నోరు మంచిదైతే... మెదడుకూ మంచిదే! రోజూ వాడే బ్రష్‌తో పక్షవాతాన్నీ తరిమేయండి! | The mouth and good reviews ... Medaduku good! Get paksavatanni brushes used on a regular basis! | Sakshi
Sakshi News home page

నోరు మంచిదైతే... మెదడుకూ మంచిదే! రోజూ వాడే బ్రష్‌తో పక్షవాతాన్నీ తరిమేయండి!

Published Sun, Dec 29 2013 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

The mouth and good reviews ... Medaduku good! Get paksavatanni brushes used on a regular basis!

ఇటీవల తమ వద్దకు వచ్చే కేసులతో ఒక కొత్త పరిణామాన్ని గమనించారు దంతవైద్యులు డాక్టర్ ప్రత్యూష, న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మ వీరపనేని. పక్షవాతంతో తన వద్దకు  వచ్చిన కేసులను పరిశీలిస్తే... వారికి గతంలో దంత సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చిన కేస్ హిస్టరీని గమనించినట్లు పేర్కొంటున్నారు పద్మ  వీరపనేని. అలాగే దంత సంబంధమైన వ్యాధులు జింజివైటిస్, పెరియోడాంటైటిస్ వచ్చి ఉన్న వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువే అంటున్నారు డాక్టర్ ప్రత్యూష.  ఈ సంయుక్త పరిశీలన ఫలితాలను బేరీజు వేసి చూస్తే... దంతసంబంధమైన  వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదనేది ఆ ఇద్దరు డాక్టర్ల మాట. నోటి శుభ్రతతో పక్షవాతానికి వాత పెట్టవచ్చని వారి సలహా. దంతాలకు వచ్చే జింజివైటిస్, పెరియోడాంటైటిస్ వ్యాధులు దీర్ఘకాలంలో పక్షవాతానికి దారితీసే వైనాన్ని వివరిస్తున్నారు వీరు.
 
 చాలామందిలో చిగుర్ల భాగం కాస్తంత ఉబ్బి, ఎర్రగా మారుతుంది. నిజానికి చిగుర్లకు వచ్చే వ్యాధులు నొప్పి లేనివిగా ఉంటాయి. దాంతో చిగుర్లకు వచ్చే వ్యాధుల్ని గుర్తించడం కష్టం. చిగుర్లను ‘జింజివా’ అంటారు. వీటికి వచ్చే ఇన్ఫెక్షనే ‘జింజివైటిస్’. చిగుర్లలోపలి భాగంలో పంటికి గట్టిగా అతుక్కుపోయే గార, బ్యాక్టీరియా వల్ల చిగుర్లవాపు లక్షణంతో కనిపించే జింజివైటిస్ వస్తుంది. ప్రతిరోజూ సరిగా బ్రష్ చేయకపోవడం అనే చిన్న కారణం మొదలుకొని, చాలామందిలో ఉండే పొగాకు నమిలే దురలవాటు వరకు ఈ గార, బ్యాక్టీరియాల పెరుగుదలకు కారణం. మనం రోజూ సరిగా బ్రష్ చేయకపోతే  కనీసం 400 రకాల హానికర బ్యాక్టీరియా పళ్ల మధ్య పెరగడానికి ఆస్కారం ఉంది. అలా హానికరమైన బ్యాక్టీరియా కారణంగా పంటిపై గార పెరుగుతుంది. తొలిదశలో గారను సులభంగా తొలగించవచ్చు. కానీ అదే దీర్ఘకాలికంగా ఉంటే తొలగించలేనంత గట్టిగా మారి కాలక్రమంలో పెరియోడాంటైటిస్‌కు దారితీస్తుంది. ఇది ప్రధానంగా పొగతాగేవారిలో, పొగాకును గుట్కా, ఖైనీ, పాన్‌పరాగ్‌ల రూపంలో నమిలేవారిలో మరింతగా ఉంటుంది.
 
 నోటి ఆరోగ్యానికీ... పక్షవాతానికీ సంబంధమేమిటి?
 
 నోటిజబ్బులకూ, చిగుర్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా కొన్ని రకాల విషపదార్థాల (టాక్సిన్స్)ను వెలువరిస్తుంటాయి. ఆ టాక్సిన్స్ రక్తంలో ప్రవేశించి, రక్తప్రవాహానికి అడ్డుపడటానికి కారణమయ్యే కొన్ని రక్తపుగడ్డలు (క్లాట్స్)నూ, కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ క్లాట్స్, ప్లాక్స్ ఒకవేళ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలకు అడ్డుపడితే గుండెపోటు రావచ్చు. ఇది ఒక థియరీ.
 
 ఇక పక్షవాతానికి దారితీసే మరో థియరీ కూడా  ఉంది. దీని ప్రకారం... నోటిలో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందినప్పుడు మన కాలేయంలో కొన్ని రకాల ప్రోటీన్లు తయారవుతాయి. అవి రక్తప్రవాహంలోకి తద్వారా మెదడులోని  రక్తనాళాల్లోకి ప్రవేశించి రక్తప్రవాహానికి అడ్డుపడటం వల్ల ‘ఇస్కిమిక్ స్ట్రోక్’ (ఒక రకం పక్షవాతం)కు దారితీయవచ్చు. మెదడులో ఏ అవయవాన్ని నియంత్రించే సెంటర్‌కు రక్తసరఫరా నిలిచిపోతే ఆ భాగం చచ్చుబడి... అలా అది పక్షవాతం రూపంలో వ్యక్తమవుతుంది. ఇదీ నోటిఆరోగ్యానికీ, చిగుళ్ల ఆరోగ్యానికీ... మెదడుకూ ఉన్న సంబంధం. అలాగే కోరపన్నుకు వచ్చే  ఇన్ఫెక్షన్ నేరుగా మెదడుకి వెళ్లి కేవర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అనే కండిషన్ వస్తుంది. అది నేరుగా పక్షవాతానికి దారితీస్తుంది. ఇక కొందరిలో అసలు పళ్లే ఉండవు. దాంతో చిగుర్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశమే ఉండదు. ఇలా చిగుర్ల ఇన్ఫెక్షన్ లేనివాళ్లలో పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్న దృష్టాంతం కూడా పళ్లకూ, పక్షవాతానికి ఉన్న సంబంధాన్ని స్పష్టం చేస్తోంది.
 
 చిగుర్లు ఆరోగ్యంగానే ఉన్నాయని గుర్తించడం ఎలా?

 
 చిగుర్లు  గులాబి రంగులో ఆరోగ్యంగా కనిపిస్తుంటాయి. ఈ గులాబి రంగు చిగుర్లు కాస్తా ఎర్రగా వాచి కనిపించడం, బ్రష్ చేసుకుంటుంటే చిగుర్ల నుంచి రక్తం రావడం జరిగితే అది చిగుర్ల వ్యాధి (జింజివైటిస్)కి లక్షణంగా భావించాలి. జింజివైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది దీర్ఘకాలంలో పెరియోడాంటైటిస్‌కు దారి తీస్తుంది. పెరియోడాంటైటిస్‌ను గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి... చిగుర్లలో పుండ్లు పడటం, దంతాల మధ్య గ్యాప్ పెరగడం, దంతాలు వదులు కావడం వంటి లక్షణాలతో తెలుసుకోవచ్చు.
 
 పక్షవాతానికి బ్రష్‌తోనూ నివారణ...
 
 మనం రోజూ పళ్లు తోముకునే ఒక చిన్న బ్రష్ గుండెజబ్బులతో పాటు పక్షవాతాన్నీ నివారిస్తుందని తెలుసుకోండి. ఒకవేళ ఇప్పుడు మీరు బ్రషింగ్ కోసం చేతిని కదిలించడానికి బద్దకిస్తే... అసలు భవిష్యత్తులో చెయ్యే కదలకుండా చచ్చుబడిపోయే ప్రమాదం ఉందని గుర్తించండి. పంటి పక్కవైపున ఉండే ప్లాక్‌ను ఫ్లాసింగ్‌తో (దారం సహాయంతో) తొలగించుకోండి. ఒకవేళ ఇప్పటికే ప్లాక్ చేరి ఉన్నట్లు గుర్తిస్తే డెంటిస్ట్‌ను కలిసి దాన్ని స్కేలింగ్ వంటి ప్రక్రియలతో తొలగించుకోవాలి. ఒకసారి ఆ పని చేసి ఇక ఆ తర్వాత ఎప్పటికప్పుడు నోటి శుభ్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఇది పళ్లను శుభ్రపరచడమే  గాక... రక్తనాళాలనూ శుభ్రం చేసి అటు గుండెపోటూ, ఇటు బ్రెయిన్‌స్ట్రోక్‌లను నివారిస్తుంది.
 
 -నిర్వహణ: యాసీన్

 
 పక్షవాతం రిస్క్ తగ్గించే షార్ట్‌కట్స్ ఇవి...
 ఊ రోజూ బ్రషింగ్, ఫ్లాసింగ్ ద్వారా దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారపదార్థాలను తొలగించాలి
 
 దంతాలకు బలం చేకూర్చే సమతుల పోషకాహారం తీసుకోవాలి. దంతాలకు తగినంత క్యాల్షియం లభించేలా పాలు, పాల ఉత్పాదనలు తీసుకోండి
 
 సిగరెట్, పొగాకుకు సంబంధించిన ఇతర ఉత్పాదనలైన గుట్కా, ఖైనీ, పాన్‌మసాలా వంటి అలవాట్లను తక్షణం మానేయండి. అవి తీసుకునే సమయంలో భవిష్యత్తులో అదే పక్షవాతానికి కారణం కావచ్చనే మాటను గుర్తుచేసుకోండి.
 
 డాక్టర్ ప్రత్యూష
 దంత వైద్య నిపుణులు,
 ప్రొఫెసర్, ఓరల్ మెడిసిన్
 అండ్ రేడియాలజీ, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్.

 
 డాక్టర్ పద్మ ఎస్. వీరపనేని
 సీనియర్ న్యూరాలజిస్ట్, అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్
 కిమ్స్ హాస్పిటల్ , సికింద్రాబాద్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement