Narakasura
-
ఒక టికెట్‌పై ఇద్దరు సినిమా చూడొచ్చు..‘నరకాసుర’బంపరాఫర్
రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరో హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి స్పందన లభించడంతో.. మరింత మందికి చేరవయ్యేందుకు చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక టికెట్‌పై ఇద్దరు సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ ఆఫర్ వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత యథావిధిగా ఒక టికెట్‌పై ఒకరు మాత్రమే సినిమా చూడాల్సి ఉంటుంది. ఈ మేరకు తాజాగా జరిగిన సక్సెస్ మీట్లో మేకర్స్ ఈ విషయాన్ని వెళ్లడించారు. ఈ సందర్భంగా రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. , ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి అప్రిషియేషన్స్ తో పాటు మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. మా సినిమాలో మెసేజ్ మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని మండే నుంచి థర్స్ డే వరకు ఒక టికెట్ మీద ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాం’ అన్నారు. ‘ట్రాన్స్ జెండర్స్ ను చిన్న చూపు చూడకూడదు మనుషులంతా ఒక్కటే అని మేము ఇచ్చిన సందేశం ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. ఇది మరింత మంది ప్రేక్షకులకు చేరేలా వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి థియేటర్ లో ఒక్కో టికెట్ పై ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూడొచ్చు’అని దర్శకుడు సెబాస్టియన్ అన్నారు. -
‘నరకాసుర’మూవీ రివ్యూ
టైటిల్: నరకాసుర నటీనటులు: రక్షిత్, అపర్ణ జనార్థన్, నాజర్, సంగీర్తన, చరణ్ రాజ్, ఎస్.ఎస్.కాంచి, శ్రీమన్, ఫిష్ వెంకట్ తదితరులు నిర్మాత: డా.అజ్జా శ్రీనివాస్ దర్శకత్వం: సెబాస్టియన్ నోవా అకోస్టా సంగీతం:నౌపాల్ రాజా సినిమాటోగ్రఫీ:నాని చామిడి శెట్టి ఎడిటింగ్ : సీ.హెచ్. వంశీ కృష్ణ విడుదల తేది: నవంబర్ 3, 2023 ‘నరకాసుర’కథేటంటే.. చిత్తూరు జిల్లాకు చెందిన శివ(రక్షిత్ అట్లూరి) ఓ కాఫీ ఎస్టెట్‌లో పని చేసే లారీ డ్రైవర్. ఎమ్మెల్యే నాగమ నాయుడు(చరణ్ రాజ్)అంటే అతనికి చాలా ఇష్టం. ఎంతలా అంటే.. నాయుడు గెలుపు కోసం ప్రత్యర్థులను హత్య చేసేంత. అలాంటి శివ ఉన్నట్టుండి కనిపించకుండా పోతాడు. అతని ఆచూకి కోసం పోలీసులు వెతకడం ప్రారంభిస్తారు. అసలు శివ ఎలా తప్పిపోయాడు? అతన్ని బంధించిందెవరు? ఎమ్మెల్యే నాయుడు కుమారుడు ఆది నాయుడు(తేజ చరణ్ రాజ్)తో శివకు ఎందుకు వైరం ఏర్పడింది? తనను ప్రేమించిన మరదలు వీరమణి(సంకీర్తన విపిన్), తను ప్రేమించి పెళ్లి చేసుకున్న మీనాక్షి(అపర్ణ జనార్దన్) కోసం శివ ఏం చేశాడు. ఊరికి మంచి చేసే వ్యక్తిగా ఉన్న శివ ‘నరకాసుర’వథ ఎందుకు చేయాల్సివచ్చింది? ఈ కథలో ట్రాన్స్ జెండర్స్ పోషించిన పాత్రేంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో నరకాసుర సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ మధ్యకాలంలో ఆడియన్స్‌లో మార్పు వచ్చింది. కథ బాగుంటే చాలు.. హీరో హీరోయిన్లు ఎవరనే విషయం పట్టించుకోకుండా థియేటర్స్‌కి వచ్చేస్తున్నారు. అందుకే నూతన దర్శకులు డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డైరెక్టర్ సెబాస్టియన్ కూడా ఓ కొత్త కాన్సెప్ట్‌తో ‘నరకాసుర’ను తెరకెక్కించాడు. ఓ కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ తన కథలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. దాంతోపాటు వివక్షకు గురవుతున్న హిజ్రాలకు సంబంధించిన ఓ మంచి సందేశాన్ని సైతం ఇచ్చాడు. . డెబ్యూ దర్శకుడే అయినా... కథ... కథనం నడిపించడంలో ఎక్కడా తడబడకుండా చాలా క్లారిటీగా సినిమాను తెరకెక్కించారు. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. వాస్తవానికి ఈ కథ కొత్తేదేమి కాదు. ఒక రోటీన్ రివేంజ్ డ్రామా స్టోరీ. ఊరికోసం ఏదైనా చేయగలిగే ఓ వ్యక్తిని నమ్మిన వాళ్లే మోసం చేస్తే.. అతను రాక్షసుడిగా మారి ఎలా రివెంజ్ తీసుకున్నాడనేది ఈ సినిమా కథ. దీనికి హిజ్రాల స్టోరీని యాడ్ చేసి కథనం నడిపించడంతో కాస్త ఢిఫరెంట్‌గా అనిపిస్తుంది. హిజ్రాలతో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. వీటికి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. అలాగే పరస్త్రీ వ్యామోహం తగదని... అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పడమే ‘నరకాసుర‘ వథ అనే అంశాన్ని రివేంజ్ డ్రామాగా ఓ సందేశాత్మకంగా తెరరపై చూపించడం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. పలాస చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకున్న రక్షిత్ అట్లూరి.. మరోసారి తన మాస్ అప్పియరెన్స్‌తో ఆకట్టుకున్నాడు. లారీ డ్రైవర్ శివ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. అతనికి జంటగా మీనాక్షి పాత్రలో నటించిన అపర్ణ జనార్ధన్ తన హోమ్లీ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. హీరో మరదలుగా నటించిన సంకీర్తన విపిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. ఆమె కూడా ఓ కీలకమైన మాస్ యాక్షన్ సీక్సెన్స్ తో ఆకట్టుకుంటుంది. రాజకీయ నాయకుని పాత్రలో నటించిన చరణ్ రాజ్ పాత్ర పర్వాలేదు. చాలా కాలం తరువాత తెలుగు సినిమాలో కనిపించాడు చరణ్ రాజ్. అతని కుమారునిగా నటించిన తేజ్ చరణ్ రాజు కూడా ఆకట్టుకుంటాడు. శత్రు అండ్ అతని టీమ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టకున్నారు..కాఫీ ఎస్టెట్ సూపర్వైజర్గా నాజర్‌తో పాటు మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికపరంగా ఈ సినిమా పర్వాలేదు. నాని చామిడి శెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. అడవి లొకేషన్స్ బాగా క్యాప్చర్ చేయగలిగారు. నౌపాల్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రతి సన్నివేషాన్ని... తనదైన బీజీఎంతో ఎలివేట్ చేయగలిగారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
చేయి పోయినా ఆత్మవిశ్వాసంతో సినిమా పూర్తి చేశాను
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో డా.అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సెబాస్టియన్ నోవా మాట్లాడుతూ– ‘‘దర్శకుడు కావాలనేది నా కల. ఓ ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకుని అవకాశాల కోసం ప్రయత్నించినా కుదర్లేదు. టెక్నాలజీపై అవగాహన కోసం 2012లో ప్రసాద్ ల్యాబ్‌లో చేరాను. అక్కడ రిలీజ్‌కు నోచుకోని సినిమాలు కనిపించాయి. దీంతో సినిమా తీయడం కాదు.. తీసిన సినిమాను మార్కెట్ చేసుకోవడం ముఖ్యమని భావించి సాయి కొర్రపాటిగారి సహాయంతో డిస్ట్రిబ్యూషన్ రంగంలో చేరాను. ఆ తర్వాత నా దర్శకత్వంలో సినిమా కోసం కథ రెడీ చేసుకున్నాను. చిన్నతనంలో నేను తప్పిపోతే ట్రాన్స్‌జెండర్స్ నన్ను మా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కథకు ఈ సంఘటన ఓ స్ఫూర్తి. ఇక దర్శకుడిగా తొలి అవకాశమే కష్టం అనుకుంటే.. ‘నరకాసుర’ చిత్రీకరణ టైమ్‌లో ఒరిస్సాలో షూటింగ్ పూర్తి చేసుకుని జబల్పూర్ వెళ్తుంటే ప్రమాదం జరిగి, నా చేయి పోయింది. ప్రమాదం జరిగిన తర్వాత 27వ రోజు నేను సెట్స్‌లోకి వచ్చి, ఆత్మవిశ్వాసంతో సినిమాను పూర్తి చేశాను. ఇక మాధవన్, అరుణ్ విజయ్, వివేక్ ఒబెరాయ్, టొవినో థామస్ వంటి స్టార్స్‌తో ట్రైబల్ నేపథ్యంలో ఓ సినిమా ΄్లానింగ్లో ఉంది. మూడు భాషల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు. -
షూటింగ్‌కే రెండేళ్లు పట్టింది
‘‘నరకాసుర’ చిత్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో శివ అనే లారీ డ్రైవర్ పాత్ర చేశాను. నా గత సినిమా ‘పలాస 1978’లో దళితుల సమస్యలు చూపించినట్లే ‘నరకాసుర’లో హిజ్రాలకు సంబంధించిన పాయింట్ ఒకటి తీసుకున్నాం. కథలో ఇదొక అంశం మాత్రమే. మా సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి హీరోగా, అపర్ణా జనార్ధన్, సంకీర్తనా విపిన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నరకాసుర’. డా. అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘2020లో ‘నరకాసుర’ ్రపారంభించి, ఏడాదిలో పూర్తి చేయాలనుకున్నాం. అయితే రెండు సార్లు కరోనా లాక్డౌన్ రావడం, కథపరంగా ఛత్తీస్గడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం, ఆర్టిస్టుల డేట్స్, మా డైరెక్టర్ ప్రమాదంలో చేయి కోల్పోవడం... ఇలా పలు కారణాలతో షూటింగ్‌కే రెండున్నరేళ్లు పట్టింది. అయితే కథపై నమ్మకంతో నిర్మాతలు స΄ోర్ట్ చేశారు. ఇక నేను నటించిన ‘శశివదనే’, ‘ఆపరేషన్ రావణ్’ సినిమాలు ΄ోస్ట్ ్ర΄÷డక్షన్ దశలో ఉన్నాయి. మరికొన్ని కథలు వింటున్నాను’’ అన్నారు. -
‘పుష్ప’కథతో ‘నరకాసుర’కు సంబంధమే లేదు: హీరో రక్షిత్ అట్లూరి
‘నరకాసుర’ మూవీ ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యం సాగుతుంది. అంతేకానీ పుష్ప మూవీతో ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఇందులో స్మగ్లింగ్ లాంటివి ఉండవు. పుష్ప కంటే ముందే మా చిత్రం షూటింగ్ మొదలైంది. కానీ పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యంగా జరిగి.. రెండున్నర ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ మూవీ కచ్చితంగా అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది’అని యంగ్ హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. ‘పలాస’లాంటి హిట్ మూవీ తర్వాత రక్షిత్ అట్లూరి నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో "నరకాసుర" మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంతో హీరో రక్షిత్ అట్లూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► పలాస సినిమా రిలీజైన తర్వాత 2020లోనే ‘నరకాసుర’ మూవీ స్టార్ట్ చేశాం. ఏడాది సినిమా పూర్తి చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. తర్వాత ఆర్టిస్టులు డేట్స్ కుదరలేదు. ఏడాది అనుకున్న సినిమా షూటింగ్ కే రెండున్నర సంవత్సరాల టైమ్ తీసుకుంది.మా డైరెక్టర్ గారికి యాక్సిడెంట్ అయి చేయి కోల్పోవడం కూడా డిలేకు కారణం అయ్యింది. ►ఈ సినిమాలో నేను లారీ డ్రైవర్ శివ అనే క్యారెక్టర్ లో నటించాను. నాజర్ గారు కాఫీ ఎస్టేట్ సూపర్ వైజర్ క్యారెక్టర్ చేస్తున్నారు. నేను ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ కమ్ పెప్పర్ హార్వెస్టర్ గా కనిపిస్తాను. నా గత సినిమా పలాసలో దళితులకు సంబంధించిన సమస్యలు చూపించినట్లే "నరకాసుర" సినిమాలో హిజ్రాలకు సంబంధించిన పాయింట్ ఒకటి తీసుకున్నాం. కథలో ఇదొక అంశం మాత్రమే. సినిమా అంతా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. ఈ ట్రాన్స్ జెండర్స్ అంశం కథలో ఒక సంఘర్షణకు కారణంగా నిలుస్తుంది. ►గత మూడు నెలలుగా ప్రతి వారం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ నెల 3వ తేది మా సినిమా రిలీజ్ కు మంచి డేట్ అనుకున్నాం. ఎందుకంటే దసరా సినిమాల సందడి కాస్త తగ్గింది. అలాగే పెద్ద సినిమాలేవీ ఈ వారం రిలీజ్ కావడం లేదు. ►‘నరకాసుర’లో ఒక లాంగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. మధ్యప్రదేశ్ లో 20 రోజుల పాటు ఆ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాం. అక్కడ చలి ఎక్కువ. పైగా రాత్రి పూట వర్షంలో ఆ ఫైట్ సీన్ చేయాల్సివచ్చింది. అప్పుడు కష్టం అనిపించినా...స్క్రీన్ మీద ఔట్ పుట్ చూశాక హ్యాపీగా ఫీలయ్యాం. ►మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ఎందుకంటే పలాస మూవీలో నేను చేసిన యాక్షన్ సీన్స్ చూకున్నప్పుడు ఫైట్స్ బాగా చేశాను అనిపించింది. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. పలాస సినిమాలో నాలుగు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో బాగా నటించాను అనే పేరొచ్చింది. ఆ పేరు కాపాడుకుంటూ సినిమాలు చేస్తా. పాటలు, పైట్స్ ఉన్న ఫార్మేట్ లో వెళ్లను. ►నరకాసుర సినిమా చేస్తున్నప్పుడు మరికొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి కానీ నేను ఈ గెటప్ వల్ల చేయలేకపోయాను. పొలిమేర 1 కూడా నేనే చేయాల్సింది. అయితే ఆ ప్రాజెక్ట్స్ చేయలేకపోయినందుకు బాధ లేదు. మా సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. నేను నటించిన మరో చిత్రం శశివదనే డిసెంబర్ రిలీజ్ అనుకుంటున్నాం. ప్రస్తుతం కథలు వింటున్నాను. రెండు ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. -
నరకాసుర మూవీ టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
నన్ను తీసేశారా అని భయపడ్డాను
‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. అపర్ణా జనార్ధన్, సంకీర్తనా విపిన్ హీరోయిన్లుగా సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో డా. అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రం నవంబరు 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ కీ రోల్ చేసిన చరణ్‌రాజ్ బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. ఎనిమిదేళ్లు కష్టపడ్డాను. ఆకలి బాధలు అనుభవించాను. ఫలితంగా సినీ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన 40 ఏళ్ల కెరీర్ లభించింది. వివిధ భాషల్లో ఐదు వందలకు పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేశాను. అయితే ‘ప్రతిఘటన, జెంటిల్‌మేన్’ సినిమాలు నన్నొక నటుడిగా తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా చేశాయి. ఇక దర్శకుడు సెబాస్టియన్ నాకు ‘నరకాసుర’ కథ చెప్పినప్పుడు నా పాత్రకు బాగా ఎగ్జయిట్ అయ్యాను. కానీ రెండు నెలలు గడిచినా సెబాస్టియన్గారి నుంచి ఫోన్ రాలేదు. మేం చేస్తే కనెక్ట్ కాలేదు. దీంతో ‘నరకాసుర’లోంచి నన్ను తీసేశారా అనే భయం కలిగింది. కథా రచనలో భాగంగా జబల్పూర్ వెళ్లానని, అందుకే ఫోన్ కలవలేదని, ‘నరకాసుర’లో నాకు చెప్పిన పాత్రను నేనే చేస్తున్నట్లుగా సెబాస్టియన్గారు ఆ తర్వాత చెప్పారు. అప్పుడు రిలాక్స్ అయ్యాను. ఈ సినిమాలో నా పాత్ర మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్లుగా ఉంటుంది. నా కెరీర్లో ఇప్పటివరకు చేయని ఓ ప్రత్యేక పాత్రను ఈ సినిమాలో చేశాను. ప్రస్తుతం శ్రీహరిగారి అబ్బాయి మేఘాంశ్ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను’’ అని అన్నారు. -
కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా 'నరకాసుర' సాంగ్ రిలీజ్
'పలాస' ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా 'నరకాసుర'. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్‌లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. (ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి) తాజాగా 'నరకాసుర' నుంచి 'గ్రీవము యందున' అనే లిరికల్ పాటని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశాడు. పాట చాలా బాగుందని మెచ్చుకున్నాడు. చిత్రబృందానికి బెస్ట్ విషెస్ చెప్పాడు. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను స్టార్ సింగర్ శంకర్ మహదేవన్ పాడారు. పరమ శివుడిని ప్రశ్నిస్తూ సాగుతుందీ పాట. శివభక్తుల గెటప్స్‌లో ఆధ్యాత్మిక భావన కలిగించేలా ఈ పాటను పిక్చరైజ్ చేశారు. ఈ పాట, సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టీమ్ భావిస్తున్నారు. (ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా) -
నరకాసుర మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్
-
సెప్టెంబర్‌లో ‘నరకాసుర’
రక్షిత్ అట్లూరి, అపర్ణా జనార్థన్, సంకీర్తన విపిన్, శత్రు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్ దర్శకత్వంలో సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూసిన పలువురు సినీ ప్రముఖులు ‘కాంతారా రేంజ్లో ఉందని’ ప్రశంసించారు. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ రెండో వారంలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘నరకాసుర’ అనే రాక్షసుడి జననం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది.’ అని దర్శకుడు అన్నారు.సెప్టెంబర్ రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు. -
పలాస తర్వాత గ్యాప్ రావడంతో హేళన చేశారు: యంగ్ హీరో
"ఒక టీజర్ ఇంపాక్ట్ ఏంటో 'పలాస' సినిమా టైమ్‌లో చూశాను. ఆ మూవీ తర్వాత నాకు గ్యాప్ రావడంతో అందరూ హేళనగా మాట్లాడారు. అలాంటివారికి సమాధానమే నరకాసుర అని హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. సెబాస్టియన్ దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి హీరోగా.. అపర్ణ జనార్జన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం నరకాసుర. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శక-నిర్మాత వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ రక్షిత్‌ను కలిసినప్పుడు యంగ్ డేస్‌లో జగపతి బాబు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడనిపించింది. 'నరకాసుర' అతన్ని మంచి స్థాయికి తీసుకువెళుతుంది" అన్నారు. "నరకాసుర టీజర్ చూస్తే 'కాంతారా రేంజ్లో ఉందనిస్తోంది" అన్నారు కెమెరామేన్ సెంథిల్ కుమార్. "తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో మా చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నాం" అన్నారు అజ్జా శ్రీనివాస్. "ఈ చిత్రంతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటాం అన్నారు సెబాస్టియన్, ఈ కార్యక్రమంలో నిర్మాత దామోదర ప్రసాద్, అవర్ణ జనార్ధన్, సంకీర్తన విపిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం ఏఐఎస్ నాఫాల్ రాజా. చదవండి: కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల్ -
నరకుడికి మోక్షపురి.. నరకాసురుడి వధ జరిగింది ఇక్కడే..!
చల్లపల్లి(కృష్ణా జిల్లా): పవిత్ర కృష్ణానదీ తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రాల్లో చల్లపల్లి మండలం నడకుదురు గ్రామం ఒకటి. నరకాసుర సంహార క్షేత్రంగా, మోక్షపురిగా చరిత్ర ప్రసిద్ధి గాంచి కాలక్రమేణా నరకొత్తూరు, నరకదూరుగా మారి నడకుదురుగా స్థిరపడింది. గ్రామంలో కృష్ణానది గర్భంలో ఉన్న శ్రీ ఫృద్వీశ్వరస్వామి ఆలయం, చెంతనే ఉన్న పాటలీవనం సందర్శనీయ స్థలాలు. నడకుదురు నరకునికి మోక్షం ప్రసాదించిన క్షేత్రంగా, మోక్షపురిగా గుర్తింపు ఉంది. నరకాసురుడు పూజించిన స్థలం.. నారద మహాముని నరకాసురుడితో నీవు భూదేవి పుత్రుడవని తెలియజేసి, ద్విముఖుడనే రాక్షసుడిని సంహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకు పుష్కరకాలం స్వయంభువైన శ్రీ ఫృద్వీశ్వరుని పూజించమని సూచిస్తాడు. నరకాసురుడు ఫృద్వీశ్వరాలయానికి చేరుకుని కృష్ణానదిలో నిత్య స్నానమాచరిస్తూ 4,320 రోజుల పాటు స్వామిని పూజిస్తాడు. అదే నడకుదురు గ్రామంలోని ఫృద్వీశ్వరాలయం. వధ జరిగింది ఇక్కడే.. నరకాసురుడి ఆగడాలతో అల్లాడిపోతున్న ముల్లోకాల వాసులను కాపాడేందుకు నరకాసురుని సంహరించ దలచిన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై ఈ ప్రాంతంలో ఉన్న నరకాసురుడితో యుద్ధానికి దిగుతాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్చబోగా, సత్యభామ ఫృద్వీశ్వర క్షేత్రం సమీపంలో నరకాసురుని సంహరించినట్లు చారిత్రక కథనం. భూదేవికి ప్రతిరూపం, నరకాసురుని తల్లిలాంటి సత్యభామ నరకాసురునికి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించి, నదీతీరాన పిండ తర్పణాలు వదిలినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. కృష్ణ–భామల విహార స్థలం.. నరకాసుర సంహారం అనంతరం ఆలయం చెంతనున్న పాటలీవనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణుడు, సత్యభామలు లక్ష్మీనారాయణుని విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పూజలు చేసినట్లు కథనం. నడకుదురు ఆలయం వద్ద పాటలీవృక్షంకింద లక్ష్మీనారాయణుని విగ్ర హం నేటికీ భక్తుల పూజలందుకుంటోంది. మహిమాన్వితం పాటలీవృక్షం.. గ్రామ చారిత్రక, ఆథ్యాత్మిక వైభవానికి నిదర్శనం నడకుదురు ఫృద్వీశ్వరాలయం చెంతనున్న దేవతావనం. దేవలోక వనమాత పాటలీ వృక్షాలు దేశంలో కేవలం కాశీ తర్వాత నడకుదురులో మాత్రమే ఉన్నాయి. కరకట్ట దిగువనే నదిలో కొబ్బరిచెట్లు, పాటలీవృక్షాలు, ఉసిరిచెట్ల మధ్య ఆలయం ఉంటుంది. చుట్టూ పసుపుతోటలు, వాణిజ్య పంటలతో చల్లని వాతావరణం భక్తులకు ఆలయం స్వాగతం పలుకుతుంది. దీపావళి ప్రత్యేకత సంతరించుకుంటుంది. -
తనయుడతడు.. తల్లి భూమాత
యుద్ధంలో మరణించిన నరకుడు వీరస్వర్గం అలంకరించటానికి బయలుదేరుతూ.. రెండు రోజుల తరవాత స్వర్గానికి వస్తాను, అంతవరకు భూలోకంలో తిరిగే అవకాశం ఇవ్వమని ఇంద్రుడిని వరం కోరాడు. ఇంద్రుడు అనుమతి ఇచ్చాడు. నరకుడు నేరుగా సత్యభామ దగ్గరకు వెళ్లాడు. ‘‘అమ్మా..’’ అని సంబోధించాడు ఆర్తిగా నరకుడు. సత్యభామ మనసు ఒక్కసారి కలుక్కుమంది. ప్రజలను యథేచ్ఛగా బాధించాడు నరకుడు. తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని వర గర్వంతో విర్రవీగాడు. మునులు, ఋషులు, వృద్ధులు, పిల్లలు, స్త్రీలు.. ఒకరేమిటి.. అందరూ నరకుని బాధితులే. నిస్సహాయ స్థితిలో ప్రజలంతా శ్రీకృష్ణునికి విన్నవించుకున్నారు. నవ్వురాజిల్లెడు మోముతో యశోదా నందనుడు అందరికీ అభయం ఇచ్చి పంపాడు. యుద్ధానికి సుముహూర్తం నిర్ణయించాడు. సంగ్రామ అభిలాష ఉన్న సత్యభామ తాను కూడా యుద్ధానికి వస్తానని, చీర నడుముకి బిగించింది. శ్రీకృష్ణుడు మరో మాట మాట్లాడకుండా విల్లందుకుంది, రథం అధిరోహించింది. ఇరు పక్షాల నడుమ యుద్ధం హోరాహోరీగా జరిగింది. సంగరంలో కొద్దిసేపు శ్రీకృష్ణుడు మూర్ఛితుడయ్యాడు. కాళిదాసు వర్ణించినట్లుగా మన్మధ బాణాల వంటి కనుబొమలు కలిగిన సత్యభామ నారి సంధించింది. శర వర్షం కురిపించింది. ఒక పక్క శ్రీకృష్ణుని వైపు అమృత కిరణాలను ప్రసరిస్తోంది. మరో పక్క నరకుడిపై రౌద్ర బాణాలు విడుస్తోంది. కొంతసేపటికి శ్రీకృష్ణుడు స్వస్థుడయ్యాడు. సత్యభామా సమేతుడై నరకుడిని వధించాడు. ప్రజలంతా శ్రీకృష్ణుడిని స్తుతించారు, సత్యభామను అభినందించారు. రాక్షస సంహారం జరిగితే జాతరలు, సంబరాలు, పండుగలు జరుపుకోవలసిందే కదా. ఆయా ప్రాంతాల వారు వారి సంప్రదాయానుసారం నరక చతుర్దశి జరుపుకోవటానికి సన్నద్ధులయ్యారు. అక్కడితో ఆగకుండా మరుసటి రోజు దీపావళి కూడా జరుపుకోవాలని తీర్మానించారు. అన్ని లోగిళ్లు పండుగకు సన్నాహాలు చేయటంలో మునిగిపోయాయి. తల్లి ఆశీర్వాదం యుద్ధంలో మరణించిన నరకుడు వీరస్వర్గం అలంకరించటానికి బయలుదేరుతూ.. రెండు రోజుల తరవాత స్వర్గానికి వస్తాను, అంతవరకు భూలోకంలో తిరిగే అవకాశం ఇవ్వమని ఇంద్రుడిని వరం కోరాడు. ఇంద్రుడు అనుమతి ఇచ్చాడు. నరకుడు నేరుగా సత్యభామ దగ్గరకు వెళ్లాడు. సత్యభామ సాక్షాత్తు భూదేవి అవతారం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. ‘‘అమ్మా..’’ అని సంబోధించాడు ఆర్తిగా నరకుడు. సత్యభామ మనసు ఒక్కసారి కలుక్కుమంది. నరకుడు తన కుమారుడే అయినప్పటికీ దుష్ట సంహారం చేసి, తన ప్రజలను కాపాడింది సత్యభామ. ‘‘అమ్మా! నేను నీ కుమారుడినే కదా. నన్ను ఎందుకు సంహరించావు, నన్ను నువ్వే మనిషిగా మార్చలేకపోయావేం’ అని దీనంగా ప్రశ్నించాడు. అందుకు సత్యభామ, ‘బుద్ధి కర్మానుసారీ’ అన్నారు పెద్దలు. నీకు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పి చూసినా నువ్వు నీ దుష్టత్వం విడిచిపెట్టలేదు. నా కుమారుడి కారణంగా నా రాజ్య ప్రజలంతా బాధలు పడటం చూస్తూ ఎలా ఉంటాను. అందుకే నా మాతృ హృదయాన్ని పక్కన పెట్టి, కొద్దిసేపు పాషాణంలా ప్రవర్తించి, నిన్ను యుద్ధంలో సంహరించాను’ అని గంభీరంగా పలికింది సత్యభామ. ‘‘నేను దుర్మార్గుడిని, దుష్టుడిని అని కదా నువ్వు నన్ను సంహరించావు. మరి ఈ పండుగను నా పేరుతో ఎందుకు ‘నరక చతుర్దశి’ గా జరుపుకుంటున్నారు’’ అని అమాయకంగా ప్రశ్నించాడు. సత్యభామ.. ఈ ప్రశ్నకు తన ప్రజలే సరైన సమాధానం చెబుతారని భావించి, ‘నాయనా! నువ్వు ఒకసారి ఈ పండుగ జరుపుకుంటున్న ప్రదేశాలన్నీ సంచరించి, నీ సందేహానికి సమాధానం దొరుకుతుందేమో ప్రయత్నించు’ అని ఆశీర్వదించి, అంతఃపురానికి బయలుదేరింది, తల్లికి నమస్కారం నరకుడు భూలోక సంచారం ప్రారంభించాడు. ఎక్కడ చూసినా వీధులన్నీ ముగ్గులతో, గుమ్మాలన్నీ తోరణాలతో నిండిపోయాయి. అందరూ తలంట్లు పోసుకుని, టపాసులు కొద్దిగా కాల్చుతున్నారు. తన పీడ వదిలినందుకే సంతోషంతో ఈ పండుగ చేసుకుంటున్నారని అర్థం చేసుకున్నాడు నరకుడు. ఇంటింటా దీపాలు ఉంచటానికి ప్రమిదెలు, నూనె, ఒత్తులు, బాణాసంచా, మిఠాయిలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఒక వీధిలోకి ప్రవేశించాడు నరకుడు. అక్కడ చాలామంది పిల్లలు ఎంతో ఆనందంగా ఆడుకుంటూ కనిపించారు. వాళ్ల దగ్గరగా వెళ్లి, ‘చిట్టిపిల్లలూ! ఏమిటి ఇంత సంబరంగా ఉన్నారు’ అని ప్రశ్నించాడు. అందుకు వారు, ‘నీకు తెలీదా! నరకుడు అనే రాక్షసుడిని ఈ రోజునే చంపారు. అందుకే మేం పండుగ చేసుకుంటున్నాం. నీకు ఇంకో విషయం తెలుసా, వాడు రాక్షసుడే అయినా కూడా మేం ఈ పండుగకి నరకచతుర్దశి అని ఆ రాక్షసుడి పేరుతోనే జరుపుకుంటున్నాం’ అన్నారు. తను అడగాలనుకున్న ప్రశ్నను వారే చెప్పడం తనకు ఆశ్చర్యం వేసింది. ‘‘రాక్షసుడి పేరు మీద ఎందుకు చేసుకుంటున్నారు’’ అని ఆసక్తిగా ప్రశ్నించాడు నరకుడు. ఏ రాక్షసుడిని చంపారో మాకు గుర్తుండాలి కదా. ఊరికే దీపావళి పండుగ అంటే నరకుడు గుర్తుండడు కదా. అంతే కాదు, ఆ నరకుడి పేరు గుర్తు రాగానే, ‘మనం ఈ రాక్షసుడిలా చెడ్డ పనులు చేస్తే, మనల్ని శ్రీకృష్ణుడు చంపుతాడు’ అని అందరికీ భయం కలగాలి కదా. అందుకే ఆ పేరుతో ఈ పండుగ జరుపుకుంటామని మా నాన్న చెప్పారు’’ అన్నాడు ఒక కుర్రవాడు. ఒక్కోరు ఒక్కోలా నరకాసురుడిని నిందిస్తూనే ఉన్నారు. తన వంటి వాడు స్వర్గానికి అనర్హుడు. నరకంలోకి కూడా ప్రవేశం ఉండదు.. అని మనసులో పలువిధాల బాధ పడ్డాడు నరకుడు. తాను ఎన్ని చెడ్డ పనులు చేసినా, సాక్షాత్తు తాను భూదేవి కుమారుడు కావటం వల్లనే తన పేరుతో పండుగ చేసుకుంటున్నారని తల్లికి శతకోటి నమస్కారాలు చేసి, నేరుగా స్వర్గానికి చేరుకున్నాడు నరకుడు. సృజన రచన : వైజయంతి పురాణపండ -
విష్ణు.. బ్రహ్మ.. కృష్ణ.. సత్య
ది స్టోరీ ఆఫ్ నరకాసుర హిరణ్యాక్షుడు దుర్మార్గుడు, అసురుడు. వాడు మానవులనే కాకుండా దేవతలను సైతం పీడించాడు. హిరణ్యాక్షుడి బారి నుంచి రక్షించ మని వారంతా విష్ణుమూర్తిని ప్రార్థించారు. శ్రీమహావిష్ణువు అభయమిచ్చాడు. ఈ విషయం హిరణ్యాక్షుడు తెలుసుకున్నాడు. తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచన చేశాడు. భూమిని రక్షించడమే విష్ణుమూర్తి ప్రధాన ధ్యేయం కనుక, ఈ భూమిని దాచేస్తే, విష్ణుమూర్తి కనుగొనలేకపోతాడు. అప్పుడు తనకు ఎటువంటి ముప్పూ ఉండదనుకున్నాడు. తన సర్వశక్తులూ ఒడ్డి, భూమిని కక్ష్యలోనుంచి త ప్పించాడు. తర్వాత ఏం జరిగింది? భూమిని కక్ష్యలోంచి తప్పించాక హిరణ్యాక్షుడు తన పాదంతో భూమిని తోయబోడాడు. అంతలో భూదేవికి, హిరణ్యాక్షుడి పాదానికి మధ్య నుంచి ఒక అసురుడు పుట్టుకొచ్చాడు. సరిగ్గా అదే సమయంలో విష్ణుమూర్తి వరాహవతారంలో ప్రభవించి భూమిని తన కొమ్ముల మీదకు ఎత్తి భూమిని మళ్లీ అదే కక్ష్యలో ఉంచాడు. అలా హిరణ్యాక్షుడి మీద విష్ణుమూర్తి విజయం సాధించాడు. మరి మధ్యలో పుట్టుకొచ్చిన ఈ అసురుడు ఎవడు? వాడే నరకాసరుడు! విష్ణుమూర్తి వదిలేశాడు! భూదేవి వచ్చి, విష్ణుమూర్తితో ఆ అసురుని పుట్టుక గురించి అడిగింది. ‘‘అమ్మా! ఇతడు నీ పుత్రుడు. వీడు కూడా హిరణ్యాక్షుడిలాగే మహా శక్తివంతుడు, బలవంతుడు’ అన్నాడు విష్ణుమూర్తి. ‘‘అయితే వీడు కూడా హిరణ్యాక్షుడిలాగే రాక్షసుడవుతాడా’’ అంది భూదేవి. అవునన్నాడు శ్రీమహావిష్ణువు. అంతేకాదు, ‘‘నువ్వు మాత్రమే వీడిని ఓడించగల శక్తి కలిగిన దానివి. అయితే ఇప్పుడు వాడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. వాడు రాక్షస లక్షణాలు ప్రదర్శించినప్పుడు ఆలోచిద్దాం’ అని చెప్పి విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్లిపోయాడు. బ్రహ్మ వరమిచ్చాడు! కాలం గడుస్తోంది. ఈ రాక్షసుడు దుష్టాత్ముడిగా ఎదుగుతున్నాడు. వాడి కి నరకుడు అని పేరు పెట్టారు. బాణాసురుడనే శక్తిమంతమైన రాక్షసుడు, నరకుడి బలవిశేషాల గురించి విని, ఒకనాడు నరకుడిని కలిసి, ‘‘నరకా! నువ్వు మహాబలవంతుడివి. బ్రహ్మ గురించి తపస్సు ఆచరించు. మరింత శక్తిమంతుడివి అవుతావు. ముల్లోకాలనూ పాలించే శక్తి సంపాదిస్తావు... అన్నాడు. నరకాసురుడు బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు ఆచరించాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ‘‘నీ తపస్సుకి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో’’ అన్నాడు, వరం ఇవ్వడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో అన్నాడు బ్రహ్మ. నరకాసురుడు వికటాట్టహాసం చేస్తూ, ‘‘బ్రహ్మదేవుడు తెలివితక్కువవాడు. ఏ తల్లీ తన బిడ్డను సంహరించదు. ఆ విధంగా బ్రహ్మదేవుడు నాకు చావు లేని వరం ప్రసాదించినట్లే. ఈ లోకాలన్నిటినీ స్వాధీనం చేసుకుంటాను’’ అని వీరవిహారం చేస్తున్నాడు. అక్కడ గోకులంలో, న ల్లనివాడు, నవ్వురాజిల్లెడి మోమువాడు అయిన శ్రీకృష్ణుడు నందయశోదల దగ్గర పెరుగుతున్నాడు. విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమయిన వాడు శ్రీకృష్ణుడు. నరకుడు తన నగరమైన ప్రాగ్జ్యోతిషపురానికి తిరిగివచ్చి, వర గర్వంతో రాజ్యాలన్నీ వశపరచుకుని, భూలోకానికి రాజయ్యాడు. అంతటితో తృప్తి చెందక, దేవలోకం మీదికి దండెత్తాడు. అందరూ స్వర్గం విడిచిపోయారు. నరకుడు పదహారువేల మంది స్వర్గలోక కన్యలను చెరబట్టి తన అంతఃపురంలో బంధించాడు. దేవతల తల్లి అయిన అదితిని కూడా విడిచిపెట్టక, అతి మహిమాన్వితము, సుందరము అయిన ఆమె కుండలాలను తస్కరించాడు. ఈ విధంగా నరకుడి పాలనకు ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఈ రాక్షసుడి బారి నుండి రక్షించేవారే లేరా అని బాధపడుతున్నారు. శ్రీకృష్ణుడు బయల్దేరాడు! గోకులంలో శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తన కర్తవ్యం తెలుసుకున్నాడు. ఒకనాడు సత్యభామ ఉద్యానవనంలో శ్రీకృష్ణుని తలచుకుంటూ, ఒంటరిగా ఉన్న సమయంలో, అదితి కన్నీరు పెట్టుకుంటూ వచ్చింది. జరిగిన విషయం తెలుసుకున్న సత్యభామ, అదితిని ఓదార్చి, తన భవనంలో చోటిచ్చి, శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి, విషయం విన్నవించింది. నరకుడికి బుద్ధి చెప్పడానికి బయలుదేరతానన్నాడు శ్రీకృష్ణుడు. తానూ వెంట వస్తానంది సత్యభామ. శ్రీకృష్ణుడు అంగీకరించాడు. ‘ఆయుధాలతో సిద్ధంగా ఉండు. మనం యుద్ధానికి బయలుదేరుతున్నాం. గరుడ వాహనం మీద మన ప్రయాణం’ అన్నాడు. ఇద్దరూ గరుడుని మీద ప్రాగ్జ్యోతిషపురానికి బయలుదేరారు. నరకుడి గుండె అదుపు తప్పింది. ఆ నల్లనివాడు తనను సంహరించడానికి వచ్చాడు. కాని తనకు చావు లేని వరం ఉంది కదా అని విర్రవీగాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుడు.. సత్యభామ సహాయంతో నరకుడి సైన్యం మొత్తాన్ని సంహరించాడు. తన అంతఃపురం నుంచి అంతా పరికిస్తున్న నరకుడు, తన మంత్రి మురుడిని యుద్ధానికి పంపాడు. వాడు శ్రీకృష్ణుని చేతిలో హతుడయ్యాడు. నాటి నుంచే శ్రీకృష్ణుడు మురారి అయ్యాడు. నరకుడు క్రోధంతో ఊగిపోతూ తన శతఘ్నిని శ్రీకృష్ణుడి మీదకు ప్రయోగించాడు. దానిని గరుడుడు తిప్పికొట్టాడు. శ్రీకృష్ణుడు నరకుడి మీదకు ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా, ఆశ్చర్యకరంగా ఏ ఒక్క ఆయుధమూ వాడిని ఏమీ చేయలేకపోయాయి. వాడు అన్నిటినీ తిప్పికొట్టాడు. నరకాసురుడిని చూసిన సత్యభామ విల్లు అందుకుని భయంకరమైన బాణాలను వాడి మీదకు ప్రయోగించింది. శ్రీకృష్ణుడు, సత్యభామ... ఇద్దరూ తన మీద దాడి చేయడం చూసిన నరకుడు, అత్యంత మహిమాన్వితమైన శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది శ్రీకృష్ణుడి గుండెలను తాకి, స్పృహతప్పాడు శ్రీకృష్ణుడు. సత్యభామ తలపడింది! సత్యభామ రెట్టింపు శక్తితో యుద్ధం చేయడం ప్రారంభించింది. ఆమె వేసిన ఆయుధం నేరుగా నరకుడి గుండెలో దిగి, అతడిని బాధించింది. నెమ్మదిగా నేలకొరుగుతున్నాడు. తనను వీరు ఎలా ఓడించగలుగుతున్నారో ఒక నిమిషం నరకుడికి అర్థం కాలేదు. కాసేపటికే నల్లనివాడు కోలుకొన్నాడు. సత్యభామా సమేతుడై, గరుడుని మీద నుంచి కిందకు దిగి, నరకుడి వైపుగా అడుగులు వేశారు. వారిని చూసిన నరకుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తనకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని మంచికి వినియోగించకుండా, చెడు మార్గం పట్టానని పశ్చాత్తాపపడ్డాడు. యుద్ధభూమిలో నల్లనివాని పాదాల మీద పడి, రెండు చేతులూ జోడించి, ‘‘దేవా! నన్ను క్షమించు, ఈ రోజే నేను కాంతిరేఖలు చూశాను. ప్రజలను పీడించినవారికి అంతిమంగా ఇదే జరుగుతుందని తెలుసుకున్నాను’’ అన్నాడు. ‘‘నరకా! నీలో కలిగిన పశ్చాత్తాపానికి ఆనందపడుతున్నాను’’అన్నాడు శ్రీకృష్ణుడు సాయం సంధ్యలో నల్లనివాడు, సత్యభామ మెరిసిపోతూ కనపడ్డారు. ‘‘నేను ఈ రోజే కాంతి చూస్తున్నాను. చీకటి మీద వెలుగు విజయం సాధించినందుకు గుర్తుగా ప్రజలందరూ ఈ రోజు పండుగ జరుపుకుంటారు’’ అంటూ, సత్యభామ పాదాలకు నరకుడు నమస్కరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ‘‘నరకాసురా! ఈమె భూదేవి అవతారం. నీ సంహారం కోసమే అవతరించింది. సత్యభామ లేనిదే నేను నిన్ను సంహరించలేను. అందువల్లే నేను సొమ్మసిల్లినట్లు నటించాను’ అన్నాడు. సత్యభామ వాస్తవాన్ని గ్రహించింది. నరకుడి తలను ఒడిలోకి తీసుకుని, ‘‘నాయనా కుమారా! ఎందుకురా చెడు మార్గం పట్టావు’’ అని విలపించింది. ‘అమ్మా! నా తప్పులకు నువ్వు బాధ్యురాలివి కాదు. నిన్ను ‘అమ్మా’ అని పిలవడానికి నాకు గర్వంగా ఉంది’’ అంటూ కన్ను మూశాడు. నాటి నుంచే నరకాసురుడి మరణాన్ని చీకటి మీద వెలుగు సాధించిన విజయంగా నరకచతుర్దశి జరుపుకుంటున్నాం. దీపావళి దీపాల పండుగ. చెడు మీద మంచి సాధించిన దివ్వెల పండుగ అయింది. - డా. పురాణపండ వైజయంతి, ‘సాక్షి’ ఫీచర్స్ ‘‘దేవా! నేను చావు లేని వరం కోరుకోను. నువ్వు ఎవ్వరికీ ఆ వరం ప్రసాదించవని తెలుసు. భూదేవి నా తల్లి అని తెలుసుకున్నాను. నాకు చావు అంటూ ఉంటే, అది నా తల్లి చేతిలోనే జరగాలి. ఆ వరం ప్రసాదించు’’ అన్నాడు నరకుడు. బ్రహ్మదేవుడు లోలోపల నవ్వుకుంటూ, ‘తథాస్తు’ అని అంతర్థానమయ్యాడు.