అమరశిల్పి అంబేడ్కర్
అంబేడ్కర్ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికి వచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, రాజ్యాంగంలో పొందుపరిచారు.
కత్తి పద్మారావు
అంబేడ్కర్ జీవితంలోని లోతు తాత్త్వికమైంది. భారతదేశాన్ని మనం పునర్నిర్మించాలనుకున్నప్పుడు తప్పకుండా ఆయన రచనలను భారతీయ పునరుజ్జీవనానికి సమన్వయం చేసుకోక తప్పదు. భారత రాజ్యాంగంలో పొందుపర్చబడిన ఆర్థిక, సామాజిక సమత అట్టడుగు ప్రజలకు ప్రవహించాలంటే ఆయన అందించిన సిద్ధాంతాల ప్రమాణాలలోని తత్త్వాన్ని అందుకోవలసిన అవసరం ఉంది.
భారత రాజ్యాంగ శిల్పంలో ఆయన అద్వితీయ పాత్రను వహించాడు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలోకి పెద్దది. చాలామంది భారత రాజ్యాంగాన్ని ఉపరితలం నుంచే చూసి ఇది విస్తృతమైనదనే అనుకుంటారు కాని, నిజానికి ఇది లోతైనది. ఈ లోతు అంబేడ్కర్ అధ్యయనం నుండే వచ్చింది. అంబేడ్కర్ ఆర్థిక, తాత్త్విక అధ్యయనం భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దింది.
అస్పృశ్యత మూలాల నిర్మూలన
మనుస్మృతిలో కొన్ని వర్ణాలవారిని చూడటమే నిషేధించబడింది! మనిషిని మనిషిగా చూడటమే నేరమనే ఈ అమానవ నిషేధాలను అంబేడ్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 17తో తిప్పికొట్టారు. ఆయనలోని మహోన్నత సామాజిక, విప్లవ శక్తంతా ఆ ఆర్టికల్ నిర్మాణంలోనే వుంది. దీనికి బౌద్ధ సాహిత్య అధ్యయనం ఆయనకు ఎంతగానో తోడ్పడింది. బౌద్ధాన్ని ఆయన వాఙ్మయంగానే కాక, తత్త్వశాస్త్రంగా, సామాజిక జ్ఞానశాస్త్రంగా అధ్యయనం చేశారు. మనిషికి మనిషికి అడ్డువస్తున్న అన్ని సామాజిక అంతరాలను బౌద్ధం కూల్చివేసింది. ఆ క్రమాన్ని ఆయన అధ్యయనం చేశారు. ఒక మనిషి మరొక మనిషిని చూస్తే నేరం, తాకితే నేరం అనే దశ నుంచి ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించే సూత్రాలను ఆయన అవగాహన చేసుకున్నారు.
అస్పృశ్యతను నివారించడం నుంచి మానవ సమాజాన్ని సమైక్యం చేశారు. విధానాలను రూపొందించారు. మనిషి పుట్టుకతోనే ఇతరులను అవమానించడమనే నేరస్థుడుగా జీవిస్తున్నాడని గుర్తుచేశారు. మనిషి అగ్రవర్ణుడుగా తన చుట్టూ అల్లుకుని ఉన్న ఆచార సూత్రాలన్నీ రాజ్యాంగం ప్రకారం నేరానికి దారితీస్తాయి. నేరమంటే ఏమిటి? ఇతరులను నిందించటం, అవమానించటం, అపహాస్యం చేయటం, అణచివేయటం. మరి ఈ నేరాలు ఎవరు చేస్తున్నారు? రాజ్యం చేస్తుంది. వ్యక్తులు చేస్తున్నారు. సమాజమూ చేస్తుంది. ఈ మూడింటిని ఈ ఆర్టికల్ నిరోధిస్తుంది.
రాజ్యాంగంపై అంబేడ్కర్ జీవిత ప్రభావం
అంబేడ్కర్ జీవితాంతం అవిశ్రాంతంగా అధ్యయనం చేశాడు. ఆయన చదువును గురించి ధనుంజయ్ కీర్ ఇలా రాశారు. ‘‘అంబేడ్కర్ ఉదయం చదువుతుండేవాడు. మధ్యాహ్నం, రాత్రి చదువుతుండేవాడు. రాత్రి గడిచి ఉదయమైనా చదువుతుండేవాడు. ప్రక్కనున్న ఇళ్లల్లో ఉదయాన్నే శబ్దాలు మొదలయ్యేవి. అప్పటికి కూడా ఆయన పుస్తకం చదువుతూ ఉండేవాడు. బాబా సాహెబ్ గంటల గణగణల మధ్య, బండ్ల గడగడ శబ్దాల మధ్య, పనిముట్ల దబదబ శబ్దాలమధ్య, మోటార్ల బరబర శబ్దాల మధ్య కూడా తనపనిలో తాను నిమగ్నమై ఉండేవాడు.
బాబాసాహెబ్ అంతిమ కోరిక ఏమంటే అడవిలో లేక ప్రశాంతవనంలో ఏర్పాటు చేయబడిన ఒక గ్రంథాలయంలో కూర్చొని యుగాల మహాసిద్ధాంత కారులతో, మహోపాధ్యాయులతో సంభాషించాలని. జ్ఞానజ్యోతిని కనుగొనే క్రమంలో అనంత రహస్యాలని వెతుక్కుంటూ సాగుతున్న ఆయన ఆలోచనల్ని ఎవరు ఊహించగలరు? ఆయన విద్యాదాహం అంతులేనిది. చదువుతోపాటు ఆయన కూడా పెరిగాడు. ఆయన జ్ఞానం ఆ నింగి సాక్షిగా దిగంతాలకు పాకింది.’’
అంబేడ్కర్ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికివచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆయనలోని గొప్పతనం ఆయన గొప్ప దేశభక్తుడు కావటమే. సాత్వికునిగా, సామరస్యునిగా ఆయన జీవించాడు. ప్రజలు అలా జీవించాలని కోరుకున్నాడు. భారతీయులందరూ జ్ఞానులుగా రూపొందాలనేది ఆయన ఆకాంక్ష. అందుకు కావలసిన పునాదుల్ని భారత రాజ్యాంగంలో రూపొందించాడు. శిల్పిని వేరుచేసి శిల్పాన్ని చూడలేము. కవిని వేరు చేసి కవిత్వాన్ని పఠించలేము. భారత రాజ్యాంగం అర్థం కావాలంటే అంబేడ్కర్‌ని, అంబేడ్కర్ రచనల్ని ప్రతి భారతీయుడు చదవాలి.
(వ్యాసకర్త దళితకవి, సామాజిక కార్యకర్త, ఫోన్: 9849741695)
డా॥బి.ఆర్.అంబేడ్కర్ జీవిత సంక్షిప్తం (1891-1956)
* 14 ఏప్రిల్ 1891 - భీమ్‌రావ్ రాంజీ అంబేడ్కర్ జన్మించారు.
* 1896 - ప్రాథమిక విద్య ప్రారంభం.
* 1907 - ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షల్లో ఉత్తీర్ణత.
* 1908 - రామ్‌బాయ్‌తో పెళ్లి.
* 1912 - ఎలిఫిన్ స్టన్ కాలేజీలో చదువులు, బీఏ పరీక్షల్లో ఉత్తీర్ణత.
* మే 30 నుండి జూన్ 1 వరకు 1920 - డిప్రెస్డ్ క్లాసెస్ ప్రథమ అఖిల భారత మహాసభ. కొల్హాపూర్ సాహు మహారాజ్ అధ్యక్షత. అంబేడ్కర్ కీలకపాత్ర.
* సెప్టెంబర్ 1920 - చదువులు కొనసాగించడానికి తిరిగి విదేశాల ప్రయాణం.
* 1922 - గ్రేన్ ఇన్ బార్‌ఎట్‌లాకు ఆహ్వానం.
* 20 మార్చి 1927 - మహద్‌లో చాదార్ చెరువు వద్ద సత్యాగ్రహం ప్రారంభం.
* 4 సెప్టెంబర్ 1927 - సమాజ్ సమతా సంఘ్ స్థాపన.
* 25 డిసెంబర్ 1927 - మహద్‌లో మనుస్మృతి దహనం.
* 14 జూన్ 1928 - ముంబాయిలో డిప్రెస్డ్ క్లాసెస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపన.
* 2 మార్చి 1930 - నాసిక్‌లో కాలారామ్‌దేవాలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభం. ఐదేళ్లు ఆగుతూ, లేస్తూ కొనసాగింపు.
* 8-9 ఆగస్ట్ 1930 - స్వీయ అధ్యక్షతన నాగపూర్‌లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ప్రథమ మహాసభలో చారిత్రాత్మక నాగపూర్ ఉపన్యాసం.
* 12 నవంబర్ 1930 నుండి 19 జనవరి 1931 వరకు - మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలలో పాల్గొనటం.
* 1931 నుండి 1932 వరకు - రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొనటం.
* 27 మే 1935 - రామ్‌బాయ్ మరణం.
* 1936 - ‘కులనిర్మూలన’ రచన
* 18-20 జూలై 1942 - నాగపూర్‌లో ‘షెడ్యూల్డ్ క్యాస్ట్‌ఫెడరేషన్’ స్థాపన.
* 27 జూలై 1942 - వైస్రాయి కౌన్సిల్‌లో కార్మికశాఖ సభ్యుడు (మంత్రి) (జూలై 1946 వరకు).
* 8 జూలై 1945 - బొంబాయిలో ‘ఫౌండేషన్ ఆఫ్ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ స్థాపన.
* 19 జూలై 1946 - బెంగాల్ నుండి భారత రాజ్యాంగ సభకు ఎన్నిక.
* 3 ఆగస్ట్ 1947 - లా మినిస్టర్‌గా నియామకం.
* 19 ఆగస్ట్ 1947 - భారత రాజ్యాంగ రచన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్‌గా నియామకం.
* 1948 - ‘అస్పృశ్యులెవరు?’ రచన.
* 15 ఏప్రిల్ 1948 - ఢిల్లీలో డా॥శారద కబీర్‌తో (సవిత అంబేడ్కర్) వివాహం.
* 25 మే 1950 - బౌద్ధాన్ని పరిశీలించేందుకు కొలంబో పర్యటన.
* 26 నవంబర్ 1950 - భారత రాజ్యాంగం ఆమోదం.
* మార్చి 1952 - ముంబాయి శాసనసభ నుండి రాజ్యసభకు ఎన్నిక.
* 5 జూన్ 1952 - కొలంబియా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లా డిగ్రీ ప్రదానం.
* డిసెంబర్ 1954 - రంగూన్‌లో జరిగిన ప్రపంచ బుద్ధిస్ట్ మహాసభలో పాల్గొనడం.
* మే 1955 - బుద్ధ మహాసభ స్థాపన.
* 15-16 అక్టోబర్ 1956 - ఖాట్మండ్‌లో జరిగిన ప్రపంచ బుద్ధిస్ట్ మహాసభలో పాల్గొనడం.
* 6 డిసెంబర్ 1956 - ఢిల్లీలో మరణం.
* 1957 - ‘బుద్ధ - ధమ్మ’ మరణానంతర ప్రచురణ (వలీరియన్ రోడ్రిగ్స్ ‘అంబేడ్కర్’ సంకలనం నుండి).