పనులు సజావుగా పూర్తవుతాయి | The tasks are completed smoothly | Sakshi
Sakshi News home page

పనులు సజావుగా పూర్తవుతాయి

Published Fri, Nov 20 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 12:46 PM

పనులు సజావుగా పూర్తవుతాయి

పనులు సజావుగా పూర్తవుతాయి

నవంబర్ 21 నుంచి 27 వరకు
 
టారో బాణి

 
 ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)

 పని చేసీ చేసీ అలసిపోయిన శరీరానికీ, మనస్సుకీ కొంత విశ్రాంతి అవసరం. వీలయితే మీరు కొంత విశ్రాంతి తీసుకోండి. కొత్త ఉద్యోగం, కొత్త ప్రాజెక్టు లేదా ఉద్యోగావకాశం రావచ్చు. కొన్ని రకాల ప్రలోభాలకి, ఆకర్షణలకి లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. జరగబోయే దాని గురించి ఊహించుకోవడం అంత మంచిది కాదని గ్రహించండి. కలిసొచ్చే రంగు: లేత గులాబీ
 
 టారస్ (ఏప్రిల్ 21-మే 20)
 భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. మీరు వెతుకుతున్న ప్రేమను పొందుతారు. మీ లక్ష్యాలు దాదాపు పూర్తవుతాయి. ఆడుతూ పాడుతూ హాయిగా పని చేసుకోండి. మీరేమిటన్నది మీ పనే చెబుతుంది. జీవితంలో ఎదురయ్యే వివిధ ఒడుదొడుకులను ఎదుర్కొనగలిగే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయని గుర్తుంచుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ
 
 జెమిని (మే 21-జూన్ 21)

 అనుకున్న పనులన్నింటినీ సజావుగా, సక్రమంగా పూర్తి చేస్తారు. గత నెలరోజులుగా మీ మనసులో రూపుదిద్దుకుంటున్న ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. మీ డబ్బును మదుపు చేసేందుకు మరిన్ని మంచి మార్గాలు అన్వేషించండి. ప్రేమ విషయంలో కొంత వైఫల్యం ఎదురైనప్పటికీ మీలో ఉన్న ఆనందాన్ని, చురుకుదనాన్ని పోగొట్టుకోకండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ
 
 
 క్యాన్సర్ (జూన్22-జూలై 23)

 విజయాల బాటలో నడుస్తారు. మీరు సాధించిన విజయాలను చూసి మీరే గర్విస్తారు. మీ పనితనాన్ని చూసి, చాలా మంది మీ పట్ల మొగ్గ చూపుతారు. అయితే మీ విజయాలను చూసి గర్వించకుండా, అహంకరించకుండా, సమతుల్యతను పాటిస్తూ, జీవితంలో మరింత ఆనందాన్ని నింపుకోండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
 లియో (జూలై 24-ఆగస్టు 23)
 మీ అసలైన శిక్షణ ఇప్పుడే ఆరంభమైందని గుర్తించండి. మొదట్లో కొంత అపరిపక్వంగా ఉన్నా, రానురానూ పరిణతి సాధిస్తారు. నేర్చుకోవడం పట్ల దృష్టి పెడితే సులువుగా చేసుకోవచ్చు. ఆఫీసులో లేదా పనిప్రదేశంలో ఇద్దరు విభిన్న మనస్తత్వాలున్న అధికారులతో పని చేయవలసి రావచ్చు. పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటే గెలుపు మీదే. కలిసొచ్చే రంగు: వంకాయరంగు
 
 లిబ్రా  (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

 కొత్త పనులు ప్రారంభించడం, కొత్త మార్పులు చోటు చేసుకోవడం జరగవచ్చు ఈ వారంలో. ఇష్టపడ్డవారితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతారు. వారు మీ నుంచి విడిపోతారేమోనన్న ఆలోచనే మీకు చేదుగా అనిపిస్తుంటుంది. అయితే, మీకంత ఇబ్బంది ఏమీ రాదు. పేదల పట్ల కొంచెం ఉదారంగా ఉండండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
 మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని చికాకులు చోటు చేసుకోవచ్చు. అయితే వాటిగురించే ఆలోచిస్తూ కుంగిపోవద్దు. శారీరక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఎవరితోనైనా అనైతిక బంధంలో ఉంటే వెంటనే తెంచేసుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరతారు. పని మీద దృష్టి పెట్టడం మంచిది. కలిసొచ్చే రంగు: వెండిరంగు
 
 శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)

 వృత్తిపరంగా కొత్త మార్పులు చోటు చేసుకోవచ్చు. బదిలీ లేదా ఉద్యోగంలో స్థాన మార్పు విషయమై కొన్ని వార్తలు వింటారు. అంతా బాగుంటుందనే ఊహించండి. ప్రేమబంధం మరింత బలపడుతుంది. ఒక దూరప్రయాణం ఉండచ్చు. సృజనాత్మకంగా ఆలోచించండి, కళాత్మకంగా పని చేయండి. కలిసొచ్చే రంగు: బూడిదరంగు
 
 క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
 మీ లక్ష్యానికి, విజయానికి చేరువ చేసి, మీకంటూ గుర్తింపు తెచ్చే వారమిది. మరింత బాగా శ్రమించడానికి ప్రయత్నించండి. మీ సృజనాత్మకతను వెలుగులోకి తీసుకు రండి. పాత పరిచయస్థులతో ప్రేమలో పడవచ్చు. అయితే శృంగారం, ప్రేమ కన్నా కెరీరే ప్రధానమని గుర్తించడం మంచిది. కలిసొచ్చే రంగు: గోధుమరంగు
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిళ్లను అధిగమించడానికి నిరంతరం శ్రమించాల్సి వస్తుంది. లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు, తీసుకున్న నిర్ణయాలను, చేసిన ఆలోచనలను వెంటనే అమలులో పెట్టడానికి ప్రయత్నించండి. లేకుంటే ఇతరులు వాటిని తమవని చెప్పుకునే అవకాశం ఉంది. కలిసొచ్చే రంగు: ఇటికరాయి రంగు.
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
జీవితంలో సమతుల్యత సాధించడానికి ఇది తగిన సమయం. మీరు ఎంతో కాల ం నుంచి అన్వేషిస్తున్న గురువు లేదా మార్గదర్శి తనంతట తనే ఎదురుపడవచ్చు. మీరు సాధించిన విజయంలో మీకు సహకరించిన వారికి కూడా భాగస్వామ్యం ఇవ్వడం మంచిది. కొత్త భాగస్వామ్యం, విదేశీ ప్రయాణం, కొత్త ఉద్యోగం మీ తలుపు తట్టవచ్చు. కలిసొచ్చేరంగు: ఆలివ్ గ్రీన్
 
టారో ఇన్సియా
టారో అనలిస్ట్
రేకీ గ్రాండ్ మాస్టర్

 
సౌర వాణి
 
ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20)

వివిధ కారణాల వల్ల మీరు లోగడ దరఖాస్తు చేసిన దానికే తిరిగి ప్రయత్నించవలసి వస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఆర్థికంగా నష్టపోయి మళ్లీ ప్రయత్నించి సాధించుకోవలసి వస్తుంది. వ్యాపారంలో కూడా రెండవమారు ప్రయత్నమే ఫలించే అవకాశం కనిపిస్తోంది. కాలగ్రహ ఫలితమే తప్ప మీ దోషం కాదు ఈ స్థితికి.
 
 టారస్ (ఏప్రిల్ 21-మే 20)
 ఒకప్పుడు నమ్మకంగా చేసిన పనులన్నీ ఇప్పుడు రాతకోతల పరిస్థితికి రావచ్చు. అప్పట్లో నోటి మాట మీద తీసుకుని ఎంతెంతో చెల్లించినప్పటికీ నేడు కాగితం కావలసిందే అనే ఒత్తిడి మీపై రావచ్చు. కాగితం మీది సంతకం వజ్రాయుధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి అక్షరాన్ని ఆలోచించి రాయండి. పెద్దల్ని సంప్రదించి మాత్రమే పత్రాల మీద సంతకాన్ని చేయండి.
 
జెమిని(మే 21-జూన్ 21)
ఆరోగ్యంగా ఉంటారు. ప్రయత్నించిన అన్ని కార్యక్రమాలూ విజయవంతమై సుఖసంతోషాలతో గడుపుతారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలత ఉన్నా ఇక్కడ పరిష్కరించుకోవలసిన సమస్య ఉన్నందువల్ల ఈ మాసంలో విదేశీ ప్రయాణం గురించి కొంత ఆలోచించ వలసిందే!  దంపతులకి ఉద్యోగరీత్యా కొంతకాలం ఎడబాటు ఉండవచ్చు.
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
 మీ దంపతుల్లో ఒకరికి మానసికారోగ్యం బాగుండకపోవచ్చు. సంతానానికి సంబంధించి సమస్య కారణంగా చింతతో ఉంటారు. జరిగే వ్యతిరేకతంటూ ఏమీ లేకున్నా, మానసికంగా దృఢంగా ఉండలేకపోవచ్చు. దీనికితోడు ఆర్థికంగా వ్యయం అవుతూ ధనం ఎలా వచ్చిందో అలా వెళ్లిపోతూ ఉండచ్చు కూడా. ప్రణాళికాబద్ధంగా వ్యయం చేసుకోవడం మంచిది.
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
మీ దంపతులు అందరికీ అన్యోన్యంగా కనిపిస్తున్నప్పటి కీ అంత సుఖంగా ఉండ (లే)కపోవచ్చు. దానికి ఆర్థికమైన విషయాల్లో ఒకరికొకరికి అవగాహనా సమన్వయమూ సామరస్యమూ లేకపోవడమే కారణం అనిపిస్తోంది. జరిగిందాన్ని మరచి ఇప్పటికైనా ఆర్థికమైన విషయాల్లో గుంభనని వీడితే దాంపత్యం సుఖమయమై సంతోషమంటే ఏమిటో అర్థమౌతుంది.
 
వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23)
మీదైన చిత్తవృత్తికి భిన్నంగా కోపం కలిగించే సంఘటనలు మీ మీద ప్రభావాన్ని చూపించవచ్చు. దాని గురించే ఆలోచిస్తుండే కారణంగా ఉద్యోగంలో కూడా అధికారులతో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. మీతో విరోధించిన వారికి మీరే స్వయంగా తెలియజేసుకుని పరిస్థితిని చక్కబరుచుకుంటే ఔషధసేవ తప్పుతుంది. మనసూ బుద్ధీ ఆరోగ్యవంతంగా ఉంటాయి.
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
ఒక ఆలోచనతో మీరుంటే, దాన్ని మీచుట్టూ చేరిన బంధుమిత్రులందరూ తమ సూచనలని చెప్పి వాళ్ల అభిప్రాయానికి మిమ్మల్ని దాసోహపడేలా చేసి ఉంటారు లోగడ. ఆ అభిప్రాయానికి అనుగుణంగానే నడవాల్సిన పరిస్థితిలో ఉన్న మీకు ఎవరు చెప్పినా వినే స్థితి ఉండకపోవచ్చు. ఒక్క క్షణం వెనక్కి తిరిగి మీ గురించి మీరు ఆలోచించుకుంటే బాగుండవచ్చునేమో!
 
 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
 అకస్మాత్తుగా వచ్చిన సమస్య మిమ్మల్ని కుంగదీస్తుంది. ఇది శని కారణంగా జరుగుతున్న స్థితి మాత్రమే. మానసిక ఆందోళన, పనుల్లో జాప్యం, ఉద్యోగంలో ఒత్తిడి అనవసర వ్యయం ఏది మాట్లాడినా మరోలా ఎదుటి వారికి అర్థం గోచరించడం... వంటివన్నీ ఈ దశలో సాధారణం అని గమనించి మీ దైనందిన జీవితాన్ని గడుపుకోండి. ఇంకొంతకాలం ఇదే స్థితి ఉండవచ్చు.
 
శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21)
మీరు ఎవరి మాటనైనా వింటున్నట్టే ఉంటారు కానీ మీకు తోచిన రీతినే చేసే మనస్తత్వమే అధికం. మిమ్మల్ని మొగమాటపెట్టి మాట సాయం గాని, లిఖితపూర్వకమైన హామీ గాని వాగ్దానం గాని చేయించుకునే పరిస్థితి కనిపిస్తోంది. అనవసర మనోవ్యగ్రత కలగచ్చు. బురద తొక్కి కాళ్లు కడుక్కోవద్దు- సరైన తోవలో నడవండి.
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
సంతానపరంగా ఎక్కువ వ్యయమయ్యే అవకాశం కనిపిస్తోంది. వృథాగా ఖర్చయిన పక్షంలో దాన్ని దుర్వ్యయం అంటుంది శాస్త్రం. ఇక్కడ జరుగుతున్న వ్యయం సంతాన శ్రేయస్సు అభివృద్ధుల నిమిత్తం కాబట్టి ఇది సద్‌వ్యయం కిందికే వస్తుంది. ఎంతో ఖర్చయినా కూడ వ్యాధి నివారణం కాని సందర్భాలుండవచ్చునేమోగాని, ఈ ఖర్చు మాత్రం సద్వ్యయమే.
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)

ఈ వారం ఈ రాశివారికి ఏదైనా చిన్నబుచ్చుకునే సందర్భంగాని వస్తే తిరగబడకుండా సంయమనంతో తలవంచుకోవడం లేదా ఆ ప్రదేశాన్ని మౌనంగా వీడడం మాత్రమే చేయవలసిన పని. నా తప్పు లేనప్పుడెందుకు దూరంగా తొలగిపోవాలి? అంటూ చర్చకి దిగడం కంటే ఒక్క క్షణం ఆలోచించి ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లడం మంచిది కదా!
 
 పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
 కురుక్షేత్రంలో అర్జునిలా అకస్మాత్తుగా తమ ఆలోచనని నిర్వేదం నిరాశ మీదికి లగ్నం చే సి కుటుంబ సభ్యులకి కొత్త ప్రశ్న పుట్టేలా ప్రవర్తిస్తారు. గమనించుకోండి. మీ నిరాశ మొత్తం తాత్కాలికం మాత్రమే. శ్రీకృష్ణునిలా గీతోపదేశం చేసేవారెవరూ మీకు తారసపడకపోయినా కుంగిపోక మీకు మీరుగా సంయమనం పాటించడం మంచిది.
 
 డా॥మైలవరపు శ్రీనివాసరావు
 సంస్కృత పండితులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement