ఫిలిప్పైన్స్‌లో అందాలు విందులు చేస్తున్నాయి...
విశ్వ సౌందర్యం
ఫిలిప్పైన్స్‌లో అందాలు విందులు చేస్తున్నాయి. జనవరి 30న ఆ దేశంలో జరగనున్న ‘మిస్ యూనివర్స్’ పోటీల కోసం దాదాపు 85 దేశాల నుంచి అందాల భామలంతా రాజధాని మనీలా చేరుకున్నారు. స్థానిక ప్రజలు వీరికి కరతాళధ్వనులతో, కేరింతలతో స్వాగతం చెబుతున్నారు. పోలీసు విభాగం హడావిడి చేసి దాదాపు 1300 మంది పోలీసులను ఈ పోటీలకు కేటాయిం చింది. ఎందరు అందాల భామలు ఉన్నా 15 దేశాల వారు అంతిమంగా బరిలో నిలువవచ్చనీ, వారిలో ఒకరు ‘మిస్ యూనివర్స్’ కావచ్చుననీ పండితులు అంచనాలు కడుతున్నారు.
కొలంబియా, జర్మనీ, అమెరికా, చిలీ, ఫిలిప్పైన్స్, వెనిజులా, మెక్సికో దేశాలకు చెందిన సుందరీమణులకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వీరి ఉవాచ. భారతదేశం నుంచి రోష్మిత హరిమూర్తి ఈ పోటీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అన్నట్టు మలేసియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిరణ్‌మీత్ కౌర్ కూడా మన భారతీయ సంతతికి చెందిన అమ్మాయే. మొత్తానికి కిరీటధారిణి ఎవరో తేలాలంటే జనవరి 30 వరకు ఆగాలి.