
పేరుకు తగ్గ వ్యాధి... శ్యాడ్!
ఆ వ్యాధి పేరు ‘శ్యాడ్’. ఇంగ్లిష్‌లో ఆ వ్యాధి పేరైన ‘సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్’ అనే వ్యాధి పేరుకు సంక్షిప్తరూపమే ఈ ‘శ్యాడ్’. పేరుకు తగ్గట్లు లక్షణాలూ అలాగే ఉంటాయి. ఈ డిజార్డర్ సోకినవారు వ్యాకులతతో ‘డిప్రెషన్’లో మునిగిపోయి ఉంటారు. విచారంగా కనిపిస్తుంటారు. అందుకే వ్యాధి పేరు తాలూకు సంక్షిప్త రూపానికీ, దాని లక్షణాలకూ సరిగ్గా సరిపోయింది.
‘శ్యాడ్’కు కారణాలు...
ఈ వ్యాధి రావడానికి అనేక కారణాలను చెబుతున్నారు నిపుణులు. వాటిలో ప్రధానమైన కారణాలు కొన్ని... కుటుంబసభ్యుల్లో కొందరికి ఈ వ్యాధి అప్పటికే ఉండటం, ఈ వ్యాధి కలిగిన కుటుంబ చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ఉండటం. మెదడులోని న్యూరో కెమికల్స్ అని పిలిచే కొన్ని రసాయనాల్లో అసమతౌల్యత.కుటుంబంలో ఏదైనా విషాదకర సంఘటన చోటు చేసుకోవడం. అంటే చాలా దగ్గరి వారు దూరం కావడం, దగ్గరి మిత్రులతో సంబంధం కోల్పోవడం, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం వంటివి.
ప్రధాన కారణం సూర్యకాంతి వ్యవధి తగ్గడమే...
శ్యాడ్ వ్యాధిగ్రస్థుల్లో ఆ వ్యాధి వచ్చేందుకు కారణమవుతున్నట్లుగా గమనించిన మరో ప్రధాన కారణం ‘సూర్యకాంతి’కి తగినంత ఎక్స్‌పోజ్ కాకపోవడమే. ప్రధానంగా చలికాలంలో పగటివేళ నిడివి తగ్గడం వల్ల తగినంత సూర్యకాంతి లేకపోవడంతో ‘శ్యాడ్’ రుగ్మత లక్షణాలు పెరుగుతున్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అందుకే ఈ వ్యాధి సూర్యకాంతీ, పగటి నిడివి తక్కువగా ఉండే నవంబరు, డిసెంబరు మాసాల్లో మరీ ఎక్కువ అని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు.
మహిళల్లో ఎక్కువ...
హార్మోన్‌ల అసమతౌల్యత ‘శ్యాడ్’కు దారితీస్తుందన్న అంశంపై విస్తారమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఆడపిల్లలు యౌవనదశలో ప్రవేశించే సమయంలోనూ, రుతుస్రావం ఆగిపోయే మెనోపాజ్ సమయంలోనూ... వారు హార్మోన్ల అసమతౌల్యతలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే శ్యాడ్ వ్యాధి మహిళల్లో ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని మహిళల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుండటం ఒక విశేషం.
లక్షణాలు...
ఈశ్యాడ్ రుగ్మత ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలివి... త్వరగా కోపం రావడం, ఉద్రేకాలకు గురికావడం వంటి భావోద్వేగపరమైన మార్పులు చోటుచేసుకుంటుంటాయి. మూడ్స్ త్వరగా మారిపోతుంటాయి. నీరసం, నిస్సత్తువ, నలుగురితో కలవాలన్న కోరిక లేకపోవడం (సోషల్ విత్‌డ్రావల్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువసేపు నిద్రపోవడం తాము తీవ్రమైన నిరాశాపూరితమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా భావించడం.
చికిత్స
శ్యాడ్ రుగ్మతకు చికిత్స చాలా సులభం. దీనికి ప్రధాన కారణం... తగినంత వెలుతురుకు ఎక్స్‌పోజ్ కాకపోవడమేనని నిర్ధారణ జరగడంతో... ఈ వ్యాధి గ్రస్తులు ఎక్కువసేపు పగటివేళ సూర్యకాంతిలో గడువుతూ ఉండాలంటున్నారు వైద్యనిపుణులు. దీన్నే లైట్ థెరపీ లేదా ఫోటో థెరపీగా పేర్కొంటున్నారు. దీనితో పాటు రోగులతో వారి బంధువులు ఎక్కువగా సంభాషిస్తూ ఉండాలనీ, వారిలో స్ఫూర్తి నిండేలా మాట్లాడుతూ/వ్యవహరిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. శ్యాడ్ వ్యాధిగ్రస్తుల్లో డిప్రెషన్ తగ్గేందుకు వాళ్లను ఎవరో ఒకరు ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండటం మంచిదంటున్నారు వైద్యులు. ఇవన్నీ చేస్తూ సైకియాట్రిస్ట్‌ను ఒకసారి సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు ‘శ్యాడ్’ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న అధ్యయనవేత్తలు.