కోయిల! వేప!మల్లి! మామిడి! ఎవరు గొప్ప? | Ugadi festival is Celebrated With Six Flavors | Sakshi
Sakshi News home page

కోయిల! వేప!మల్లి! మామిడి! ఎవరు గొప్ప?

Published Sat, Apr 6 2019 2:02 AM | Last Updated on Sat, Apr 6 2019 2:04 AM

Ugadi festival is Celebrated With Six Flavors - Sakshi

కొత్తరాగమున కుహూకుహూమని మత్తిలి కోయిల కూయగా... కొమ్మలో కోయిలా కూయంటదే...తొందరపడి ఒక కోయిల ముందే కూసింది...గున్నమామిడి కొమ్మమీద గూళ్లురెండున్నాయి... ఒక గూటిలోన రామచిలకుంది... ఒక గూటిలోని కోయిలుంది... కోయిల పాట బాగుందా... కొమ్మల సిరి బాగుందా...

ఏవమ్మోయ్‌ కోయిలమ్మా! నీ మీద వచ్చిన పాటలు వింటూ కూర్చున్నావు. యేమంత మిడిసిపాటుతో నెల రోజుల ముందు నుంచే పాడటం ప్రారంభించావు. అంత గొప్పలు ఎందుకు నీకు? నువ్వు పాడటానికి ఓ సమయం సందర్భం లేదా...అంటూ మావి చిగురు కోకిలను ఎకసెక్కాలాడటం ప్రారంభించింది.బాగానే ఉంది నువ్వు చెప్పేది. నీ చిగుళ్లు ముందుగా రాబట్టే కదా నేను ముందుగా వాటిని తిని, గొంతు సవరించి, కుహూకుహూ అని కూయటం ప్రారంభించాను... అని గడుసుగా సమాధానం చెప్పింది కోకిల.నా చిగుళ్లు తింటేనేగా నీకు గొంతు అంత తియ్యగా స్వరం పలికేది. నేను చిగురించకపోతే నీ పాటకు తావెక్కడ. నా గొంతు తియ్యగా ఉందా. నీ చిగుళ్లు తియ్యగా ఉంటాయని ఎవరో చెప్పడంతో తిన్నాను. ఆ వగరుకి నాకు గొంతులో దురద వచ్చి, ఆ దురద పోగొట్టుకోవడానికి ఇలా అరుస్తున్నాను. అదే మీరంతా తీయని పాట అంటున్నారు.

అంతేఅయితే ఆ ఘనత అంతా నాదే. నా వగరు చిగుళ్ల వల్లే నీకు తీయని కంఠస్వరం వచ్చింది. నీకు దురద పెడితే మాకెందుకు, దురద పెట్టకపోతే మాకెందుకు. ఇంతకీ మా సంగతి పక్కన పెట్టు, నువ్వు అంత ముందుగానే ఎందుకు పూత పూశావు. నీ అవసరం ఉన్న రోజు వచ్చేసరికి పూత కాస్తా పిందెలు అయిపోతావు. మమ్మల్ని అనే ముందు నిన్ను నువ్వు ఓ సారి చూసుకుని మమ్మల్ని వేపుకు తినకమ్మా వేప తల్లీ!నా సంగతి సరే. ఆ గున్నమామిడి సంగతి చూడండి... మిమ్మల్ని అనే హక్కు నాకు లేదు. అందుకే మౌనంగా ఉంటున్నాను. పిందెగా ఉండవలసిన నేను అప్పుడే కాయలు, పండ్ల రూపంలోకి మారిపోతున్నాను. ఇలా ఎందుకు జరుగుతోందంటావు చెరుకు తల్లీ!కాలమహిమ! ఋతువులకు అనుగుణంగా పంటలు పండే రోజులు మారిపోయాయి. పోనీలే... ముందు నుంచే మనల్ని రుచి చూస్తారు కదా. వాళ్లకి ఆనందం కలిగిస్తున్నాం కదా. కానీ ఈసారి నేను ఎందుకో అంత తియ్యగా ఉండేలా కనిపించట్లేదు. మన మల్లి తల్లి మాత్రం అప్పుడే పరిమళాలను ఘుమాయించేస్తోంది. గుభాళించి ఏం లాభం.

ఒకప్పుడు నా పూలతో జడలు కుట్టించుకుని, అద్దం ముందు నిలబడి, ఫొటోలు తీయించుకోవడం చిన్నపిల్లలందరికీ ఒక సరదా. మరి ఇప్పుడో! అందరూ జుట్లు విరబోసుకునేవాళ్లు, పూలు పెట్టుకోవడానికి మొహమాట పడేవాళ్లూనూ. నాకు మాత్రం తాచుపాము జడలలో చుట్టలా చుట్టుకుని నల్లటి కురులలో తెల్లగా మెరవడం చాలా ఇష్టం. కనీసం కొందరైనా నన్ను అక్కున చేర్చుకుంటున్నారులే. అంతటితో తృప్తి చెందుతున్నాను.సరే మనలో మనం మాట్లాడుకుంటూ అసలు విషయం మర్చిపోయాను. ఈ రోజు మనందరం కలిసి ఒక విషయం గురించి చర్చించుకోవాలి. మన తెలుగువారి కొత్త సంవత్సరాదికి ఉగాది అని ఎందుకు పేరు పెట్టాలి. మనతోటే కదా ఉగాది వచ్చేది. కోయిల కూస్తేనే కదా వసంతం వచ్చేది. మామిడి, చెరకు, వేపపూత, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం కలిస్తేనే కదా పచ్చడి. మరి మనలో ఎవరో ఒకరి పేరు మీద ఈ పండుగను పిలుచుకోవచ్చుగా.

ఆమని అంటారేకాని, కోమని అనచ్చుగా. కనీసం అందులో మన కోయిల పేరులోని మొదటి అక్షరమైనా ఉంటుంది.  లేకపోతే ఆమిడి అనొచ్చు, వేపని అనొచ్చు, మల్లిమ అనొచ్చు. ఏదో ఒక పేరు పెట్టి మనల్ని గౌరవించుకోవచ్చు కదా. ఏదీ కాకుండా ఉగాది అని పేరు పెట్టారు. సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో. అందరి కంటె పెద్దదయిన మామిడి...మిత్రులారా! మీకొక విషయం చెబుతాను వినండి. ఈ పండుగకు కోయిల పేరు పెట్టామనుకోండి. మిగతా వారికి కోపం వస్తుంది. మనమందరం ప్రకృతి మాత సంతానం. మనలో ఏ ఒక్కరు అలిగినా ఆ తల్లికి బాధే కదా మరి. అందుకే ఆలోచించి, మనమెవ్వరం బాధపడకుండా ఈ పేరు పెట్టి ఉంటారు. అయినా ఉగాది అనే పేరు ఎంత బాగుందో కదా! ఇంకో విషయం కూడా ఆలోచించు. ఈ పండుగ ఆరు రుచులతో పాటు కోయిల, మల్లెల సమ్మేళనం. ఏ ఒక్కరికో సంబంధించినది కాదు కదా. అందుకే ఉగాది అయ్యింది.  
– డా. వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement