ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టే స్థాయిని దాటేసి.. నచ్చిన మోడల్‌లో ఇంటిని ప్రింటింగ్ చేసుకునే స్థితికి వచ్చేశాడు మనిషి. నెలలు, సంవత్సరాల తరబడి కట్టే ఇళ్లను సైతం త్రీడీ ప్రింటింగ్ హౌసింగ్ టెక్నాలజీ సాయంతో గంటలు.. రోజుల్లోనే చకచకా నిర్మించేస్తున్నాడు. ఎలానో ఒకసారి తెలుసుకుందాం..
సాక్షి, అమరావతి: భారత నిర్మాణ రంగంలో కొత్త టెక్నాలజీ చేరింది. శ్రమ లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతిని వినియోగించడం ద్వారా ఇళ్లను సిద్ధం చేయడంపై మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు చేసిన ప్రయోగాలు ఫలించాయి. సంప్రదాయ నిర్మాణాలకు భిన్నంగా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ‘త్వస్త మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్’ పేరుతో స్టార్టప్ సంస్థను స్థాపించి 3డీ ప్రింటర్‌ను అభివృద్ధి చేశారు.
ప్రయోగాత్మకంగా ఐఐటీ ప్రాంగణంలోనే కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఓ ఇంటిని నిర్మించారు. ఒకే అంతస్తులో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం రూ.5.50 లక్షల ఖర్చుతో.. ఆధునిక హంగులతో 5 రోజుల్లోనే ఇల్లు పూర్తయిపోయింది. సామగ్రి కొనుగోలు, రవాణా, లేబర్ ఖర్చులు వంటివేమీ లేకుండా నిర్మించిన ఈ ఇళ్లు 50 నుంచి 60 ఏళ్లపాటు నాణ్యతతో మన్నుతాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
‘త్వస్త’తో జత కట్టిన ఎల్ అండ్ టీ
త్వస్త స్టార్టప్ అందుబాటులోకి తెచ్చిన ఈ 3డీ ఇల్లు దేశాన్ని ఆకర్షిస్తోంది. తక్కువ ఖర్చుతోనే ఆధునిక హంగులతో డబుల్ బెడ్రూమ్ ఇంటిని పూర్తిచేయగలగడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ త్వస్త మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే బెంగళూరులో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తుల 3డీ ప్రింటెడ్ భవన నిర్మాణం పూర్తి చేసింది. భారత తపాలా శాఖకు చెందిన ఈ భవన నిర్మాణానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి సైతం మంజూరు చేయడం గమనార్హం. కొత్తగా వచ్చిన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలను ప్రభావితం చేసిందని.. ఈ టెక్నాలజీలో పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడితే తక్కువ సమయంలోనే లక్షలాది మందికి సొంతింటి కలను నిజం చేయవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.
ప్లాన్.. కాంక్రీట్.. ప్రింటింగ్
సాధారణ ఇంటి నిర్మాణం మాదిరిగానే 3డీ ప్రింటింగ్ నిర్మాణం కూడా సాగుతుంది. అయితే, ఇందులో కార్మికులకు బదులుగా యంత్రం నిర్మాణ పని చేస్తుంది. ఇంటిని ఎక్కడ కట్టాలో నిర్ణయించాక, అవసరమైన ప్లాన్ (బ్లూప్రింట్) రూపొందిస్తారు. గోడలు, గదులు ఎలా ఉండాలో ప్లాన్ చేసి ఇంటి బ్లూప్రింట్ మోడలింగ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ద్వారా సిద్ధం చేస్తారు. అనంతరం ప్లాన్‌ను కంప్యూటర్ సాయంతో భారీస్థాయిలో ఉండే 3డీ ప్రింటర్‌కు పంపిస్తారు. ఇంటి ప్రింటింగ్ ప్రారంభించే ముందు.. పేస్ట్ లాంటి బిల్డ్ మిశ్రమాన్ని (కాంక్రీట్) వేసేందుకు అనువుగా నిర్మాణ ప్రాంతం చుట్టూ యంత్రం రోబోటిక్ హ్యాండ్ కదిలేందుకు వీలుగా బిల్డింగ్ సైట్ చుట్టూ పట్టాలు అమరుస్తారు.
అన్నీ సరిచూసుకున్నాక యంత్రానికున్న ‘ప్రింట్’ బటన్ ఆన్ చేయగానే ప్రింటర్ దానికదే ప్లాన్ ప్రకారం నిర్మాణాలన్నీ ప్రారంభించి గోడలు, కిటికీలు, వెంటిలేటర్లు వంటివి పూర్తిచేస్తుంది. ఇందులో ప్రింటర్‌లోని నాజిల్ ద్వారా కాంక్రీట్ మెటీరియల్ బయటకు వస్తే.. దాన్ని మరో కాంక్రీట్ డ్రయర్ నిర్మాణ సామగ్రిని త్వరగా పటిష్టం చేస్తుంది. ఆ వెంటనే దానిపై మరో పొర కాంక్రీట్ వేస్తుంది. ఇలా పొరలు పొరలుగా ప్లాన్‌లో ఉన్నట్టుగా నిర్మాణం పూర్తవుతుంది. ఆపై కిటికీలు, తలుపులు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి పనులను కార్మికులతో పూర్తిచేస్తారు.
Been following developments in 3D printed homes overseas. Critical for India so delighted to see home-grown tech from IIT Madras (now one of the world’s leading Tech-Incubators) I know you guys raised some seed funding, but any room for me to join in? pic.twitter.com/LXoZCMAwM8
— anand mahindra (@anandmahindra) January 31, 2022
Comments
Please login to add a commentAdd a comment