వెల్‌కమ్ ట్యాక్స్ | 'Tomorrow's World Junk Food Day | Sakshi
Sakshi News home page

వెల్‌కమ్ ట్యాక్స్

Published Tue, Jul 19 2016 11:15 PM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM

వెల్‌కమ్ ట్యాక్స్ - Sakshi

వెల్‌కమ్ ట్యాక్స్

`రేపు వరల్డ్ జంక్‌ఫుడ్ డే
 
ఉన్న పన్నులకే కొవ్వు కరుగుతుంటే...
వెల్‌కమ్ చెప్పాల్సిన ఈ కొత్త పన్నేంట్రా నాయనా!
ఇన్‌కమ్ ట్యాక్స్ విన్నాం.
 వెల్త్ ట్యాక్స్ విన్నాం.
 సేల్స్ ట్యాక్ విన్నాం.
 సర్వీస్ ట్యాక్స్ విన్నాం.
 వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విన్నాం.
 ఇప్పుడీ వెల్‌కమ్ ట్యాక్స్ ఏంటండీ!
 అయినా ఎవరైనా...
 ఏదీ... మైండ్ సరిగా ఉన్నవాళ్లెవరైనా..
 ట్యాక్స్‌ని వెల్‌కమ్ చేస్తారా?
 కొత్త పన్ను వేస్తామంటే ఒప్పుకుంటారా?
 పర్సు వీక్ అవుతుందంటే ఓకే అంటారా?
 ఏమిటో!
 కేరళలో ఓకే అంటున్నారట!
 ‘ఫ్యాట్ ట్యాక్స్’ వేయబోతున్నారట!
 కొన్ని దేశాల్లో కూడా ఈ ట్యాక్స్ ఉందట!
 మనమూ దీనికి ఓకే అంటామా లేదా అన్నది...
 యు ఆర్ వెల్‌కమ్ టు డిసైడ్.

 
ఈ వర్షాకాలంలో... మీరు కేరళ వెళుతున్నారా? సన్నటి చిరుజల్లుల మధ్య ఏ కోచ్చిలోనో, త్రివేండ్రంలోనో, ఖరీదైన రెస్టారెంట్లలో కూర్చొని, పిజ్జాలు, బర్గర్లు, డోనట్లు.. శాండ్ విచ్‌లు.. పాస్తాలు... ఫ్రెంచ్ ఫ్రైస్... తింటే వెచ్చగా, హాయిగా ఉంటుందని భావిస్తున్నారా? అయితే, మీ జేబులు ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉంది.

ఎందుకంటే, ఒంట్లో కొవ్వు పెంచి, లావుకు కారణమయ్యే ఇలాంటి ఆహార పదార్థాల మీద కేరళలో ఇప్పుడు పన్ను వేయనున్నారు.  
 కేరళలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నేతృత్వంలోని ‘వామపక్ష ప్రజాస్వామ్య కూటమి’ (ఎల్.డి.ఎఫ్) ఇలా కొవ్వుపై పోరాటాన్ని పై స్థాయికి తీసుకువెళ్ళింది. పిజ్జాలు, బర్గర్లు, డోనట్స్ లాంటి వాటిపై ‘‘కొవ్వు పన్ను’’ పేరిట 14.5 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. వినియోగదారుల జేబుకు ఇది బరువైనా, వాళ్ళు బరువు పెరగకుండా ఉండడానికీ, ఆరోగ్యంగా జీవించడానికీ ఇది ఉపయోగపడుతుందని కేరళ సర్కారు భావిస్తోంది. మన దేశంలో ఈ తరహా ట్యాక్స్ విధించబోవడం ఇదే తొలిసారి. స్థూలకాయాన్ని తగ్గించడానికి ఉపయోగపడే ఈ పన్ను మన దగ్గర కూడా ఉంటే బాగుంటుందేమో అన్న చర్చ మొదలైంది.
 
ప్రపంచంలో తొలిసారిగా...
ఇంతకీ, ‘ఫ్యాట్ ట్యాక్స్’ అంటూ కొవ్వు పెంచే పదార్థాలపై ప్రత్యేకంగా పన్ను విధించడం ప్రపంచంలో తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసా? 2011లో డెన్మార్క్‌లో! జున్ను, వెన్న, నూనె, పాలు, మాంసం - ఇలా 2.3 శాతానికి మించి శ్యాచురేటెడ్ కొవ్వులున్న ఆహార పదార్థాలన్నిటి మీదా ఆ దేశంలో ‘కొవ్వు పన్ను’ వేశారు. దేశంలో స్థూలకాయ సమస్యను తగ్గించడానికి అది దోహదం చేస్తుందని భావించారు. ఇప్పటికీ, ప్రపంచ దేశాల్లో కొవ్వు పెంచే ఫుడ్ మీద రకరకాల పేర్లతో పన్నులు వేస్తున్నారు.
 
అది తగ్గాలంటే... ఇది తప్పదు!
 ఇక ఇప్పుడు కేరళ సర్కార్ పన్ను పోటు పొడవడం వెనుక ఓ కారణం ఉంది. ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ ప్రకారం దేశం మొత్తం మీద చిన్నతనంలోనే స్థూలకాయ సమస్య అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రెండోది కేరళ. ఆ రాష్ట్రంలో పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య తీవ్రంగానే ఉంది. అందుకే, ఇలా ‘ఫ్యాట్ ట్యాక్స్’ ద్వారా జంక్‌ఫుడ్ ప్రియత్వానికి కళ్ళెం వేయాలని చూస్తోంది.

నిజానికి, తెలుగునాట కూడా ఇప్పుడు అంతకంతకూ పెరుగుతున్న సమస్య - స్థూలకాయం. హైదరాబాద్ సంగతే తీసుకుంటే, నగర జనాభాలో నూటికి 19 నుంచి 20 మంది ఇటు ఒబేసిటీ (స్థూలకాయం), అటు దానివల్ల వచ్చే డయాబెటిస్ (మధుమేహం) - రెండూ కలగలిసి ‘డయాబెసిటీ’తో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్ అమ్మే బహుళ జాతి సంస్థలు వచ్చే వరకు మన దేశంలో స్థూలకాయ సమస్య ఇంత ఉండేది కాదు. అవి వచ్చాకే, చిన్న వయసులోనే స్థూలకాయమనే సమస్య రెట్టింపు అయినట్లు ఆహార నిపుణుల మాట. క్రమపద్ధతి అంటూ లేని జీవనశైలి, ఆహారవేళలు మర్చిపోయి ప్రతి క్షణం పనిలో మునిగిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల లాంటి వారు తీరా ఆకలేసినప్పుడు ఒక బర్గర్, సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేయడం లాంటివి కూడా ఈ సమస్యను తీవ్రం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒంట్లో కొవ్వును పెంచి, మనిషిని మందకొడిగా మార్చే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచడానికి ‘ఫ్యాట్ ట్యాక్స్’ వేయడం స్వాగతించాల్సిందే అన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఈ దెబ్బతో మానేస్తారా?
ఒకప్పుడు వంద రూపాయలుండే బర్గర్ ఖరీదు కేరళలో ఈ ‘ఫ్యాట్ ట్యాక్స్’ వల్ల రూ. 114.5 అవుతుంది. అంతమాత్రాన అందరూ వీటిని తినడం మానేస్తారా? చెప్పలేం! మెక్సికోలో కూడా సరిగ్గా అదే జరిగింది. పన్ను పోటు దెబ్బకు ఆర్థికంగా, సామాజికంగా దిగువ, మధ్యశ్రేణి కి చెందిన కుటుంబాల వారు కొవ్వు పెంచే ఇలాంటి ఆహారం తగ్గించారు. అయితే, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చెందిన కుటుంబాలు మాత్రం తమ ఆహారపుటలవాట్లు మానలేదు!  

ఈ ‘ఫ్యాట్ ట్యాక్స్’ వల్ల ఈ ఫుడ్ ఐటమ్స్ అమ్మకాలేవో ఇప్పటికిప్పుడు తగ్గుతాయన్న అత్యాశ వైద్య నిపుణులకు కూడా లేదు. అయితే, ఫలానా ఆహారపదార్థం వల్ల కొవ్వు పెరిగి, లావయ్యే ప్రమాదం ఉందనే చైతన్యం పెరుగుతుంది. తల్లితండ్రులు కూడా తమ పిల్లల్ని వాటికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడిక ఈ జంక్‌ఫుడ్ ఉత్పత్తి సంస్థలు కూడా కొవ్వు తక్కువుండే ఉత్పత్తుల తయారీకి సిద్ధమయ్యే అవకాశం ఉంది. మైదాతో కాకుండా, ఆరోగ్యకరమైన పదార్థంతో, తక్కువ కేలరీలుండే జున్నుతో పిజ్జాలు, పోషకపదార్థాలు కూరిన బర్గర్ల లాంటివి తయారు చేస్తాయని ఒక ఆశ.

ఇప్పటికైతే, కొవ్వు పెంచే జంక్‌ఫుడ్ కొన్నప్పుడు వేసే బిల్లు మీద ప్రత్యేకంగా పెద్ద పెద్ద అక్షరాల్లో ‘ఫ్యాట్ ట్యాక్స్ ఇంత...’ అని ముద్రించడం వల్ల కూడా మరింత ఉపయోగం ఉంటుందని కొందరు సూచిస్తున్నారు. అలా పదే పదే ఆ అక్షరాల్ని చూడడం వల్ల తెలియకుండానే అది మనసు మీద ముద్ర పడుతుంది. దీర్ఘకాలంలో ఆ జంక్ ఫుడ్‌కు దూరమవుతారు.
 
ఆదాయ మార్గమా? ఆరోగ్య దానమా?
ఇంతకీ ఈ పన్ను పోటు వల్ల ప్రభుత్వ ఖజానాకు వచ్చే లాభమెంత? ఈ ‘ఫ్యాట్ ట్యాక్స్’ వల్ల కేరళ సర్కారుకు ఏటా దాదాపు రూ. 10 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని ఒక అంచనా. అదేమంత పెద్ద మొత్తం కాదు. కానీ, ‘మీరు తింటున్నది అనారోగ్యకరమైన జంక్ ఫుడ్’ అని ప్రజలకు పదే పదే గుర్తు చేయడం వరకు ఈ పన్ను పోటు కచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. స్థూలకాయం వల్ల మనుషుల్లో హుషారు తగ్గి, పని గంటలు, ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతింటూ, సర్జరీలకే లక్షల లక్షలు ఖర్చవుతున్న సమయంలో ఇది వెల్‌కమ్ ట్యాక్స్ అంటున్నారు. ‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అంటూ ప్రభుత్వం ప్రచారం చేయడానికి కోట్లు ఖర్చుపెట్టాల్సొస్తున్న సమయంలో, ఆదాయం కేవలం 10 కోట్లయినా, ఈ ‘కొవ్వు పన్ను’ వల్ల జనంలో వచ్చే చైతన్యం వేల కోట్లతో సమానమని సర్కారు వాదన.   
 
పనిలో పనిగా చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలపై కేరళ ప్రభుత్వం కొరడా జళిపించలేదేమిటన్న ప్రశ్నా వచ్చింది. గొలుసుకట్టు బహుళ జాతి సంస్థల మీద, వాటి ఉత్పత్తుల మీదే తప్ప స్థూలకాయానికి కారణమయ్యే మన దేశవాళీ ఆహార పదార్థాలపై పన్ను వేయలేదేమిటని నోళ్ళు నొక్కుకుంటున్నవాళ్ళూ లేకపోలేదు. ఆ మాటకొస్తే, వీధి కూడళ్ళలో, స్కూళ్ళ దగ్గర, ఆకర్షణీయమైన ఆహారశాలల్లో ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు సులభంగా అందుబాటులో ఉంటే అసలు ఈ గొడవే లేదుగా అంటున్నవాళ్ళూ ఉన్నారు. ఏమైనా ‘ఫ్యాట్ ట్యాక్స్’ వల్ల జంక్ ఫుడ్ తినడం మానుతారా లేదా అన్న మాట అటుంచితే, ఈ ప్రతిపాదనతో అందరిలో ఇంత చర్చ రేగడం కొత్త చైతన్యానికి కారణమైనట్లే! ఆ మేరకు ఈ ‘ఫ్యాట్ ట్యాక్స్’ ప్రయోజనం నెరవేరినట్టే . - రెంటాల
 
ఒంటికి పనికొచ్చేవేనా?
పిజ్జాలు, బర్గర్లు లాంటివి ‘జంక్ ఫుడ్’ అనీ, ఒంటికి ఉపయోగం లేకపోగా, కొవ్వుకు కారణమనీ అంటూ ఉంటాం. కానీ, మన దేశవాళీ చిరుతిండ్లలోనూ చాలాభాగం కడుపు నిండడానికే తప్ప, కేలరీల పరంగా ఉపయోగమైనవి కావు.బజ్జీలు, వడా పావ్ దగ్గర నుంచి బట్టర్ చికెన్, దాల్ మఖానీ, పన్నీర్ మఖానీ దాకా ఆహారపదార్థాలు, రస మలాయ్ నుంచి బర్ఫీ దాకా చాలాభాగం స్వీట్లు విగ్రహపుష్టికే తప్ప, నిజంగా ఒంటికి పనికొచ్చేవి కావని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇంటి తయారీ ఆహారమైనప్పటికీ, ఉప్పు, చక్కెర, నూనె ఎక్కువగా ఉండే తిండి వల్ల ఆరోగ్యానికి హాని. ఆరోగ్యకరమైన ఆహారమే తినడం, వ్యాయామం చేయడం కీలకం.
 
 
బరువు తగ్గించడానికి... భలే భలే!
దేశపౌరులు విపరీతంగా బరువు పెరగడం చూసి, గుండె బరువెక్కిన వివిధ దేశాలు వినూత్న మార్గాల్ని అనుసరిస్తున్నాయి. టర్కీలో ప్రభుత్వ భవనాల్లో మొదటి మూడు అంతస్థులకూ ఎవరైనా మెట్లెక్కి వెళ్ళాల్సిందే! లిఫ్ట్ వాడకం నిషిద్ధం. టర్కీ గవర్నర్ గత ఏడాది ఈ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. రంజాన్ మాసంలో ‘ఈద్’ పండుగ నాటి కల్లా రెండు కిలోలు, అంతకు మించి బరువు తగ్గితే, తగ్గిన ప్రతి కిలోకీ ఒక గ్రాము వంతున గతంలో బంగారం ఇచ్చింది దుబాయ్ ప్రభుత్వం. జపాన్‌లో లావెక్కడం చట్టవిరుద్ధమట! దేశప్రజల్లో స్థూలకాయం రేటును తగ్గించడానికి అక్కడ చట్టపరమైన చర్యలు చేపట్టారు. నడుము కొలత ఎంత ఉండాలో కూడా నిర్దేశించారు. 40 నుంచి 74 ఏళ్ళ లోపు మహిళలకైతే 35.4 అంగుళాలు, పురుషులకైతే 33.5 అంగుళాల లోపలే నడుము చుట్టుకొలత ఉండాలి {బిటన్‌లో స్థూలకాయాన్ని తగ్గించడానికి 2014 అక్టోబర్‌లో ఒక పద్ధతి ఆలోచించినట్లు వార్తలు వచ్చాయి. లావాటివాళ్ళు గనక ఒంట్లో కొవ్వు కరిగించుకుంటే, అందుకు ప్రతిఫలంగా డబ్బు చెల్లిస్తారు. నగదు రూపంలో కానీ, షాపింగ్ ఓచర్ల రూపంలో కానీ ఆ ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచన.
 
విదేశాలు... అపరాధ పన్నులు!
‘ఫ్యాట్ ట్యాక్స్’ అనేది డెన్మార్క్, హంగరీ లాంటి యూరోపియన్ దేశాల్లో గతంలో విధించినదే! చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే శీతల పానీయాలపైన, చాక్లెట్ బార్స్, చిప్‌ల మీద హంగరీలో పన్ను వేశారు.  ‘ప్రపంచంలోకెల్లా అత్యంత లావాటి దేశం’ అనే అపకీర్తి కిరీటం ఒకప్పుడు మెక్సికోకు దక్కింది. మెక్సికోలో కూడా తీపి ఎక్కువగా ఉండే పానీయాలు, అల్పాహారంగా తినే తృణధాన్యాలు, మిఠాయిలపై పన్ను వేశారు. అవన్నీ తినడం, తాగడం పాపం (సిన్) అని గుర్తు చేస్తూ, తప్పు చేసినందుకు విధించిన పన్ను అని చెప్పేలా ‘‘సిన్ ట్యాక్స్’’ అని దానికి పేరు పెట్టారు. ఆ దేశంలో చక్కెర పానీయాలపై 10 శాతం పన్ను వేశారు.
   
{ఫాన్స్‌లోనూ చక్కెర ఎక్కువుండే కార్బొనేటెడ్ పానీయాలపై ‘సిన్ ట్యాక్స్’ విధించారు. ‘భూమండలంపై అత్యంత లావాటి దేశాల్లో ఒకటి’గా సామోవా దేశానికి పేరు. పసిఫిక్ మహాసముద్రంలోని ఈ ద్వీపసమూహ దేశంలో 1984నుంచి ఇప్పటికి 32 ఏళ్ళుగా చక్కెర పానీయాలపై పన్ను ఉంది. ఆస్ట్రేలియాలో ఒకప్పుడు సోడా, పటికబెల్లం మీద, అలాగే అతిగా పాలిష్ చేసిన గోదుమల పిండితో చేసిన బేకరీ ఉత్పత్తుల మీద 10 శాతం పన్ను వేశారు.  {బిటన్‌లో చిన్నతనంలో స్థూలకాయ సమస్యను అరికట్టేందుకు చర్యలు మొదలెట్టారు. ప్రతి 100 మిల్లీలీటర్ల పానీయంలో 5 మిల్లీ గ్రాముల కన్నా ఎక్కువ చక్కెర ఉండే శీతల పానీయాలపై వచ్చే ఏడాది నుంచి పన్ను విధించాలని యోచిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement