దేహంలో ఒక పార్శ్వం కదలకపోతే... పక్షవాతం
అవగాహన
పక్షవాతం దాడి చేసినప్పుడు ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే రోగి కోలుకోవడం కూడా అంతే వేగంగా జరుగుతుంది. చిక్కంతా ‘పక్షవాతం లక్షణాలు ఇలా ఉంటాయి’ అని తెలియకపోవడంతోనే వస్తుంటుంది.
బలహీనత, దేహంలో ఒక వైపు కదలికలు మందగించడం, స్పర్శ కోల్పోవడం, తిమ్మిరి
ఉన్నట్లుండి కంటి చూపు మసకబారడం (ముఖ్యంగా ఒక కన్ను).
మాట తడబాటు, మాట పట్టేయడం, మాట స్పష్టంగా అర్థం కాకపోవడం
మింగలేకపోవడం (ఘన పదార్థాలే కాక ద్రవాలు మింగడం కూడా)
తల తిరిగినట్లు ఉండడం, మెదడుకు, దేహ కదలికలకు మధ్య సమన్వయం లోపించడం (ఉదాహరణకు చెయ్యి పెకైత్తబోయినప్పుడు అనుకున్నట్లు కదిలించలేకపోవడం, వేళ్లకు పట్టు దొరకకపోవడం, నుదుటిని తాకాలని ప్రయత్నిస్తే చేయి ముక్కు దగ్గరే ఆగిపోవడం వంటివి), కదలికలు మద్యం సేవించిన వారిలా ఉండడం
నిలబడినప్పుడు రెండు కాళ్ల మీద ఒకే విధంగా బరువును మోపలేకపోవడం
రెండు చేతులను ఒకే రకంగా కదిలించలేకపోవడం, చేతులను పెకైత్తినప్పుడు ఒక చెయ్యి కిందకు పడిపోతుండడం
భరించలేనంత తలనొప్పి, ఏకాగ్రత కుదరకపోవడం లాంటివి కనిపిస్తాయి.
ఈ లక్షణాల్లో కొన్ని కనిపించినా, వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.