‘పట్టుకుపోయేదేం లేదు’ అని చెప్పడానికి తన చేతుల్ని పైకే పెట్టించుకుని, దేహాన్ని ఖననం చేయించుకున్నాడు అలెగ్జాండర్ ది గ్రేట్. ‘కనులు లేవని నీవు కలత పడవలదు’ అంటూ స్పర్శలిపిని చెక్కి ఇచ్చి, చెక్కిన ఆ చేతులతోనే ఈ ప్రపంచానికి చిరస్మరణీయం అయ్యాడు ‘ఆఖరివాడు’ ది గ్రేట్.
చిన్న గ్రామం అది. ఎంత చిన్నదంటే.. ఒక పెద్ద కుటుంబమంత. రెండొందల పదేళ్ల క్రితం ఆ గ్రామ జనాభా ఆరొందల పది. జనాభాను బట్టి చూస్తే ఇప్పటికీ అది చిన్న గ్రామమే. ఐదేళ్ల క్రితం నాటి లెక్కల ప్రకారం జనాభా మూడు వేలకు మించి లేదు. ఆరొందల పదిమంది ఉన్న ఆ గ్రామంలో ఆరుగురు మనుషులున్న ఒక కుటుంబం ఉండేది. తల్లి, తండ్రి, నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఆఖరి సంతానం మగపిల్లవాడు. గ్రామంలో సారవంతమైన నేలలు, సున్నితమైన పర్వత ప్రాంతాలు, పండ్లతోటలు, వ్యవసాయ క్షేత్రాలు, ద్రాక్ష తోటలు ఉండేవి. వైద్యుడు, మంత్రసాని, దర్జి, తాళాల మనిషి, తాళ్ల మనిషి, కళ్లేల మనిషి ఉండేవారు. ఈ కళ్లేల మనిషి గుర్రాలకు, శునకాలకు తోలు కళ్లేలు తయారు చేస్తుండేవాడు. పైన చెప్పుకున్న ఆరుగురు మనుషుల కుటుంబం ఆయనదే. ఆఖరివాడు ఎప్పుడూ ఆయన్ని అంటుకునే ఉండేవాడు. తల్లిని కదా చంటి పిల్లలు అంటుకుని ఉండేది, ఈ ఆఖరివాడు తన తండ్రిని అంటుకుని ఉండేవాడు. ‘వెళ్లరా అమ్మ దగ్గరికి’ అని చెప్పినా వినకుండా మూడేళ్ల వయసున్న ఆ ఆఖరివాడు తండ్రి దగ్గరే ఉండేవాడు. ఇంటి ప్రాంగణంలోనే ఒక వైపు ఉండేది ఆయన కళ్లేల పరిశ్రమ. తోళ్లను తేలిగ్గా ఒక ఆకృతిలోకి కోసేవాడు. కోసిన తోళ్లను కలిపి మేకులు కొట్టేవాడు. ఇంకా ఏవో హంగులు జత చేశాక అందమైన కళ్లేలు తయారయ్యేవి.
ఈ పనులన్నింటినీ ఆఖరివాడు అబ్బురంగా చూస్తూ కూర్చునేవాడు. తండ్రికి కళ్లేలొక్కటే పని కాదు. ముకుతాళ్లు, గుర్రపు జీనులు తయారుచేసేవాడు. ఆ ఒడుపునంతా దగ్గర్నుంచి చూస్తుండేవాడు ఈ ఆఖరివాడు. ఒకరోజు తండ్రి ఇంట్లో లేనప్పుడు తండ్రి పనిచేసే చోటుకు వెళ్లి కూర్చున్నాడు. వాడికీ తండ్రిలా చెయ్యాలని ఉంది. ఒక తోలు ముక్క తీసుకున్నాడు. పదునైన పరికరం అందుకుని దానితో తోలు ముక్కపై గట్టిగా కొట్టాడు. పరికరం చెయ్యి జారి, ఎగిరొచ్చి ఆఖరివాడి కంటికి తగిలింది! కంటిచూపు పోయింది. తర్వాత కొన్నాళ్లకే గాయం పెద్దదై రెండో కన్ను మీదా దుష్ప్రభావం చూపించి, రెండో కన్నూ పోయింది. ఆఖరివాడు అంధుడయ్యాడు!కుటుంబ పెద్దకు కుటుంబ పోషణ ఒక్కటే బాధ్యత కాదు. రోజుకింత సంపాదించి తెస్తే అయిపోదు. కుటుంబ సంరక్షణ తీసుకోవాలి. కుటుంబ భవిష్యత్తును తీర్చిదిద్దాలి. పిల్లలకు ఒక దారి చూపించాలి. ఆఖరివాడికి చూపు లేదు దారి చూపించడానికి.
చూపు లేకున్నా దారి వేశాడు. వేసిన దారినే చూపుగా మార్చాడు. మొదట ఎ,బి,సి,డిల దారి. తర్వాత బడి దారి. పదేళ్లు వచ్చేనాటికి ఆఖరివాడికి తండ్రి తన పక్కనే ఉంచుకుని అన్నీ నేర్పించాడు. చెక్కతో అక్షరాలను చెక్కి వాటిని వేళ్లతో తడిమి గుర్తించేలా తర్ఫీదు ఇచ్చాడు. గుర్తించిన అక్షరాలను చెయ్యి పట్టి రాయించాడు. ఆ గ్రామంలోని చర్చి ఫాదర్ ఆఖరివాడికి ప్రకృతి గురించి చెప్పాడు. ఏ పక్షి ఎలా కూస్తుందో, ఏ జంతువు ఎలా అరుస్తుందో, ఏ పువ్వు పరిమళం ఎలా ఉంటుందో, రుతువులు ఎలా మారుతాయో, ఎందుకు తెల్లవారుతుందో, ఎందుకు చీకటి పడుతుందో అర్థమయ్యేలా చెప్పాడు. ఆఖరివాడికి పదో ఏడు వచ్చిన ఆరు వారాలకు అతడిని గ్రామానికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలోని ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. అతడు అక్కడే ఉండి, అక్కడే చదువుకుని, అక్కడే పెరిగి పెద్దయి, అక్కడే పని చేసి, ఆ తర్వాత అక్కడే పాఠాలు చెప్పాడు. ఆ పాఠశాలే ‘రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్ యూత్’. ఆ నగరం పారిస్. ఆ అఖరివాడు లూయీ బ్రెయిలీ.
అతడి గ్రామం కూప్రే.కూప్రేలో రెండొందల పదేళ్ల క్రితం బ్రెయిలీ కుటుంబం నివసించిన ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయితే ఇప్పుడది ఇల్లు కాదు. మ్యూజియం. బ్రెయిలీ చనిపోయాక ఆయన చేతుల్ని కూప్రేలో ఖననం చేసి, మిగతా దేహాన్ని పారిస్‌లో పూడ్చిపెట్టారు. చేతులే జీవితాంతం ఆయనను కళ్లయి నడిపించాయి. ఆయన్నొక్కర్నే కాదు. ఆ చేతులతో ఆయన కనిపెట్టిన భాష ఎందరో అంధుల్ని చూపు కర్రలా నడిపిస్తోంది. అందుకే ఆయన చేతులకు అంత ప్రత్యేక ‘స్థానం’. ఇవాళ బ్రెయిలీ జనన దినం. ఎల్లుండి మళ్లీ మరణ దినం. ఒకే నెలలో రెండు రోజుల తేడాతో ఈ నలభై మూడేళ్ల ఆఖరివాడు జన్మించి, మరణించాడు. మరణించి స్పర్శలిపిగా పునర్జన్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment