చల్లపల్లి(కృష్ణా జిల్లా): పవిత్ర కృష్ణానదీ తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రాల్లో చల్లపల్లి మండలం నడకుదురు గ్రామం ఒకటి. నరకాసుర సంహార క్షేత్రంగా, మోక్షపురిగా చరిత్ర ప్రసిద్ధి గాంచి కాలక్రమేణా నరకొత్తూరు, నరకదూరుగా మారి నడకుదురుగా స్థిరపడింది. గ్రామంలో కృష్ణానది గర్భంలో ఉన్న శ్రీ ఫృద్వీశ్వరస్వామి ఆలయం, చెంతనే ఉన్న పాటలీవనం సందర్శనీయ స్థలాలు. నడకుదురు నరకునికి మోక్షం ప్రసాదించిన క్షేత్రంగా, మోక్షపురిగా గుర్తింపు ఉంది.
నరకాసురుడు పూజించిన స్థలం..
నారద మహాముని నరకాసురుడితో నీవు భూదేవి పుత్రుడవని తెలియజేసి, ద్విముఖుడనే రాక్షసుడిని సంహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకు పుష్కరకాలం స్వయంభువైన శ్రీ ఫృద్వీశ్వరుని పూజించమని సూచిస్తాడు. నరకాసురుడు ఫృద్వీశ్వరాలయానికి చేరుకుని కృష్ణానదిలో నిత్య స్నానమాచరిస్తూ 4,320 రోజుల పాటు స్వామిని పూజిస్తాడు. అదే నడకుదురు గ్రామంలోని ఫృద్వీశ్వరాలయం.
వధ జరిగింది ఇక్కడే..
నరకాసురుడి ఆగడాలతో అల్లాడిపోతున్న ముల్లోకాల వాసులను కాపాడేందుకు నరకాసురుని సంహరించ దలచిన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై ఈ ప్రాంతంలో ఉన్న నరకాసురుడితో యుద్ధానికి దిగుతాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్చబోగా, సత్యభామ ఫృద్వీశ్వర క్షేత్రం సమీపంలో నరకాసురుని సంహరించినట్లు చారిత్రక కథనం. భూదేవికి ప్రతిరూపం, నరకాసురుని తల్లిలాంటి సత్యభామ నరకాసురునికి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించి, నదీతీరాన పిండ తర్పణాలు వదిలినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
కృష్ణ–భామల విహార స్థలం..
నరకాసుర సంహారం అనంతరం ఆలయం చెంతనున్న పాటలీవనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణుడు, సత్యభామలు లక్ష్మీనారాయణుని విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పూజలు చేసినట్లు కథనం. నడకుదురు ఆలయం వద్ద పాటలీవృక్షంకింద లక్ష్మీనారాయణుని విగ్ర హం నేటికీ భక్తుల పూజలందుకుంటోంది.
మహిమాన్వితం పాటలీవృక్షం..
గ్రామ చారిత్రక, ఆథ్యాత్మిక వైభవానికి నిదర్శనం నడకుదురు ఫృద్వీశ్వరాలయం చెంతనున్న దేవతావనం. దేవలోక వనమాత పాటలీ వృక్షాలు దేశంలో కేవలం కాశీ తర్వాత నడకుదురులో మాత్రమే ఉన్నాయి. కరకట్ట దిగువనే నదిలో కొబ్బరిచెట్లు, పాటలీవృక్షాలు, ఉసిరిచెట్ల మధ్య ఆలయం ఉంటుంది. చుట్టూ పసుపుతోటలు, వాణిజ్య పంటలతో చల్లని వాతావరణం భక్తులకు ఆలయం స్వాగతం పలుకుతుంది. దీపావళి ప్రత్యేకత సంతరించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment