
జాబిల్లిని తళతళలాడిద్దామా?
పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అని ఓ సామెతుంది.
ఈ ఐడియా కూడా ఇదే కోవకు చెందుతుందేమో!
ఒకవైపు భూమి మండిపోతోంది..
ఇంకోవైపు అవసరాలు పెరిగిపోతున్నాయి..
మరోవైపు నుంచి వాతావరణ మార్పులు భయపెడుతున్నాయి.
ఈ విపత్తును తట్టుకునేదెలా అని శాస్త్రవేత్తలు తలలు పట్టుకుని ఉంటే...
జాబిల్లిని తళతళలాడించండి. ఈ తలనొప్పులన్నీ తగ్గిపోతాయి అంటోంది...
ఫోరియో ఇన్‌స్టిట్యూట్! అదెలా సాధ్యమనుకుంటూంటే...
మన సహజ ఉపగ్రహం అదేనండి చందమామ సూర్యుడి వెలుగుతోనే మనపై వెన్నెల కురిపిస్తోందన్న విషయం మనకు తెలుసు. అయితే చందమామపై ఉన్న పరిస్థితులు కానివ్వండి... రసాయనిక కూర్పు కానివ్వండి.. చాలా తక్కువ వెలుతురు మాత్రమే భూమిపైకి వస్తోంది. శాస్త్రీయ పరిభాషలో దీన్ని అల్‌బిడో అని పిలుస్తారు. ప్రస్తుతం ఇది కేవలం 0.12 శాతం మాత్రమే ఉంది. ఈ మోతాదును కాస్త పెంచితే ప్రతి రాత్రి వసంత రాత్రి మాదిరిగా పండు వెన్నెలలు కురుస్తాయని.. తద్వారా భూమిపై రాత్రివేళల్లో వీధి దీపాలను కట్టేసుకోవచ్చునని సూచిస్తోంది స్టాక్‌హోం కేంద్రంగా పనిచేస్తున్న ఫోరియో ఇన్‌స్టిట్యూట్!
భూతాపోన్నతిలో దీపాల వాటా 5 శాతం!
పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ వాయువుల విచ్చల విడి వాడకం ద్వారా భూమి వేడెక్కుతోందని, ఫలితంగా భవిష్యత్తులో అనేక విపత్తులు రానున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. భూతాపోన్నతిలో లైటింగ్ వాటా దాదాపు 5 శాతం ఉంటుంది. అత్యాధునిక ఎల్‌ఈడీ లైట్ల వాడకం, సౌర, పవన విద్యుత్తు వినియోగాల ద్వారా దీన్ని తగ్గించేందుకు ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఫోరియో ఇన్‌స్టిట్యూట్ అంచనా ప్రకారం ఇవన్నీ వ్యయ ప్రయాసలతో కూడిన పనులు. వీటికంటే చాలా తక్కువ ఖర్చుతో జాబిల్లినే భూమి మొత్తానికి వీధి దీపంగా వాడుకోవచ్చునని అంటోంది సంస్థ!
ఎలా చేస్తారు?
చందమామ ఉపరితలం ద్వారా మరింత ఎక్కువ సూర్య కాంతి ప్రతిఫలించేలా చేయాలి. రసాయనాల వాడకం ద్వారా, లేదా అక్కడి అగాధాలను చదును చేయడం ద్వారా దీన్ని సాధ్యం చేయవచ్చునంటోంది ఫోరియో ఇన్‌స్టిట్యూట్.
చందమామ మొత్తాన్ని మార్చేయాల్సిన అవసరం కూడా లేదని, కేవలం చంద్రుడి ఉపరితలంలో 0.1 శాతాన్ని మార్చినా (స్విట్జర్లాండ్ దేశమంత విస్తీర్ణం) వెన్నెల వెలుగుల్లో 80 శాతం మేరకు వృద్ధి కనిపిస్తుందని అంటున్నారు వీరు. జాబిల్లిపై ఉండే వనరులను వాడుకుంటూ... సౌరశక్తి ద్వారా ఈ పనిని సాధించవచ్చు నన్నది ఫోరియో అంచనా. ఒక్కసారి ఈ మార్పు చేస్తే... దీర్ఘకాలం పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా వెన్నెల వెలుగులు అందుకోవచ్చునని, పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ జరగదనీ వాదిస్తోంది ఈ సంస్థ. ఈ దిశగా తాము ఇప్పటికే కొన్ని పరిశోధనలు చేపట్టామని, అయితే పేటెంట్ల సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రస్తుతానికి వీటి వివరాలను బహిర్గతపరచడం లేదని ఫోరియో తెలిపింది.
బోలెడు ఆదా...
ఒక్కో వీధి దీపం ద్వారా ఏడాదికి 120 కిలోల కార్బన్ డైయాక్సైడ్ వాయువు వెలువడుతుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీధి దీపాలు పదుల కోట్ల సంఖ్యలో ఉంటాయి. వీటన్నింటి వాడకం ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్‌డైయాక్సైడ్ మోతాదు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. జాబిల్లి వెలుగును ఎక్కువ చేయగలిగితే వీధిదీపాలతో పనే ఉండకపోవచ్చునని, తద్వారా అంతమేరకు పర్యావరణానికి మేలు జరుగు తుందని ఫోరియో అంటోంది. ఒక్క అమెరికా, యూరప్‌ల లోనే వీధి దీపాలపై పెడుతున్న వేల కోట్ల రూపాయల ఖర్చును అరికట్టవచ్చునని సూచిస్తోంది.