సిరులతల్లి శ్రీకనకమహాలక్ష్మి
గోపురం లేని ఆలయం!
కనకమహాలక్ష్మి ఆలయానికి ఇతర దేవాలయాల మాదిరిగా గోపురం ఉండదు. దేశంలో గోపురం లే ని దేవాలయం ఇదే కావడం విశేషం. బహిరంగ మండపంలోనే విగ్రహాన్ని ప్రతిష్టించారు. పంచభూతాలు అమ్మవారిని సేవించడానికి వీలుగా ఇలా గోపురం లేకుండా స్థాపించారని పండితులు చెబుతారు. ఇక్కడ రోజులో 24 గంటలూ దర్శించుకునేందుకు ఆలయం తెరిచే ఉంచడం మరో ప్రత్యేకత. అమ్మవారి విగ్రహం ఏ కాలంలో వెలిసిందో తెలిపే ఆధారాలు లేవు. దీంతో 1912కి ముందే ఉన్నట్టు నిర్ధారణ అవుతోంది.
శ్రీకనకమహాలక్ష్మి .. విశాఖవాసుల ఇలవేల్పుగాను, కోరిన కోర్కెలు తీర్చే తల్లిగాను, సిరిసంపదలు, స్త్రీలకు ఐదవతనాన్ని, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే అమ్మవారిగాను, మహిళల కొంగుబంగారంగా భాసిల్లుతున్నారు. కనకమహాలక్ష్మికి ఆలయానికి ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. అయితే అమ్మవారు గురువారం నాడు ఆవిర్భవించడం వల్ల, ఆమెకు ప్రీతికరమైన మాసం మార్గశిరం కావడం వల్ల ఈ మాసంలో వచ్చే నాలుగు లక్ష్మివారాలు (గురువారాలు) లక్షల్లో భక్తులు సందర్శించి పునీతులవుతారు. మహిళలు అమ్మవారికి నేరుగా పసుపు కుంకుమలు సమర్పించుకోవడం, భక్తులే స్వయంగా కొబ్బరికాయలు కొట్టుకోవడం ఇక్కడి ప్రత్యేకత. విశాఖలో అమ్మవారి భక్తులెవరూ పెళ్లయిన ఆడపిల్లను గురువారం అత్తవారిళ్లకు పంపరు. అలా పంపితే లక్ష్మి వారి వెంట వెళ్లిపోతుందని నమ్ముతారు.
ఇలా వెలిశారు..
స్థలపురాణం ప్రకారం.. శ్రీకనకమహాలక్ష్మి ఈ ప్రాంతాన్ని పాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు. వారి కోట ఈ పరిసరాల్లో ఉండేది. అందుకే అమ్మవారున్న ప్రదేశాన్ని బురుజుపేటగా పిలుస్తారు. శత్రురాజులు విశాఖ కోటపై దండెత్తినప్పుడు అమ్మవారిని బావిలో పడేశారు. కలియుగారంభంలో ఓ సత్‌బ్రాహ్మణుడు తపస్సుతో దైవసాన్నిధ్యం పొందాలని కాశీకి పయనమై బురుజుపేట చేరుకున్నాడు. అక్కడ బావిలో స్నానమాచరిస్తుండగా అమ్మవారు ప్రత్యక్షమై తనను పైకి తీసి ప్రతిష్ఠించాలని కోరారు. అందుకు ఆ బ్రాహ్మణుడు తిరస్కరించడంతో బావి నుంచి పైకి వచ్చి తన ఎడమ చేతిలోని పరిఘ అనే ఆయుధంతో అతడిని సంహరించడానికి యత్నించారు. అతడు శివుని ప్రార్థించడంతో ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యం చేసి వామహస్తాన్ని మోచేతి దాకా ఖండించాడు. అప్పటితో ఆమె కోపం మాయమై శాంతి, కారుణ్యంతో కలియుగంలో శ్రీకనకమహాలక్ష్మిగా అవతరించి భక్తుల కోర్కెలు తీర్చేలా అనుగ్రహించాడు. అలా వెలిసిన అమ్మవారు నిత్యపూజలందుకుంటున్నారు. 1912లో వీధి వెడల్పు చేసినప్పుడు అమ్మవారి విగ్రహం అలాగే ఉంచారు.
1917లో ఆ విగ్రహాన్ని రోడ్డు మధ్య నుంచి 30 అడుగుల దూరం జరిపారు. ఆ తర్వాత విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి వేలాది మంది మరణించారు. అమ్మవారి విగ్రహాన్ని కదపడం వల్లే ఇదంతా జరిగిందని భావించిన ప్రజలు యథాస్థానంలో చేర్చారు. అనంతరం ప్లేగు పునరావృతం కాకపోవడంతో అదంతా అమ్మవారి మహిమగా విశ్వాసం ప్రబలింది.
ఇవీ పూజలు..
మార్గశిరమాసంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, సహస్ర, అష్టోత్తర నామార్చన పూజలుంటాయి. గురువారాల్లో (బుధవారం అర్ధరాత్రి నుంచి) విశేషపంచామృతాభిషేక సేవ, సహస్రనామార్చన పూజ, సర్వదర్శనం ఉంటాయి.
ఎలా రావాలి?
శ్రీకనకమహాలక్ష్మిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 3, రైల్వే స్టేషన్ నుంచి 3, విమానాశ్రయం నుంచి 15 కి.మీల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ప్రాంతాల నుంచి చేరుకోవడానికి కార్లు, ఆటోలు, బస్సు సదుపాయాలున్నాయి.
- బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం.
ఫొటోలు: పి.ఎన్.మూర్తి, విశాఖపట్నం