అంబేడ్కర్ ఎవ్వరికి చెందినా, చెందకపోయినా కాంగ్రెస్‌కు గాని ఆ మాటకు వస్తే బీజేపీకి, దాని మతతత్వ శక్తులకు ఏ కోణం నుండి చూసినా ఆయన చెందడు.
ప్రొ. హరగోపాల్
బాబాసాహెబ్ అంబేడ్కర్, ఆయన ఆలోచనా విధానం సమకాలీన భారతదేశంలో ఒక కీలకమైన దశలో ఉంది. ఆయన ఎవరికి చెందినవాడు అనే కాక ఆయన ఆలోచనా విధానానికి నిజమైన వారసులు ఎవరు అనే చర్చ కూడా జరుగుతున్నది. అంబేడ్కర్ జన్మదినాన్ని జరపడానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పోటాపోటీ పడుతున్నాయి. ఇది గమనించిన ఎవరికైనా లేదా కొంచెం చరిత్ర తెలిసిన వారికి తప్పక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంబేడ్కర్ స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీని, దానికంటె మించి గాంధీజీని వాళ్ళ రాజకీయాలను వ్యతిరేకించాడు. ఇది వ్యక్తిగత వ్యతిరేకం కాదు, ఒక సైద్ధాంతిక భూమిక మీద ఏర్పడ్డ భావ సంఘర్షణ.
ప్రధానంగా దళిత ఉద్యమాలకు వస్తే, ఇది చాలా సున్నిత అంశంగా మారింది. ఎలాంటి చర్చ జరిగినా వివాదాస్పదమవుతున్నది. ఒక కోణం నుంచి డాక్టర్ అంబేడ్కర్ కచ్చితంగా దళిత పోరాటాలకు చెందినవాడే. దళిత వర్గాలకు ఆయన మీద, ఆయన భావజాలం మీద న్యాయమైన క్లెయిమ్ ఉంది. అయితే అంబేడ్కరిజం దళిత వర్గాలకు మాత్రమే పరిమితమా, ఆయన కేవలం దళితుల గురించే మథనపడ్డారా అని ఆలోచిస్తే, అంబేడ్కర్‌కు మహిళల పట్ల కూడా అంతే ప్రజాస్వామ్యమైన మానవీయమైన భావాలుండేవి. ఉన్నత కులాల మహిళల గురించి ముఖ్యంగా బ్రాహ్మణ మహిళల గురించి, వాళ్ళ విధవత్వాన్ని గురించి చాలా మథనపడ్డాడు.
ప్రతినెలా మహిళలను బహిష్ఠులైనప్పుడు మూడు రోజులు ఇంటి బయట పెట్టడాన్ని అంటరానితనంతో పోల్చాడు. బౌద్ధానికి మహిళల పట్ల చిన్నచూపు అనే ఒక అంశాన్ని గురించి చాలా పరిశోధన చేసి, బుద్ధుడికి మహిళల పట్ల ఉండే గౌరవాన్ని సోదాహరణంగా విశ్లేషించాడు. అలాగే మొత్తం కులవ్యవస్థ నిర్మూలన జరగాలి, దానిని కూకటివేళ్ళతో కూల్చాలని తన (అజీజిజ్చ్టీజీౌ ౌజ ్టజ్ఛి ఛ్చిట్ట్ఛ) కుల నిర్మూలన వ్యాసంలో ప్రతిపాదించాడు. అంటే కులాన్ని వ్యతిరేకించిన ప్రతి వ్యక్తికి, సమూహానికి అంబేడ్కర్ మీద క్లెయిమ్ ఉంటుంది.
అంబేడ్కర్ ఎవ్వరికి చెందినా, చెందకపోయినా కాంగ్రెస్‌కు గాని ఆ మాటకు వస్తే బీజేపీ, దాని మతతత్వ శక్తులకు ఏ కోణం నుండి చూసినా ఆయన చెందడు. నిజానికి అంబేడ్కర్ దళిత ఉద్యమాలకి, మహిళా ఉద్యమాలకి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగే ఏ ఉద్యమానికైనా చెందినవాడే. అలాగే కులరహిత వర్గరహిత ప్రత్యామ్నాయ సమాజం కొరకు త్యాగాలు చేస్తూ పోరాడే విప్లవ శక్తులకు కూడా ఆయన ఆత్మబంధువే!
(వ్యాసకర్త పౌర హక్కుల నేత, ఫోన్: 9989021741)
డా. అంబేడ్కర్ ఎవరికి చెందినవాడు?
Published Tue, Apr 14 2015 12:35 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement