
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఫార్మేషన్ (డర్టీ) : మ్యూజిక్ వీడియో
అమెరికన్ సింగర్ బేయాన్స్ విడుదల చేసిన సింగిల్ ట్రాక్.. ‘ఫార్మేషన్ (డర్టీ)’. ఇందులో లయబద్ధంగా నాట్యమాడే బేయాన్స్‌తో పాటు ఆమె కూతురు బ్లూ ఐవీ కార్టన్‌ను కూడా చిన్న సన్నివేశంలో చూడొచ్చు. ప్రకృతి విలయాలు, నేరగ్రస్త మానవ స్వభావాలను థీమ్‌గా తీసుకుని, ‘లేడీస్.. అందరం ఒకటిగా ఫామ్ అవుదాం’ అనే అర్థంలో బేయాన్స్ ఈ పాటను పాడి, చిత్రీకరించారు. ఇందులోని మ్యూజిక్ మన చేత ఆన్ ది స్పాట్ డాన్స్ చేయిస్తుంది.
వరద నీటిలో సగం మునిగిపోయి ఉన్న పోలీసు వాహనంపై బేయాన్స్ పడుకుని ఉండడంతో వీడియో మొదలౌతుంది. ‘మై డాడీ అలబామా.. మామా లూసీయానా.. యు మిక్స్ దట్ నీగ్రో విత్ దట్ క్రెయోల్ మేక్ ఎ టాక్సస్ బామా...’ అని బేయాన్స్ పాడుతున్నప్పుడు ఆ బీట్ ‘వ్రూమ్’ అంటూ వీక్షకుల్ని తనతో పాటు ఈడ్చుకుని వెళుతుంది. తప్పక చూడండి.
బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ : డాన్ ఆఫ్ జస్టిస్
టీజర్ పోస్టర్లు, ట్రైలర్‌లు విడుదల అవుతూ ఊరిస్తున్నాయే కానీ.. ‘డాన్ ఆఫ్ ది జస్టిస్’ చిత్రం విడుదలయ్యే సమయం మాత్రం దగ్గరపడడం లేదు. ఈ ఏడాది మార్చి 25న రిలీజ్ కాబోయే ఈ అమెరికన్ సూపర్ హీరో ఫిల్మ్ కోసం ప్రేక్షకులు ఇంత ఇదిగా ఎదురు చూడడానికి 2013లో వచ్చిన దీని ప్రీక్వెల్ ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ ఒక కారణం అయితే, పోస్టర్లు, టీజర్లలోని ఉత్కంఠ భరిత సన్నివేశాలు ఇంకో కారణం.
రెండు ప్రధాన క్యామిక్ క్యారెక్టర్‌లలో ఒకటైన బ్యాట్‌మ్యాన్ పాత్రను బెన్ ఎఫ్లెక్స్, సూపర్‌మ్యాన్ పాత్రను హెన్రీ కావెల్ పోషిస్తున్నారు. మానవాళిని విపత్తు నుండి కాపాడే ప్రయత్నంలో బ్యాట్‌మ్యాన్‌కీ, సూపర్‌మ్యాన్‌కీ మధ్య జరిగే పోరాటాలు పిల్లల్ని, పెద్దల్ని అలరిస్తాయని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. అద్దాలు బద్దలవడం, తుపాకులు మోతమోగడం, పిడిగుద్దుల ప్రతిధ్వనులు, వీటన్నిటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ తాజా ట్రైలర్‌లోని ప్రత్యేక ఆకర్షణలు.
కపూర్ అండ్ సన్స్ (సిన్స్ 1921) : ట్రైలర్
మరో బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ‘కపూర్ అండ్ సన్స్ (సిన్స్ 1921)’ సినీ ప్రియుల కోసం సిద్ధం అవుతోంది. మార్చి 18న విడుదల అవుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, ఫవాద్ ఖాన్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డెరైక్షన్ షకున్ బాత్రా. నిర్మాత కరణ్ జోహార్. నవ్వులు, కన్నీళ్లు, భావోద్వేగాలతో నడిచే ఈ కథలో కుటుంబ సంబంధాల్లోని సున్నితమైన హాస్యమే ఎక్కువగా ఉన్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు.
చిన్నప్పుడే విడిపోయి ఉంటారు. తొంభై ఏళ్ల తాతగారికి హార్ట్ ఎటాక్ అని తెలిసి తమ చిన్నప్పటి ఇంటికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి అదంతా ఓ ఫ్యామిలీ డ్రామా, కామెడీ డ్రామా. ట్రైలర్‌ను చూస్తూ కూడా మూవీని ఎంజాయ్ చెయ్యొచ్చు!