సాగు ఖర్చు తగ్గేదెలా? | To reduce the cost of cultivation methods to teach! | Sakshi
Sakshi News home page

సాగు ఖర్చు తగ్గేదెలా?

Published Wed, Nov 5 2014 11:42 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

సాగు ఖర్చు తగ్గేదెలా? - Sakshi

సాగు ఖర్చు తగ్గేదెలా?

పంట పొలాల్లో మరణ మృదంగం మోగిస్తున్న వ్యవసాయ సంక్షోభాన్ని నిలువరించడం ఎలా? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ప్రశ్నపై దృష్టిని కేంద్రీకరించింది. వ్యవసాయ పరిశోధనల సారాన్ని స్వయంగా సేద్యం చేస్తున్న యువ రైతులకు నేరుగా అందించడానికి వీలుగా శిక్షణ ఇవ్వడం మేలని విశ్వవిద్యాలయం భావించింది. దూరవిద్య ద్వారా తెలుగులో 3 నెలల సర్టిఫికెట్ కోర్సును నిర్వహించాలని, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, కేవీకేలలో వారానికో రోజు కాంటాక్టు క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇంతకీ యువ రైతులకు ఏయే అంశాలపై శిక్షణ అవసరం? 9 జిల్లాల నుంచి 77 మంది యువ రైతులను ఈ నెల 1న హైదరాబాద్‌లోని విస్తరణ విద్యా సంస్థకు పిలిపించి వారి అభిప్రాయాలను సేకరించారు.

అనేక ఇతర అంశాలతోపాటు.. రసాయనిక ఎరువులు, పురుగు, కలుపు మందుల ఖర్చు పెచ్చుమీరిందని.. ఈ ఖర్చులు తగ్గించే సమగ్ర సేంద్రియ/ప్రకృతి సాగు పద్ధతుల్లో శిక్షణనివ్వాలని యువ రైతులు కోరారు. అయితే, వర్మీ కంపోస్టు, జీవన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం తప్ప.. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంపై ఇప్పటి వరకు సమగ్ర పరిశోధనా విభాగాన్నే తెరవని మన విశ్వవిద్యాలయం(తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఈ విషయంలో ఎంతో ముందున్నాయి).. ఇక యువ రైతులకెలా నేర్పిస్తుందో వేచి చూడాల్సిందే.

ఇప్పటికే ఈ పద్ధతులను ఏళ్ల నాటి నుంచి అవలంబిస్తూ అనేక పంటల్లో సత్ఫలితాలు సాధిస్తున్న చిన్న, పెద్ద రైతులతోపాటు విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్తలు/ అధికారులూ లేకపోలేదు. వీరి తోడ్పాటుతో యువ రైతులకు నిక్షేపంగా శిక్షణ ఇవ్వొచ్చు. అయితే  విశ్వవిద్యాలయ నిబంధనలు అందుకు ఒప్పుకుంటాయా?  ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు పాటించకుండా ఖర్చు తగ్గేదెలా? రైతుల అభిలాష నెరవేరేదెలా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి!
 
ఖర్చు తగ్గే సాగు పద్ధతులు నేర్పాలి!
రెండెకరాల్లో పత్తి, ఎకరన్నరలో వరి, ఎకరంలో టమాటా పండిస్తున్నం. వ్యవసాయం ఖర్చు బాగా పెరిగిపోయింది. గిట్టుబాటు కావటం లేదు. శిక్షణ ద్వారా కూలీల ఖర్చు తగ్గించుకునే సాగు పద్ధతులను నేర్చుకోవాలనుకుంటున్న. డీఏపీ బస్తా రూ. 1,200కు పెరిగిపోయింది. కూలి రూ. 200 దాటింది. సేంద్రియ ఎరువులను రైతులు ఎవరికివారు సొంతంగా తయారు చేసుకోవడంపై శిక్షణ ఇవ్వాలి.
- మద్ది శ్రావణి(93924 84542), యువ మహిళా రైతు, మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా
 
రైతు కొడుకును రైతుగా నిలబెట్టే శిక్షణ కావాలి
ఎరువులు, పురుగుమందులు, కలుపుమందుల మోతాదుపై రైతుల్లో అవగాహన లేదు. వీటిని విచక్షణారహితంగా వాడేస్తున్నందున ఖర్చు పెరుగుతోంది. డిగ్రీ చదివిన నా వంటి రైతులు కూడా పక్క వాళ్లను చూసి ఎక్కువగా వాడేయాల్సి వస్తోంది. వీటిపై పూర్తి అవగాహన కలిగించేలా శిక్షణ ఇవ్వాలి. అన్ని పంటల్లో పూర్తిస్థాయిలో సొంత విత్తనం తయారుచేసుకోవడం, మాక్ సొసైటీల ఏర్పాటుపై అవగాహన కలిగించాలి. రైతుల కోసం ప్రత్యేక తెలుగు టీవీ ఛానల్ ప్రారంభించాలి. సెల్ ద్వారా పంట ఫొటోలు పంపితే శాస్త్రవేత్తలు సూచనలు ఇవ్వాలి. రైతు కొడుకును రైతుగా నిలబెట్టే భరోసా ఇచ్చేలా శిక్షణ సమగ్రంగా ఉండాలి.
 - రాకం దేవేందర్(97015 59376), లింగయ్యగిరి, చెన్నారావుపేట మండలం, వరంగల్ జిల్లా
 
అధికాదాయాన్నిచ్చే పంటలపైనే ఆసక్తి!
తాతలు తండ్రుల నాటి నుంచి సాగు చేస్తున్న వరి, పత్తి వంటి సంప్రదాయక పంటల సాగుపై చిన్న కమతాలున్న యువ రైతులకు బొత్తిగా ఆసక్తి లేదు. ధనిక రైతులకే పరిమితమైన అధికాదాయాన్నిచ్చే పంటలపై వీరికి ఆసక్తి ఉంది. పూలు, పండ్ల తోటల సాగు, చేపల పెంపకం, పాడి పెంపకంలో ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. అధికాదాయాన్నిచ్చే పంటలకు పెట్టుబడి ఎక్కువ అవసరమైనప్పటికీ.. అయినావాళ్లు నలుగురూ కలిసి సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సబ్సిడీలకన్నా సమాచారం, శిక్షణ ఇవ్వడం అవసరం. చిన్న రైతులకు వ్యవసాయ సూచనలు, సలహాలు అందటం లేదు.
- పొడిచేటి సురేందర్, నకిరేకల్(90303 69300), నల్లగొండ జిల్లా
 
సేంద్రియ సాగుపై ఊరూరా ప్రదర్శన క్షేత్రాలు పెట్టాలి
18 ఎకరాల్లో పత్తి, వరి, కంది పండిస్తున్నా. పాలిహౌస్‌లతో పెద్ద రైతులకే ఉపయోగం. చిన్న రైతులందరికీ ఉపయోగపడే సేంద్రియ సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. తక్కువ ఖర్చుతో సేంద్రియ వ్యవసాయం చేయడంపై ప్రతి గ్రామంలో రెండెకరాల్లో ప్రదర్శన క్షేత్రాలను విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. అనుభవజ్ఞులైన ప్రకృతి వ్యవసాయదారులు, సేంద్రియ రైతులతో శిక్షణ ఇప్పించడం అవసరం.

అన్ని పంటల విత్తనాలు తయారు చేసుకోవడం.. స్ప్రేయర్లు, చిన్న యంత్రపరికరాలు, మోటార్ల మరమ్మతులు చేయడం.. 50-100 కోళ్లు పెంచుకోవడం, పశువ్యాధులకు చికిత్స చేయడం.. ప్రతి ఊళ్లో కొందరు యువ రైతులకు శిక్షణ ఇప్పించాలి. సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, వాటి ద్వారా లబ్ధిపొందడంపై శిక్షణ ఇవ్వాలి. ఆవులు, గేదెలను 50% సబ్సిడీ మీద ఇవ్వాలి.
 - పల్లె రమాదేవి (90003 02289), మహిళా రైతు, ఎత్‌బార్‌పల్లె, రంగారెడ్డి జిల్లా
 
యువ రైతులకు గోఆధారిత సాగు నేర్పించాలి
అనేక దేశవాళీ వరి వంగడాలు, కూరగాయలను సాగు చేస్తున్నా. 4 ఏళ్ల నుంచి గోఆధారిత వ్యవసాయం చేస్తున్నా. ప్రతి రైతుకూ ఆవులుండాలి. పాడి-పంట ఉంటేనే రైతుకు లాభం. పశువుల ఎరువు కొనుక్కొని వేస్తే రైతుకు మిగిలేదేమీ ఉండదు. గోమూత్రం, వేపనూనె పిచికారీ చేస్తున్నాను. గోమూత్రం పిచికారీ వల్ల వైరస్ తెగుళ్లు రావడం లేదు. ఖర్చు బాగా తగ్గింది. దిగుబడి బాగుంది. యువ రైతులకు ఈ పద్ధతులను నేర్పిస్తే.. వ్యవసాయంలో నిలబడగలుగుతారు. పత్తి, సోయా వంటి వాణిజ్య పంటలతోపాటే అంతరపంటలుగా చిరుధాన్యాలు, కూరగాయలు పండించుకుంటే చిన్న రైతులకు తిండి కరువుండదు. ఈ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి.  
 - ఎన్. మన్మోహన్‌రెడ్డి (85001 47354), చించోలిబీ, సారంగపూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా
 
దిగుబడి తగ్గి.. తెగుళ్లు పెరుగుతున్నాయి!
మా గ్రామాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం పదేళ్ల క్రితమే దత్తత తీసుకుంది. అన్ని పొలాల్లోనూ డ్రిప్ ఏర్పాటు చేసుకొని కూరగాయలే పండిస్తున్నాం. ఎకరానికి 7 టన్నులు కోళ్ల పెంట, డీఏపీ తదితర ఎరువులు వేస్తున్నాం. ప్రతి సంవత్సరం దిగుబడి తగ్గుతోంది. తెగుళ్లు పెరుగుతున్నాయి. క్యాబేజీ 2010 వరకు ఎకరానికి 20 టన్నులు పండేది. ఇప్పుడు 5-6 టన్నులకు తగ్గింది. ఎండుతెగులుకు శాస్త్రవేత్తలూ పరిష్కారం చూపలేకపోతున్నారు. క్యారెట్ మొక్కలు 4 ఆకులు వేసిన తర్వాత పడిపోయి చనిపోతున్నాయి.

టమాటా సాగులో మల్లి సమస్యకు పరిష్కారం లేదు. స్థానిక అధికారులకు ఈ సమస్యలపై అవగాహన శూన్యం. సమస్య ఇదీ అని చెప్పినా రోజులు గడుస్తున్నా పరిష్కారం ఏమిటో చెప్పే నాథుడే లేడు. ఫోన్ ద్వారా ఫొటో పంపితే ఒకటి, రెండు రోజుల్లో పరిష్కారం చూపే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంతకన్నా ఆలస్యమైతే పంట చేయిదాటిపోతుంది. పురుగుమందుల కంపెనీల శాస్త్రవేత్తలు తరచూ పొలాల్లోకి వస్తూనే ఉంటారు.

తమ కంపెనీ ఉత్పత్తులనే వాడాలని ఎవరికి వారు ఊదరగొడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. యాంత్రీకరణలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. కర్ణాటకలో క్యారెట్ సీడ్ వేయడం, దుంపలు పీకడం, కడగడం వంటి పనులన్నీ యంత్రాలతోనే చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. అటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తేవాలి. ఖర్చు, తెగుళ్లు తగ్గి దిగుబడి పెరిగే సాగు పద్ధతులపై శిక్షణ కావాలి.
 - యువ రైతులు దేవేందర్‌రెడ్డి, శంకర్, సుఖేష్‌రెడ్డి, దీపక్‌రెడ్డి(98669 66162) చనువల్లి, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా
 
 - సేకరణ: పంతంగి రాంబాబు, ఫొటోలు: మోహన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement