తెలుగునేల మీద పదుల సంఖ్యలో అంబేడ్కర్‌కు అక్షరహారతి పట్టారు. మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యంలో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకు దక్కుతుంది. బోయి భీమన్న ‘జయ జయ జయ అంబేడ్కర’ దళితుల జాతీయగీతంగా ప్రసిద్ధి.
డా. శిఖామణి
నవ భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల హక్కుల ప్రదాత, భారతదేశ ప్రథమ న్యాయశాఖామాత్యులు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ దేశంలోని అనేక రాష్ట్రాలను ప్రభావితం చేసినట్టుగానే ఆంధ్రదేశాన్నీ ప్రభావితం చేశారు. నందనార్ హరిశ్చంద్రుడి పట్టువదలని పూనికతో అంబేడ్కర్ 1942 సెప్టెంబర్ 28న అనకాపల్లిలో అడుగుపెట్టారు. అప్పటి దళిత నాయకులు ఈలి వాడపల్లి, పాము రామ్మూర్తి, కుసుమ ధర్మన్న, బొజ్జా అప్పలస్వామి వంటి వారు ఆ పర్యటనలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌ను కనులారా చూసిన ఆ ప్రజలు అదృష్టవంతులు!
అయితే, అంబేడ్కర్ మరణించిన దశాబ్దాలకు గానీ ఆయన జీవితం, రచనలు చదివే అవకాశం తెలుగు దళితులకు దక్కలేదు. 1968లో మొదటిసారి యెండ్లూరి చిన్నయ్య రాసిన డా॥అంబేడ్కర్ జీవిత చరిత్ర దళితులకు ఆరాధ్య గ్రంథం అయింది. ఆ కాలంలోనే అంబేడ్కర్ ‘ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ గ్రంథానికి యెండ్లూరి చిన్నయ్య, బోయి భీమన్నల అనువాదాలు వచ్చాయి. ఆ తర్వాత అంబేడ్కర్ జీవిత చరిత్రను గ్రంథస్తం చేసిన వారిలో బి.విజయభారతి, అమూల్యశ్రీ, పి.అబ్బాయి, ఉదయకీర్తి వంటి వారున్నారు. తెలుగునాట మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యంలో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకే దక్కుతుంది. 1947లో వెలువరించిన ఆయన కావ్యం గబ్బిలంలో ‘జంబేడ్కరుండు సహోదరుండు’ అనే పద్యంలో గబ్బిలాన్ని అంబేడ్కర్ దీవెనలు అందుకోమంటారు. అప్పటి నుండి తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్ శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు. పద్యకావ్యాలు, శతకాలు, గేయాలు, వచన కవితలు, నాటకాలు, బుర్రకథలు, హరికథలు ఒకటేమిటి అన్ని ప్రక్రియల్లోనూ అంబేడ్కర్ ఆవిష్కరించబడ్డాడు.
బోయి భీమన్న ‘నమస్సుల్, డాక్టరంబేడ్కరా!’ మకుటంతో రాసిన అంబేడ్కర్ సుప్రభాతం, రాపాక ఏకాంబరం ‘అంబేడ్కరో! సమరసింహా!’, చోడగిరి చంద్రరావు ‘భీమరాయ శతకం’, ముఖ్యంగా దళిత ఉపాధ్యాయ వర్గాల నుండి వచ్చిన కవులు మల్లవరపు జాను, మల్లవరపు వెంకటరావు, బుంగా ఆడమ్‌బాబు, రాచమల్లు దేవయ్య, తోటకూర జార్జి, పలిమెల సుదర్శనరావు, గుర్రం ధర్మోజి, నక్కా అమ్మయ్య వంటి వారు అంబేడ్కర్‌కు పద్య నీరాజనాలు పలికారు.
ఇక గేయ సాహిత్యంలో భీమన్న రాసిన ‘‘జయ జయ జయ అంబేడ్కర’’ దళితుల జాతీయగీతంగా ప్రసిద్ధికెక్కింది. చోడగిరి చంద్రరావు ‘‘డాక్టరో నీ నాయకత్వము లోకమంతయు మేలికొలిపెను’’ ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించింది. అరుణ్ శౌరి, రంగనాయకమ్మ అంబేడ్కర్‌పై విషం చిమ్మడానికి ప్రయత్నించినపుడు దళిత సాహిత్యం నిప్పుల నాలుకలతో భగ్గున పైకి లేచింది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ ‘‘అంబేడ్కర్ ఎక్కడని లెక్కదీసి అడుగుతావా/ దిక్కులేని గుండెల్లో దీపమై వెలుగుతుండు’’ అని అంబేడ్కర్ స్థానాన్ని గుర్తు చేశాడు. వాగ్గేయకారుడు గోరటి వెంకన్న ‘‘వైతాళికా! ఈ యుగము నీదిరా’’ అని వైతాళిక గీతాన్ని ఆలాపిస్తే, మట్టి బిడ్డ జయరాజు ‘‘మా బల్లో టీచర్ అంబేడ్కర్/ మా బతుకు ఫ్యూచర్ అంబేడ్కర్’’ అని తమ బతుకు ఆశగా వర్ణిస్తాడు. మాష్టార్జీ, పావన ప్రసాద్, శ్రమశ్రీ, భీమసేన, రాంచందర్, శుక్తి, భీమసేన, లెల్లె సురేశ్, సవేరా వంటి కవులు పదుల సంఖ్యలో అంబేడ్కర్‌కు గేయ హారతి పట్టరు.
నగేష్‌బాబు, ఖాజా సంపాదకత్వంలో వెలువడిన ‘విడి ఆకాశం’ కవితా సంకలనానికి ‘అంబేడ్కరిస్టు ప్రేమ కవిత్వం’ అని పేరు పెట్టారు. ‘‘అతడు పాలబువ్వ, అతడు నిప్పురవ్వ’’ అని అంబేడ్కర్ ఏమిటో గోరుముద్దల ద్వారా తెలియజేస్తాడు ఎండ్లూరి సుధాకర్. ‘‘మహాత్ములూ వద్దు/ మావోలూ వద్దు/ అంబేద్కరయ్యే మాకు ముద్దు’’ అంటాడు నేతల ప్రతాప్ కుమార్. వంగపండు ప్రసాదరావు, కలేకూరి ప్రసాద్, గూటం స్వామి, తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, జి.వి. రత్నాకర్, బన్న అయిలయ్య, పైడి తెరేష్‌బాబు, విరియాల లక్ష్మీపతి, కత్తి పద్మారావు, ‘సత్య’మూర్తియైన శివసాగర్, సౌదా అరుణ, పాటిబండ్ల ఆనందరావు ‘నిలువెత్తు ఆత్మగౌరవంలా/ నిలబడ్డ బాబాసాహెచ్’ మూర్తిమత్వాన్ని దర్శింపచేశారు. జై భీమ్!
(వ్యాసకర్త ప్రముఖ కవి, ఫోన్: 9848202526)
జయ జయ అంబేడ్కరా!
Published Tue, Apr 14 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM
Advertisement