శాస్త్రీయ సంగీతానికి ఆయన ప్రచార కర్త... 72 మేళకర్త రాగాలను ఒక కీర్తనగా చేసి ఆరు నిమిషాలలో ఆ రాగాలను అందరికీ పరిచయం చేస్తున్నారు. సంగీత అవధానం చేస్తూ పండితుల మన్ననలు అందుకుంటున్నారు...‘మిథునం’ చిత్రం ద్వారా ‘ఆది దంపతులు అభిమానించే అచ్చ తెలుగు మిథునం’ అంటూ సినీ సంగీతం వినిపించారు... నేడు ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే... ఈ సందర్భంగా సంగీత దర్శకులు వీణాపాణితో సాక్షి ముచ్చటించింది... ఆ వివరాలు...
సంగీతాన్ని ఏమని నిర్వచిస్తారు?
సంగీతం తల్లిలాంటిది. చిన్నప్పటి నుంచే మంచి మార్గంలో వెళ్లాలి అనే పోకడకు సంగీతం శ్రీకారమవుతుంది. అమ్మ దేవుడి పూజలో లలితా సహస్ర నామాలను రాగంలో చదువుతుంటే, ఆ స్వరానికి ఆకర్షితులై అమ్మ దగ్గర వింటూ నేర్చుకుంటారు పిల్లలు. ఘంటసాల గారి భగవద్గీత వింటుంటే స్వరం, సాహిత్యం వచ్చేస్తాయి. పాఠశాలల్లో చిన్న తరగతులలో పాఠాలు కూడా సంగీతం, పాటల ద్వారానే చెబుతారు. ఒక మంచి మాటను పాటలో పెడితే, రెండు సంవత్సరాలలో వచ్చే మార్పు, రెండు రోజుల్లోనే వస్తుంది. పిల్లల మధ్య ఉండే స్పర్థలు దూరమవుతాయి. ఇది సంగీతానికి ఉన్న గొప్పదనం.
సంగీతానికి పసరాలు తలలు ఊపిన సంఘటన మీ జీవితంలో తారసపడిందా?
ఒకసారి నేను, తనికెళ్లభరణి ఇద్దరం ‘ఆటగదరా శివా’ కార్యక్రమం చేయడానికి పాలకొల్లు దగ్గర ఒక గెస్ట్‌హౌస్‌లో దిగాం. నేను ఉదయాన్నే హార్మోనియం మీద సంగీత సాధన ప్రారంభించాను. మేం ఉన్న ప్రాంతంలో వందల ఏళ్ల నాటి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. వాటి మీద పక్షులన్నీ గట్టిగా శబ్దం చేస్తున్నాయి. నేను హార్మోనియం మీద పాడుకుంటున్నప్పుడు పక్షులన్నీ వాటి సందడి ఆపాయి. అందులో రెండు పక్షులు, అవి ఏ జాతి పక్షులో తెలియదు కాని, రెండు నిమిషాల పాటు ‘ఆ... ఊ... ఆ... ఊ...’ అంటూ చతురస్ర గతిలో తాళం వేస్తున్నట్లు, ఒకదానికి ఒకటి స్పందించినట్లు కిలకిల స్వరాలు చేశాయి. అటువంటి అనుభూతి నా జీవితంలో ఎన్నడూ కలగలేదు.
మనుషులలో మార్పు కోసం సంగీతం ఎంతవరకు ఉపయోగపడుతుంది?
జీవన ప్రమాణంలో మనిషితో పాటు మమేకమై ప్రయాణిస్తోంది సంగీతం. ఒకసారి నేను ఐఫోకస్ వారి ఒక కార్యక్రమానికి అతిథిగా వెళ్లాను. అక్కడ వేదిక మీద అనేక విషయాల గురించి చర్చ జరుగుతోంది. అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు బ్యాక్‌గ్రౌండ్‌లో సన్నగా వాద్యపరికరాల మీద త్యాగరాజ కీర్తనలు ప్లే చేస్తున్నారు. ఆ సంగీతం ఎవ్వరికీ అంతరాయం కలిగించలేదు.
స్టార్ హోటల్స్, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఎయిర్‌పోర్టు... ఎక్కడ చూసినా సంగీతం పెడుతూనే ఉంటారు. అక్కడివారంతా ఆస్వాదిస్తూనే ఉంటారు. సంగీతం మనిషి మేధస్సును, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. సంగీతం జీవితాంతం తోడునీడగా ఉంటుంది. అది సంగీతంలో ఉన్న గొప్ప గుణం.
సంగీతం ద్వారా చదువుల ఒత్తిడి నుంచి పిల్లలకు ఉపశమనం కలుగుతుందా?
డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురాగల శక్తి సంగీతానికి మాత్రమే ఉంది. ఇటీవల గుంటూరులో కచేరీ చేసినప్పుడు నాగలక్ష్మి అనే ఒక సంగీత విద్వాంసురాలు హాజరయ్యారు. ఆవిడ కుమారుడు అకాల మరణం చెంది సంవత్సరం దాటింది. ఇంతకాలం ఆవిడ బయటకు రాలేదు. నా కచేరీకి వచ్చాక ఆవిడ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఈ రోజుల్లో పిల్లలకు చదువు వల్ల ఒత్తిడి ఎక్కువవుతోంది. విద్యార్థులు ఉదయాన్నే ఒక అరగంట సేపు పాటలు వినడాన్ని విద్యలో భాగంగా పెట్టుకుంటే ఒత్తిడిని పోగొట్టుకుని శక్తిని సాధించగలరు. ఫ్లోరిడాలో చదువు సంగీతం, సాహిత్యం, ఆటలు పాటలు... విద్యార్థులకు కావలసిన విధంగా చెబుతున్నారు. వారు చదువు విషయంలో ప్రపంచంలో నంబర్‌వన్‌గా ఉన్నారు.
సరస్వతీదేవి ఉండగా సంగీతం గురించి తాపత్రయం ఎందుకు?
ఒక మహానుభావుడు రెండు కోట్లు ఖర్చు చేసి కొన్న కారు కారిడారు వరకు వస్తుంది. కారులో కూర్చోవాలంటే పై అంతస్థు నుంచి కిందకు దిగి రావలసిందే. కారు ఆయనదే, కాళ్లు ఆయనవే. ఇన్ని కోట్లు పెట్టి కారు కొనుక్కున్నా, కారు కాళ్ల దగ్గరకు నడిచి రాదు. కాళ్లతో నడవకుండా కారు ఎక్కడం కుద రదు. భగవంతుడు ఇచ్చిన శక్తిని వినియోగించుకోవాలి. మంగళంపల్లి బాలమురళి వంటి వారు ఎంతో శక్తి సంపాదించుకుని ప్రపంచమంతా తిరగడం వల్లే ప్రపంచానికి పరిచితులయ్యారు. ఆయన ఇంట్లోనే కూర్చుని ఉంటే ప్రపంచానికి పరిచితులయ్యేవారా? ఇన్ని అవార్డులు ఆయనను వరించేవా? ఆలోచన ఇచ్చేది, పని చేయించేది, సంతోషపడేది... అన్నీ ఆ సరస్వతీమాతే.
మార్పు వస్తుందనుకుంటున్నారా?
ప్రతి దేశానికి జాతీయ గీతం ఉంది. ఈ గీతాన్ని ఏ దేశంలోనూ చదవరు, స్వరపరిచి పాడతారు. 30 ఏళ్ల క్రితంలాగ ఇటీవల మన సినిమా హాల్‌లో జాతీయగీతం వచ్చేసరికి అందరూ లేచి నిలబడుతున్నారు. సంగీతం ప్రపంచంలో మార్పు తీసుకు వస్తుంది. అన్ని దేశాలలోను సంగీతం ఉంది, ఆ సంగీతం ప్రపంచ శాంతికి దోహదం చేస్తూనే ఉంది.
సంగీతంతో రీచార్జ్ అవుతారా?
గత 18 సంవత్సరాలుగా అప్రతిహతంగా, అవిశ్రాంతంగా , తరగని శక్తిలా నూతనోత్తేజంతో పరిగెడుతూనే ఉన్నాను. నేను 72 మేళకర్త రాగాలతో రూపొందించి, స్వరపరచిన కీర్తనను ప్రపంచంలో లక్షలమందికి అందించాలనే తపనతో ప్రయాణిస్తున్నాను. నా ప్రయత్నాన్ని ప్రపంచం అంగీకరించాక నా కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేశాను.
సంగీతానికి సరిహద్దులుంటాయా?
సంగీతానికి సరిహద్దులు లేవు అని కర్ణాటక సంగీతం ఏనాడో చెప్పింది. ప్రపంచంలో ఉన్న సంగీత స్వరాలు 12 అయితే, వాటిని పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ (ప్రస్తారాలు సంయోగాలు) తో భారతదేశంలో తెలుగులో మొట్టమొదటగా రామామాత్యుడు అనే వ్యక్తి 72 మేళకర్త రాగాలకు శ్రీకారం చుట్టాడు. తరవాత వేంకటమఖిగారు దానిని పెద్ద చేసి, ప్రపంచానికి అందించారు. తరవాత వచ్చిన గోవిందాచార్యులు వాటికి ప్రణాళిక రూపొందించారు. సంగీతం ప్రకృతి వరప్రసాదం. దేశకాలానుసారంగా మనం వాటిని మలచుకుని, సంగీతంగా పాడుకుంటున్నాం. త్యాగరాజు తెలుగులో రాసిన కీర్తనలను, తమిళులు తమిళంలో రాసుకుని, పాడుతున్నారు. ఇది చాలు సంగీతానికి హద్దులు లేవని చెప్పడానికి.
Comments
Please login to add a commentAdd a comment