మనమంటే పట్టనివాళ్లు కూడా మన బట్టల్ని పట్టేస్తారు.
అంటే... మనకు లేని ఫేస్‌వ్యాల్యూ...
మన బట్టలకు ఉంటుందనేగా!
ఆ వ్యాల్యూని కాపాడుకోవాలి.
మన ‘వేర్’ బోర్ కొట్టించకుండా జాగ్రత్తపడాలి.
కానీ ఎంతని జాగ్రత్త పడతాం...
కొత్తవి వెంటవెంటనే పాతవైపోతుంటే?
ఉపాయం ఉంది.
బట్టల్ని తీసుకెళ్లి రంగుల్లో ప‘డై’ండి!
వార్డ్‌రోబ్ తెరిస్తే బోలెడన్ని దుస్తులు హ్యాంగర్లకు వేళ్లాడుతుంటాయి. కాని దేనిని తీసినా వేసుకోబుద్ధి కాదు. అలాగని నెలకోసారి కొత్త దుస్తులు కొనడమూ సాధ్యమయ్యే పని కాదు? మరి ఏం చేయాలి? పాతవాటినే కొత్తగా మార్చేయాలి. వైట్ షర్టుని సెమీ కలర్ షర్టుగా మార్చేయాలి. నీలిరంగు డెనిమ్ షర్టుకి మరో రంగు అద్దేయాలి. అలాగే ప్యాంట్లు కూడ. అదెలాగో చూద్దాం!
డై చేయాలంటే..!
డై చేయడానికి ఒక ట్రే
= ఒక కప్పు
=ఉప్పు
= డై కలర్(మనకు కావాలన్న రంగు)
= గ్లవ్స్ కావాలి.
ట్రేలో డైలాన్ డైయింగ్ కలర్ పౌడర్ వేసి(కొంత పౌడర్‌ని పక్కన ఉంచుకోవాలి) అందులో నాలుగుకప్పుల వేడి నీటిని పోయాలి. ఆ నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్పు కలపాలి. రంగు పౌడర్ నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత ట్రేలో ముప్పావు భాగం నిండేలా నీటిని పోయాలి. దీంతో రంగు పలుచబడుతుంది. ఇప్పుడు టీ షర్టును కింది పావు భాగాన్ని(పై భాగంలో కలర్ రావాలంటే పై భాగాన్ని) రంగులో మునిగేటట్లు చేయాలి. ఈ పనంతా చేతికి గ్లవ్స్ వేసుకుని చేయాలి. రంగు నీటిలో ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత షర్టుని మెల్లగా తీయాలి.
కలర్ లైట్‌గా కావాలంటే రంగు నీటిలో నుంచి తీసిన తర్వాత షర్టుని చన్నీటిలో ముంచి తీసి పిండేయాలి. నీరు కారిపోయే వరకు ఆరేయాలి. కొంత తేమ ఉండగానే ముందుగా తీసి పక్కన ఉంచుకున్న రంగుపొడిని వేళ్లతో తీసుకుని షర్టు మీద పరుచుకునేటట్లు చల్లి (మరింత ఆకర్షణీయంగా ఉండడానికి మాత్రమే ఇలా చేయాలి తప్ప తప్పనిసరి కాదు) పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా చేస్తే రంగు పూర్తిగా పట్టేస్తుంది.
రంగుపొడి షర్టుకి పట్టేయగా మిగిలినది రాలిపోవడానికి వీలుగా షర్టుని మరోసారి నీటిలో ముంచి ఆరేయాలి. డిప్ డై టీ షర్టు రెడీ. రంగు పౌడర్‌ని పైన చల్లకుండా ఉంటే కలర్ అద్దిన మేర సాదాగా ఉంటుంది. పైన పౌడర్ చల్లినట్లయితే రంగురేణువులు అందంగా కనిపిస్తాయి. మరింత అందంగా కనిపించాలంటే డిజైన్ వున్న దుస్తువులకు డై చేయవచ్చు. డై చేసిన తరువాత ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు.
బోర్‌కొట్టేస్తే పడైండి
Published Wed, Nov 6 2013 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement