తెల్లకోటులో తడిగుండె!
సందర్భం: నేడు డాక్టర్స్ డే
రెండు తనువులు ఒకటే కాలేయం
కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్, సంధ్య భార్యాభర్తలు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. తొమ్మిదేళ్ల అబ్బాయి. నాలుగేళ్ల అమ్మాయి. ఇద్దరూ టీచర్లే. వేర్వేరు చోట్ల పోస్టింగ్. దాంతో పిల్లలు తల్లి దగ్గర ఉంటున్నారు. వీకెండ్‌లో, సెలవుల్లో అందరూ కలుస్తారు. అంతా హ్యాపీ. మూడు నెలల కిందట శ్రీనివాస్‌కు కామెర్లు వచ్చాయి. ఏదో నాటు మందు తీసుకోవడంతో ఒళ్లూ, కళ్లూ పచ్చగా మారాయి. కాలేయం పూర్తిగా దెబ్బతిని, పరిస్థితి విషమించింది. మరింత మంచి చికిత్స కోసం మే 25న మా దగ్గరికి తీసుకొచ్చారు. రోగి హెపాటిక్ కోమా అంచున ఉన్నాడు. వెంటనే వెంటిలేటర్‌పై పెట్టాం. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ కండిషన్‌లో తక్షణం కాలేయ మార్పిడి జరగకపోతే మెదడు వాచిపోయి పూర్తిగా దెబ్బతింటుంది.ఎంతమాత్రమూ చక్కదిద్దలేని పరిస్థితి అది. కాలేయం కోసం వెతుకుతూ ఉండగా అదృష్టవశాత్తు భార్య సంధ్య కాలేయం శ్రీనివాస్‌కు సరిపడుతుందని తేలింది.
భర్తను కాపాడుకోడానికి సంధ్య వెంటనే సన్నద్ధం అయ్యింది. ఆఘమేఘాల మీద ఆపరేషన్‌కు అంతా సిద్ధమైంది. ఆసుపత్రిలో భావోద్వేగ వాతావరణం. ఆ భార్యభర్తలకోసం, ఆ పిల్లల కోసం అంతా ప్రార్థిస్తున్నారు. మే 26 సాయంత్రం మేజర్ సర్జరీ. అన్ని సన్నద్ధాలు జరిగాయి. ఎన్నో విభాగాలకు చెందిన నిపుణులు, ఇతరత్రా వైద్య, వైద్యేతర సిబ్బంది ప్రాణరక్షణ యాగంలో నిమగ్నమయ్యారు. నా నేతృత్వంలో సర్జరీ జరిగింది. విజయవంతంగా ముగిసింది. బాగా కోలుకొని సంధ్య ముందుగా డిశ్చార్జ్ అయ్యారు. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ చాలా సంక్లిష్టమైనది. హెచ్చరికలు లేకండా వచ్చేస్తుంది. చాలా కష్టమైనదీ, సంక్లిష్టమైనదీ, ఖర్చుతో కూడినది. అయితే శ్రీనివాస్ అదృష్టానికి, మా అందరి సమష్టికృషి తోడైంది. ఆపరేషన్ జరిగిన 13వ రోజున సరికొత్త జీవితంతో శ్రీనివాస్ మళ్లీ ఈ లోకంలోకి వచ్చారు.
డాక్టర్ మనీశ్ సి. వర్మ,
హెడ్ – లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ హెపాటోబిలియరీ పాంక్రియాటిక్ యూనిట్,
అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్
కల్పన కంటే చిత్రమైనది వాస్తవం!
‘‘శశిధర్‌గారిని ఎమర్జన్సీకి తీసుకొచ్చారు సర్’’ ఒక రోజు రాత్రి పదకొండు గంటలకు భోజనం చేస్తుండగా వచ్చిన ఫోన్‌లో చెప్పాడు మా హాస్పిటల్ ఎమర్జెన్సీ డాక్టర్ ప్రసాద్. ‘‘ఛాతీలో నొప్పి. తీవ్రమైన హార్ట్ ఎటాక్. వెంటనే రండి’’ చెప్పాడు. భోజనం మధ్యలోనే ముగించి బయల్దేరాను. శశిధర్‌ను కాథ్‌ల్యాబ్‌కు తరలించమని మధ్యదారిలోనే సూచించాను. సిస్టర్స్, ఇతర టెక్నీషియన్స్‌ను తయారుగా ఉండేలా ఏర్పాటు చేశాను. మా కొలీగ్ డాక్టర్ ప్రేమ్‌చంద్‌ను కూడా నాతో రమ్మని కోరాను.
సరిగ్గా పావుగంటలో ఆసుపత్రికి చేరుకున్నాను. శశిధర్‌కు వచ్చిన గుండెపోటు చాలా తీవ్రమైనది. అత్యవసరంగా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ చేసినా బతికే అవకాశాలు 25 శాతం మాత్రమే. శశిధర్‌గారి భార్య, ముగ్గురు కొడుకులు, కూతురూ ఆయనను కాపాడమని ప్రాధేయపడడంతో ఎలాగైనా ఆయనను బతికించాలని నేనూ, ప్రేమ్‌చంద్ రంగంలోకి ఉరికాం. యాంజియోగ్రామ్ చేసి గుండె రక్తనాళాల్లోని అడ్డంకిని గుర్తించాం. దాన్ని తొలగించే ప్రయత్నాలు మొదలుపెట్టాం. గంట పాటు క్యాథ్‌లాబ్‌లోని పరిస్థితి యుద్ధవాతావరణాన్ని తలపించింది. ఎట్టకేలకు శశిధర్ గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలైంది.
ఈలోగా పిడుగులాంటి ఓ వార్త. ‘‘ఇప్పుడే ల్యాబ్ నుంచి ఫోన్ సర్. శశిధర్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్ అట’’. వణికిపోయాను. శశిధర్ ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో నాకూ, నా సహచరుడైన ప్రేమ్‌చంద్‌కూ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండవచ్చు. శశిధర్ కుటుంబాన్ని పిలిచి పరిస్థితిని వివరించాను. ‘‘ఆసుపత్రికి రావడంలో పదినిమిషాలు ఆలస్యం చేసినా, ఆయన దక్కేవారు కాదు’’ అంటూ కొడుకుకు విషయం చెప్పాం. తండ్రి అంటే కొడుకుకు అవ్యాజమైన ప్రేమ. కానీ ఆ ప్రేమను ప్రాక్టీకాలిటీ కమ్మేసి ఆ కొడుకు అన్న మాటలు నా గుండెను నొక్కేశాయి. ‘‘సార్ పది నిమిషాలు ఆలస్యం అయితే మా నాన్న ప్రాణాలు దక్కేవి కావని మీరన్నారు. కానీ నాకిప్పుడనిపిస్తోందీ... ఆ పది నిమిషాలు ఆలస్యం ఎందుకు కాలేదా అని.’’ అంటూ రోదించాడు. అనంతమైన ప్రేమసముద్రం... ప్రాక్టికాలిటీ అనే సూర్యుడి వేడికి ఆవిరైపోతున్న దృశ్యం కనిపించింది.
నాలుగోరోజున శశిధర్ కోలుకోవడం మొదలైంది. వారంరోజుల్లో డిశ్చార్జ్ చేశాం. నెల తర్వాత ఫాలో అప్‌కు వచ్చినప్పుడు ‘‘నా వాళ్ల కళ్లలో కనిపించే నిర్లిప్తత చూస్తే చనిపోవడమే మంచిదనిపిస్తోంది సర్’’ అన్నాడు. ఐసీయూలో మృత్యువుతో పోరాడిన శశిధర్‌లో ఇప్పుడు యుద్ధం ఓడిన సైనికుడు కనిపిస్తున్నాడు.
మూడు నెలల తర్వాత నేనూ, నా కొలీగ్ ప్రేమ్‌చంద్ హెచ్‌ఐవీ టెస్ట్ చేయించాం. ఏమీ కాదని నమ్మకం ఉన్నా మనసులో మూలన ఏదో భయం. ఆ మర్నాడు రెండు వార్తలు నాకు తెలిశాయి. మొదటిది... నాకూ, ప్రేమ్‌చంద్‌కు హెచ్‌ఐవీ సోకలేదు. ఇక రెండోది... రక్తంలో షుగర్ తగ్గడంతో శశిధర్ మరణించారు. అవును... కొన్ని ఆత్మహత్యలకు రుజువు లుండవు. సమాజం చేసే హత్యలకు సాక్ష్యాలుండవు. డాక్టర్లూ రాగద్వేషాలకు, భయాలకు అతీతులు కారు.
డాక్టర్ ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ,
ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్,
మాక్స్‌క్యూర్ హాస్పిటల్స్, మాదాపూర్
ఆపారమైన ఆ అమ్మ ప్రేమకు నా చికిత్స కాస్త తోడయ్యిందంతే!!
చిన్నారి నాజ్మీన్ శోడియాల్‌కు జస్ట్ 14 ఏళ్లు. ఎక్కడో అస్సాం రాష్ట్రంలోని మారుమూల మధుబన్ అనే చిన్న పల్లెటూరు ఆమెది. ఆడీ పాడీ అలసీ సొలసీ సేదదీరుతూ ఆనందంగా గడపాల్సిన వయసాపాపది. కానీ కిడ్నీలు రెండూ చెడిపోవడంతో ఆమెకు ప్రాణగండం ఏర్పడింది. దాదాపు మరణం అంచున ఉన్న ఆ పాపను ఎలాగైనా రక్షించుకోవాలనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. అక్కడ ఎవరో నా పేరు చెప్పారట. అంతే... అస్సాం నుంచి ఇక్కడికి వచ్చి నన్ను సంప్రదించారు. ఆమెకు మూత్రపిండం మాత్రమే ప్రాణగండం కాదు. తండ్రి ఖుఖాన్ శోడియల్ నెలసరి వేతనం కేవలం రూ. 12000. ఆపరేషన్‌కు కనీసం రూ. ఏడు లక్షలైనా కావాలి. ఇక రెండో అవసరం ఎవరైనా మూత్రపిండం ఇవ్వాలి. డబ్బు సమకూర్చడం కోసం అందరమూ ఎంతో కష్టపడ్డాం. దాతలు, వదాన్యులతో పాటు కేర్ ఫర్ యువర్‡ కిడ్నీ ఫౌండేషన్ (సీఎఫ్‌వైకేఎఫ్) చేయూత ఇచ్చింది.
స్టార్ హాస్పిటల్స్ ఎన్నో రాయితీలు ఇచ్చి తన పూర్తి సహకారం అందించింది. అపార ప్రేమాస్పదమూర్తి అయిన తన అమ్మ హిరామణి మూత్రపిండాన్ని నవ్వుతూ ఇచ్చింది. గత ఏడాది ఆగష్టులో ఇక్కడికి వచ్చిన ఆ అమ్మాయికి అక్టోబరులో శస్త్రచికిత్స చేశాం. ఆపరేషన్ పూర్తయ్యింది. అదీ అందరి సహకారంతో, కేవలం మూడు లక్షల ఖర్చుతోనే. ఇప్పుడా చిన్నారి అందరు పిల్లల్లాగే ఆనందంగా స్కూల్‌కు వెళ్తోంది. ఆపరేషన్ పూర్తయ్యాక అద్భుతంగా తన చేత్తో అల్లిన ఊల్ శాల్‌ను నాకు బహూకరించిందా చిన్నారి. అంతటి మంచి కానుక నాకు ఇచ్చింది గానీ ఆమె ప్రాణాలు రక్షించడానికి ఆ తల్లి తన కూతురికి ఇచ్చిన వరంతో
పోలిస్తేæ నేను చేసిన వైద్యం ఏపాటిది?
– డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి,
సీనియర్ నెఫ్రాలజిస్ట్,
స్టార్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్
ఈ చిన్నారికి చేసిన ఆపరేషన్ చరిత్రలోనే తొలిసారి!
ఈ లోకంలోకి వచ్చి అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలని ఆ చిన్నారి ఎంతగా త్వరపడిందంటే తన ఊపిరితిత్తులు మాత్రమే కాదు... ముక్కురంధ్రాలు కూడా ఏర్పడకముందే ఆమె పుట్టేసింది. అందునా కేవలం 1100 గ్రాముల బరువుతో. అది కూడా అసలు వ్యవధి కంటే మూడు వారాల ముందుగా. ముక్కురంధ్రాలూ లేని ఈ కండిషన్‌ను వైద్య పరిభాఫలో ‘కంజెనిటల్ కొయానల్ యాస్ట్రీషియా’ అంటారు. తక్షణం గాలి పీల్చుకోడానికి నోటిలో ఒక తాత్కాలిక మార్గం ఏర్పరచకపోతే వీళ్లు వెంటనే చనిపోతారు. ఆ మార్గాన్ని ఏర్పాటు చేసి, నోటి ద్వారా వెంటిలేటర్ అమర్చి మా దగ్గరికి తీసుకువచ్చారు. నిజానికి ఇదో ఛాలెంజ్. అంతకు మునుపు అప్పుడే పుట్టిన పిల్లలకు ముక్కురంధ్రాలు ఏర్పాటు చేశారు గానీ... ఇలా ప్రీ–మెచ్యుర్‌గా పుట్టిన బేబీకి ముక్కు రంధ్రాలు ఏర్పాటు చేయడం అన్నది నాకు తెలిసనంత వరకు వైద్య చరిత్రలోనే ఇది మొదటిసారి.
అప్పటికే రెండు గర్భస్రావాల తర్వాత పుట్టిన చిన్నారి కావడంతో ఆ పాప చాలా అపురూపం. అలాంటి ప్రెషియస్ బేబీకి లంగ్స్ అభివృద్ధి చెందడానికి వారం టైమిచ్చాం. అసలు ఆపరేషన్ ముందుంది. కేవలం ఒక మిల్లీమీటరు వ్యాసం కలిగి ఉన్న స్కీటర్ అనే వజ్రపు డ్రిల్‌తో ఎండోస్కోపిక్ విధానంలో ముక్కు రంధ్రాలను నిర్మించాం. అవి వెంటనే మూసుకుపోకుండా స్టెంట్స్ ఏర్పాటు చేశాం. అలా ఆరువారాల టైమ్ ఇచ్చాం. అప్పటికి ముక్కు రంధ్రాలు మళ్లీ మూసుకుపోకుండా ఏర్పడ్డాయి. ఒక ఉచ్ఛ్వాస... ఆ చిన్నారి తనంతట తానే గాలి పీల్చుకుంది. మేం శ్వాసబిగబట్టుకున్నాం. నిశ్శా్వస... ఆమె మళ్లీ గాలి వదిలింది. హా... అంటూ హాయిగా నిట్టూరుస్తూ మేమూ ఆమెతో పాటు బిగబట్టిన ఊపిరి వదిలాం. ముక్కురంధ్రాలు ఏర్పాటు చేసిన చిన్నారితో డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఈఎన్‌టీ, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
అంటుకట్టిన గుండె వికసించిన వేళ!
అరుణ(24)ది కాకినాడ. గోపాలకృష్ణతో వివాహం తర్వాత ఆమె పూణేలో స్థిరపడ్డారు. కొడుకు కార్తీక్‌కు రెండున్నర ఏళ్లు. అందమైన కుటుంబం. అంతలోనే కల్లోలం. 2015లో సొంత ఊరికి వెళ్లినప్పుడు ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. వైద్యపరీక్షలు చేసి ఆమెకు కార్డియోమయోపతి అని తేల్చారు. పూణే డాక్టర్ల సూచన మేరకు ఆమె మా హాస్పిటల్‌కు వచ్చారు. పరీక్షల్లో గుండె సామర్థ్యం కేవలం 15 శాతం మాత్రమేనని తేలింది. వెంటనే గుండెమార్పిడి శసచికిత్స చేస్తే తప్ప బతకదు. ఆ విషయం అరుణ భర్తకి చెప్పి జీవన్‌దాన్ సంస్థలో పేరు నమోదు చేయించుకొమ్మని సూచించాం. కిందటి ఏడాది జూన్ నెల అది. కొద్దిరోజుల్లోనే స్కూళ్లూ కాలేజీల ప్రారంభం. కాబట్టి బంధువులూ, స్నేహితులతో విహారయాత్రలకు ప్లాన్ చేసుకున్నాం.
జూన్ 14న అరుణ ఆరోగ్యం మరోసారి విషమించింది. ఆమె మృత్యువుతో పోరాడుతోంది. అలాంటి సమయంలో మా వినోదాలూ, విహారాల కంటే పేషెంట్ ప్రాణాలే ముఖ్యమనుకున్నాం. మా సరదాలను వాయిదా వేసుకున్నాం. అప్పుడు ఒక వ్యక్తి దురదృష్టం అరుణ పాలిట అదృష్టమైంది. రోడ్డు ప్రమాదానికి గురైన ఒక వ్యక్తి బ్రెయిన్‌డెడ్ కావడంతో అరుణకు గుండె లభ్యమైంది. దాదాపు తొమ్మిదిగంటల కఠోర శ్రమతో కూడిన సర్జరీ చేశాం. అందరిలోనూ ఉత్కంఠ. ఎట్టకేలకు ఆపరేషన్ సక్సెస్. పదిరోజుల్లో అరుణ కోలుకొని ఇంటికి వెళ్లారు. భర్త, కొడుకుతో ఇప్పుడామె ఆనందంగా ఉన్నారు. ఆమె ఆనందం చూస్తే నాలోకి సర్జన్ పట్ల కించిత్ గర్వం.అకుంఠిత దీక్షతో పనిచేసే అద్భుతమైన నా టీమ్ పట్ల అపారమైన గౌరవం. కోలుకున్న అరుణతో డాక్టర్ పి.వి. నరేశ్‌కుమార్, సీనియర్ కార్డియోథొరాసిక్ అండ్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్