విష్ణు.. బ్రహ్మ.. కృష్ణ.. సత్య | The Story of narakasura | Sakshi
Sakshi News home page

విష్ణు.. బ్రహ్మ.. కృష్ణ.. సత్య

Published Tue, Nov 10 2015 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 12:20 PM

విష్ణు.. బ్రహ్మ.. కృష్ణ.. సత్య

ది స్టోరీ ఆఫ్  నరకాసుర
 
హిరణ్యాక్షుడు దుర్మార్గుడు, అసురుడు. వాడు మానవులనే కాకుండా దేవతలను సైతం పీడించాడు. హిరణ్యాక్షుడి బారి నుంచి రక్షించ మని వారంతా విష్ణుమూర్తిని ప్రార్థించారు. శ్రీమహావిష్ణువు అభయమిచ్చాడు. ఈ విషయం  హిరణ్యాక్షుడు తెలుసుకున్నాడు. తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచన చేశాడు. భూమిని రక్షించడమే విష్ణుమూర్తి ప్రధాన ధ్యేయం కనుక, ఈ భూమిని దాచేస్తే, విష్ణుమూర్తి కనుగొనలేకపోతాడు. అప్పుడు తనకు ఎటువంటి ముప్పూ ఉండదనుకున్నాడు. తన సర్వశక్తులూ ఒడ్డి, భూమిని కక్ష్యలోనుంచి త ప్పించాడు.
 
తర్వాత ఏం జరిగింది?
భూమిని కక్ష్యలోంచి తప్పించాక హిరణ్యాక్షుడు తన పాదంతో భూమిని తోయబోడాడు. అంతలో భూదేవికి, హిరణ్యాక్షుడి పాదానికి మధ్య నుంచి ఒక అసురుడు పుట్టుకొచ్చాడు. సరిగ్గా అదే సమయంలో విష్ణుమూర్తి వరాహవతారంలో ప్రభవించి భూమిని తన కొమ్ముల మీదకు ఎత్తి భూమిని మళ్లీ అదే కక్ష్యలో ఉంచాడు. అలా హిరణ్యాక్షుడి మీద విష్ణుమూర్తి విజయం సాధించాడు. మరి మధ్యలో పుట్టుకొచ్చిన ఈ అసురుడు ఎవడు?
 
వాడే నరకాసరుడు!
 
 
విష్ణుమూర్తి వదిలేశాడు!
భూదేవి వచ్చి, విష్ణుమూర్తితో ఆ అసురుని పుట్టుక గురించి అడిగింది. ‘‘అమ్మా! ఇతడు నీ పుత్రుడు. వీడు కూడా హిరణ్యాక్షుడిలాగే మహా శక్తివంతుడు, బలవంతుడు’ అన్నాడు విష్ణుమూర్తి. ‘‘అయితే వీడు కూడా హిరణ్యాక్షుడిలాగే రాక్షసుడవుతాడా’’ అంది భూదేవి. అవునన్నాడు శ్రీమహావిష్ణువు. అంతేకాదు, ‘‘నువ్వు మాత్రమే వీడిని ఓడించగల శక్తి కలిగిన దానివి. అయితే ఇప్పుడు వాడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. వాడు రాక్షస లక్షణాలు ప్రదర్శించినప్పుడు ఆలోచిద్దాం’ అని చెప్పి విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్లిపోయాడు.
 
 బ్రహ్మ వరమిచ్చాడు!

 కాలం గడుస్తోంది. ఈ రాక్షసుడు దుష్టాత్ముడిగా ఎదుగుతున్నాడు. వాడి కి నరకుడు అని పేరు పెట్టారు. బాణాసురుడనే శక్తిమంతమైన రాక్షసుడు, నరకుడి బలవిశేషాల గురించి విని, ఒకనాడు నరకుడిని కలిసి, ‘‘నరకా! నువ్వు మహాబలవంతుడివి. బ్రహ్మ గురించి తపస్సు ఆచరించు. మరింత శక్తిమంతుడివి అవుతావు. ముల్లోకాలనూ పాలించే శక్తి సంపాదిస్తావు... అన్నాడు. నరకాసురుడు బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు ఆచరించాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై  ‘‘నీ తపస్సుకి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో’’ అన్నాడు, వరం ఇవ్వడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో అన్నాడు బ్రహ్మ.

నరకాసురుడు వికటాట్టహాసం చేస్తూ, ‘‘బ్రహ్మదేవుడు తెలివితక్కువవాడు. ఏ తల్లీ తన బిడ్డను సంహరించదు. ఆ విధంగా బ్రహ్మదేవుడు నాకు చావు లేని వరం ప్రసాదించినట్లే. ఈ లోకాలన్నిటినీ  స్వాధీనం చేసుకుంటాను’’ అని వీరవిహారం చేస్తున్నాడు.
 అక్కడ గోకులంలో, న ల్లనివాడు, నవ్వురాజిల్లెడి మోమువాడు అయిన శ్రీకృష్ణుడు నందయశోదల దగ్గర పెరుగుతున్నాడు. విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమయిన వాడు శ్రీకృష్ణుడు. నరకుడు తన నగరమైన ప్రాగ్జ్యోతిషపురానికి తిరిగివచ్చి, వర గర్వంతో రాజ్యాలన్నీ వశపరచుకుని, భూలోకానికి రాజయ్యాడు.

అంతటితో తృప్తి చెందక, దేవలోకం మీదికి దండెత్తాడు. అందరూ స్వర్గం విడిచిపోయారు. నరకుడు పదహారువేల మంది స్వర్గలోక కన్యలను చెరబట్టి తన అంతఃపురంలో బంధించాడు. దేవతల తల్లి అయిన అదితిని కూడా విడిచిపెట్టక, అతి మహిమాన్వితము, సుందరము అయిన ఆమె కుండలాలను తస్కరించాడు. ఈ విధంగా నరకుడి పాలనకు ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఈ రాక్షసుడి బారి నుండి రక్షించేవారే లేరా అని బాధపడుతున్నారు.
 
 శ్రీకృష్ణుడు బయల్దేరాడు!
 గోకులంలో శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తన కర్తవ్యం తెలుసుకున్నాడు.
 ఒకనాడు సత్యభామ ఉద్యానవనంలో శ్రీకృష్ణుని తలచుకుంటూ, ఒంటరిగా ఉన్న సమయంలో, అదితి కన్నీరు పెట్టుకుంటూ వచ్చింది. జరిగిన విషయం తెలుసుకున్న సత్యభామ, అదితిని ఓదార్చి, తన భవనంలో చోటిచ్చి, శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి, విషయం విన్నవించింది. నరకుడికి బుద్ధి చెప్పడానికి బయలుదేరతానన్నాడు శ్రీకృష్ణుడు. తానూ వెంట వస్తానంది సత్యభామ. శ్రీకృష్ణుడు అంగీకరించాడు. ‘ఆయుధాలతో సిద్ధంగా ఉండు. మనం యుద్ధానికి బయలుదేరుతున్నాం. గరుడ వాహనం మీద మన ప్రయాణం’ అన్నాడు.

 ఇద్దరూ గరుడుని మీద ప్రాగ్జ్యోతిషపురానికి బయలుదేరారు. నరకుడి గుండె అదుపు తప్పింది. ఆ నల్లనివాడు తనను సంహరించడానికి వచ్చాడు. కాని తనకు చావు లేని వరం ఉంది కదా అని విర్రవీగాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుడు.. సత్యభామ సహాయంతో నరకుడి సైన్యం మొత్తాన్ని సంహరించాడు. తన అంతఃపురం నుంచి అంతా పరికిస్తున్న నరకుడు, తన మంత్రి మురుడిని యుద్ధానికి పంపాడు. వాడు శ్రీకృష్ణుని చేతిలో హతుడయ్యాడు. నాటి నుంచే శ్రీకృష్ణుడు మురారి అయ్యాడు. నరకుడు క్రోధంతో ఊగిపోతూ తన శతఘ్నిని శ్రీకృష్ణుడి మీదకు ప్రయోగించాడు. దానిని గరుడుడు తిప్పికొట్టాడు. శ్రీకృష్ణుడు నరకుడి మీదకు ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా, ఆశ్చర్యకరంగా ఏ ఒక్క ఆయుధమూ వాడిని ఏమీ చేయలేకపోయాయి. వాడు అన్నిటినీ తిప్పికొట్టాడు. నరకాసురుడిని చూసిన సత్యభామ విల్లు అందుకుని భయంకరమైన బాణాలను వాడి మీదకు ప్రయోగించింది. శ్రీకృష్ణుడు, సత్యభామ... ఇద్దరూ తన  మీద దాడి చేయడం చూసిన నరకుడు, అత్యంత మహిమాన్వితమైన శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది శ్రీకృష్ణుడి గుండెలను తాకి, స్పృహతప్పాడు శ్రీకృష్ణుడు.
 
 సత్యభామ తలపడింది!

 సత్యభామ రెట్టింపు శక్తితో యుద్ధం చేయడం ప్రారంభించింది. ఆమె వేసిన ఆయుధం నేరుగా నరకుడి గుండెలో దిగి, అతడిని బాధించింది. నెమ్మదిగా నేలకొరుగుతున్నాడు. తనను వీరు ఎలా ఓడించగలుగుతున్నారో ఒక నిమిషం నరకుడికి అర్థం కాలేదు. కాసేపటికే నల్లనివాడు కోలుకొన్నాడు. సత్యభామా సమేతుడై, గరుడుని మీద నుంచి కిందకు దిగి, నరకుడి వైపుగా అడుగులు వేశారు. వారిని చూసిన నరకుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తనకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని మంచికి వినియోగించకుండా, చెడు మార్గం పట్టానని పశ్చాత్తాపపడ్డాడు.

 యుద్ధభూమిలో నల్లనివాని పాదాల మీద పడి, రెండు చేతులూ జోడించి, ‘‘దేవా! నన్ను క్షమించు, ఈ రోజే నేను కాంతిరేఖలు చూశాను. ప్రజలను పీడించినవారికి అంతిమంగా ఇదే జరుగుతుందని తెలుసుకున్నాను’’ అన్నాడు. ‘‘నరకా! నీలో కలిగిన పశ్చాత్తాపానికి ఆనందపడుతున్నాను’’అన్నాడు శ్రీకృష్ణుడు సాయం సంధ్యలో నల్లనివాడు, సత్యభామ మెరిసిపోతూ కనపడ్డారు. ‘‘నేను ఈ రోజే కాంతి చూస్తున్నాను. చీకటి మీద వెలుగు విజయం సాధించినందుకు గుర్తుగా ప్రజలందరూ ఈ రోజు పండుగ జరుపుకుంటారు’’ అంటూ, సత్యభామ పాదాలకు నరకుడు నమస్కరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ‘‘నరకాసురా! ఈమె భూదేవి అవతారం. నీ సంహారం కోసమే అవతరించింది. సత్యభామ లేనిదే నేను నిన్ను సంహరించలేను. అందువల్లే నేను సొమ్మసిల్లినట్లు నటించాను’ అన్నాడు. సత్యభామ వాస్తవాన్ని గ్రహించింది. నరకుడి తలను ఒడిలోకి తీసుకుని, ‘‘నాయనా కుమారా! ఎందుకురా చెడు మార్గం పట్టావు’’ అని విలపించింది.

‘అమ్మా! నా తప్పులకు నువ్వు బాధ్యురాలివి కాదు. నిన్ను ‘అమ్మా’ అని పిలవడానికి నాకు గర్వంగా ఉంది’’ అంటూ కన్ను మూశాడు. నాటి నుంచే నరకాసురుడి మరణాన్ని చీకటి మీద వెలుగు సాధించిన విజయంగా నరకచతుర్దశి జరుపుకుంటున్నాం. దీపావళి దీపాల పండుగ. చెడు మీద మంచి సాధించిన దివ్వెల పండుగ అయింది.   
 - డా. పురాణపండ వైజయంతి,
 ‘సాక్షి’ ఫీచర్స్
 
‘‘దేవా! నేను చావు లేని వరం కోరుకోను. నువ్వు ఎవ్వరికీ ఆ వరం ప్రసాదించవని తెలుసు. భూదేవి నా తల్లి అని తెలుసుకున్నాను. నాకు చావు అంటూ ఉంటే, అది నా తల్లి చేతిలోనే జరగాలి. ఆ వరం ప్రసాదించు’’ అన్నాడు నరకుడు.  బ్రహ్మదేవుడు లోలోపల నవ్వుకుంటూ, ‘తథాస్తు’ అని అంతర్థానమయ్యాడు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement