వేగాన్ని అందుకొన్నాడు.. విజేత అయ్యాడు! | The winner was received down ..! | Sakshi
Sakshi News home page

వేగాన్ని అందుకొన్నాడు.. విజేత అయ్యాడు!

Published Wed, Aug 27 2014 10:57 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

వేగాన్ని అందుకొన్నాడు.. విజేత అయ్యాడు! - Sakshi

వేగాన్ని అందుకొన్నాడు.. విజేత అయ్యాడు!

వేగవంతంగా దూసుకుపోతున్న ఈ ప్రపంచంలో... ఏ రంగంలోనైనా  వేగాన్ని అందిపుచ్చుకొంటేనే పోటీలో ఉన్నట్టు.  మొన్నటి వరకూ... ఒక యువకుడు సొంతంగా షార్ట్‌ఫిలిమ్ తీయడమే గొప్ప. అయితే ఇప్పుడు చాలా మంది ఆ పనిచేసేస్తున్నారు. మరి అదే షార్ట్‌ఫిలిమ్‌ను వేగవంతంగా తీస్తే... కౌంట్‌డౌన్ పెట్టుకొని కొన్ని గంటల్లోనే పూర్తి చేస్తే... దాంతో అవార్డును అందుకొంటే... కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్  ఛాన్స్‌కు దగ్గరైతే... అతడు వేగాన్ని అందిపుచ్చుకొన్న వ్యక్తి అవుతాడు. విజేత అవుతాడు. శ్రీరామ్ ఆదిత్య అలాంటి ఛాంపియనే! తన షార్ట్‌ఫిలిమ్ ‘ది కాన్‌స్పిరసీ’ ద్వారా ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ లో ‘బెస్ట్ డెరైక్టర్’ అవార్డును అందుకొన్న యువకుడితను. శ్రీరామ్, అతడి స్నేహితులు కలిసి రూపొందించిన ఆ సినిమా ఈ పోటీల్లో ‘బెస్ట్ ఫిలిమ్’గా కూడా నిలిచింది. ఈ నేపథ్యంలో శ్రీరామ్ గురించి, అతడి సినిమా గురించి...
 
‘ది కాన్‌స్పిరసీ’ శ్రీరామ్ ఆదిత్య స్వీయదర్శకత్వంలో రూపొందించిన ఎనిమిదో షార్ట్‌ఫిలిమ్. హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు కాలేజ్‌లో బీటెక్ చదివే రోజుల నుంచి సినిమాలంటే అతనికి తగని ప్రీతి. ఎప్పటికైనా డెరైక్టర్ కావాలనేది అతని కల. మరి డెరైక్టర్ కావాలంటే ఫిలింనగర్ చుట్టూ చక్కర్లు కొట్టడానికి కన్నా మునుపు.. తనకు ఆ కల కనడానికి అర్హత ఉందని నిరూపించుకోవాలనుకొన్నాడతను. అందుకోసమే తన ఆలోచనలను తెరకెక్కించడం మొదలు పెట్టాడు. అలా తెరకెక్కినదే ‘చైల్డ్ లేబర్’ అనే షార్ట్‌ఫిలిమ్. చదువుకొనే సమయంలోనే శ్రీరామ్ రూపొందించిన ఆ సినిమా సౌతిండి యన్ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్‌గా నిలిచింది. దానికీ అవార్డు లభించింది.
 
మరి శ్రీరామ్‌కు అంతకు మించిన ప్రోత్సాహం అవసరం లేకపోయింది. ఇంట్లో కూడా పూర్తి మద్దతు లభించడంతో, షార్ట్‌ఫిలిమ్‌లతో గుర్తింపు సంపాదించుకొనే ప్రక్రియను ముమ్మరం చేశాడు. ఈ క్రమంలోనే చదువు పూర్తి అయ్యింది.. గూగుల్‌లో ఉద్యోగం వచ్చింది, అటు నుంచి ఫేస్‌బుక్‌లోకి మారాడు. ఆ సంస్థల్లో పనిచేయడం ఎంతోమంది యువతకు కలల పంట. అయితే శ్రీరామ్ కల మాత్రం ‘సినిమా’. అందుకే ఉద్యోగాన్ని వదిలేసి.. సినిమా లక్ష్యంగా కార్యాచరణ మొదలు పెట్టాడు.
 
ఈ క్రమంలో షార్ట్‌ఫిలిమ్ పోటీలపై దృష్టి సారించాడు. దేశంలో నగరాల వారీగా జరిగే బుల్లి సినిమాల పోటీల్లో తన ప్రయత్నాలు చేయసాగాడు. ఎక్కడికి వెళ్లినా శ్రీరామ్ తన ప్రత్యేకతను అయితే నిరూపించుకొంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకూ శ్రీరామ్ ఎనిమిది షార్ట్‌ఫిలిమ్‌లు రూపొందించగా, నాలుగింటికి అవార్డులు వచ్చాయి!
 
అవన్నీ కూడా 48 గంటల వ్యవధిలో రూపొందించిన సినిమాలే కావడం విశేషం! ప్రస్తుతం శ్రీరామ్ రూపొందించిన ‘ది కాన్‌స్పిరసీ’కి ఒక అంతర్జాతీయ స్థాయి సంస్థ అవార్డు రావడం, అది అమెరికాలో జరిగే ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శనకు అవకాశం దక్కించుకోవడంతో పాటు.. ఇండియన్ జ్యూరీలో కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ప్రదర్శన కోసం కూడా పోటీలో ఉంది. మరి కాన్స్‌కు వీసా గనుక పొందితే శ్రీరామ్ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం ఉంది.
 
షార్ట్‌ఫిలిమ్స్‌తో మంచి గుర్తింపు లభించిన నేపథ్యంలో ఫీచర్ ఫిలిం రంగంలోకి ప్రవేశించి... పూర్తిస్థాయిలో సినీ దర్శకుడు అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు శ్రీరామ్. తను సినిమా రంగానికి సరిపోయే వ్యక్తినేనని నిర్ధారణ  చేసుకొని ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాడు. కథలను సిద్ధం చేసుకొని సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. సరైన సహకారం లభిస్తే మంచి సినిమాలను తీర్చదిద్దగలననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో శ్రీరామ్ విజయవంతం అవుతాడని ఆశిద్దాం.
 
‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ అనే ఈ అంతర్జాతీయ స్థాయి సంస్థ నగరాల వారీగా షార్ట్‌ఫిలిమ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా హైదరాబాద్ యువత నుంచి ఎంట్రీలను కోరింది. ఈ అవకాశాన్ని శ్రీరామ్ సద్వినియోగం చేసుకొన్నాడు. కాంపిటీషన్ అంటే.. ముందస్తు ఏర్పాట్లతో వెళ్లడం కాదు. ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ వాళ్లు చెప్పిన కాన్సెప్ట్‌తో, వాళ్లు చెప్పిన ఒక పాత్రతో, కొన్ని పరిధుల మేరకు మెప్పించాలి! ఈ విషయంలోనే శ్రీరామ్ బృందం విజయవంతమైంది. ఒకే పాత్రతో..అది కూడా నిద్రపోతున్నట్టుగా చూపుతూ ఈ లఘుచిత్రాన్ని రూపొందించారు. బుక్, స్కేటింగ్ బోర్డ్, క్లాక్, గిటార్, స్మార్ట్‌ఫోన్ వంటి వస్తువులతో ఈ సినిమాను రూపొందించి మార్కులు కొట్టేసింది శ్రీరామ్, బృందం. దాదాపు 40 నుంచి 50 షార్ట్ ఫిలిమ్‌లు పోటీ పడగా వాటిల్లో ఇది అత్యుత్తమమైనదిగా నిలిచింది.  ఈ లఘు ప్రయత్నానికి సౌమిత్ లంక (సంగీతం, వాయిస్ ఓవర్), అవినాష్ మట్టా (ఎడిటింగ్), ప్రసాద్ కళ్ళేపల్లి (సినిమాటోగ్రఫీ), ఇంకా దుర్గ, గౌతమ్‌లు  శ్రీరామ్‌కు అండగా నిలిచారు. ఇక, తెరపై కనిపించే ఒకే ఒక్క పాత్రలో అంకుర్ నటించాడు.
 
అవార్డుల పంట

మహీంద్రా కంపెనీ వాళ్లు తమ కారు ఒకదాన్ని మార్కెట్‌లో ప్రవేశపెడుతూ, ఆ కారును ఉపయోగించుకొంటూ లఘు చిత్రాలను రూపొందించాలనే పోటీని నిర్వహించింది. అందులో శ్రీరామ్ దర్శకత్వం వహించిన ‘ద డ్రైవ్’ దేశంలోనే ఉత్తమ 20 షార్ట్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతకన్నా మునుపే ‘రన్ వీ రీల్’ కాంపిటీషన్ కోసం 48 గంటల్లో రూపొందించిన లఘుచిత్రానికి ప్రైజ్ వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు  రూపొందించిన షార్ట్ ఫిలిమ్‌కు కూడా అవార్డు దక్కింది. ఇప్పుడు ద్వితీయ ప్రయత్నంలో ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement