వీవీయస్ లక్ష్మణ్‌లాగే ఆయన భార్య శైలజ కూడా వెరీ వెరీ స్పెషల్.
లక్ష్మణ్ క్రికెట్ క్రీడను సంప్రదాయంగా ఆడితే...
శైలజ పండుగలలోని సంప్రదాయాలను తుచ తప్పకుండా పాటిస్తారు...
పుట్టింట్లో... అత్తవారింట్లో...
రెండు చోట్లా ఒకే సంప్రదాయం... ఒకే ఆచారం...
శ్రావణమాసం వచ్చిందంటే చాలు...
శ్రావణగౌరి నోములు... వరల క్ష్మీ వ్రతం...
ఇల్లంతా కళకళలాడిపోతూ ఉంటుంది...
ఏ పండుగనూ విడిచిపెట్టకుండా...
అత్తగారు, తోటికోడళ్లతో కలిసి సంబరంగా చేసుకుంటారు.
ఈ వరలక్ష్మీ వ్రతం నాడు శైలజ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఎలా జరుగుతోంది...
‘సాక్షి’కి ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు...
మా వివాహం జరిగి పది సంవత్సరాలయ్యింది. పెళ్లయిన మొదటి సంవత్సరం మేం ఇంగ్లండ్ వెళ్లవలసి వచ్చింది. అందువల్ల అక్కడే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఆ తరవాత నుంచి నేను మా అత్తగారు సత్యభామ ఇద్దరం కలిసే చేసుకుంటున్నాం. అత్తగారు డాక్టర్ కావడంతో ఆవిడకు ఎక్కువ సమయం దొరకదు. అందువల్ల ఉదయం మూడు గంటలకల్లా నిద్ర లేచి తొమ్మిదింటికల్లా పూజ పూర్తి చేసేసేవారు. ఆ తరవాతే హాస్పిటల్‌కి వెళ్లేవారు. మాతో మొదటిసారి పూజ చేయించినప్పుడు పూజారిని పిలిచారు. శ్రావణ పట్టీ కింద అమ్మవారి రూపు, పట్టుచీర... అన్నీ ఇచ్చారు. అసలు మాకు చీరలు మా అత్తగారే కొంటారు. తరువాతి సంవత్సరం నుండి ఆవిడ దగ్గరుండి మాకు చెబుతూ చేయించారు. మాకు అనుభవం రావడం కోసం అలా చేశారు. ఇప్పుడు మా అంతట మేమే చేసుకునే అనుభవం సంపాదించుకున్నాం.
ఇద్దరి సంప్రదాయాలు ఒకటే...
నేను వచ్చాకనే మా అత్తగారు పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటున్నారని చాలా మంది అనుకుంటారు. కాని ఆవిడకు ముందు నుంచీ పూజలు చేయడం బాగా అలవాటు. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉండటం వల్ల, నేను వచ్చాక ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం. అంతే! కొన్నిసార్లు పుట్టింటి సంప్రదాయం, అత్తింటి సంప్రదాయం వేర్వేరుగా ఉంటాయి. అయితే మా ఇద్దరి సంప్రదాయాలు ఒకటే కావడం వల్ల ఎవరిది ఎవరు పాటించాలా అనే ఇబ్బందే లేదు మాకు. అంతేకాదు.. మా ఆయన లక్ష్మణ్ గనక ఇంట్లో ఉంటే పూజ చేసేటప్పుడు మాతోటే ఉంటారు.
కలశానికి పూజ చేస్తాం...
ఈ పూజకు కొందరు బొమ్మకు అలంకరిస్తారు. కాని మేం మాత్రం కొబ్బరికాయకు పసుపు పూసి, కుంకుమతో కల్యాణ తిలకం తీర్చి, పైన రవికెల వస్త్రం ఉంచి, అలంకరించిన నారికేళాన్ని... వెండి కలశం మీద ఉంచుతాం. పుట్టింట్లోను, అత్తవారింట్లోనూ ఇదే ఆనవాయితీ.
మంగళగౌరి వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఈ రెండు వ్రతాలూ... పిల్లలు, భర్త బాగుండాలని చేస్తారు. నేను కూడా ఆ నమ్మకంతోనే చేస్తున్నాను. ఆరోజున ప్రత్యేకంగా మొత్తం పన్నెండు రకాల పిండి వంటలు చేస్తాం. బూరెలు, పాయసం, గారెలు, పెరుగు వడలు, బజ్జీలు, ఐదు రకాల చిత్రాన్నాలు, సేమ్యా పాయసం వంటివి చేస్తాం. సాయంత్రం పేరంటానికి అందరినీ పిలిచి వాయనాలు ఇస్తాం. మా అత్తగారికి దగ్గరుండి మరీ అన్నీ సహాయం చేస్తాను. మా తోటికోడలు, అత్తగారు, నేను అందరం కలిసి పూజ చేసుకుంటాం.
కన్నకూతురిలా చూస్తారు...
మా అత్తగారు నన్నూ, మా తోటికోడలినీ ఏనాడూ కోడలిగా చూడలేదు. మా అత్తమామలకు అమ్మాయిలు లేరు. ‘మాకు అమ్మాయిలు లేరు, మీరిద్దరే మా అమ్మాయిలు’ అని మా మామగారు అంటుంటారు. మా అత్తగారిలో ఉండే సర్దుకుపోయే లక్షణం వల్లే మేం ఈ రోజు హాయిగా ఉన్నాం. మా అమ్మగారు ‘తల్లిదండ్రుల్ని కాదు, అత్తమామలను ప్రేమగా చూడటం గొప్ప’ అని చెప్పేవారు. తల్లిదండ్రులను ఎలాగూ ప్రేమగానే చూస్తార., కాని అత్తమామలను అలా చూడాలంటూ, మా దగ్గర నుంచి ప్రమాణం తీసుకున్నారు. అత్తవారింట్లో రెబెల్‌లా ఉండద్దన్నారు. కానీ రెబల్ నేచర్ పోదు కదా! చాలా త్వరగానే నేను నా ప్రవర్తనను మార్చుకున్నాను.
అనుకున్నప్పుడే ప్రారంభించాలి...
భక్తి కావచ్చు, పూజలు కావచ్చు... ఏవైనా సరే చిన్నప్పటి నుంచే ఆచరించాలని భావిస్తాను. ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడే మొదలుపెడతాను. పెద్దవాళ్లమయ్యాక చేయచ్చులే అని వాయిదా వేయకూడదనేది నా అభిప్రాయం. ప్రతిరోజూ పొద్దున్న నిద్ర లేవగానే స్నానం చేసి పూజ చేసేసుకుని, అప్పుడు దినచర్య ప్రారంభిస్తాను. అది కూడా యాంత్రికంగా కాదు, మనస్ఫూర్తిగా చేస్తాను. నాకు ఏదైనా జరిగిపోతుందేమోననే భయంతో కాదు, భగవంతుడి మీద భక్తితో, ప్రేమతో చేస్తాను. మా చిన్నప్పుడు అమ్మ... ఇంట్లో బాగా పూజలు చేసేది. బహుశ నాకు అది వంశపారంపర్యంగా వచ్చిందేమో. ఇక్కడకు వచ్చాక అత్తగారిది కూడా అదే స్వభావం కావడంతో, నేను ఏ ఇబ్బందీ లేకుండా అన్ని పూజలూ చేసుకుంటున్నాను. నిద్ర లేవగానే సూర్యుడికి నమస్కారం చేయమని మా పిల్లలకు నేర్పాను. పెద్దల పట్ల గౌరవంగా ఉండటం మా ఆయన లక్ష్మణ్ దగ్గర నుంచే నేర్చుకున్నారు.
- సంభాషణ: పురాణపండ వైజయంతి
మాకు ఇద్దరు అబ్బాయిలు. కోడళ్లయినా, కూతుళ్లయినా వాళ్లే. కొత్తలో ఏవేవో ఇబ్బందులు రావడం సహజం. అయితే వాటిని పెద్దవి చేసుకోకూడదు. ముందర ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. అప్పుడే గొడవలు లేకుండా సాఫీగా సాగిపోతుంది జీవితం. ఇప్పుడు నేను మా ఇద్దరు కోడళ్లు కలిసే పూజ చేసుకుంటాం. కోడళ్లు అంతా సిద్ధం చేసి ఉంచుతారు.
- డా. సత్యభామ
మా అత్తగారు బాగా సర్దుకుపోయేవారు. మా డెలివరీల టైమ్‌లో ఆవిడే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. పెళ్లయి అత్తవారింట్లో అడుగు పెట్టినప్పుడు మేం చిన్నవాళ్లం కదా. ఆ టైమ్‌లోనే ఏవైనా చిన్నచిన్న తేడాలు వచ్చేవి. నెమ్మదిగా ఆవిడంటే ఏమిటో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిసిపోయాం. పండుగల లాంటివి వస్తే, ఉప్పాడ, కాంచీవరం పట్టుచీరలు తెస్తారు.
- వీవీఎస్ శైలజ
ఈ పూజ వెరీ వెరీ స్పెషల్!
Published Thu, Aug 7 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
Advertisement