India Constitution
-
ఆ మూలసూత్రాలను అందుకుంటేనే...
భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన మన నాయకులకు ఉంటే అంబేడ్కర్ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. నిజానికి దేశాన్ని రక్షించాల్సిన వారు దేశంలో నేడు మత వైరుద్ధ్యాలు పెంచడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మత సామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, ఇప్పటి నాయకులు మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 13న జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలు పోటెత్తి ఓటెయ్యడం ఒక సామాజిక, సాంస్కృతిక పరిణామం. మహిళకు రాజకీయ అస్తిత్వం పెరిగింది అనడానికి ఇది ఒక నిదర్శనం. మహిళలు ఎక్కడ చైతన్యవంతం అవుతారో అక్కడ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాలు త్వరితం అవుతాయని అంబేడ్కర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 81.86 శాతం ఓట్లు పోయ్యాయి. నడి ఎండలో కూడ ప్రజలు నిలబడి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మరోప్రక్క కుల, మతం, మద్యం, డబ్బు ప్రభావం కూడా బలంగానే ఎన్నికల మీద ఉంది. ఎన్నికల సంగ్రామంలో ఈసారి సోషల్ మీడియా కీలకపాత్ర పోషించింది. ఒక రకంగా సామాజిక వేదికలపై పెద్ద యుద్ధమే నడిచింది. పార్టీలు, అభ్యర్థుల వారీగా ఏర్పడ్డ గ్రూపుల్లో ఓటింగ్ సందర్భంగా రాతలతో కత్తులు దూశారు. ఫేక్ ఫోటోలు, ఫేక్ ఆడియోలతో పాటు ఫేక్ వార్తలను క్షేత్రస్థాయిలో వైరల్ చేశారు. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారు అయోయయానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఇలా వుంటే మొత్తం భారతదేశం వ్యాప్తంగా పెను వృక్షాలు కూలుతున్న చప్పుళ్లు వినబడుతున్నాయి. కొన్ని అధికార పీఠాలు బీటలు వారుతున్నాయి. మే 15న భువనేశ్వర్‌లోని భువనంగిరిలో ఇండియా కూటమి నాయకుడు రాహుల్‌గాంధీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో భాజపా నెగ్గితే ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం అవుతాయని, దేశాన్ని 22 మంది బిలియనీర్లు పాలిస్తారని, రాజ్యాంగ పుస్తకాన్ని భాజపా చించి అవతల పారేస్తుందని అన్నారు. బడుగు వర్గాలకు ప్రయోజనాలు లభించటానికి కారణమే రాజ్యాంగం అని తమ చేతిలోని రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ చెప్పారు. 22 మంది బిలియనీర్లు తీసుకున్న రూ. 16 లక్షల కోట్ల రుణాలను కేంద్ర సర్కారు మాఫీ చేసిందని, ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 24 ఏళ్ల పాటు వేతనాలు చెల్లించేందుకు అయ్యే మొత్తంతో ఇది సమానమని వివరించారు. ‘‘రైతుల, విద్యార్థుల రుణాలను మాఫీ చేయలేదు. చిరు వ్యాపారులకు రుణాలే ఇవ్వలేదు. జీయస్టీ మొత్తమంతా ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు వెళ్లిపోతోంది. మేం వచ్చాక కులగణనతో విప్లవాత్మక ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనను తీసుకువస్తాం. దేశంలో దేశంలో 50 శాతం మంది ఓబిసీలు, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనార్టీలు, 5 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారున్నారు. ఈ 90 శాతం మందికిపైగా ప్రజలు మోదీ పాలనలో వంచితులయ్యారు. ఎన్ని రకాల అబద్ధాలను భాజపా చెప్పినా జూన్ 4 తర్వాత ప్రధాని పదవిలో మోదీ ఉండరు’’ అని రాహుల్ ఉద్ఘాటించారు.మోడీ ప్రభుత్వంలో రాజ్యం కంటే కూడా కార్పోరేట్ శక్తులు బలపడ్డాయి. విశ్వవిద్యాలయాలు అన్నింటిలో మతోన్మాద భావాలను ప్రచారం చేస్తూ శాస్త్ర జ్ఞానాన్ని వక్రీకరిస్తున్నాయి. అందుకే శ్రీనగర్‌లో మే 15న మాట్లాడుతూ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎస్పీ)అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఇలా విమర్శించారు. భవిష్యత్తులో తాను పదవిలో లేకపోయినా దేశం మనుగడ సాగిస్తుందన్న విషయాన్ని ప్రధాని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్ అనంత్‌నాగ్‌లోని షాంగుస్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మనం కలిసి జీవించాలి. దేశాన్ని రక్షించాలి. పదవి ఎల్లకాలం ఉండదు. కానీ దేశం శాశ్వతం. ఆయన (మోడీ) ఏ దేశాన్ని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారో అది వినాశకరమైనది’’ అన్నారు.నిజానికి దేశాన్ని రక్షించాల్సిన ప్రధానమంత్రి దేశంలో మత వైరుధ్యాలు పెంచడం ఆశ్చర్యకరం. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మతసామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, మోడీ ప్రభుత్వం మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీసిందని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులందరూ భావిస్తున్నారు. మోడీ ఆవేశపూరితమైన ప్రసంగాల్లో 400 సీట్లు వస్తున్నాయని చెప్పుకుంటున్నా 150 నుంచి 200కే పరిమితం అవుతారని కమ్యూనిస్టు నాయకులు చెబుతున్నారు. బీజేపీకి బలమైన ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఈ ఎన్నికల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనే బీజేపీకి ఎదురు గాలి వీస్తున్నది. పైకి డాంబికంగా 370–400 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకుంటున్నా ఏ సర్వేలోనూ ఆఖరికి బీజేపీని బలపరిచే విశ్లేషకులు సైతం 250కి మించి రావని చెప్పాల్సిన పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం ఈ దశాబ్దంలో ఏ సోషల్ మీడియాలోనైతే దళిత బహుజన మైనార్టీ స్త్రీల మీద, రాజ్యాంగం మీద, మానవ హక్కుల మీద, విద్యార్థుల ప్రతిభ మీద, దళితుల జీవన సంస్కృతి మీద, ముస్లింలు జీవించే హక్కు మీద దాడి చేసిందో అదే సామాజిక మాధ్యమాన్ని ఉపయుక్తం చేసుకొని ఈ సామాజిక శ్రేణుల అన్నింటిలో వున్న మే«ధావర్గం ఎదురుదాడి ప్రారంభించింది. నిజానికి మోడీ ద్వంద్వ భావజాల ఘర్షణలో ఇరుక్కుపోయారా అనిపిస్తుంది. ఏ ప్రజలైతే ఏ బడుగువర్గాలైతే అధిక ఓట్ల శక్తిగా ఉన్నాయో, ఆ వర్గాల జీవన వ్యవస్థలను ధ్వంసం చేస్తూ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ఈ వర్గాలను మతం పేరుతో ఓట్లు అడుగుతున్న సందర్భంగా, తమ కాళ్ల కింద పునాదులు తొలగిపోతున్న స్థితిలో కేవలం మతోన్మాద నినాదం ఫలిస్తుందా? అనేది ఇప్పుడు మోడీ ముందు నిలబడిన పెద్ద ప్రశ్నలా కనిపిస్తోంది.ఉత్తర ప్రదేశ్ కేంద్రంగా మొత్తం భారతదేశం గురించి మనం ఆలోచించినప్పుడు అన్ని మతాల్లో బానిసలుగా బతుకుతున్న వారికి సమాన గౌరవ జీవన వ్యవస్థ లేకపోవటం కనిపిస్తోంది. మతోన్మాద నినాదం గౌరవం ఇవ్వదు. ఆచరణ గౌరవం ఇస్తుంది. భారతదేశంలో కుల గణన చేయిస్తామని కాంగ్రెస్ పేర్కొన్నాక ఓబిసీలు ఆలోచనలో పడినట్లే ఉంది. తమకు రిజర్వేషన్ హక్కు వస్తుందని, రిజర్వేషన్ వల్ల విద్య, ఉద్యోగ హక్కులు విస్తృతం అవుతాయని ఓబిసీలు భావించడం ద్వారా భారతదేశంలో అతి పెద్ద సామాజిక తరగతి ‘ఇండియా’ కూటమి వైపు మొగ్గుతుందనక తప్పదు. ‘ఇండియా’ కూటమికి నూతన దశ వస్తున్న ఈ తరుణంలో అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన ఆ కూటమికి ఉంటే అంబేడ్కర్ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. ఆ పరిణతి మాత్రం ‘ఇండియా’ కూటమికి వచ్చినట్టు లేదు. అంబేడ్కర్ పరిశ్రమలను జాతీయం చేయండి, భూములను జాతీయం చేయండి అనే ప్రధాన సూత్రాన్ని ముందుకు తెచ్చారు. ఆయా రాష్ట్రాల ఆధిపత్య కులాల పార్టీ నుంచి వస్తున్న ‘ఇండియా’ కూటమి ఇంకా సామాజిక, సామ్యవాద భావాలను పరిపుష్టం చేయవలసిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాల్లో చారిత్రక, సాంస్కృతిక శాస్త్ర జ్ఞాన పునరుజ్జీవనానికి కూడా వీరు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మండల కమిషన్ రిపోర్ట్స్‌ను, సచార్ కమిటీ రిపోర్ట్స్‌ను, రిపబ్లికన్ పార్టీలోని మూల సూత్రాలను ‘ఇండియా’ కూటమి తీసుకోగలిగితే నిజమైన ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది. భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. ఈసారైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ఒక దళిత ప్రధానమంత్రిని ప్రకటించగలిగిన విశాలతను సంతరించుకోవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా భారతదేశంలోని రాజకీయ నాయకుల వ్యక్తిత్వ నిర్మాణంలో నైతికత, అవినీతి రహిత, రుజువర్తన జీవన విధానం, మానవతా స్పృహ, సామాజిక విప్లవ భావన, ఆర్థిక స్వావలంబనా దృష్టి అనుసరణీయం అవ్వవలసి ఉంది. రాజకీయ నీతిశాస్త్ర అధ్యయనం ఈనాటి చారిత్రక కర్తవ్యం. అంబేడ్కర్ రాజకీయ జీవన మార్గమే దేశానికి దిక్సూచి.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు -
2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. వీరికి తిరుగులేదండోయ్!
భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రముఖ రంగాలలో ఒకటి 'రియల్ ఎస్టేట్' అని అందరికి తెలుసు. ప్రస్తుతం ఈ రంగంలో దేశవ్యాప్తంగా సుమారు 7.1 కోట్ల ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ సంఖ్య 2030 నాటికి 10 కోట్లకు చేరే అవకాశం ఉందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నైట్‌ఫ్రాంక్ ఇండియా, రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ సర్వేయర్స్ ప్రకారం.. ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం 2030 నాటికి మరింత అభివృద్ధి చెందనుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇందులో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. నిర్మాణ రంగంలో టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోందని.. ఈ తరుణంలో ఉద్యోగులకు డిమాండ్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో ఉద్యోగులకు డిమాండ్.. ఇప్పటి వరకు నిర్మాణ రంగంలో ఉన్న చాలా మంది ప్రజలకు సరైన నైపుణ్యాలు లేవని.. అలాంటి నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య చాలా తక్కువని చెబుతున్నారు. కావున రానున్న రోజుల్లో ఈ రంగంలో అనుభవం ఉన్నవారికి డిమాండ్ భారీగా ఉండనుంది. అంతే కాకుండా ఈ రంగానికి తగిన విధంగా మార్చుకోవడానికి కంపెనీలు కూడా తమ వంతు పాటుపడాలని కొంత మంది సూచిస్తున్నారు. ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు పనిచేస్తున్న 7.1 కోట్ల మందిలో 44 లక్షలు ఇంజినీర్లు, టెక్నీషియన్స్ ఉన్నారు. మిగిలిన వారికి ఈ రంగంలో ఎక్కువ నైపుణ్యాలు లేకపోవడం గమనార్హం. కావున రానున్న రోజుల్లో సరైన మెళుకువలున్నవారు ఈ రంగంలో అడుగుపెడితే తప్పకుండా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన వంటి లక్ష్యాలను చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. -
ఐదు రోజుల్లో ఇల్లు రెడీ.. 5.50 లక్షల ఖర్చు.. 60 ఏళ్లకు పైగా మన్నిక!
ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టే స్థాయిని దాటేసి.. నచ్చిన మోడల్లో ఇంటిని ప్రింటింగ్ చేసుకునే స్థితికి వచ్చేశాడు మనిషి. నెలలు, సంవత్సరాల తరబడి కట్టే ఇళ్లను సైతం త్రీడీ ప్రింటింగ్ హౌసింగ్ టెక్నాలజీ సాయంతో గంటలు.. రోజుల్లోనే చకచకా నిర్మించేస్తున్నాడు. ఎలానో ఒకసారి తెలుసుకుందాం.. సాక్షి, అమరావతి: భారత నిర్మాణ రంగంలో కొత్త టెక్నాలజీ చేరింది. శ్రమ లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతిని వినియోగించడం ద్వారా ఇళ్లను సిద్ధం చేయడంపై మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు చేసిన ప్రయోగాలు ఫలించాయి. సంప్రదాయ నిర్మాణాలకు భిన్నంగా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ‘త్వస్త మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్’ పేరుతో స్టార్టప్ సంస్థను స్థాపించి 3డీ ప్రింటర్‌ను అభివృద్ధి చేశారు. ప్రయోగాత్మకంగా ఐఐటీ ప్రాంగణంలోనే కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఓ ఇంటిని నిర్మించారు. ఒకే అంతస్తులో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం రూ.5.50 లక్షల ఖర్చుతో.. ఆధునిక హంగులతో 5 రోజుల్లోనే ఇల్లు పూర్తయిపోయింది. సామగ్రి కొనుగోలు, రవాణా, లేబర్ ఖర్చులు వంటివేమీ లేకుండా నిర్మించిన ఈ ఇళ్లు 50 నుంచి 60 ఏళ్లపాటు నాణ్యతతో మన్నుతాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ‘త్వస్త’తో జత కట్టిన ఎల్ అండ్ టీ త్వస్త స్టార్టప్ అందుబాటులోకి తెచ్చిన ఈ 3డీ ఇల్లు దేశాన్ని ఆకర్షిస్తోంది. తక్కువ ఖర్చుతోనే ఆధునిక హంగులతో డబుల్ బెడ్రూమ్ ఇంటిని పూర్తిచేయగలగడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ త్వస్త మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే బెంగళూరులో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తుల 3డీ ప్రింటెడ్ భవన నిర్మాణం పూర్తి చేసింది. భారత తపాలా శాఖకు చెందిన ఈ భవన నిర్మాణానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి సైతం మంజూరు చేయడం గమనార్హం. కొత్తగా వచ్చిన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలను ప్రభావితం చేసిందని.. ఈ టెక్నాలజీలో పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడితే తక్కువ సమయంలోనే లక్షలాది మందికి సొంతింటి కలను నిజం చేయవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్లాన్.. కాంక్రీట్.. ప్రింటింగ్ సాధారణ ఇంటి నిర్మాణం మాదిరిగానే 3డీ ప్రింటింగ్ నిర్మాణం కూడా సాగుతుంది. అయితే, ఇందులో కార్మికులకు బదులుగా యంత్రం నిర్మాణ పని చేస్తుంది. ఇంటిని ఎక్కడ కట్టాలో నిర్ణయించాక, అవసరమైన ప్లాన్ (బ్లూప్రింట్) రూపొందిస్తారు. గోడలు, గదులు ఎలా ఉండాలో ప్లాన్ చేసి ఇంటి బ్లూప్రింట్ మోడలింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా సిద్ధం చేస్తారు. అనంతరం ప్లాన్‌ను కంప్యూటర్ సాయంతో భారీస్థాయిలో ఉండే 3డీ ప్రింటర్‌కు పంపిస్తారు. ఇంటి ప్రింటింగ్ ప్రారంభించే ముందు.. పేస్ట్ లాంటి బిల్డ్ మిశ్రమాన్ని (కాంక్రీట్) వేసేందుకు అనువుగా నిర్మాణ ప్రాంతం చుట్టూ యంత్రం రోబోటిక్ హ్యాండ్ కదిలేందుకు వీలుగా బిల్డింగ్ సైట్ చుట్టూ పట్టాలు అమరుస్తారు. అన్నీ సరిచూసుకున్నాక యంత్రానికున్న ‘ప్రింట్’ బటన్ ఆన్ చేయగానే ప్రింటర్ దానికదే ప్లాన్ ప్రకారం నిర్మాణాలన్నీ ప్రారంభించి గోడలు, కిటికీలు, వెంటిలేటర్లు వంటివి పూర్తిచేస్తుంది. ఇందులో ప్రింటర్‌లోని నాజిల్ ద్వారా కాంక్రీట్ మెటీరియల్ బయటకు వస్తే.. దాన్ని మరో కాంక్రీట్ డ్రయర్ నిర్మాణ సామగ్రిని త్వరగా పటిష్టం చేస్తుంది. ఆ వెంటనే దానిపై మరో పొర కాంక్రీట్ వేస్తుంది. ఇలా పొరలు పొరలుగా ప్లాన్‌లో ఉన్నట్టుగా నిర్మాణం పూర్తవుతుంది. ఆపై కిటికీలు, తలుపులు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి పనులను కార్మికులతో పూర్తిచేస్తారు. Been following developments in 3D printed homes overseas. Critical for India so delighted to see home-grown tech from IIT Madras (now one of the world’s leading Tech-Incubators) I know you guys raised some seed funding, but any room for me to join in? pic.twitter.com/LXoZCMAwM8 — anand mahindra (@anandmahindra) January 31, 2022 -
అమరశిల్పి అంబేడ్కర్
అంబేడ్కర్ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికి వచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, రాజ్యాంగంలో పొందుపరిచారు. కత్తి పద్మారావు అంబేడ్కర్ జీవితంలోని లోతు తాత్త్వికమైంది. భారతదేశాన్ని మనం పునర్నిర్మించాలనుకున్నప్పుడు తప్పకుండా ఆయన రచనలను భారతీయ పునరుజ్జీవనానికి సమన్వయం చేసుకోక తప్పదు. భారత రాజ్యాంగంలో పొందుపర్చబడిన ఆర్థిక, సామాజిక సమత అట్టడుగు ప్రజలకు ప్రవహించాలంటే ఆయన అందించిన సిద్ధాంతాల ప్రమాణాలలోని తత్త్వాన్ని అందుకోవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగ శిల్పంలో ఆయన అద్వితీయ పాత్రను వహించాడు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలోకి పెద్దది. చాలామంది భారత రాజ్యాంగాన్ని ఉపరితలం నుంచే చూసి ఇది విస్తృతమైనదనే అనుకుంటారు కాని, నిజానికి ఇది లోతైనది. ఈ లోతు అంబేడ్కర్ అధ్యయనం నుండే వచ్చింది. అంబేడ్కర్ ఆర్థిక, తాత్త్విక అధ్యయనం భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దింది. అస్పృశ్యత మూలాల నిర్మూలన మనుస్మృతిలో కొన్ని వర్ణాలవారిని చూడటమే నిషేధించబడింది! మనిషిని మనిషిగా చూడటమే నేరమనే ఈ అమానవ నిషేధాలను అంబేడ్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 17తో తిప్పికొట్టారు. ఆయనలోని మహోన్నత సామాజిక, విప్లవ శక్తంతా ఆ ఆర్టికల్ నిర్మాణంలోనే వుంది. దీనికి బౌద్ధ సాహిత్య అధ్యయనం ఆయనకు ఎంతగానో తోడ్పడింది. బౌద్ధాన్ని ఆయన వాఙ్మయంగానే కాక, తత్త్వశాస్త్రంగా, సామాజిక జ్ఞానశాస్త్రంగా అధ్యయనం చేశారు. మనిషికి మనిషికి అడ్డువస్తున్న అన్ని సామాజిక అంతరాలను బౌద్ధం కూల్చివేసింది. ఆ క్రమాన్ని ఆయన అధ్యయనం చేశారు. ఒక మనిషి మరొక మనిషిని చూస్తే నేరం, తాకితే నేరం అనే దశ నుంచి ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించే సూత్రాలను ఆయన అవగాహన చేసుకున్నారు. అస్పృశ్యతను నివారించడం నుంచి మానవ సమాజాన్ని సమైక్యం చేశారు. విధానాలను రూపొందించారు. మనిషి పుట్టుకతోనే ఇతరులను అవమానించడమనే నేరస్థుడుగా జీవిస్తున్నాడని గుర్తుచేశారు. మనిషి అగ్రవర్ణుడుగా తన చుట్టూ అల్లుకుని ఉన్న ఆచార సూత్రాలన్నీ రాజ్యాంగం ప్రకారం నేరానికి దారితీస్తాయి. నేరమంటే ఏమిటి? ఇతరులను నిందించటం, అవమానించటం, అపహాస్యం చేయటం, అణచివేయటం. మరి ఈ నేరాలు ఎవరు చేస్తున్నారు? రాజ్యం చేస్తుంది. వ్యక్తులు చేస్తున్నారు. సమాజమూ చేస్తుంది. ఈ మూడింటిని ఈ ఆర్టికల్ నిరోధిస్తుంది. రాజ్యాంగంపై అంబేడ్కర్ జీవిత ప్రభావం అంబేడ్కర్ జీవితాంతం అవిశ్రాంతంగా అధ్యయనం చేశాడు. ఆయన చదువును గురించి ధనుంజయ్ కీర్ ఇలా రాశారు. ‘‘అంబేడ్కర్ ఉదయం చదువుతుండేవాడు. మధ్యాహ్నం, రాత్రి చదువుతుండేవాడు. రాత్రి గడిచి ఉదయమైనా చదువుతుండేవాడు. ప్రక్కనున్న ఇళ్లల్లో ఉదయాన్నే శబ్దాలు మొదలయ్యేవి. అప్పటికి కూడా ఆయన పుస్తకం చదువుతూ ఉండేవాడు. బాబా సాహెబ్ గంటల గణగణల మధ్య, బండ్ల గడగడ శబ్దాల మధ్య, పనిముట్ల దబదబ శబ్దాలమధ్య, మోటార్ల బరబర శబ్దాల మధ్య కూడా తనపనిలో తాను నిమగ్నమై ఉండేవాడు. బాబాసాహెబ్ అంతిమ కోరిక ఏమంటే అడవిలో లేక ప్రశాంతవనంలో ఏర్పాటు చేయబడిన ఒక గ్రంథాలయంలో కూర్చొని యుగాల మహాసిద్ధాంత కారులతో, మహోపాధ్యాయులతో సంభాషించాలని. జ్ఞానజ్యోతిని కనుగొనే క్రమంలో అనంత రహస్యాలని వెతుక్కుంటూ సాగుతున్న ఆయన ఆలోచనల్ని ఎవరు ఊహించగలరు? ఆయన విద్యాదాహం అంతులేనిది. చదువుతోపాటు ఆయన కూడా పెరిగాడు. ఆయన జ్ఞానం ఆ నింగి సాక్షిగా దిగంతాలకు పాకింది.’’ అంబేడ్కర్ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికివచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆయనలోని గొప్పతనం ఆయన గొప్ప దేశభక్తుడు కావటమే. సాత్వికునిగా, సామరస్యునిగా ఆయన జీవించాడు. ప్రజలు అలా జీవించాలని కోరుకున్నాడు. భారతీయులందరూ జ్ఞానులుగా రూపొందాలనేది ఆయన ఆకాంక్ష. అందుకు కావలసిన పునాదుల్ని భారత రాజ్యాంగంలో రూపొందించాడు. శిల్పిని వేరుచేసి శిల్పాన్ని చూడలేము. కవిని వేరు చేసి కవిత్వాన్ని పఠించలేము. భారత రాజ్యాంగం అర్థం కావాలంటే అంబేడ్కర్‌ని, అంబేడ్కర్ రచనల్ని ప్రతి భారతీయుడు చదవాలి. (వ్యాసకర్త దళితకవి, సామాజిక కార్యకర్త, ఫోన్: 9849741695) డా॥బి.ఆర్.అంబేడ్కర్ జీవిత సంక్షిప్తం (1891-1956) * 14 ఏప్రిల్ 1891 - భీమ్రావ్ రాంజీ అంబేడ్కర్ జన్మించారు. * 1896 - ప్రాథమిక విద్య ప్రారంభం. * 1907 - ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షల్లో ఉత్తీర్ణత. * 1908 - రామ్బాయ్తో పెళ్లి. * 1912 - ఎలిఫిన్ స్టన్ కాలేజీలో చదువులు, బీఏ పరీక్షల్లో ఉత్తీర్ణత. * మే 30 నుండి జూన్ 1 వరకు 1920 - డిప్రెస్డ్ క్లాసెస్ ప్రథమ అఖిల భారత మహాసభ. కొల్హాపూర్ సాహు మహారాజ్ అధ్యక్షత. అంబేడ్కర్ కీలకపాత్ర. * సెప్టెంబర్ 1920 - చదువులు కొనసాగించడానికి తిరిగి విదేశాల ప్రయాణం. * 1922 - గ్రేన్ ఇన్ బార్ఎట్లాకు ఆహ్వానం. * 20 మార్చి 1927 - మహద్‌లో చాదార్ చెరువు వద్ద సత్యాగ్రహం ప్రారంభం. * 4 సెప్టెంబర్ 1927 - సమాజ్ సమతా సంఘ్ స్థాపన. * 25 డిసెంబర్ 1927 - మహద్‌లో మనుస్మృతి దహనం. * 14 జూన్ 1928 - ముంబాయిలో డిప్రెస్డ్ క్లాసెస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపన. * 2 మార్చి 1930 - నాసిక్‌లో కాలారామ్దేవాలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభం. ఐదేళ్లు ఆగుతూ, లేస్తూ కొనసాగింపు. * 8-9 ఆగస్ట్ 1930 - స్వీయ అధ్యక్షతన నాగపూర్‌లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ప్రథమ మహాసభలో చారిత్రాత్మక నాగపూర్ ఉపన్యాసం. * 12 నవంబర్ 1930 నుండి 19 జనవరి 1931 వరకు - మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలలో పాల్గొనటం. * 1931 నుండి 1932 వరకు - రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొనటం. * 27 మే 1935 - రామ్‌బాయ్ మరణం. * 1936 - ‘కులనిర్మూలన’ రచన * 18-20 జూలై 1942 - నాగపూర్‌లో ‘షెడ్యూల్డ్ క్యాస్ట్ఫెడరేషన్’ స్థాపన. * 27 జూలై 1942 - వైస్రాయి కౌన్సిల్లో కార్మికశాఖ సభ్యుడు (మంత్రి) (జూలై 1946 వరకు). * 8 జూలై 1945 - బొంబాయిలో ‘ఫౌండేషన్ ఆఫ్ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ స్థాపన. * 19 జూలై 1946 - బెంగాల్ నుండి భారత రాజ్యాంగ సభకు ఎన్నిక. * 3 ఆగస్ట్ 1947 - లా మినిస్టర్‌గా నియామకం. * 19 ఆగస్ట్ 1947 - భారత రాజ్యాంగ రచన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్‌గా నియామకం. * 1948 - ‘అస్పృశ్యులెవరు?’ రచన. * 15 ఏప్రిల్ 1948 - ఢిల్లీలో డా॥శారద కబీర్‌తో (సవిత అంబేడ్కర్) వివాహం. * 25 మే 1950 - బౌద్ధాన్ని పరిశీలించేందుకు కొలంబో పర్యటన. * 26 నవంబర్ 1950 - భారత రాజ్యాంగం ఆమోదం. * మార్చి 1952 - ముంబాయి శాసనసభ నుండి రాజ్యసభకు ఎన్నిక. * 5 జూన్ 1952 - కొలంబియా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లా డిగ్రీ ప్రదానం. * డిసెంబర్ 1954 - రంగూన్లో జరిగిన ప్రపంచ బుద్ధిస్ట్ మహాసభలో పాల్గొనడం. * మే 1955 - బుద్ధ మహాసభ స్థాపన. * 15-16 అక్టోబర్ 1956 - ఖాట్మండ్‌లో జరిగిన ప్రపంచ బుద్ధిస్ట్ మహాసభలో పాల్గొనడం. * 6 డిసెంబర్ 1956 - ఢిల్లీలో మరణం. * 1957 - ‘బుద్ధ - ధమ్మ’ మరణానంతర ప్రచురణ (వలీరియన్ రోడ్రిగ్స్ ‘అంబేడ్కర్’ సంకలనం నుండి).