యుద్ధంలో మరణించిన నరకుడు వీరస్వర్గం అలంకరించటానికి బయలుదేరుతూ.. రెండు రోజుల తరవాత స్వర్గానికి వస్తాను, అంతవరకు భూలోకంలో తిరిగే అవకాశం ఇవ్వమని ఇంద్రుడిని వరం కోరాడు. ఇంద్రుడు అనుమతి ఇచ్చాడు. నరకుడు నేరుగా సత్యభామ దగ్గరకు వెళ్లాడు. ‘‘అమ్మా..’’ అని సంబోధించాడు ఆర్తిగా నరకుడు. సత్యభామ మనసు ఒక్కసారి కలుక్కుమంది.
ప్రజలను యథేచ్ఛగా బాధించాడు నరకుడు. తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని వర గర్వంతో విర్రవీగాడు. మునులు, ఋషులు, వృద్ధులు, పిల్లలు, స్త్రీలు.. ఒకరేమిటి.. అందరూ నరకుని బాధితులే. నిస్సహాయ స్థితిలో ప్రజలంతా శ్రీకృష్ణునికి విన్నవించుకున్నారు. నవ్వురాజిల్లెడు మోముతో యశోదా నందనుడు అందరికీ అభయం ఇచ్చి పంపాడు. యుద్ధానికి సుముహూర్తం నిర్ణయించాడు. సంగ్రామ అభిలాష ఉన్న సత్యభామ తాను కూడా యుద్ధానికి వస్తానని, చీర నడుముకి బిగించింది. శ్రీకృష్ణుడు మరో మాట మాట్లాడకుండా విల్లందుకుంది, రథం అధిరోహించింది.
ఇరు పక్షాల నడుమ యుద్ధం హోరాహోరీగా జరిగింది. సంగరంలో కొద్దిసేపు శ్రీకృష్ణుడు మూర్ఛితుడయ్యాడు. కాళిదాసు వర్ణించినట్లుగా మన్మధ బాణాల వంటి కనుబొమలు కలిగిన సత్యభామ నారి సంధించింది. శర వర్షం కురిపించింది. ఒక పక్క శ్రీకృష్ణుని వైపు అమృత కిరణాలను ప్రసరిస్తోంది. మరో పక్క నరకుడిపై రౌద్ర బాణాలు విడుస్తోంది. కొంతసేపటికి శ్రీకృష్ణుడు స్వస్థుడయ్యాడు. సత్యభామా సమేతుడై నరకుడిని వధించాడు. ప్రజలంతా శ్రీకృష్ణుడిని స్తుతించారు, సత్యభామను అభినందించారు. రాక్షస సంహారం జరిగితే జాతరలు, సంబరాలు, పండుగలు జరుపుకోవలసిందే కదా. ఆయా ప్రాంతాల వారు వారి సంప్రదాయానుసారం నరక చతుర్దశి జరుపుకోవటానికి సన్నద్ధులయ్యారు. అక్కడితో ఆగకుండా మరుసటి రోజు దీపావళి కూడా జరుపుకోవాలని తీర్మానించారు. అన్ని లోగిళ్లు పండుగకు సన్నాహాలు చేయటంలో మునిగిపోయాయి.
తల్లి ఆశీర్వాదం
యుద్ధంలో మరణించిన నరకుడు వీరస్వర్గం అలంకరించటానికి బయలుదేరుతూ.. రెండు రోజుల తరవాత స్వర్గానికి వస్తాను, అంతవరకు భూలోకంలో తిరిగే అవకాశం ఇవ్వమని ఇంద్రుడిని వరం కోరాడు. ఇంద్రుడు అనుమతి ఇచ్చాడు. నరకుడు నేరుగా సత్యభామ దగ్గరకు వెళ్లాడు. సత్యభామ సాక్షాత్తు భూదేవి అవతారం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. ‘‘అమ్మా..’’ అని సంబోధించాడు ఆర్తిగా నరకుడు. సత్యభామ మనసు ఒక్కసారి కలుక్కుమంది. నరకుడు తన కుమారుడే అయినప్పటికీ దుష్ట సంహారం చేసి, తన ప్రజలను కాపాడింది సత్యభామ.
‘‘అమ్మా! నేను నీ కుమారుడినే కదా. నన్ను ఎందుకు సంహరించావు, నన్ను నువ్వే మనిషిగా మార్చలేకపోయావేం’ అని దీనంగా ప్రశ్నించాడు. అందుకు సత్యభామ, ‘బుద్ధి కర్మానుసారీ’ అన్నారు పెద్దలు. నీకు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పి చూసినా నువ్వు నీ దుష్టత్వం విడిచిపెట్టలేదు. నా కుమారుడి కారణంగా నా రాజ్య ప్రజలంతా బాధలు పడటం చూస్తూ ఎలా ఉంటాను. అందుకే నా మాతృ హృదయాన్ని పక్కన పెట్టి, కొద్దిసేపు పాషాణంలా ప్రవర్తించి, నిన్ను యుద్ధంలో సంహరించాను’ అని గంభీరంగా పలికింది సత్యభామ.
‘‘నేను దుర్మార్గుడిని, దుష్టుడిని అని కదా నువ్వు నన్ను సంహరించావు. మరి ఈ పండుగను నా పేరుతో ఎందుకు ‘నరక చతుర్దశి’ గా జరుపుకుంటున్నారు’’ అని అమాయకంగా ప్రశ్నించాడు. సత్యభామ.. ఈ ప్రశ్నకు తన ప్రజలే సరైన సమాధానం చెబుతారని భావించి, ‘నాయనా! నువ్వు ఒకసారి ఈ పండుగ జరుపుకుంటున్న ప్రదేశాలన్నీ సంచరించి, నీ సందేహానికి సమాధానం దొరుకుతుందేమో ప్రయత్నించు’ అని ఆశీర్వదించి, అంతఃపురానికి బయలుదేరింది,
తల్లికి నమస్కారం
నరకుడు భూలోక సంచారం ప్రారంభించాడు. ఎక్కడ చూసినా వీధులన్నీ ముగ్గులతో, గుమ్మాలన్నీ తోరణాలతో నిండిపోయాయి. అందరూ తలంట్లు పోసుకుని, టపాసులు కొద్దిగా కాల్చుతున్నారు. తన పీడ వదిలినందుకే సంతోషంతో ఈ పండుగ చేసుకుంటున్నారని అర్థం చేసుకున్నాడు నరకుడు. ఇంటింటా దీపాలు ఉంచటానికి ప్రమిదెలు, నూనె, ఒత్తులు, బాణాసంచా, మిఠాయిలు అన్నీ సిద్ధం చేసుకున్నారు.
ఒక వీధిలోకి ప్రవేశించాడు నరకుడు. అక్కడ చాలామంది పిల్లలు ఎంతో ఆనందంగా ఆడుకుంటూ కనిపించారు. వాళ్ల దగ్గరగా వెళ్లి, ‘చిట్టిపిల్లలూ! ఏమిటి ఇంత సంబరంగా ఉన్నారు’ అని ప్రశ్నించాడు. అందుకు వారు, ‘నీకు తెలీదా! నరకుడు అనే రాక్షసుడిని ఈ రోజునే చంపారు. అందుకే మేం పండుగ చేసుకుంటున్నాం. నీకు ఇంకో విషయం తెలుసా, వాడు రాక్షసుడే అయినా కూడా మేం ఈ పండుగకి నరకచతుర్దశి అని ఆ రాక్షసుడి పేరుతోనే జరుపుకుంటున్నాం’ అన్నారు. తను అడగాలనుకున్న ప్రశ్నను వారే చెప్పడం తనకు ఆశ్చర్యం వేసింది. ‘‘రాక్షసుడి పేరు మీద ఎందుకు చేసుకుంటున్నారు’’ అని ఆసక్తిగా ప్రశ్నించాడు నరకుడు.
ఏ రాక్షసుడిని చంపారో మాకు గుర్తుండాలి కదా. ఊరికే దీపావళి పండుగ అంటే నరకుడు గుర్తుండడు కదా. అంతే కాదు, ఆ నరకుడి పేరు గుర్తు రాగానే, ‘మనం ఈ రాక్షసుడిలా చెడ్డ పనులు చేస్తే, మనల్ని శ్రీకృష్ణుడు చంపుతాడు’ అని అందరికీ భయం కలగాలి కదా. అందుకే ఆ పేరుతో ఈ పండుగ జరుపుకుంటామని మా నాన్న చెప్పారు’’ అన్నాడు ఒక కుర్రవాడు.
ఒక్కోరు ఒక్కోలా నరకాసురుడిని నిందిస్తూనే ఉన్నారు. తన వంటి వాడు స్వర్గానికి అనర్హుడు. నరకంలోకి కూడా ప్రవేశం ఉండదు.. అని మనసులో పలువిధాల బాధ పడ్డాడు నరకుడు. తాను ఎన్ని చెడ్డ పనులు చేసినా, సాక్షాత్తు తాను భూదేవి కుమారుడు కావటం వల్లనే తన పేరుతో పండుగ చేసుకుంటున్నారని తల్లికి శతకోటి నమస్కారాలు చేసి, నేరుగా స్వర్గానికి చేరుకున్నాడు నరకుడు.
సృజన రచన : వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment