మహానటి | Today Savitri Jayanti | Sakshi
Sakshi News home page

మహానటి

Published Tue, Dec 5 2017 11:29 PM | Last Updated on Wed, Dec 6 2017 3:30 AM

Today Savitri Jayanti - Sakshi

పండు వెన్నెల, నిండు జాబిలి అని మహానటి సావిత్రిని పోల్చడం అంటే.. చెప్పిందే చెప్పడం. కొత్తగా కూడా ఆమె కోసం ఏమీ కవిత్వాన్ని సృష్టించలేం. చిరునవ్వు వెలుగు సావిత్రి. చిరుగాలి అల్లరి సావిత్రి. కళ్లే కాదు, ఆమె మౌనమూ ఒక చక్కటి పలకరింపు. సహజ నటి అంటారు కదా.. అది సహజత్వం మాత్రమే కాదు. నటనలోని సంపూర్ణత్వం కూడా! మంచి మంచి సినిమాలను మన కోసం మిగిల్చి వెళ్లిన సావిత్రి.. జయంతి నేడు. ఆ సందర్భంగా సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరితో ‘సాక్షి’ సంభాషణ.

మీ అమ్మగారి గురించి మాట్లాడగానే మీకు గుర్తొచ్చే విషయాలు?
అందమైన ఆ నవ్వు, చిలిపితనం, ఎప్పుడూ హ్యాపీగా ఉండటం. ఇవే గుర్తొస్తాయి.

నిజమే.. ఆ నవ్వు, కొన్ని పాత్రల్లో చూపించిన చిలిపితనాన్ని మేమూ మరచిపోలేం..
మీరు సినిమాల్లో చూసినవి. నేను అమ్మను రియల్‌ లైఫ్‌లో దగ్గరగా చూశాను. ‘దేవదాసు’ సినిమాలో ఎర్లీ స్టేజెస్‌లో కొంచెం కొంటెగా, హ్యాపీగా కనిపిస్తుంది కదా.. రియల్‌ లైఫ్‌లోనూ అలానే ఉండేది. అమ్మ 45 ఏళ్లు మాత్రమే బతికింది. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఆవిడ హ్యాపీగా ఉండటమే నాకు తెలుసు.
     
కానీ, సావిత్రిగారిది ‘ట్రాజెడీ లైఫ్‌’ అనే ఇమేజ్‌ మిగిలిపోయింది. అది బాధగా ఉంటుంది కదా...
అవును. జనరల్‌గా సినిమా ఫీల్డ్‌ అనేటప్పటికి ఏ విషయాన్నయినా ఎక్కువ చేసి చెబుతారు. అసలు ఏమీ జరిగి ఉండదు. ఓ వార్త పుట్టిస్తారు. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఆ వార్త చేరేలోపు పెద్దదైపోతుంది. చివరికి బెలూన్‌ని బాంబ్‌లా చూపించేస్తారు. అమ్మ విషయంలో అదే జరిగింది.
     
మీ అమ్మగారి చివరి రోజుల్లో మీ నాన్నగారు (నటుడు జెమినీ గణేశన్‌) పట్టించుకోలేదని, ఆస్పత్రిలో అనామకురాలిలా ఆమె ఉండేవారని కూడా అంటుంటారు...

అమ్మ దగ్గరే ఉండేవారు నాన్న. స్పెషలిస్ట్‌ అనదగ్గ ఏ డాక్టర్‌నీ ఆయన వదిలిపెట్టలేదు. నేను, నా తమ్ముడు ఆస్పత్రికి వెళ్లి చూస్తుండేవాళ్లం. నిజానికి అమ్మను విదేశాలు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ ఇప్పిద్దామనుకున్నాం. నాన్న డాక్టర్స్‌తో మాట్లాడితే, ‘అసలు ప్రయాణం చేసే పరిస్థితి లేదు’ అన్నారు. అందుకని ఆగాం. ఇది తెలియనివాళ్లు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదని, సరైన చికిత్స చేయించలేదని, విదేశాలు తీసుకెళ్లలేదని అంటుంటారు.

సావిత్రిగారు కోమాలో ఉన్నప్పుడు మీరు టీనేజ్‌లో ఉండి ఉంటారేమో?
నాకప్పుడు 16 ఏళ్లు. అప్పటికి నా పెళ్లయింది. ఒక బాబు కూడా పుట్టాడు. ఈ వయసులో ఇంటికి పరిమితం కాకూడదని నాన్న చదివించారు. సరిగ్గా ఫైనల్‌ ఎగ్జామ్స్‌ టైమ్‌లో అమ్మ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పుడు బాబ్జీ పెద్దమ్మ ‘నువ్వు ఎగ్జామ్స్‌ గురించి పట్టించుకో. అమ్మని నాన్న చూసుకుంటారులే’ అని, నన్ను దగ్గరుండి తీసుకెళ్లి ఎగ్జామ్స్‌ రాయించింది. ఎగ్జామ్, ఎగ్జామ్‌కి మధ్య గ్యాప్‌ వస్తుంది కదా.. అప్పుడు వెళ్లి అమ్మను చూసేదాన్ని. అమ్మ దగ్గరకెళ్లి ‘నేనూ, తమ్ముడూ బాగున్నాం. బాగా చదువుకుంటున్నాం’ అని బాబ్జీ పెద్దమ్మ చెప్పమనేది. అలానే చెప్పేదాన్ని.
     
కోమాలో ఉండేవారు కాబట్టి, మీరలా చెప్పినప్పుడు సావిత్రిగారిలో చలనం ఉండేది కాదు..
కళ్లు తెరచి అలా చూస్తుండేది. ఒక్కోసారి మాత్రం నా బుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకునేది. పిల్లలంటే ఇష్టం కాబట్టి, అప్పుడు చలనం వచ్చేదేమో. డాక్టర్లు ఆమెతో కంటిన్యూస్‌గా మాట్లాడమనే వాళ్లు. మేం ఏదేదో చెబుతుండేవాళ్లం. మరి.. అమ్మకు అవి అర్థమయ్యాయో లేదో తెలియదు. 19 నెలలు కోమాలో ఉండిపోయింది. అందులోంచి బయటకు రాకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.
   
బాబ్జీ పెద్దమ్మ అంటే సావిత్రిగారి అక్కా?

కాదు. మా నాన్నగారి పెద్ద భార్య. ఆవిడ కూడా అమ్మను బాగానే పట్టించుకునేది.
     
ఆవిడకు ఎంతమంది పిల్లలు. రేఖ (నటి) పుష్పవల్లిగారి కూతురు కదా?
అవును. నాన్నగారి ఇంకో భార్య పుష్పవల్లి కూతురు రేఖ. తనకో సిస్టర్‌ (రాధ) కూడా ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన పెద్దమ్మ అసలు పేరు అలమేలు. నాన్నగారు ‘బాబ్జీ’ అని పిలిచేవారు. మేం కూడా బాబ్జీ పెద్దమ్మా అనేవాళ్లం. ఆవిడకు నలుగురు కూతుళ్లు.

‘దగ్గరుండి పెద్దమ్మ ఎగ్జామ్స్‌ రాయించారు’ అని చెప్పారంటే.. మీరంతా బాగా ఉండేవారన్న మాట..
అమ్మ, పెద్దమ్మ బాగుండేవాళ్లు. ఎక్కువ రోజులు హాలిడేస్‌ ఉంటే మేం కొడైకెనాల్‌ వెళ్లేవాళ్లం. అక్కడ అమ్మకో ఇల్లు. బాబ్జీ పెద్దమ్మకో ఇల్లు ఉండేది. పిల్లలమంతా ఆ ఇంటికీ ఈ ఇంటికీ తిరుగుతూ.. ఆడుకునేవాళ్లం.

పుష్పవల్లిగారు కూడా మీ బాబ్జీ పెద్దమ్మలా మీతో బాగుండేవారా?
నాన్న అప్పుడప్పుడూ ఆవిడ ఇంటికి తీసుకు వెళ్లేవారు. ఆమె బాగానే మాట్లాడేది కానీ, బాబ్జీ పెద్దమ్మ అంత క్లోజ్‌ కాదు. అయితే అమ్మ, పుష్పవల్లి ఆంటీ బాగానే ఉండేవారు.

మరి.. ఆవిడ పిల్లలు రేఖ, రాధతో మీ అనుబంధం?
పిల్లలం బాగానే ఉండేవాళ్లం. రేఖ ముంబైలో ఉండేది. తన మూతి విరుపు, నవ్వు అమ్మలా ఉంటాయని పుష్పవల్లి ఆంటీ అంటుండేది. ‘నా కడుపున పుట్టావు. చేష్టలన్నీ ఆవిడవే’ అని ఆంటీ అంటే అమ్మ నవ్వేది. చిన్నప్పుడు రేఖ, రాధతో మాకు క్లోజ్‌నెస్‌ పెద్దగా లేదు. పెద్దయ్యాక మాత్రం క్లోజ్‌ అయ్యాం. రేఖ అయితే ‘నాకు బిడ్డలు లేరు. యు ఆర్‌ మై బేబీ’ అని నన్ను అంటుంటుంది. నా తమ్ముడు (సతీష్‌) కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. రాధ కూడా అక్కడే ఉంటోంది. వాళ్లిద్దరి మధ్య రాకపోకలు ఉన్నాయి.
     
ఎంత లేదన్నా ఒక్క తల్లి కడుపున పుట్టలేదు కాబట్టి, మీ అందరి మధ్యా చిన్నపాటి మిస్‌ అండర్‌స్టాండింగ్స్‌ అప్పుడప్పుడూ అయినా రావడం కామనే కదా?
చిన్నప్పుడు లేవు కానీ, కొంచెం పెద్దయ్యాక పొరపొచ్చాలు వచ్చిన మాట వాస్తవమే. ఇటు యంగ్‌ అటు ఓల్డ్‌ కాని ఏజ్‌ ఒకటుంటుంది కదా. అప్పుడు చిన్న చిన్న మిస్‌ అండర్‌స్టాండింగ్స్‌ వచ్చాయి. మా పిల్లలు పెద్దయ్యాక వాళ్ల కెరీర్‌ గురించి, బాగోగుల గురించీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మాకు పిల్లల భవిష్యత్తు ప్రధానంగా అనిపించింది. మా మధ్య ఉన్న పొరపొచ్చాలు కూడా మాయమయ్యాయి. మా మధ్య రాకపోకలు బాగానే ఉంటున్నాయి.
     
అమ్మానాన్న మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పిల్లలందరూ ఎలా ఉండేవాళ్లు?
వాళ్లిద్దరికీ పడలేదని మాకు తెలియదు. ఎందుకంటే మా దగ్గర వాళ్లేమీ చెప్పలేదు. దాంతో మేమంతా బాగానే ఉండేవాళ్లం.
     
ఒకవేళ తెలిసి ఉంటే.. ఆ మిస్‌ అండర్‌స్టాండింగ్స్‌ని పోగొట్టడానికి ఏదైనా చేసేదాన్నని ఇప్పుడు మీకు అనిపిస్తోందా?

ఆ ఫీలింగ్‌ ఉంది. అయితే అప్పుడు నాది టీనేజ్‌. ఇప్పుడు పదిహేను పదహారేళ్ల పిల్లలకు ఉన్నంత మెచ్యూర్టీ అప్పట్లో ఉండేది కాదు. పైగా అమ్మ పెంపకంలో మాకు కష్టాలు తెలియలేదు. లైఫ్‌ హ్యాపీగా గడిచిపోయేది.

జెమినీ గణేశన్‌గారి మొదటి, రెండో భార్య పిల్లలను కూడా మీతో పాటే  సమానంగా చూసేవారా మీ అమ్మగారు?
ఒకర్ని ఎక్కువగా మరొకర్ని తక్కువగా చూడటం అమ్మకు తెలియదు. మా బాబ్జీ పెద్దమ్మ కొంచెం స్ట్రిక్ట్‌. అందుకని పెద్దమ్మ పిల్లలు అమ్మ దగ్గర ఫ్రీగా ఉండేవాళ్లు. అమ్మ దగ్గరికొచ్చి జడలు వేయించుకునేవాళ్లు.
     
జడలు వేసేంత తీరిక సావిత్రిగారికి ఉండేదా?
ఈ విషయంలో అమ్మను మెచ్చుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా పిల్లలను అశ్రద్ధ చేయలేదు. ఏదైనా మనం ప్లాన్‌ చేసేదాన్ని బట్టే ఉంటుందని అమ్మ లైఫ్‌ చూసి తెలుసుకున్నాను. తనో స్టార్‌ అనే ఫీలింగ్‌ అమ్మకు ఉండేది కాదు. అందరి అమ్మలు తమ పిల్లలను ఎలా చూసుకుంటారో మా అమ్మ కూడా అలానే చూసుకుంది.
     
జెమినీ గణేశన్‌గారు సావిత్రిగారి ఆస్తి కొల్లగొట్టారనే సందేహం కొంతమందిలో అలానే ఉండిపోయింది...
అది నిజం కాదు. ఎవరూ ఎవరి ఆస్తినీ కొల్లగొట్టలేదు. మా అమ్మగారు మా ఇంటికి ఏమైనా కొంటే, ఆ ఇంటికీ కొనాల్సిందే. ఆ మధ్య ఓ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు నేను చెవికి జూకాలు పెట్టుకుని వెళ్లాను. అటు నాన్నవైపు బంధువుల్లో ఒకామె దగ్గర కూడా అలాంటిదే ఉంది. ‘మీ అమ్మ కొనిచ్చిందే’ అన్నారు. అమ్మ ఏదైనా ఇష్టంగా కొనిచ్చిందే తప్ప ఎవరూ అడిగి కొనిపించుకోలేదు. కానీ, అమ్మ ఆ ఇంటి నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు. మేం కూడా ఆ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉండేవాళ్లం. అక్కణ్ణుంచి మేం ఏదీ ఆశించలేదు. అమ్మ ఆస్తుల్లో వాళ్లకి ఏమీ ఇవ్వలేదు. అక్కణ్ణుంచి మేం ఏమీ తెచ్చుకోలేదు. అమ్మని నాన్న మోసం చేయలేదు కానీ, కొందరు బంధువులు మాత్రం చేశారు.

∙మరి.. చివరి రోజుల్లో సావిత్రిగారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారనే అభిప్రాయం ఎందుకు బలపడింది.. సావిత్రిగారి అంతిమ క్రియలు ఎవరింట్లో జరిగాయి?
కొందరి ఊహలకు అంతు ఉండదు. అమ్మ ఎన్నో సినిమాలు చేసింది. ఆవిడకు ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయి? నాన్న ఆవిణ్ణి దయనీయ స్థితిలో వదిలేయలేదు. చివరి కార్యక్రమాలన్నీ నాన్న ఇంటి (చెన్నై, నుంగంబాక్కమ్‌) లోనే జరిగాయి. బాబ్జీ పెద్దమ్మ, పుష్పవల్లి పెద్దమ్మ దగ్గరుండి జరిపించారు.

అది సరే.. మీరు కూడా మీ అమ్మగారిలా అందంగా ఉంటారు కదా.. మరి ఆవిడలా హీరోయిన్‌ కావాలనుకోలేదా?
అమ్మ స్టార్‌ కావడంతో చిన్నప్పుడు మాకంత ఫ్రీడమ్‌ ఉండేది కాదు. అమ్మతో కలసి ఎక్కడికి వెళ్లినా చుట్టుముట్టేసేవారు. సినిమాకెళ్లినా, హోటల్‌కెళ్లినా... ఎక్కడికెళ్లినా ప్రైవసీ ఉండేది కాదు. దాంతో చాలా మిస్సయినట్లుగా అనిపించేది. అందుకే నేను సినిమాల్లోకి వెళ్లాలనుకోలేదు. అమ్మకి కూడా ఆ ఫీలింగ్‌ లేదు. నాది పాత పద్ధతి అనిపించవచ్చేమో కానీ, ఇంటి పట్టున ఉండి భర్త–పిల్లలను బాగా చూసుకుంటే చాలు.. వేరే ఏ వ్యాపకం అవసరంలేదనుకున్నా. ఉద్యోగాలు చేసేవాళ్లను తప్పుబట్టడంలేదు. నా ఫీలింగ్‌ చెప్పానంతే. పిల్లలు పెరిగే టైమ్‌కి తల్లిదండ్రుల అవసరం చాలా ఉంటుంది. ఉదయం ఉరుకుల పరుగులతో బయటికెళ్లి, సాయంత్రం పిల్లలతో గడిపే తీరిక లేకపోతే ఏం లాభం? అమ్మా నాన్నల పరంగా మేం మిస్సయిన విషయం ఒకటుంది. స్కూల్లో ‘పేరెంట్స్‌ అండ్‌ టీచర్స్‌ మీటింగ్‌’ అంటే వచ్చే వాళ్లు కాదు. ఫోన్‌లో టీచర్స్‌తో మాట్లాడినా.. మిగతా పిల్లల్లా మన అమ్మానాన్న రాలేదే? అనే ఫీలింగ్‌ ఉండేది.
     
మీ అమ్మగారు అమాయకత్వం నిండిన పాత్రలు కొన్ని చేశారు.. నిజంగా కూడా అలానే ఉండేవారని మా ఫీలింగ్‌?

ఎగ్జాట్లీ. అమ్మ చాలా ఇన్నోసెంట్‌. తలుపు తట్టి ఎవరేం అడిగినా కాదనేది కాదు. మా పిల్లలకు బాగాలేదనో.. మా ఆవిడకు బాగాలేదనో.. ఇలా రకరకాల కారణాలు చెప్పి, డబ్బులు తీసుకెళ్లిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఫేస్‌ డల్‌గా పెట్టుకుంటే చాలు.. వెనకా ముందూ ఆలోచించకుండా హెల్ప్‌ చేసేది.

మరి.. అలా ఇవ్వొద్దని మీరు, మీ తమ్ముడూ చెప్పేవాళ్లు కాదా?
అప్పుడు మాకంత వయసు లేదు. నాన్న మాత్రం, ‘వాళ్లు చెబుతున్నది నిజమా? కాదా? తెలుసుకుని హెల్ప్‌ చేస్తే బాగుంటుంది’ అనేవారు. అయినా అమ్మ పట్టించుకునేది కాదు. మనకి ఇంత డబ్బుంది కదా.. ఇస్తే ఏం పోతుంది? అనే ధోరణిలో ఉండేది.

ఇప్పుడు సావిత్రిగారి లైఫ్‌ ఆధారంగా వైజయంతీ మూవీస్‌ ‘మహానటి’ తీస్తున్నారు కదా.. దర్శకుడు నాగ అశ్విన్‌ మీకు కథ చెప్పారా?
చెప్పారు. కొన్ని విషయాలు అడిగితే చెప్పాను. షూటింగ్‌ చేస్తున్న టైమ్‌లో కూడా ఏదైనా డౌట్‌ వస్తే, ఫోన్‌ చేస్తున్నారు. చెబుతున్నాను.

దాసరిగారి డైరెక్షన్‌లో మీ అబ్బాయి అభినయ్‌ ‘యంగ్‌ ఇండియా’ మూవీ ద్వారా పరిచయమయ్యారు కదా.. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం?
అమ్మమ్మ బ్యాగ్రౌండ్‌ చూపించి, అభినయ్‌ చాన్సులు తెచ్చుకోవాలనుకోలేదు. అప్పుడు దాసరిగారు కూడా ఫొటోషూట్‌ చేసి, కరెక్ట్‌గా ఉంటాడని తీసుకున్నారు. ఆ తర్వాత చాలా కథలు విన్నాం. కొన్ని నచ్చాయి. అయితే మంచి ప్రొడ్యూసర్‌ సెట్‌ కాలేదు. నచ్చని కథలకు మంచి ప్రొడ్యూసర్స్‌ కుదిరారు. అయినా ఆ సినిమాలు చేసి ఏం లాభం? అన్నీ ప్రాపర్‌గా కుదిరితేనే చేద్దామనుకుంటున్నాం.
     
గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ లైఫ్‌ స్టోరీతో తీసిన తమిళ సినిమా ‘రామానుజన్‌’లో టైటిల్‌ రోల్‌ చేశారు అభినయ్‌. గెటప్‌ చాలా బాగుంది...
థ్యాంక్స్‌. ఆ సినిమా చాన్స్‌ కూడా దానంతటదే వచ్చింది. మంచి క్యారెక్టర్‌. అభినయ్‌ చాలా బాగా చేశాడనే పేరు కూడా వచ్చింది.
   
జనరల్‌గా మంచి బ్యాగ్రౌండ్‌ ఉన్నవాళ్లు పిల్లల కోసం సినిమాలు తీస్తున్నారు.. మీకా ఆలోచన?
అభినయ్‌తో ఈ మాటే అన్నాను. ‘వారసుల కోసం కొందరు సొంత బేనర్‌ పెట్టి సినిమాలు తీస్తున్నారు. నేను, నాన్న (గోవింద రావు) నీకోసం సినిమాలు తీయడంలేదనే బాధ ఉంటే చెప్పు. కోట్లు కోట్లు లేకపోయినా సినిమాలు తీసే స్థితి అయితే ఉంది’ అన్నాను. అభినయ్‌ ఒప్పుకోలేదు. ‘అమ్మమ్మ ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి. ఆ మనీతో సినిమాలు వద్దు. నా టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకుని, అవకాశాలు తెచ్చుకుంటాను’ అన్నాడు.
     
కాలిఫోర్నియాలో ఉన్న మీ తమ్ముడి గురించి?
తమ్ముడి పిల్లలు కూడా సెటిలయ్యారు. తను హ్యాపీ. మేం అప్పు డప్పుడూ వెళుతుంటాం. అమ్మ మా కోసం కష్టపడింది. మేమంతా ఆనందంగా ఉన్నాం. చిన్నప్పుడు తెలియలేదు కానీ, పెద్దయ్యాక ‘ఇంత ఆస్తి సంపాదించడానికి అమ్మ ఎంత కష్టపడి ఉంటుందో’ అనిపిస్తుంటుంది. అప్పుడు మాత్రం గుండె కలుక్కుమంటుంది.
– డి.జి.భవాని

నేడు సావిత్రి జయంతి సందర్భంగా ‘మహానటి సావిత్రి కళాపీఠం’ ఆధ్వర్యంలో విజయవాడలోని ‘తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం’లో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ‘‘ఈ సందర్భంగా ‘మిస్‌ ఏషియా ఇంటర్నేషనల్‌ 2016’ ఫస్ట్‌ రన్నరప్‌ రష్మీ ఠాగూర్‌కి మహానటి సావిత్రి పురస్కారాన్ని అందించనున్నాం’’ అని కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి, గౌరవాధ్యక్షులు పి. శ్రీనివాస్‌ తెలిపారు.

సావిత్రిగారు ఫస్ట్‌ ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ – నాగ అశ్విన్‌
‘ఎవడే సుబ్రమణ్యం’తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు నాగ అశ్విన్‌. ప్రస్తుతం సావిత్రి జీవితం ఆధారంగా ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలు నాగ అశ్విన్‌ మాటల్లోనే...

సావిత్రిగారి జీవిత కథతో సినిమా తీయాలని ఎందుకు అనిపించింది?
ఆమె ‘ఫస్ట్‌ ఇండియన్‌ సూపర్‌ స్టార్‌’ అని నా ఒపీనియన్‌. ఆవిడ జీవితాన్ని ప్రజలు మరచిపోక ముందే చెప్పాలనిపించింది. అందుకే ‘మహానటి’ మొదలుపెట్టా.
     
ఆవిడ జీవితంలో మిమ్మల్ని అంతగా ఇన్‌స్పైర్‌ చేసిన అంశాలేంటి?
ఫిమేల్‌ ఆర్టిస్టులకు మేల్‌ ఆర్టిస్ట్‌ల కన్నా తక్కువ పారితోషికం ఉంటుంది. బాలీవుడ్‌లో దీపికా పదుకోన్‌ వంటి హీరోయిన్లు ఈ విషయం గురించి అప్పుడప్పుడూ చెబుతుంటారు. కానీ, 60 ఏళ్ల క్రితం సావిత్రిగారు తనతో పాటు యాక్ట్‌ చేసిన హీరోలకంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. హిందీలో మధుబాల వంటి హీరోయిన్లకు కూడా అది సాధ్యం కాలేదు. దీన్నిబట్టి సావిత్రిగారి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఈ తరానికి చెందిన మీరు సావిత్రిగారి గురించి వాళ్లూ వీళ్లు చెబితేనో, సినిమాలు చూశో తెలుసుకుని ఉంటారు.. ఆవిడ గురించి సినిమా తీయాలని ఎప్పుడు అనిపించింది?
చిన్నప్పుడు అమ్మమ్మవాళ్లు ఏ సినిమా చూసినా అందులో దాదాపు సావిత్రిగారు ఉండేవారు. మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ.. ఇలాంటివన్నీ అన్నమాట. అలా నాకు సావిత్రిగారు స్క్రీన్‌ మీద పరిచయమయ్యారు. ఆవిడ ఎంత గొప్ప నటో తెలిసింది. కొంచెం పెద్దయ్యాక ఆవిడ లైఫ్‌ గురించి తెలుసుకున్నాను. సీనియర్‌ డైరెక్టర్స్‌ కూడా చెప్పారు. అవన్నీ  విన్నప్పుడు ఇలాంటి మంచి నటి లైఫ్‌ని స్క్రీన్‌ మీద సెలబ్రేట్‌ చేయాల్సిందే అనుకున్నా. ఈ సినిమా ఓ సెలబ్రేషన్‌లా ఉంటుంది.

సావిత్రిగారి పాత్రకు కీర్తీ సురేశ్‌ న్యాయం చేస్తున్నారా?
ఓ సినిమా బాగా రావాలంటే కాస్టింగ్, టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్, నేచర్‌ అన్నీ సహకరించాలి. ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. ఓ పదేళ్ల క్రితం కీర్తీ ఈ పాత్రకు సరిపోయి ఉండేది కాదు. మరో పదేళ్ల తర్వాతా సరిపోయి ఉండేది కాదు. రైట్‌ టైమ్‌లో ఈ రోల్‌ చేస్తోంది. పర్ఫార్మెన్స్‌ బాగుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement