ఉత్తరాల తోటకు... పూచిన పూలు
‘ఉభయ కుశలోపరి... నేను క్షేమం, నువ్వు క్షేమమేనని తలంచుతున్నాను.’ అంటూ 12 ఏళ్ల అమ్మాయి – 14 ఏళ్ల అబ్బాయి.. ఒకరికొకరు లేఖలు రాసుకున్నారు. యోగక్షేమాలను తెలుసుకుంటూ... చేతిరాతల్లోనే ప్రతి నెలా పలకరించుకునేవారు. కట్ చేస్తే... 42 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కలుసుకుని ఉత్తరాల కట్ట విప్పారు. స్వచ్ఛమైన స్నేహానికి చిరునామాగా వాళ్లు. స్నేహం విలువను తెలుపుతూ పలువురి ప్రçశంసలను అందుకుంటున్నారు కూడా.
న్యూయార్క్‌కు చెందిన జార్జ్ ఘోస్న్ (56), లోరీ గెర్జ్ట్ (54)లు గత 42 ఏళ్లుగా ఒకరికొకరు కలుసుకోలేదు, చూసుకోలేదు, కనీసం మాట్లాడుకోలేదు. కేవలం నెలనెలా లేఖలు రాసుకుంటూ ప్రాణ స్నేహితులయ్యారు. ఫోనులో కబుర్లు లేవు, వాట్సాప్‌ల్లో చాటింగ్‌లు, మీటింగ్‌లు ఏమీ లేకుండానే 42 ఏళ్ల పాటు ఫ్రెండ్‌షిప్ కొనసాగించారు. చివరికి జార్జ్ ఏమనుకున్నాడో ఏమో... లోరీని సర్‌ప్రైజ్ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లి తలుపుతట్టాడు.
ఒకరిని ఒకరు కలుసుకుని భావోద్వేగాలను తట్టుకోలేక కన్నీళ్లతో ఆలింగనం చేసుకున్నారు. ఆప్యాయంగా ఊసులాడుకున్నారు. ఒకరికొకరు రాసుకున్న లేఖలను చూసుకుని మురిసిపోయారు. లోరీ భర్త, పిల్లలతో కలిసి చాలా సంతోషంగా గడిపిన జార్జ్... తన కుటుంబ సభ్యులను కూడా లోరీకి పరిచయం చేశాడు. ఆ తర్వాత 42 ఏళ్ల క్రితం వాళ్లు చదివిన స్కూల్‌కెళ్లి ఇప్పటి పిల్లలతో సంతోషాన్ని పంచుకున్నారు.