టైటిల్: నరకాసుర
నటీనటులు: రక్షిత్, అపర్ణ జనార్థన్, నాజర్, సంగీర్తన, చరణ్ రాజ్, ఎస్.ఎస్.కాంచి, శ్రీమన్, ఫిష్ వెంకట్ తదితరులు
నిర్మాత: డా.అజ్జా శ్రీనివాస్
దర్శకత్వం: సెబాస్టియన్ నోవా అకోస్టా
సంగీతం:నౌపాల్ రాజా
సినిమాటోగ్రఫీ:నాని చామిడి శెట్టి
ఎడిటింగ్ : సీ.హెచ్. వంశీ కృష్ణ
విడుదల తేది: నవంబర్ 3, 2023
‘నరకాసుర’కథేటంటే..
చిత్తూరు జిల్లాకు చెందిన శివ(రక్షిత్ అట్లూరి) ఓ కాఫీ ఎస్టెట్‌లో పని చేసే లారీ డ్రైవర్. ఎమ్మెల్యే నాగమ నాయుడు(చరణ్ రాజ్)అంటే అతనికి చాలా ఇష్టం. ఎంతలా అంటే.. నాయుడు గెలుపు కోసం ప్రత్యర్థులను హత్య చేసేంత. అలాంటి శివ ఉన్నట్టుండి కనిపించకుండా పోతాడు. అతని ఆచూకి కోసం పోలీసులు వెతకడం ప్రారంభిస్తారు. అసలు శివ ఎలా తప్పిపోయాడు? అతన్ని బంధించిందెవరు? ఎమ్మెల్యే నాయుడు కుమారుడు ఆది నాయుడు(తేజ చరణ్ రాజ్)తో శివకు ఎందుకు వైరం ఏర్పడింది? తనను ప్రేమించిన మరదలు వీరమణి(సంకీర్తన విపిన్), తను ప్రేమించి పెళ్లి చేసుకున్న మీనాక్షి(అపర్ణ జనార్దన్) కోసం శివ ఏం చేశాడు. ఊరికి మంచి చేసే వ్యక్తిగా ఉన్న శివ ‘నరకాసుర’వథ ఎందుకు చేయాల్సివచ్చింది? ఈ కథలో ట్రాన్స్ జెండర్స్ పోషించిన పాత్రేంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో నరకాసుర సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈ మధ్యకాలంలో ఆడియన్స్‌లో మార్పు వచ్చింది. కథ బాగుంటే చాలు.. హీరో హీరోయిన్లు ఎవరనే విషయం పట్టించుకోకుండా థియేటర్స్‌కి వచ్చేస్తున్నారు. అందుకే నూతన దర్శకులు డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డైరెక్టర్ సెబాస్టియన్ కూడా ఓ కొత్త కాన్సెప్ట్‌తో ‘నరకాసుర’ను తెరకెక్కించాడు. ఓ కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ తన కథలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. దాంతోపాటు వివక్షకు గురవుతున్న హిజ్రాలకు సంబంధించిన ఓ మంచి సందేశాన్ని సైతం ఇచ్చాడు. . డెబ్యూ దర్శకుడే అయినా... కథ... కథనం నడిపించడంలో ఎక్కడా తడబడకుండా చాలా క్లారిటీగా సినిమాను తెరకెక్కించారు. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం అనుభవలేమి స్పష్టంగా కనిపించింది.
వాస్తవానికి ఈ కథ కొత్తేదేమి కాదు. ఒక రోటీన్ రివేంజ్ డ్రామా స్టోరీ. ఊరికోసం ఏదైనా చేయగలిగే ఓ వ్యక్తిని నమ్మిన వాళ్లే మోసం చేస్తే.. అతను రాక్షసుడిగా మారి ఎలా రివెంజ్ తీసుకున్నాడనేది ఈ సినిమా కథ. దీనికి హిజ్రాల స్టోరీని యాడ్ చేసి కథనం నడిపించడంతో కాస్త ఢిఫరెంట్‌గా అనిపిస్తుంది. హిజ్రాలతో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. వీటికి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. అలాగే పరస్త్రీ వ్యామోహం తగదని... అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పడమే ‘నరకాసుర‘ వథ అనే అంశాన్ని రివేంజ్ డ్రామాగా ఓ సందేశాత్మకంగా తెరరపై చూపించడం ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే..
పలాస చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకున్న రక్షిత్ అట్లూరి.. మరోసారి తన మాస్ అప్పియరెన్స్‌తో ఆకట్టుకున్నాడు. లారీ డ్రైవర్ శివ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. అతనికి జంటగా మీనాక్షి పాత్రలో నటించిన అపర్ణ జనార్ధన్ తన హోమ్లీ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. హీరో మరదలుగా నటించిన సంకీర్తన విపిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. ఆమె కూడా ఓ కీలకమైన మాస్ యాక్షన్ సీక్సెన్స్ తో ఆకట్టుకుంటుంది. రాజకీయ నాయకుని పాత్రలో నటించిన చరణ్ రాజ్ పాత్ర పర్వాలేదు.
చాలా కాలం తరువాత తెలుగు సినిమాలో కనిపించాడు చరణ్ రాజ్. అతని కుమారునిగా నటించిన తేజ్ చరణ్ రాజు కూడా ఆకట్టుకుంటాడు. శత్రు అండ్ అతని టీమ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టకున్నారు..కాఫీ ఎస్టెట్ సూపర్‌వైజర్‌గా నాజర్‌తో పాటు మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికపరంగా ఈ సినిమా పర్వాలేదు. నాని చామిడి శెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. అడవి లొకేషన్స్ బాగా క్యాప్చర్ చేయగలిగారు. నౌపాల్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రతి సన్నివేషాన్ని... తనదైన బీజీఎంతో ఎలివేట్ చేయగలిగారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment