుగేళ్ల హాస్టల్ ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీహర్షిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహర్షిత ‘సాక్షి’తో మాట్లాడుతూ తన ఆర్థిక పరిస్థితిని గమనించి ముందుకు వచ్చిన దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. -
వెల్కమ్ దాసరి హర్షిత.. జపాన్ నుంచి నేడు స్వదేశానికి..
సాక్షి, కరీంనగర్: తొమ్మిదో జాతీయ ఇన్స్పైర్ అవార్డుల పోటీల్లో సత్తాచాటి జిల్లా పేరు ఇనుమండింపజేసిన దాసరి హర్షిత అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని ఆదివారం స్వదేశానికి చేరుకోనుంది. రామగిరి మండలం చందనాపూర్ జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న హర్షిత ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు జపాన్ రాజధాని టోక్యో వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సకూర కార్యక్రమంలో పాల్గొంది. గతేడాది సెప్టెంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు ఢిల్లీ వేదికగా నిర్వహించిన 9వ జాతీయ ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన పోటీల్లో జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు హాజరవగా.. హర్సిత ప్రతిభ చూపించింది. కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖమంత్రి జితేంద్రసింగ్ నుంచి అవార్డును అందుకున్నట్లు డీఈవో మాధవి తెలిపారు. అలాగే ఈఏడాది ఏప్రిల్ 10 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఫైన్ కార్యక్రమంలో పాల్గొని నేరుగా రాష్ట్రపతికి తను రూపొందించిన బహుళ ప్రయోజనకర హెల్మెట్ గురించి వివరించి మన్ననలు పొందింది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో మే 10, 11, 12వ తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలోనూ ప్రతిభ చాటింది. మనరాష్ట్రం నుంచి 9వ జాతీయ ప్రదర్శన పోటీల్లో విజేతలైన 8 మంది విద్యార్థులతో కలిసి అంతర్జాతీయ కార్యక్రమానికి ఎంపికై ంది. దేశం నలుమూలల నుంచి ఏడు, ఎనిమిది, తొమ్మిదో జాతీయ ఇన్స్పైర్ అవార్డు– మనక్ పోటీల్లో విజేతలైన 59 మంది విద్యార్థులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. మనరాష్ట్రం నుంచి ఆరుగురు విద్యార్థులు ఇందులో ఉన్నారు. ఆదేశంలోని మన రాయబార కార్యాలయంతోపాటు పలు విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక వారసత్వం కలిగిన 15కు పైగా ప్రదేశాలను తిలకించి రావడం హర్షిత ప్రత్యేకత. పాఠశాల స్థాయి నుంచే.. పాఠశాలస్థాయి ప్రదర్శన నుంచే చైనా, సైప్రస్, ఉజ్బెకిస్తాన్, తజబిస్తాన్ లాంటి దేశాల విద్యార్థులు పాల్గొన్న అంతర్జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడానికి అరుదైన అవకాశం మనదేశంలోని గ్రామీణి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని హర్షితకు రావడం విశేషం. ఆమెను ప్రో త్సాహించిన గైడ్ టీచర్ సంపత్‌కుమార్‌ను డీఈవో మాధవి, జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు, హెచ్ఎం లక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు. -
అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో.. జపాన్‌కు పయనమైన హర్షిత!
సాక్షి, కరీంనగర్/పెద్దపల్లి: రామగిరి మండలం చందనాపూర్ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థి డి.హర్షిత శుక్రవారం జపాన్‌కు బయలుదేరి వెళ్లింది. దాసరి మహేశ్–స్వప్న దంపతుల కుమార్తె దాసరి హర్షిత.. గైడ్ టీచర్ సంపత్‌కుమార్ సహకారంతో తను తయారుచేసిన బహుళప్రయోజనకర(హెల్మెట్) హెల్మెట్ ప్రాజెక్ట్ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. ఈనెల 5 నుంచి పదో తేదీ వరకు జపాన్‌లోని టోక్యో నగరంలో నిర్వహించనున్న అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించన్నుట్లు హెచ్ఎం లక్ష్మి, గైడ్ టీచర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా హర్షిత మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై తన ప్రాజెక్టు ప్రదర్శించడం సంతోషంగా ఉందని పేర్కొంది. -
నీట్ పీజీ ఫలితాలు.. కోనసీమ విద్యార్థినికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్
అల్లవరం (కోనసీమ జిల్లా): పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశపరీక్షలో కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి బట్టుపాలెంకి చెందిన యాళ్ల హర్షిత జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. తాజాగా విడుదల చేసిన పీజీ నీట్ ఫలితాల్లో హర్షితకు 99.17 శాతం మార్కులు వచ్చాయి. భీమనపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన హర్షిత 9.3 గ్రేడ్ సాధించి విశాఖపట్నంలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసింది. ఇంటర్‌లోనూ 9.3 గ్రేడ్ సాధించి ఎంసెట్‌లో 180వ ర్యాంక్ దక్కించుకుంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అభ్యసించింది. ఎంబీబీఎస్‌లో ప్రథమ స్థానంలో నిలిచి ఆరు బంగారు పతకాలు సాధించింది. పోస్ట్రుగాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)– చండీగఢ్ నిర్వహించిన ప్రవేశపరీక్షలోనూ జాతీయ స్థాయిలో 47వ ర్యాంకుతో సత్తా చాటింది. పీడియాట్రిక్స్‌లో పీజీ చేయడమే తన లక్ష్యమని హర్షిత తెలిపారు. తమ కుమార్తె నీట్ పీజీలో మంచి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు యాళ్ల శ్రీనివాసరావు, కాంతామణి ఆనందం వ్యక్తం చేశారు. కాగా హర్షిత తమ్ముడు శివ సుబ్రహ్మణ్యం శ్రీకాకుళంలోని జెమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించిన హర్షితకు పలువురు అభినందనలు తెలిపారు. -
అతి చిన్న రాతిపై 'క్షీరసాగర మథనం'
తెనాలి: పేదింట జన్మించి, సంక్షేమ వసతి గృహంలో ఉంటూ డిగ్రీ చదువుకుంటున్న హర్షిత..చిత్రలేఖనంలో తన సృజనతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. గుంటూరు జిల్లా అంగలకుదురులోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతిగృహంలో ఉంటూ తెనాలిలో జేఎంజే మహిళా కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్న హర్షిత దావులూరి 4.6 సెంటీమీటర్ల ఎత్తు, 5 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన అతి చిన్న రాతిపై పురాణాల్లోని అతి పెద్ద వృత్తాంతమైన క్షీరసాగర మథనాన్ని 15 నిమిషాల్లో చిత్రీకరించింది. ఆ వీడియోను కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ షైనీ తదితరులు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపారు. దీంతో రికార్డ్ హోల్డర్‌గా గుర్తిస్తూ ‘సెల్యూట్ ది టాలెంట్’ అంటూ ఆ సంస్థ రికార్డు పతకాన్ని, సర్టిఫికెట్‌ను హర్షితకు ఇటీవల పంపింది. హర్షిత సొంతూరు క్రాప. తల్లిదండ్రులు హేమలత, నాగయ్య వ్యవసాయ కూలీలు. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనేది తన లక్ష్యమని హర్షిత తెలిపింది. రికార్డు పతకం, ధృవీకరణ పత్రాలతో హర్షిత దావులూరి -
అనుకోని అరుదైన వ్యాధి ఆమె జీవితాన్నే మార్చేసింది
రాజస్తాన్: మనం కాస్త బాగొకపోతేనే డీలా పడిపోతాం. కొంచెం వంట్లో బాగోకపోతే ఇక రెస్ట్ తీసుకుంటాం. కానీ రాజస్తాన్‌కి చెందిన ఒక అమ్మాయి లక్షల్లో ఒక్కరికీ వచ్చే అరుదైన వ్యాధితో పోరాడుతూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడానికీ శతవిధాల ప్రయత్నిస్తోంది. వివరాల్లోకెళ్లితే..... రాజస్తాన్‌కి చెందిన హర్షిత దరియాని 11 ఏళ్ల ప్రాయంలో తల్లిని కోల్పయింది. అంత చిన్నవయసులో ఆ దుఃఖాన్ని అధిగమించి అందరిలా నవ్వుతూ, ఆడుతూ...హయిగా చదువుకునేది. సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటుండగా అనుకోని అరుదైన గుయిలిన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్ ) వ్యాధి ఆమెను మళ్లీ అగాధంలోకి తీసుకువెళ్లిపోయింది. హర్షిత ఇంటర్మీడియేట్‌లో ఉండగా ఒక రోజు బ్యాడ్మింటన్ ఆడుతుంటే ఎడమ చేయి విపరీతమైన నొప్పి వచ్చి ఇక ఆడలేక హాస్టల్‌కి వచ్చేసింది. ఆ తర్వా త రోజు స్టడీ అవర్స్ కోసమై వార్డెన్ మేడం తెల్లవారుఝూమున లేపితే ఆమె అసలు బెడ్‌మీద నుంచి ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అప్పుడే తెలిసింది అత్యంత అరుదుగా నూటికి ఒక్కరికో ఇద్దరికో వచ్చే గుయిలిన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్ ) బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు. అప్పటికే ఆమె ఆ వ్యాధి నరాల వ్యవస్థపై దాడి చేసి శరీరం మొతం పక్షవాతం వచ్చినట్లుగా చలనం లేకుండా చేసేసింది. ఆఖరికి ఊపిరితిత్తులు కూడా పనిచేయడం మానేశాయి. దీంతో శ్వాస తీసుకోవడమే కష్టమైంది, ఆమె ఐసీయూలో 47 రోజులు కోమాలోనే ఉంది. అయినప్పటికీ విద్యాసంవత్సరాన్ని క్పోల్పోకుండా పరీక్షకి వీల్ చైర్లో వెళ్లి మరీ రాసి మంచి మార్కులతో ఇంటర్మీడియేట్ పాసై అయ్యింది. కానీ ఈ వ్యాధి కారణంగా తనకి ఇష్టమైన మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలన్న ఆశను వదులుకోవల్సి వచ్చింది. ప్రస్తుతం తాను బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వుతున్నానని, అమెజాన్‌తో కలిసి పనిచేయడానికీ ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ మేరకు హర్షిత మాట్లాడుతూ..."సరిగ్గా ఐద్దేళ్ల క్రితం తాను కనీసం కళ్ల రెప్పలను కూడా కదిలించ లేకపోయాను చూపుతోటే చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడూ వాటన్నింటిని అధిగమించగలిగాన. జీబీఎస్ వ్యాధి నా జీవితాన్ని మార్చేసింది. దేన్నైన తట్టుకుని బతకలగలనన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది. ఈ కష్టం నన్ను కదలనియదు అనుకున్నాను కానీ కాలంతో పాటు అది మారిపోతుంది. కబళించేసేంతా కష్టమైన కదలకుండ ఉండదని, కాల గమనంతోపాటు మారిపోతుంది" అంటూ తన ఆత్మస్థైర్యాన్ని వ్యక్తం చేసింది. -
'డింపీ ఆఫ్ మీర్జాపూర్' ఇంటర్వ్యూ
అందానికి తగ్గ తెలివి.. తెలివికి తగ్గ్గ టాలెంట్.. అన్నీ కలబోస్తే హర్షితా గౌర్. పొగడ్త కాస్త ఎక్కువైందనిపిస్తే.. ఆమె గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే. ► నటనలో, నృత్యంలో, చదువులో ఇలా పోటీ దేనిలో అయినా.. ఎవరితో అయినా.. ముందుండాలనే తపనే హర్షితని ప్రత్యేకంగా నిలబెట్టింది. వైద్యుల కుటుంబం నుంచి వచ్చిన ఈ బాలీవుడ్ భామ.. ‘ఫలక్‌నుమాదాస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే వెబ్ సిరీస్ ప్రియులు మాత్రం హర్షితని.. ‘డింపీ పండిట్’గా గుర్తుపడతారు. ► హర్షితా గౌర్ 1992 అక్టోబర్12న ఢిల్లీలో జన్మించింది. తండ్రి చంద్రశేఖర్ గౌర్, తల్లి నీనా గౌర్ ఇద్దరూ డాక్టర్సే. ► హర్షిత నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ – కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పొందింది. ► కెరీర్ మొదట్లో మోడలింగ్ చేసిన హర్షిత.. చదువుకునే రోజుల్లోనే ‘సద్దా హక్’ షోకి జరిగిన ఆడిషన్లో సెలెక్ట్ అయ్యింది. 2013లో ఆ షో ప్రసారమైన తర్వాత హర్షిత.. సంయుక్తా అగర్వాల్ (సద్దా హక్‌లో పాత్ర పేరు)గా మారిపోయింది. ఆ షో 5 వందలకు పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అందులోని కోస్టార్ పరమ్ సింగ్‌కి, హర్షితకి మధ్య నడిచే కెమెస్ట్రీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే రియల్ లైఫ్‌లో కూడా హర్షిత, పరమ్‌సింగ్ మధ్య కొన్నాళ్లు రిలేషన్ నడిచింది. (చదవండి: 2020 ఇంట్లో కూడా సినిమా చూపించింది) ► మలయాళీ చిత్రం అంగమలై డైరీస్కి రీమేక్ అయిన ఫలక్‌నుమా దాస్ సినిమాలో.. హీరో విశ్వక్ సేన్ పక్కన నటించిన హర్షిత గౌర్.. తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచింది. ► 2017లో ‘బ్లాక్ కాఫీ’ అనే వెబ్ సిరీస్‌లో.. 2018లో ‘ అమన్’ అనే షార్ట్ ఫిలిమ్‌లో ప్రధాన పాత్రలు పోషించింది. 2018లో ‘బ్రైబ్’ ఆ తర్వాత ఏడాది ‘పంచ్ బీట్’ వెబ్ సిరీస్‌లలోనూ నటించి మెప్పించింది. ► తాజాగా మీర్జాపూర్ 1, 2 సిరీస్‌లో డింపీ పండిట్ అనే పాత్రలో వెబ్ వీక్షకులకు ఇంకా దగ్గరైన హర్షిత.. ‘డింపీ ఆఫ్ మీర్జాపూర్’గా గుర్తింపు తెచ్చుకుంది. ► ఒత్తిడిని అధిగమించడానికి మీరు వెతికే పరిష్కారం ఏమిటి అని హర్షితని అడిగితే.. ‘సమస్య రాగానే.. గతంలోని సంతోషకరమైన ఓ ఐదు సందర్భాలను గుర్తు చేసుకుంటాను. మీరూ ట్రై చెయ్యండి..’ అంటోంది ఈ ఫలక్‌నుమా నాయిక. (చదవండి: ‘ముద్దు సీన్ గురించి అమ్మతో చర్చించాకే..’) -
సినిమాలు అవసరమా? అన్నారు
‘‘యాడ్‌ఫిల్మ్స్ చేయడానికి సినిమాల్లో నటించడానికి చాలా తేడా ఉంది. సినిమాల్లో నటించడం అంత సులువేం కాదు. సెట్లో అందరితో కలిసి పోవాలి. ‘తోలుబొమ్మలాట’ సినిమా చేసిన తర్వాత నాలో మరింత ప్రొఫెషనలిజం పెరిగింది. కొత్త విషయాలు నేర్చుకున్నా’’ అని హర్షిత అన్నారు. విశ్వంత్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రల్లో విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలో విడుదలకానుంది. హర్షిత చెప్పిన సంగతులు.. ► నేను ప్రకాశంజిల్లాలో జన్మించాను. మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. నేను మాస్ కమ్యూనికేషన్స్ చదువుకున్నాను. పై చదువులు చదువుతా. ∙సినిమాల్లోకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పినప్పుడు అవసరమా? అన్నారు. కానీ, ప్రస్తుతం మంచి సపోర్ట్ లభిస్తోంది. తెలుగు అమ్మాయిగా వస్త్రాధారణ విషయంలో నాకు కొన్ని పరిమితులున్నాయి. ► కొన్ని యాడ్‌ఫిల్మ్స్ చేశాను. నా ఫొటోలు చూసిన చిత్రబృందం ‘తొలుబొమ్మలాట’ చిత్రంలో హీరోయిన్గా తీసుకున్నారు. ఇందులో సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్ర చేశా. రాజేంద్రప్రసాద్‌గారిలాంటి అనుభవం ఉన్న ఆర్టిస్టులతో నటించడానికి తొలుత భయం వేసింది. ► అవకాశాలను ఎంచుకునే స్థాయిలో ప్రస్తుతం నేను లేను. నాకు వచ్చినవాటిని, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాను. నా లైఫ్ సినిమానే అనుకోవడం లేదు. ఇతర విషయాలను కూడా ఆలోచిస్తున్నాను. ► సౌందర్యగారు, నిత్యామీనన్... ఇలా నేను అభిమానించేవారి నటీమణుల జాబితా చాలానే ఉంది. నా తర్వాతి చిత్రాల గురించి చర్చలు జరుగుతున్నాయి. వివరాలు త్వరలోనే చెబుతా. -
ఐదుపైసల సోడా గుర్తొచ్చింది
‘‘నా 42 ఏళ్ల నటజీవితంలో మొదటి ఐదు సినిమాల వరుసలో నిలిచే చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఇందులో సోడాల రాజు పాత్రలో నటించా. ఐదు పైసలతో సోడాలు తాగిన రోజులను ఈ సినిమా గుర్తు చేసింది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌లో విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఏమేం చేశాం? మన మూలాలు ఏంటి? అని తెలియజెప్పడానికైనా ఓ మంచి సినిమా ఉండాలి. ఆ లోటును తీర్చే సినిమా ‘తోలుబొమ్మలాట’. సాధారణంగా ఇలాంటి కథని 50 సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు చేయాలి. కానీ, విశ్వనాథ్ వంటి కుర్ర దర్శకుడు ఈ కథ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ‘ఆ నలుగురు’ సినిమా చేశాక ఇంతకంటే ఇంకేముంటుందిలే అనుకున్నా. ఒళ్లు దగ్గర పెట్టుకో అని నన్ను మళ్లీ హెచ్చరించిన కథ ఇది. నా నటజీవితంలో మరుపురాని సినిమా ఈ ‘తోలుబొమ్మలాట’ అన్నారు. ‘‘ఈ కథను రాసుకుని రాజేంద్రప్రసాద్‌గారి దగ్గరకు వెళ్లినపుడు ఓ గురువులా నన్ను ప్రోత్సహించారు’’ అన్నారు విశ్వనాథ్ మాగంటి. ‘‘కుటుంబ భావోద్వేగాలతో ఈ సినిమా తెరకెక్కింది’’ అన్నారు విశ్వంత్. ‘‘ఈ చిత్రంలో సోడాలరాజు స్నేహితుని పాత్ర చేశా’’ అన్నారు సీనియర్ నటుడు నారాయణరావు. నటుడు దేవీప్రసాద్, పాటల రచయిత చైతన్యప్రసాద్, హీరోయిన్ హర్షితాచౌదరి, నర్రా శ్రీనివాస్, కల్పన, సంగీతదర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరామన్ సతీష్ ముత్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ నూకవల్లి, ఆర్ట్‌డైరెక్టర్ మోహన్ కె.తాళ్లూరి తదితరులు పాల్లొన్నారు. -
విలనిజం నా డ్రీమ్ రోల్
అక్కగా, అర్ధాంగిగా, కోడలిగా.. ‘మా’ టీవీలో వచ్చే ‘లక్ష్మీకళ్యాణం’ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు ఆమె సుపరిచితమే. లక్ష్మీ, రంగీ, కృష్ణవేణిగా ఇప్పటివరకు ఆకట్టుకున్న ఈ చిరునవ్వుల రాణి అసలు పేరు హర్షిత వెంకటేష్. కన్నడ ఇంటిలో పుట్టి, తెలుగింటి అభిమానాన్ని పొందిన హర్షిత చిరునవ్వుతోనే తన విషయాలు ఇలా చెప్పుకొచ్చింది. ‘‘లక్ష్మీకళ్యాణం సీరియల్లో అక్కగా, భార్యగా, కోడలిగా లక్ష్మి పోషించే పాత్రలు.. వాటి చుట్టూ అల్లుకున్న అనుబంధాలతో కథ నడుస్తుంది. రెండేళ్లుగా వస్తున్న ఈ సీరియల్ నాకెంతో మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా, ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. కన్నడ అమ్మాయిని అయినా తెలుగులో నన్ను ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు అందరికీ థ్యాంక్స్. ఇప్పటికే కన్నడలో నాలుగు సీరియల్స్ చేశాను. తమిళ్లోనూ ఒక సీరియల్ చేశాను. తెలుగులో ‘లక్ష్మీకళ్యాణం’ చేస్తూనే ‘అత్తారింటికి దారేది’ సీరియల్‌కీ వర్క్ చేశాను. కొత్త భాష, కొత్త ప్రాంతం, అక్కడి సంస్కృతుల గురించి తెలుసుకోవడం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆ ఇష్టమే నన్నింత దూరం తీసుకొచ్చింది. అయితే, ఈ ప్రొఫెషన్లో చాలా చాలా ఓపిక ఉండాలి. ఎండలో, నీడలో, రాత్రి, పగలు.. వర్క్ చేస్తాం. లొకేషన్ ఎక్కడంటే అక్కడ ఉండాలి. టఫెస్ట్ జాబ్. కానీ, హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా వందలో ఒకరు యూనిక్‌గా ఉంటారు. ఆ యూనిక్ని నేను అనుకుంటే హ్యాపీ కదా! సీరియల్స్‌కి రాకముందు మా అమ్మానాన్నలు చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎంబీయే పూర్తి చేశాను. కాలేజీ టైమ్ నుంచే థియేటర్లో నటించిన అనుభవం ఉంది. ముందు సీరియల్లో ఆఫర్ వచ్చినప్పుడు మా పేరెంట్స్ వెంటనే ఓకే చేయలేదు. మా ఫ్యామిలీలోనూ ఎవరూ ఆర్టిస్టులు లేరు. కొంచెం ఆలోచనలో పడ్డారు. నేనూ సీరియల్ ఆర్టిస్టు ప్రొఫెషన్‌గా తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఒక సీరియల్ చేసి చూద్దాం అని ట్రై చేశాను. కన్నడలో రెండు సీరియల్స్ చేసిన తర్వాత ఈ వర్కే సీరియస్ అయిపోయింది. అమ్మానాన్న కూడా హ్యాపీ అయ్యారు. కన్నడ సీరియల్ చేసే టైమ్‌లోనే ‘మా’టీవీ నుంచి ఫోన్ వచ్చింది. ‘లక్ష్మీకళ్యాణం’ సీరియల్‌కి వాళ్లు వేరేవాళ్లతోనూ చాలా ఆడిషన్స్ చేశారంట. కానీ, నేను ఆ రోల్‌కి బాగా సూటవుతాను అనుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్ చాలా త్వరగా ఫైనల్ అయిపోయింది. వర్క్ బ్యాలెన్స్ నేను, అమ్మ, నాన్న.. ఇదే మా ఫ్యామిలీ. పుట్టి పెరిగింది బెంగుళూరులోనే. నాన్న వెంకటేష్ గవర్నమెంట్ జాబ్. ఇటీవలే వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అమ్మ గాయత్రి టీచర్. ఒక్కత్తే కూతురినని ఎంత గారాబంగా చూసుకుంటారో అంతే ఇండిపెండెంట్‌గా పెంచారు. చదువుతోపాటు ఇంటిపనుల్లోనూ పర్ఫెక్ట్. ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వచ్చినా ఇండివిడ్యువల్‌గా ఎలా ఉండాలో నేర్పించారు. అందుకే బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చినా ఇండిపెండెంట్‌గా ఉండగలుగుతున్నాను. వర్క్ ఇంపార్టెన్స్ పెరిగే కొద్దీ ఫ్యామిలీని మిస్ అవుతాం. ఒక్కోసారి నా వర్క్ షెడ్యూల్ వల్ల రెండు మూడు నెలలకోసారి కూడా ఇంటికి వెళ్లలేను. ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వడం అంత సులువు కాదు. ఎంత ముఖ్యమైన ఫంక్షన్ అయినా అటు నుంచి అటే లొకేషన్‌కి వచ్చేసిన రోజులున్నాయి. ఫ్యామిలీ–వర్క్ బ్యాలెన్సింగ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. – నిర్మలారెడ్డి విలన్ రోల్ ‘లక్ష్మీ కళ్యాణం’లో లక్ష్మీగా, రంగీగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. ఈ సీరియల్లో రంగీ రోల్ చాలా పాపులర్ అయ్యింది. ఈ పాత్రకు ఇదే పరిమితి అంటూ హద్దుల్లేవు. నా మనస్తత్వానికి పూర్తి డిఫరెంట్‌గా ఉండే పాత్ర అది. ఛాలెంజింగ్ పాత్రల్లో నటించడం అంటే చాలా చాలా ఇష్టం. అలా ఆ పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. నెక్ట్స్ అంధురాలిగా, విలన్‌గా, దేవత పాత్రలు.. యాక్ట్ చేయాలని ఉంది. లక్ష్మీకళ్యాణంలోని రంగీ పాత్రలో కొంచెం విలనిజం ఉంది. కానీ, ఇంకా పూర్తి విలన్ కాదు(నవ్వుతూ). నా టాలెంట్ చూపించాలనుకుంటే అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ అయితే బాగుంటుందనుకుంటున్నాను. సీరియల్స్ కాకుండా డ్యాన్స్, మ్యూజిక్, షాపింగ్ చేయడం అంటే బాగా ఇష్టం.’’ -
పాలిటెక్నిక్‌లో మొదటి ర్యాంకు సాధించిన హర్షిత
కడప అగ్రికల్చర్ : జిల్లాకు చెందిన విద్యార్థిని హర్షిత పాలిటెక్నిక్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచింది. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి అం దరిచేత శభాష్ అని పించుకుంది. కడపలోని డ్వామా ప్రాజెక్టులో ఏపీడీగా పనిచేస్తున్న డాక్టర్ జాజుల వరప్రసాద్, చిత్తూరు జిల్లా చంద్రగిరి సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.ప్రసూనల కుమార్తె హర్షిత. ఈ విద్యార్థిని తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2015–18 సంవత్సరంలో సివిల్ బ్రాంచ్‌ను పూర్తి చేసింది. ఇటీవల నిర్వహించిన చివరి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో 98.41 శాతం మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకుంది. ఇందుకుగాను ఈనెల 15న ఒంగోలు నగరంలో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిభా అవార్డును హర్షిత అందుకోనుంది. -
ఆ పాటల్లో నేనుండటం ఆనందం
‘‘నా సినిమాల్లో మొదట్నుంచీ విలువలతో కూడిన హాస్యం, విలువలతో కూడిన కథలకే చోటు ఇచ్చా. 42ఏళ్లుగా ఒక మంచి నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో సంపాదించిన స్థానాన్ని కోల్పోలేదంటే కారణం అదే’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. సంజోష్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బేవర్స్’. కాసం సమర్పణలో పొన్నాల చందు, డా.ఎం.ఎస్. మూర్తి, ఎమ్. అరవింద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ పంచుకున్న చిత్ర విశేషాలు.. ► నటీనటులు కాదు.. వారు చేసిన పాత్రలే ప్రేక్షకుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలా నా నట జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మరొక పాత్ర ‘బేవర్స్’ సినిమాలో చేశా. రమేష్ చెప్పాల ‘మీ శ్రేయోభిలాషి’తో రచయితగా నాకు పరిచయం. ‘ఆ నలుగురు’ తర్వాత మళ్లీ ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న నాకు అంతకంటే మంచి కథని ‘మీ శ్రేయోభిలాషి’కి ఇచ్చారు. ► సమాజంలో తండ్రి, పిల్లల మధ్య అనుబంధాన్ని ‘ఆ నలుగురు’లో చెప్పాం. ఆ బంధంలో మరో కోణాన్ని ఆవిష్కరిద్దాం అంటూ రమేష్ చెప్పాల ‘బేవర్స్’ కథ చెప్పాడు. తల్లిదండ్రులు, పిల్లల బాధ్యతలేంటి? అనే విషయాలను వినోదాత్మకంగా చూపించాం. అందరికీ మా సినిమా నచ్చుతుంది. – ఇటీవల రెండు అగ్రదేశాల్లో జీవిత సాఫల్య పురస్కారం అవార్డు అందుకున్నా. అక్కడికెళ్లినప్పుడు ‘అప్పుల అప్పారావు, దివాకరం’ అంటూ నా పాత్రల పేర్లతోనే ప్రేక్షకులు పలకరించడం చాలా సంతోషంగా అనిపించింది. బాధ్యత లేకుండా తిరిగేవాణì్న బేవర్స్ అంటారు. కుటుంబంలో ఎవరు బాధ్యత లేకుండా తిరిగినా బేవర్సే. సమాజం ఇలా ఉందని కాకుండా, ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం ఈ చిత్రంలో చేశాం. ► కాలానికి అనుగుణంగా కథలు మారిపోతున్నాయి. ఓ సమకాలీన తండ్రి పాత్రని ‘బేవర్స్’లో చేశా. కూతురుకీ, తండ్రికీ... కొడుకుకీ, తల్లికీ మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. అలా కూతురుని ప్రాణంగా ప్రేమించిన ఓ తండ్రి పాత్ర నాది. కొన్ని పాత్రలు నటుల్ని బాగా లీనం అయ్యేలా చేస్తుంటాయి. అదంతా కథ గొప్పతనమే. ► మనిషి జీవితంలో గుర్తుండిపోయేవి పెళ్లి, చావు. పెళ్లిలో నా ‘పెళ్లిపుస్తకం’ చిత్రంలోని ‘శ్రీరస్తు శుభమస్తు...’ పాట వస్తుంటుంది. ఆ పెళ్లిలో నేనున్నాననే అనుభూతి కలుగుతుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ‘ఆ నలుగురు’ సినిమాలోని ‘ఒక్కడై పుట్టడం, ఒక్కడై పోవడం’ అనే పాట వినిపిస్తుంటుంది. అలాగే తండ్రీకూతుళ్ల బంధం గురించి ‘బేవర్స్’లో ఓ పాట ఉంది. సుద్దాల అశోక్‌తేజ రాసిన ఆ పాటని ఎ.ఆర్.రెహమాన్‌లా ఆలపించాడు సంగీత దర్శకుడు సునీల్‌కశ్యప్. ► గతంతో పోలిస్తే చిన్న సినిమా విడుదల ఇప్పుడు చాలా సమస్యగా మారింది. అయితే మంచి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. చిన్న సినిమా తీసేవాళ్లంతా చచ్చినట్టుగా మంచి సినిమానే తీయాలనే పరిస్థితి వచ్చింది. మేం కూడా ‘బేవర్స్’ అనే ఒక మంచి సినిమానే తీశాం. -
ఆ హీరోలతో నటించాలని ఉంది
‘‘అన్ని రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకుల చేత మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది’’ అన్నారు కథానాయిక హర్షిత. రమేష్ చెప్పాల దర్శకత్వంలో సంజోష్, హర్షిత జంటగా తెరకెక్కిన చిత్రం ‘బేవర్స్’. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర చేశారు. పొన్నాల చందు, ఎం.ఎస్. మూర్తి, అరవింద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హర్షిత మాట్లాడుతూ– ‘‘మాది రాజస్తాన్. తెలుగులో ఇది నాకు నాలుగో సినిమా. ఇంతకుముందు ‘కన్నయ్య, ఖయ్యూం భాయ్, సత్యగ్యాంగ్’ సినిమాల్లో నటించాను. ‘బేవర్స్’ సినిమాలో ఆరాధ్య అనే పాత్ర చేశా. ఇందులో వాతావరణం కోసం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని ప్రచారం చేస్తా. ఈ సినిమాలో కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, విలువలు ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. బాధ్యత లేని యువకుడి పాత్రలో సంజోష్ కనిపిస్తారు. రాజేంద్రప్రసాద్‌గారి లాంటి గొప్ప నటులతో నటించడం నిజంగా అమేజింగ్. మంచి ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకు ఆయన ఒక పిల్లర్‌గా నిలబడ్డారు. టీమ్‌ని ప్రోత్సహించారు. దర్శకుడు రమేష్ బాగా తీశారు. నిర్మాతలు కుటుంబ సభ్యురాలిగా నన్ను ట్రీట్ చేశారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘రవితేజగారు, పవన్ కల్యాణ్‌గారు నా అభిమాన హీరోలు. వాళ్లతో కలిసి పనిచేయాలని ఉంది. తెలుగులో నా నెక్ట్స్ కమిట్మెంట్స్ ప్రస్తుతానికి లేవు. తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
నేను గర్వంగా ఫీల్ అయ్యే చిత్రం బేవర్స్
‘‘తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలే కాదు, పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్సే. సినిమా చూసిన తర్వాత టైటిల్ ఎందుకు పెట్టామో అర్థం అవుతుంది. మంచి సామాజిక స్పృహ ఉన్న చిత్రం చేశా అనే తృప్తి మిగిలింది. మనకంటే మనం చేసిన పాత్రలే గుర్తుండాలి. పాత్రల వల్లే నటులు గుర్తుంటారు’’ అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ అన్నారు. రమేష్ చెప్పాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో సంజోష్, హర్షిత జంటగా తెరకెక్కిన చిత్రం ‘బేవర్స్’. పొన్నాల చందు, ఎం.ఎస్. మూర్తి, అరవింద్ నిర్మించారు. అక్టోబర్ 12న రిలీజ్ కానున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నేను గర్వంగా ఫీల్ అయ్యే పది సినిమాల్లో ‘బేవర్స్’ ఉంటుంది. నేను రుణపడే దర్శకుల్లో రమేశ్ కూడా ఉంటారు. సుద్ధాల అశోక్‌తేజ మంచి పాటలు రాశారు’’ అన్నారు. ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో కలసి నటిస్తాననుకోలేదు. ఆయనతో ప్రేమలో పడి పోయా. కుటుంబమంతా ఎంజాయ్ చేసే చిత్రమిది’’ అన్నారు సంజోష్. ‘‘ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రానికి రచయితగా పని చేసిన రమేష్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం సంతోషంగా ఉంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం రాజేంద్రప్రసాద్‌గారిని జీవిత సాఫల్య పురస్కా రంతో సత్కరించడం హ్యాపీ’’ అన్నారు నిర్మాతలు. ‘‘మహానటుడు రాజేంద్రప్రసాద్‌తో యాక్ట్ చేయడం గర్వంగా ఉంది. కాశం నమశివాయగారి వల్లే చిత్రం పూర్తి చేశాం’’ అన్నారు రమేష్ చెప్పాల. ‘‘బేవర్స్ చెడ్డ పదం కాదు. ఎందుకూ పనికి రాని వాడు అని అర్థం. స్క్రీన్ మీద రాజేంద్రప్రసాద్ ఉన్నారు, రమేశ్ హిట్ కొట్టబోతున్నాడు’’ అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ‘‘రాజేంద్రప్రసాద్ అంటే నవ్వులే. ఆ నవ్వుల వెనక ఫిలాసఫర్ కనపడతారు నాకు. ప్రధాని పీవీ నరసింహా రావు కూడా ఆయన సినిమాలు చూసి సేద తీరేవారట. నాతో ప్రత్యేకంగా పాట రాయించుకున్నారు’’ అన్నారు సుద్ధాల అశోక్ తేజ. -
అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య
హైదరాబాద్: అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం కుమార్తె ఎస్.హర్షిత (21) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతోంది. గురువారం 11.30కి నల్లగండ్లలోని హిమసాయి అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. అపార్ట్మెంట్లోని 1401 ఫ్లాట్‌కు వెళ్తున్నట్టు సెక్యూరిటీ రిజిస్టర్లో రాసింది. 12.30 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడివారు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. అపార్ట్మెంట్ వాసులను హర్షిత గురించి ప్రశ్నించగా తమకెవరికీ తెలియదని జవాబు చెప్పారు. దీంతో పోలీసులు తనిఖీలు చేయగా.. 14వ అంతస్తులో ఆమె బ్యాగ్ లభించింది. అందులో బుక్స్, టిఫిన్, వాటర్ బాటిల్‌తో పాటు సెల్‌ఫోన్ లభించాయి. అందులో ఉన్న వివరాలను చూసి మృతురాలు హర్షితగా గుర్తించారు. సెల్ఫోన్లో ఉన్న నంబర్ ద్వారా తండ్రి సుబ్రహ్మణ్యంకు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో హెచ్‌సీయూ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాం«ధీ ఆస్పత్రికి తరలించారు. వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు ఈస్ట్ మారేడుపల్లిలోఉండే హర్షిత తల్లి అనురాధ భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న హర్షిత.. యూనివర్సిటీ నుంచి వెళ్లి నల్లగండ్లలోని హిమసాయి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఇదే అపార్ట్‌మెంట్‌కు ఎప్పుడైనా వచ్చిందా...? అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా...? ఆత్మహత్య చేసుకోవడంతో వారు తమకు సంబంధం లేనట్లు వ్యవహరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్ నుంచి చూస్తే హిమసాయి అపార్ట్మెంట్ ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అపార్ట్‌మెంట్‌ను ఎంచుకుందా అనే అభిప్రాయం కలుగుతోంది. అపార్ట్మెంట్లోని బోర్డులో చూసి నంబర్ చెప్పి మరో ఫ్లాట్‌లోకి వెళ్లి పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆత్మహత్య కోసమే అపార్ట్‌మెంట్‌ను ఎంచుకుందా..? సెమిస్టర్లో ఫెయిల్ కావడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి అనురాధ తన కూతురు బాగా చదువుతుందని ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినట్టు పోలీసులకు తెలిపింది. అపార్ట్మెంట్ పైన ఉన్నప్పుడే తల్లికి ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదని, దీంతో బాయ్ అని తల్లికి మెసేజ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జైలు నుంచి విడుదలైన సామ్రాట్
-
నాగార్జున, సమంతలతో ఫొటోలు ఎలా దిగింది..?
సాక్షి, హైదరాబాద్ : భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్టు అయిన సినీ నటుడు సామ్రాట్ రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యాడు. సామ్రాట్‌రెడ్డికి బుధవారం మియాపూర్‌లోని 25వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యాడు. ఈ సందర్బంగా సామ్రాట్ మీడియాతో మాట్లాడుతూ.. 'నా భార్యకు, నాకు మధ్య గొడవలకి కారణం మా అత్తమామలే.. నా పై వేధింపులు, దొంగతనం కేసు పెట్టారు. నా ఫ్రెండ్స్‌తో స్వలింగ సంపర్కం చేస్తున్నట్లు నాపై లేని నిందలు వేశారు. హర్షితా రెడ్డికి.. సినిమా వాళ్ళు అంటే ఇష్టం లేనప్పుడు పార్టీలకు ఎందుకు వచ్చింది..? నాగార్జున, సమంతలతో ఫొటోలు ఎలా దిగింది..? ఇంట్లో ఉన్న నా వస్తువులు తెచ్చుకుంటే నేను దొంగతనం చేశానని కేసు పెట్టి జైలుకి పంపారు. నేను డ్రగ్స్ తీసుకుంటాననేది ఆరోపణ మాత్రమే.. అందులో ఎంత మాత్రం నిజంలేదు. పార్టీలకు వెళ్లినప్పుడు హుక్కా మాత్రమే తీసుకుంటాను. వేరే అమ్మాయిలతో నాకు ఎఫైర్స్ ఉన్నాయంటున్నారు.. మరో పక్క'గే' అంటున్నారు.. నేను ఆరోపణలు చేయాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. నన్ను జైలుకి పంపించిన తరువాత.. హర్షిత రెడ్డితో కాపురం చేయలేను' అని తెలిపారు. కాగా తన ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారని స్వయంగా అతడి భార్య హర్షితా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు సామ్రాట్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడిని మియాపూర్ కోర్టులో పోలీసులు హాజరు పర్చారు.14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశాల జారీ చేశారు. అతనికి బెయిల్ మంజూరుచేయాలని సామ్రాట్‌రెడ్డి తరపున న్యాయవాదులు మంగళవారమే పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి వరూధిని కండిషనల్ బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తులు రూ.25 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ప్రతి శనివారం సామ్రాట్‌రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో హజరు కావాలని ఆదేశించారు. -
సామ్రాట్ టార్చర్ పెట్టేవాడు
-
భార్య ఇంట్లో చోరీ: నటుడి అరెస్ట్, జైలుకి తరలింపు
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తన ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారని స్వయంగా అతడి భార్య హర్షితా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు సామ్రాట్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడిని మియాపూర్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు.14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశాల జారీ చేశారు. మరోపక్క తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సామ్రాట్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై కోర్టు నిర్ణయం బుధవారానికి వాయిదా పడింది. దాంతో సామ్రాట్‌ను పోలీసులు జైలుకు తరలించారు. తన భర్త సామ్రాట్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ గతంలో హర్షితారెడ్డి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో తన ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారు, ఇతర వస్తువుల్ని చోరీ చేశారనే ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు సామ్రాట్‌పై ఐపీసీలోని 380,427ఆర్/డబ్ల్యూ, 201 సెక్షన్ల కింద కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. అలా చేయడం తప్పే: సామ్రాట్ తనపై వస్తున్న ఆరోపణలను టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డి ఖండించాడు. తన భార్య హర్షిత రెడ్డి, వాళ్ల కుటుంబీకులు చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని అతడు పేర్కొన్నాడు. ఇంటి నుంచి డబ్బులు, నగలు దొంగిలించానని హర్షిత ఆరోపిస్తూ కేసు పెట్టిందని, అయితే తన ఇంట్లో నుంచి తనకు కావల్సిన వస్తువులు మాత్రమే తీసుకున్నట్లు సామ్రాట్ రెడ్డి తెలిపాడు. ఇంట్లో సీసీ కెమెరాలను తానే ధ్వంసం చేసినట్లు అతడు అంగీకరించాడు. కోపంతోనే అలా చేశానని, అది తన తప్పేనంటూ...అయితే తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని సామ్రాట్ రెడ్డి స్పష్టం చేశాడు. తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారని, అలా అయితే తాను ఇప్పటివరకూ పోలీసులకు ఎందుకు పట్టుబడలేదని ప్రశ్నించాడు. డ్రగ్స్ వాడకంపై పోలీస్ శాఖ సీరియస్‌గానే ఉందని చెప్పుకొచ్చాడు. కావాలనే తనపై హర్షితా రెడ్డి కుటుంబీకులు ఆరోపణలు చేస్తున్నారని సామ్రాట్ రెడ్డి వాపోయాడు. హర్షితకు సామ్రాట్‌పై అనుమానం.. సామ్రాట్ ఎవరితో మాట్లాడినా హర్షిత అనుమానపడేదని సామ్రాట్ తల్లి తెలిపారు. హర్షితకు మొదటి నుంచి సామ్రాట్ సినిమాలు చేయడం ఇష్టం లేదని తెలిపారు. ప్రతిదానికీ హర్షిత గొడవ పెట్టుకునేందని చెప్పారు. రెండేళ్ల క్రితం సామ్రాట్, హర్షితకు పెళ్లి అయిందని, మూడు నెలల నుంచి భార్యభర్తల మధ్య గొడవులు జరుగుతున్నాయని తెలిపారు. సామ్రాట్‌కు లేని అలవాటు లేదు: హర్షిత మరోవైపు సామ్రాట్ రెడ్డి భార్య హర్షిత మాట్లాడుతూ... సామ్రాట్‌కు అన్ని అలవాట్లు ఉన్నాయని, హుక్కా సెంటర్లో డ్రగ్స్ కూడా తీసుకున్నాడని తెలిపింది. ‘సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలతో సామ్రాట్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. నన్ను వదిలించుకోవాలని అని చూడటమే కాకుండా చాలాసార్లు నాపై దాడి చేశాడు. మా ఇంట్లో వస్తువులు కూడా ఎత్తుకెళ్లాడు. తనతో కలిసి ఉండే ఉద్దేశం నాకు లేదు. పెద్దలతో రాజీ ప్రయత్నం చేసినప్పటికీ విఫలం కావడంతోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. కోర్టులోనే అన్ని విషయాలు తెలుస్తాయి.’ అని ఆమె పేర్కొంది. -
కన్నయ్య లక్ష్యం ఏంటి?
విపుల్, హర్షిత జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘కన్నయ్య’. విపుల్ దర్శకత్వంలో జాదవ్ రాజేష్ బాబు, పగడాల కృష్ణంరాజు, తిరువాయిపాటి రవితేజ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కుటుంబ విలువలు, బంధాలు, సెంటిమెంట్, వినోదం అన్నీ సమపాళ్లలో ఉంటాయి. కన్నయ్య ఎవరు? అతని లక్ష్యం ఏంటి? అనేది కథాంశం. సత్యకశ్యప్ సంగీతం ప్రేక్షకులను అలరిస్తుంది. జవహర్ రెడ్డి ప్రతి ఫ్రేమ్‌ను చాలా అద్భుతంగా చూపించారు. త్వరలో పాటలు, ఫిబ్రవరిలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వైవిధ్యమైన కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఉత్తేజ్, కాశీ విశ్వనాథ్, సత్యకృష్ణ, సూర్య తదితరులు నటించారు. -
జాతీయ చెస్ విజేత హర్షిత
బాలుర విభాగం రన్నరప్ అర్జున్ న్యూఢిల్లీ: జాతీయ సబ్ జూనియర్ అండర్-15 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు మెరిశారు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జి.హర్షిత చాంపియన్‌గా అవతరించగా... బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన ఎరిగైసి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మారుు తోషాలి (8 పారుుంట్లు) మూడో స్థానంలో నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హర్షిత, వంతిక అగర్వాల్ (ఢిల్లీ) 9 పారుుంట్లతో సమఉజ్జీగా నిలిచారు. అరుుతే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హర్షితకు టైటిల్ ఖాయమైంది. ఈ టోర్నీలో హర్షిత ఎనిమిది గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోరుుంది. బాలుర విభాగంలో అర్జున్ 9 పారుుంట్లు నెగ్గి రెండో స్థానంలో నిలిచాడు. 9.5 పారుుంట్లతో మిత్రబా గుహ (బెంగాల్) అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు లక్నోలో ముగిసిన జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో అరవింద్ చిదంబరం (తమిళనాడు-8.5 పారుుంట్లు) విజేతగా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధూళిపాళ్ల బాలచంద్ర ప్రసాద్ (4.5 పారుుంట్లు) పదో స్థానంలో, తెలంగాణ ఆటగాడు ప్రణీత్ సూర్య (1 పారుుంట్) 13వ స్థానంలో నిలిచారు. -
ఆర్చరీలో సత్తా చాటిన రితురాజ్, హర్షిత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ స్కూల్ ఆర్చరీ పోటీల్లో రితురాజ్, హర్షిత సత్తాచాటారు. ఇండియన్ రౌండ్ ఆర్చరీ అండర్- 17 విభాగంలో విజేతలుగా నిలిచారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతోన్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో కృష్ణవేణి హైస్కూల్‌కు చెందిన రితురాజ్ సింగ్, ఎన్. కృష్ణ సారుు తొలి రెండు స్థానాల్లో నిలవగా... సుజాత హైస్కూల్‌కు చెందిన మొహమ్మద్ ఖాజా, అబ్దుల్ వహీద్‌లు మూడు, నాలుగు స్థానాల్ని దక్కించుకున్నారు. బాలికల విభాగంలో శంకర్ జీ మెమోరియల్ హైస్కూల్‌కు చెందిన హర్షిత, రోసరీ కాన్వెంట్కు చెందిన షేక్ రహీమా, జెడ్పీహెచ్‌కు చెందిన హిమ మాన్సి తొలి మూడు స్థానాల్ని దక్కించుకున్నారు. అండర్ -14 విభాగంలో జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ సత్తా చాటింది. బాలుర విభాగంలో తొలి మూడు స్థానాల్ని కైవసం చేసుకుంది. సారుు ఉజ్వల్, జిష్ణు, సారుు మనీష్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో ఉన్నారు. బాలికల విభాగంలో ఊర్వశి (కృష్ణవేణి హైస్కూల్) చాంపియన్‌గా నిలవగా... జినిషా (సెరుుంట్ ఆంథోని హైస్కూల్) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. స్వాతి ధన్య (బీవీబీపీఎస్) మూడో స్థానంలో ఉంది. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో చాదర్‌ఘాట్‌లో జరిగిన ఎరుుర్రైఫిల్ పోటీల విజేతలు అండర్-14 బాలురు: 1. ఎస్. సాత్విక్ (డీపీఎస్), 2. సయ్యద్ అలీ (హిదాయత్ హైస్కూల్), 3. చిన్మయ ఆరోరా (బీవీబీపీఎస్). అండర్-17 బాలురు: 1. కె. సారుు ప్రజ్వల్ (లిటిల్ ఫ్లవర్ స్కూల్), 2. శివెక్ అగర్వాల్ (బీవీబీపీఎస్), 3. డి. సుజయ్ (బీవీబీపీఎస్). బాలికలు: 1. బి. హరిత (జీబీహెచ్‌ఎస్), 2. హరిచందన (సెరుుంట్ జోసెఫ్ హైస్కూల్), 3. శ్రీష్మ (బీవీబీపీఎస్). -
విజేతలు హర్షిత, కార్తీక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ ఐసీఎస్ఈ- ఐఎస్సీ స్కూల్ స్పోర్ట్స్ మీట్లో ట్రిపుల్ జంప్ విభాగంలో హర్షిత, కార్తీక్‌లు విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన పోటీల్లో ట్రిపుల్ జంప్ సీనియర్ బాలికల కేటగిరీలో సెయింట్ జోసెఫ్ స్కూల్‌కు చెందిన హర్షిత పసిడిని దక్కించుకోగా... శ్రీరిన్ (సెయింట్ ఆన్స్), ఐశ్వర్య (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్) రజత కాంస్యాలను సాధించారు. సీనియర్ బాలుర కేటగిరీలో కార్తీక్ సింగ్ (సుజాత స్కూల్), షణ్ముఖ్ సారుు తేజ, కౌశిక్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. జూనియర్ బాలికల కేటగిరీలో రక్షిత (ఈఎస్ఆర్హెచ్ఎస్) తొలి స్థానంలో నిలవగా... మానస (ఈఎస్ఆర్హెచ్ఎస్), కస్తూరి (ఎన్ఏఎస్ఆర్) ద్వితీయ, తృతీయ స్థానాల్ని సంపాదించుకున్నారు. ఇతర విభాగాల్లో విజేతల వివరాలు సీనియర్ బాలికలు జావెలిన్ త్రో: 1. శ్రీవియా గణపతి (సెయింట్ జోసెఫ్ హైస్కూల్), 2. ఎన్. నవ్యశ్రీ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 3. సుష్మా (జాన్సన్ గ్రామర్ స్కూల్). వాకింగ్: 1. వర్ష చౌదరీ (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్), 2. సాక్షి జైన్ (సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్), 3.ముస్కాన్ (ఎన్ఏఎస్ఆర్). హైజంప్: 1. ఇషిత (ఎన్ఏఎస్ఆర్), 2. టి. ప్రవళిక (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. దివ్య (హెచ్‌పీఎస్). 200మీ. పరుగు: 1. జి. నిత్య (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 2. విన్నీ (సెరుుంట్ ఆన్స హైస్కూల్). 3. ఆత్రేయ చక్రవర్తి (గీతాంజలి) డిస్కస్ త్రో: 1. రియా (టింపనీ స్కూల్), 2. శ్రీవియా (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 3. క్రిసాల్డా (సెయింట్ ట్ ఆన్స్ స్కూల్). సీనియర్ బాలురు వాకింగ్: 1. రోషన్ (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్), 2. జై (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 3. వర్ధన్ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్). 1500మీ: 1. పవన్ తేజ (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 2. సాయి చంద్ర (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. అనిల్ (ఫ్యూచర్కిడ్స స్కూల్). 200మీ: 1. రూపేశ్ (అభ్యాస రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్), 2. మనీశ్ (సెయింట్ ట్ జార్జ్ స్కూల్), 3. దివాకర్ (హెచ్‌పీఎస్). జూనియర్ బాలికలు హైజంప్: 1. జి. దివ్య (సెయింట్ ఆన్స్), 2. విజయవాంగి (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), 3. కీర్తన (రమాదేవి పబ్లిక్ స్కూల్). 200మీ. : 1. నిఖితా రెడ్డి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 2. శ్రీలక్ష్మీ (శ్రీ సాయి పబ్లిక్ స్కూల్), 3. సి. లక్ష్య (సెయింట్ జోసెఫ్ స్కూల్). జావెలిన్ త్రో: 1. జి. గీతాంజలి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 2. నందిని (సుజాత స్కూల్), 3. అనన్య (సుజాత స్కూల్). 3కి.మీ వాక్: 1. నవ్యశ్రీ (ఈఎస్ఆర్హెచ్ఎస్), 2. శ్రీవాసవి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), 3. వైష్ణవి (షేర్వుడ్ పబ్లిక్ స్కూల్). -
లారీ ప్రమాదం: నుజ్జునుజ్జైన చిన్నారులు
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి వద్ద సోమవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృత్యవాత పడ్డారు. వివరాలు... విజ్ఞాన్ జ్యోతి స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలికలను తాతయ్య స్కూటీపై ఇంటికి తీసుకెళుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీయ (10), హర్షిత (6) నుజ్జునుజ్జయి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. తాతయ్య బాలయ్య (65)కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తెగిపడిన అవయవాలతో ప్రమాద స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది.