
పట్టాలెక్కిన పసితనం!
పేదరికం... ప్రపంచాన్ని వణికించే ఎన్నో విషయాల్లో ఈ నాలుగక్షరాల పదం కూడా ఉంది. ఇది ఎన్నో దేశాలను శాసిస్తోంది. ఎన్నో జీవితాలను వేధిస్తోంది. గుప్పెడు మెతుకులు కరువై కడుపును రగిల్చే ఆకలి మంటలు, తల దాచుకోవడానికి చిన్న గూడైనా లేని బతుకులు, ఒంటిని కప్పుకోవడానికి జానెడు గుడ్డ కరువైన జీవితాలు... ఇవన్నీ పేదరికానికి సాక్ష్యాలు!
ప్రముఖ ఫొటోగ్రాఫర్ తుర్జాయ్ చౌదరి కెమెరా కళ్లు ఎప్పుడూ ఈ పేదరికాన్ని చూసి చెమ్మగిల్లుతుంటాయి. ఎక్కడ ఎవరు దీనావస్థలో కనిపించినా చప్పున బంధిస్తాయి. ఈ ఫొటో వాటిలో ఒకటి. బంగ్లాదేశ్‌లోని ఓ మురికివాడలో సంచరిస్తున్నప్పుడు... అనుకోకుండా ఈ దృశ్యం చౌదరి కంటపడింది. అమ్మానాన్నలు కూలిపనికి వెళ్లిపోతే, తన చిట్టి తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత ఈ చిన్నారి తల్లిమీద పడింది. ఆకలితో ఏడుస్తోన్న తమ్ముడికి బువ్వ తినిపించడానికి అమ్మ అవతారమెత్తింది.
ఆడిస్తూ, లాలిస్తూ ఇలా పట్టాల మధ్యకు చేరింది. రైళ్లు వస్తాయన్న భయం లేదు. ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందన్న చింత లేదు. ఎలాగైనా తన తమ్ముడి బుల్లి బొజ్జ నింపాలన్న తపన తప్ప! ఆ తపనను ఒడిసిపట్టాడు చౌదరి. పేదరికం సాక్షిగా పట్టాలెక్కిన బతుకుల్ని ప్రపంచానికి స్పష్టంగా చూపించాడు!