
క్యాన్సర్ వ్యాధి రావడానికి ఖచ్చితమైన కారణం ఇదీ అని తెలియదు. ఈ వ్యాధికి గురైనవారిలో చక్కటి ఆరోగ్యవంతమైన జీవనశైలి గడుపుతూ ఉన్నవారూ ఉన్నారు... అలాగే దురలవాట్లకి లోనైనవారూ, వయసుపైబడిన వారూ ఉంటారు. మనం చేయాల్సిందల్లా మంచి జీవనశైలితో పాటు క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడం. వీలైనంతగా క్యాన్సర్‌ను ముందే పసిగట్టగలగడం.
ఇప్పుడు క్యాన్సర్‌ను జయించడం అంత కష్టమేం కాదు. మనోబలం, నిబ్బరం చాలు క్యాన్సర్‌ను జయించడానికి. అలా జయించిన వారు చాలామందే ఉన్నారు. వారి స్ఫూర్తి మనలో నింపుకుంటే ఇప్పుడు క్యాన్సర్‌ను ఓడించడం సులభమే. అలా క్యాన్సర్‌ను జయించిన కొంతమంది ప్రముఖుల గురించి ఈ కథనంలో... ప్రముఖ క్రికెటర్ యువరాజ్‌సింగ్ 2011లో సెమినోమా (ఊపిరితిత్తులు, గుండె మధ్య కణితి)కి గురైనప్పుడు అంత ఆరోగ్యవంతులకూ క్యాన్సర్ వస్తుందా అంటూ అందరూ ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన చికిత్స తీసుకున్నారు. పూర్తిగా కోలుకొని ‘ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్’ అనే పుస్తకం రాశారు. ఇంతకు ముందులాగే అంతే ఆరోగ్యకరమైన రీతిలో, అంతే సామర్థ్యంతో క్రీడాజీవితం గడుపుతున్నారు. ఎందరికో అభిమాన నటిగా పేరుతెచ్చుకున్న మనీషా కోయిరాలా 2012లో ఒవేరియన్ క్యాన్సర్‌కు గురయ్యారు. సర్జరీతో పాటు మిగతా చికిత్స తీసుకొని ఇప్పుడు క్యాన్సర్ మీద అవగాహన కలిగించే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ 16 ఏళ్ల నుంచే రేసుల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. 25 ఏళ్ల వయసులో క్యాన్సర్... మెదడు, ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాల్లోకి పాకడంతో పాటు అడ్వాన్స్‌డ్ దశలో టెస్టిక్యులార్ (వృషణాల) క్యాన్సర్ బయటపడ్డప్పుడు ఆయన బతకడం కష్టం అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పట్టుదలతో, ఆత్మస్థైర్యంతో అన్ని రకాల కాంబినేషన్ చికిత్స తీసుకొని ఆయన ఆ మహమ్మారిపై విజయం సాధించారు. తర్వాత ఆరుసార్లు టూర్ డిఫ్రాన్స్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్నారు. ఒకప్పటి సౌత్‌ఆఫ్రికా దేశాధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి విజేత, భారతరత్న నెల్సన్‌మండేలా పీఎస్‌ఏ పరీక్షతో ముందే ప్రోస్టేట్ క్యాన్సర్‌ను పసిగట్టి రేడియేషన్ థెరపీ తీసుకున్నారు. 1990లో ప్రోస్టేట్‌గ్రంథిని తొలగించుకొని, ఆ క్యాన్సర్ బారినుంచి విముక్తిపొందారు. 95 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో మరణించారు. అంతేగానీ క్యాన్సర్‌తో కాదు. ప్రముఖ నటి గౌతమి, గ్రామీఅవార్డు దక్కించుకున్న పాటల రచయితా, గాయని షెరిల్ క్రౌ, ఇక జీన్‌మ్యూటేషన్ పరీక్షతో రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ముందే పసిగట్టి మాసెక్టమీ చేయించుకున్న హాలివుడ్ నటి ఏంజిలినా జోలీ బ్రెస్ట్‌క్యాన్సర్ మీద విజయం సాధించిన చాలా మందిలో కొందరు మాత్రమే.
ఇలా మనకు తెలిసిన ప్రముఖ విజేతలతో పాటు తెలియనివారెందరో గుండెధైర్యంతో జీవితంలోని అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, క్యాన్సర్‌కు ఎదురొడ్డి నిలిచి, దాన్ని జయించారు. వీరిలో జీన్ మ్యూటేషన్, ఇతర పరీక్షలతో ముందే ప్రమాదాన్ని గుర్తించి క్యాన్సర్ రాకుండా చికిత్స తీసుకున్న వారు కొందరైతే, మరికొందరు శరీరమంతా అది పాకినా, ఇంక ఏ విధమైన ఆశలు లేవని తేలిపోయినా... ఆ స్థితి నుంచి బయటపడి సాధారణ జీవితం గడుపుతున్నవారూ ఉన్నారు. ఇలాంటి విజేతలందరిలో ఉండే లక్షణాలు ఏమిటా అని ఆలోచిస్తే... వారికి క్యాన్సర్ ఉందని తెలిశాక కూడా కుంగిపోకుండా, మనోనిబ్బరంతో దాన్ని ఎదుర్కోవడమే. ముందుగా కొంత ఆందోళనకు గురైనా, తర్వాత వారు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, చికిత్స ఎలా తీసుకోవాలి, ఏయే జాగ్రత్తలు పాటిస్తే మంచిది, ఆహారం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి... లాంటి విషయాలపై అవగాహన పెంపొందించుకొని డాక్టర్ సలహాలు తప్పక పాటిస్తూ, చికిత్స తీసుకుంటూనే తమ తమ రంగాల్లో తమ కృషిని కొనసాగిస్తూ... నటించిన వారూ, ఆటల్లో పాల్గొన్నవారూ, పుస్తకాలు రాసినవారూ ఉన్నారు.
ఏ క్యాన్సర్ అయినా తొలిదశలో గుర్తిస్తే ఆ కణం మీద విజయం సాధించడం తేలికే. పొగాకు ఉత్పత్తులు వాడేవారికి, ఆల్కహాల్ అలవాట్లు, అధికబరువు ఉన్నవారికి ఈ ముప్పు మరింత ఎక్కువ అని అందరూ తెలుసుకుంటే మంచిది. క్యాన్సర్ రిస్క్ అన్నది పర్యావరణ పరిస్థితులు, వారు చేసే వృత్తి, వంశపారంపర్య లక్షణాలు, వారు వాడే ఇతర మందులు, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఇతర అలవాట్లు... ఇలా అనేక విషయాలతో ముడిపడి ఉంటుంది. అయితే మనలో చాలామందికి ఈ సమస్య విషయంలో అవగాహన లేమితో పాటు అపోహలు, అనవసర అనుమానాలు ఎక్కువే అని చెప్పుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్న ఇప్పటి ఆధునిక వైద్యవిధానాలతో ఇతర దీర్ఘకాలిక వ్యాధుల మీద, క్యాన్సర్ మీద పట్టు సాధించగలుగుతున్నాం. అన్ని సందర్భాల్లోనూ
నయం చేయడం సాధ్యం కాకపోతే, కనీసం అదుపులోకి తీసుకురాగలుగుతున్నాం. కీమో మందులలో మరింత కొత్తవి, దుష్ప్రభావాలు తక్కువగా ఉండేవి వస్తున్నాయి. సైడ్‌ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే ఈ కీమో మందుల ధరలు ఇంకా అదుపులోకి రావాల్సి ఉంది. ఇతర శరీర భాగాల మీద చాలా తక్కువ ప్రభావం చూపే రేడియేషన్ థెరపీలు అందుబాటులోకి వచ్చేశాయి. వీఎమ్‌ఏటీ, సైబర్‌నైఫ్ వంటి రేడియో రోబోటిక్ సర్జరీలతో దుష్ఫలితాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇక సర్జరీలు, శరీరభాగాలను తొలగించినప్పుడు చేసే రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీలలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక మనం చేయాల్సిందల్లా... క్యాన్సర్‌ను తొలిదశలో కనుగొనడం, అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించడం, చికిత్స, మందులు సరిగా తీసుకోవడంతో పాటు కౌన్సెలింగ్, గ్రూప్ కౌన్సెలింగ్‌కు హాజరు కావడం, యోగా, ధ్యానం, మంచి వ్యాపకాల వంటివి ప్రాక్టీస్ చేయడం, నలుగురితో ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. ఇలా చేస్తే అన్ని విధాలా మంచిది. క్యాన్సర్ అని తెలియగానే మానసికంగా కుంగిపోయి, డిప్రెషన్‌కు గురయ్యేవారిలో ఎక్కువగా మహిళలే ఉంటున్నారు. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన వ్యాపకాలు పెంపొందించుకొని, మంచి చికిత్స తీసుకుంటే మీరూ క్యాన్సర్‌ను జయించవచ్చు.
Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, Kurnool 08518273001
Comments
Please login to add a commentAdd a comment