మిస్ యూనివర్స్‌గా ఫిలిప్పీన్స్ సుందరి
♦ గందరగోళం అనంతరం ఎంపికైన పియా అలొంజో
♦ రెండో స్థానంలో కొలంబియాకు చెందిన అరియాడ్నా
లాస్‌వేగాస్: ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం ఫిలిప్పీన్స్‌కు చెందిన పియా అలొంజో వుర్త్‌బాచ్‌ను వరించింది. ఫైనల్స్‌కు మొత్తం 79 మంది చేరుకోగా... అంతిమంగా పియా అలొంజో ఎంపికయ్యారు. రెండో స్థానంలో కొలంబియా సుందరి అరియాడ్నా గ్విటెర్జ్, మూడో స్థానంలో అమెరికా భామ ఒలివియా జోర్డాన్ నిలిచారు. భారత్ తరఫున పోటీ పడిన ఊర్వశి రుటెలా టాప్-15లోనూ చోటు దక్కించుకోలేకపోయింది. అయితే ఈ పోటీల విజేతల ప్రకటనలో కొంత గందరగోళం జరిగి, వివాదాస్పదంగా మారింది. కార్యక్రమం నిర్వాహకుడు స్టీవ్ హార్వే తొలుత ఈ విజేతలు వేర్వేరు స్థానాల్లో నిలిచినట్లు ప్రకటించారు.
తొలిస్థానంలో కొలంబియా యువతి అరియాడ్నా, రెండో స్థానంలోఅలొంజో, మూడో స్థానంలో ఒలివియా నిలిచారని చెప్పారు. దీంతో ఎగిరి గంతేసిన కొలంబియా యువతి.. వేదికపై ‘క్యాట్‌వాక్’ చేసి ప్రేక్షకులకు అభివాదం కూడా చేశారు. గత ఏడాది మిస్ యూనివర్స్, కొలంబియాకే చెందిన పౌలినా వెగా వేదికపైకి చేరుకుని అరియాడ్నా తలపై కిరీటమూ పెట్టారు. కానీ విజేతలను ప్రకటించడంలో పొరపాటు జరిగిందంటూ నిర్వాహకుడు స్టీవ్ హార్వే ఒక్కసారిగా షాకిచ్చారు. మొదటి స్థానంలో పియా, రెండో స్థానంలో అరియాడ్నా నిలిచినట్లు ప్రకటించారు. ఈ తప్పిదానికి తాను బాధ్యత వహిస్తానని, ఎవరూ బాధపడవద్దని వ్యాఖ్యానించారు. దీంతో తిరిగి వేదికపైకి వచ్చిన మాజీ మిస్ యూనివర్స్ పౌలినా వెగా... అరియాడ్నా నుంచి కిరీటాన్ని తీసుకుని పియా అలొంజోకు అలంకరించారు. ఈ సందర్భంగా పియా అలొంజో ‘నాది హృదయంతో కూడిన సౌందర్యం’ అని పేర్కొన్నారు. ఈ మిస్ యూనివర్స్ కిరీటం బాధ్యతలతో కూడిన గౌరవంగా భావిస్తానని చెప్పారు. హెచ్‌ఐవీపై ప్రజలను చైతన్యవంతం చేస్తానని తెలిపారు.