నవయుగాది | Ugadi turns Health Conscious | Sakshi
Sakshi News home page

నవయుగాది

Published Sat, Apr 6 2019 3:01 AM | Last Updated on Sat, Apr 6 2019 3:01 AM

Ugadi turns Health Conscious - Sakshi

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం ; న్యాయ్యేణ మార్గేణ మహీం మహీశాఃఅందరూ బాగుండాలి. కడుపు నిండా తినాలి. మంచి బట్టలు వేసుకోవాలి. చేతి నిండా పని ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి.  పాలకులు నిస్వార్థంగా ఉండాలి. న్యాయంగా పాలించాలి. కష్టంలో ఓదార్చాలి ప్రజాభీష్టాన్ని మన్నించాలి.  ఇదే ఉగాది ఆకాంక్ష...

మనం ఏ శుభకార్యానికైనా సరే, సంకల్పం చెప్పుకునేటప్పుడు స్వస్తిశ్రీ చాంద్రమానేన.... నామ సంవత్సరే అని చెప్పుకుంటాం. అంటే ఉగాది మనకు అత్యంత కీలకమైన పండుగ అన్నమాట. ఇది చాంద్రమానాన్ని బట్టి అంటే చంద్రుడి గమనానికి అనుగుణంగా గణించే సంవత్సరం అన్నమాట.
ఉగాది నుంచి తెలుగు వారికి కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. నిన్నటి వరకు ఉన్న సంవత్సరం విలంబి నామ సంవత్సరం కాగా నేటి నుంచి ‘వికారి’ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 

ఆరోగ్యాన్నిచ్చే అభ్యంగనం 
ఉగాది వంటి పర్వదినాలలో నువ్వులనూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటారని శాస్త్రోక్తి. ఉగాదినాడు పొద్దున్నే అభ్యంగన స్నానం చేయాలి. అంటే ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి, కుంకుడురసం లేదా సీకాయపొడితో తలస్నానం చేయాలి.

శుభ్రమైన దుస్తులు శుభప్రదం
ఈరోజున చిరిగిన, మాసిన లేదా విడిచిన బట్టలు ధరించిన వారికి, తలస్నానం చేయని వారికి సంవత్సరమంతా రకరకాల వ్యాధులు, దారిద్య్రబాధలు సోకుతాయని శాస్త్రోక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాదినాడు వీలయితే నూతన వస్త్రాలు లేదా చిరుగులు పడని, శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించడం శ్రేయోదాయకం. తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదÆ .

ఉగాది సంప్రదాయం
ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గుపెట్టి లేదా అటకలతో సహా అన్నిగదులలోనూ బూజు దులిపి ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి లేదా వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి. ఇంటిలో మనం పూజించే ఇష్టదేవతల విగ్రహాలను షోడశోపచారాలతో పూజించి, శుచిగా చేసిన పిండివంటలను, ఉగాది పచ్చడిని నివేదించాలి. 

పంచాంగం అంటే ...
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. తిథి వలన సంపద, నక్షత్రం వల్ల పాపపరిహారం, సరైన యోగంతో వ్యాధి నివృత్తి, కరణం ద్వారా కార్యానుకూలతను పొందవచ్చు. కాబట్టి చేసే పనులలో అనుకూలతను, జయాన్ని కాంక్షించేవారందరూ, కాలాన్ని తెలిసి కర్మలు చేసేవారందరూ తప్పక పంచాంగం చూడాలి. 

ఆరు రుచులు... అనంతమైన అర్థాలు
ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరురుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి జీవునికి అంటే... మానవునికి, ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేస్తుంది ఈ పండుగ. సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈసత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి.  

శుభారంభానికి ఉగాది
బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్నధిష్ఠించిందీ ఉగాదినా డేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలు ప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదనే కదా అర్థం. 

వైవిధ్యభరితం
ఉగాది పచ్చడిలో కొత్త చింతపండు బదులు నిమ్మరసం, మిరియాలకు మారుగా ఎండుకారం లేదా పచ్చిమిరప వాడుతున్నారు. కొందరు చెరకు ముక్కలు, అరటిపండు ముక్కలు, గసగసాలు, సోంపు... ఇలా ఎవరి అభిరుచి, అలవాటు లేదా ఆచారాన్ని బట్టి ఉగాది పచ్చడి తయారుచేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో దీనిని పచ్చడిలా గట్టిగా చేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాలలో కొత్తకుండలో పోసి, ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు, అతిథులకు ఇవ్వడం ఆనవాయితీ. ఈ రోజున ఉపవాసం ఉండి బ్రహ్మదేవుని పూజించిన వారికి సంవత్సరమంతా సుఖసంతోషాలు లభిస్తాయని శాస్త్రోక్తి. వర్షాలు బాగా కురవాలని కోరుతూ వ్యవయసాయదారులు ఈ వేళ ఇంద్రుణ్ణి పూజించడం కొన్ని ప్రాంతాలలో కనిపించే ఆచారం.

పంచాంగ శ్రవణ ఫలమేమిటి?
ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమట. అదొక్కటే కాదు, పంచాంగ శ్రవణం చేయడం వలన భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను వేదవిదుడైన బ్రాహ్మణునకు లేదా యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. అంతేకాదు, సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం గ్రహదోషాలు తొలగి, వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందట. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్‌ కార్యాచరణను చేపట్టడం సులభం అవుతుందని పెద్దల అనుభవం.
– డి.వి.ఆర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement