అలజడి | Unrest is difficult to travel Despite | Sakshi
Sakshi News home page

అలజడి

Published Mon, Mar 13 2017 10:45 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

అలజడి

అలజడి

జీవితం అనే సాగరంలో మన ప్రయాణం కాగితపు పడవలోనే. అలలో జడి లేకున్నా... మనలో అలజడి  ఉన్నా ప్రయాణం కష్టం. ఇతరుల కన్నా ముందే ఉండాలన్న అలజడి ఎన్నో జీవితాలను ముంచేస్తోంది. ముందుండాల్సింది ఇతరుల కన్నా కాదు... పోరాడాల్సింది సాటివాళ్లతో కాదు... మీ సామర్థ్యంతో మీరే ప్రతిరోజూ తలపడండి. పోరాడండి. అప్పుడు మీ ప్రతి అడుగూ ఒక ముందడుగు అవుతుంది. కాగితపు పడవలో కూడా సుదూర ప్రయాణం చేస్తారు.

కాలింగ్‌బెల్‌ మోగింది. డైనింగ్‌ టేబుల్‌ మీదే తలపెట్టి నిద్రపోతున్న కీర్తి లేచి టైమ్‌ చూసింది. అర్థరాత్రి దాటింది. డోర్‌ తీసింది. ఎదురుగా భర్త వంశీ. గుమ్మంలోనే ప్రశ్నించింది కీర్తి. ‘‘కనీసం ఈ ఒక్కరోజైనా ఇంటికి త్వరగా రావచ్చు కదా. ఎప్పుడూ పని పని.. అంటారు. ఈ రోజు దినేష్‌ బర్త్‌ డే అనైనా గుర్తుందా. వాడు ఇంత సేపు చూసి చూసి కేక్‌ కట్‌ చేయకుండా అలాగే నిద్రపోయాడు..’’ బాధగా అంది కీర్తి.‘‘ఈ పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేసినా ఇంకా వెనకపడిపోతాం. కష్టపడితేనే కదా విజయం సాధించేది. నీకిది చెప్పినా అర్థం కాదు. కేక్‌ కట్‌ చేయడమేగా. చేసేయాల్సింది..’’ సింపుల్‌గా అంటూ వెళ్లి పడుకున్నాడు వంశీ. నీళ్లు నిండిన కళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయింది. టేబుల్‌ మీద అలాగే వదిలేసిన కేక్‌ తీసి ఫ్రిజ్‌లో పెట్టింది.

పోటీలో వెనకపడిపోతే...
ఆఫీస్‌ లిఫ్ట్‌డోర్‌ తెరిచీ తెరుచుకోకముందే లోపలికి పరిగెత్తాడు వంశీ. అంతే వేగంగా తన క్యాబిన్‌కి వెళ్లి సీట్లో కూర్చుని, సిస్టమ్‌ ఆన్‌ చేశాడు. ఆయాసంతో గుండె పట్టేసినట్టయింది. రొప్పుతున్నాడు. ఇక కుర్చీలో కూర్చోలేననిపించింది. తప్పనిసరై హాస్పిటల్‌కి వెళ్లాడు. డాక్టర్‌ పల్స్‌ చెక్‌ చేసి ‘‘ఎందుకంత అలజడి పడుతున్నారు. హైబీపి ఉంది. రోజుకి ఎన్నిగంటల పనిచేస్తారు’’ అన్నాడు. ‘‘కనీసం 18 నుంచి 20 గంటలు. ఎందుకలా అడిగారు?’’ అన్నాడు వంశీ ‘‘అలా మిషన్‌లా పనిచేస్తే ఆరోగ్యం ఇలాగే ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకోండి’’ అంటున్న డాక్టర్ని వారిస్తూ.. ‘‘అలా అయితే ఈ పోటీ ప్రపంచంలో బతగ్గలమంటారా?’’అంటూనే లేచి వెళ్లడానికి నాలుగడుగులు వేసి, కళ్లు తిరిగి కిందపడిపోయాడు.

ఫైళ్లతోనే కుస్తీ
ఫోన్‌లో సమాచారం తెలియగానే కీర్తి అన్నయ్య రఘు వచ్చాడు. అన్నను చూడగానే ఏడుపు ఆగలేదు కీర్తికి. ‘‘ఆరోగ్యం పాడుచేసుకునేంతగా ఏమైంది?’’ అని అడిగాడు చెల్లెలిని. ‘‘ఇరవై నాల్గంటలూ పని పని అంటూ ఆఫీసులోనే ఉంటున్నాడు. ఇంట్లో ఉన్నా ఆఫీసుకు సంబంధించిన ఫోన్లు, ఫైళ్లతోనే ఉంటాడు. నన్నూ, దినేష్‌ను పూర్తిగా మర్చిపోయాడు. తన తిండి, నిద్ర గురించి కూడా పట్టించుకోవడంలేదు. ఎప్పుడూ మనిషికి ఆందోళనే. అదేమని అడిగితే ‘పనిలో ఉంటున్నాను కదా. పోటీకి తగ్గ స్పీడ్‌ లేకపోతే ఎలా?’ అంటున్నాడు. చెబితే కోపం, చెప్పకపోతే ఏమైపోతాడో అని భయం. ఎలా చక్కదిద్దాలో అర్థంకావడంలేదన్నయ్యా!’’ ఏడుస్తూనే తమ పరిస్థితి అంతా వివరించింది కీర్తి.

శ్రమలోనే కాలమంతా!
కౌన్సెలర్‌ ముందున్నాడు వంశీ. ఈ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే రిగ్రెషన్‌ థెరపీ ఒక గైడెన్స్‌లా ఉపయోగపడుతుందని నచ్చజెప్పి వంశీని రిగ్రెషన్‌ థెరపీకి తీసుకొచ్చాడు రఘు. కళ్లు మూసుకొని మౌనంగా ధ్యానముద్రలో ఉన్న వంశీకి కౌన్సెలర్‌ సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ సూచనలతో మెల్లగా తన జీవితాన్ని అర్థం చేసుకునే దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు వంశీ. కంపెనీలో తను. తన అవసరానికి మించి పనిచేస్తున్నాడు. కింది ఉద్యోగులను బాగా పనిచేయాలని, ఎక్కువ గంటలు పనిచేయాలని గైడ్‌ చేస్తున్నాడు.

అటు నుంచి గతంలో చేసిన ఉద్యోగాల జాబితా పరిశీలించాడు. అంతటా తన తోటివారందరిలోనూ ముందుండాలని ఎక్కువ శ్రమిస్తున్నాడు. అయినా, తనకన్నా తక్కువ గంటలు పనిచేసేవారే ముందుంటున్నారు. కాలేజ్, స్కూల్‌ రోజుల్లో తను అందరికన్నా ముందుం డాలని అనిపించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాడు. ఎందుకు? అన్వేషణ మొదలైంది. ఆ శోధనలో బాల్యదశలో ఒక చోట ఆగిపోయాడు వంశీ. కాసేపు ఆగి చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘నేను మూడు, అన్నయ్య ఐదవ తరగతి చదువుతున్నాం. మేమిద్దరం నాన్న ముందు నిల్చుని ఉన్నాం. నాన్నకు మా ప్రోగ్రెస్‌ రిపోర్ట్స్‌ ఇచ్చాం. నాన్న అన్నయ్యను మెచ్చుకుంటున్నాడు. తన జేబులో ఉన్న పెన్ను తీసి అన్నయ్య జేబులో పెట్టి, ‘నా పేరు నిలబెట్టేది నువ్వేరా’ అని ముద్దులు పెడుతున్నాడు. ‘మరి నాకు పెన్ను’ అన్నాను. ‘అన్నయ్యకన్నా మార్కులు ఎక్కువ తెచ్చుకో, అప్పుడు చూద్దాం’ అని వెళ్లిపోయాడు నాన్న. కష్టపడి చదవాలని అప్పుడే అనుకున్నా. అమ్మ అన్నానికి పిలిచినా వెళ్లకుండా చదువుతున్నాను. రాత్రిళ్లు కరెంట్‌ పోయినా దీపం పెట్టుకొని చదువుతున్నాను. నెక్ట్స్‌ క్లాస్‌కి స్కూళ్లో ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. మళ్ళీ అన్నయ్యకే ఎక్కువ మార్కులు వచ్చాయి. నేను ఇంకా ఎక్కువ కష్టపడి చదువుతున్నాను’’ అంటూ ఆగిపోయాడు వంశీ.

‘‘ఇంకా వెనక్కి ప్రయాణించండి. ఆ ప్రయాణంలో మిమ్మల్ని అమితంగా బాధించిన సంఘటన ఏదున్నా చెప్పండి’’ అన్నారు కౌన్సెలర్‌.
వంశీ ప్రయాణం ఇంకా వెనక్కి తిరిగింది. వంశీ చెబుతున్నాడు ‘‘నేను, అమ్మ గర్భంలో నుంచి అప్పుడే బయటకు వచ్చాను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నన్ను చూడ్డానికి వచ్చిన నాన్న ‘వీడేంటి ఇంత నల్లగా పుట్టాడు. పెద్దోడిది మంచి రంగు’ అంటున్నాడు. ఆయన చూపులు నన్ను అసహ్యించుకున్నట్టు ఉన్నాయి.

అన్నీ సక్రమంగా ఉంటేనే ముందంజనా!
‘‘వంశీ, మీరు ఇప్పుడు అమ్మ గర్భంలో నుంచి మీ గత జన్మలోకి ప్రయాణిస్తున్నారు. ఆ గతం తాలూకు అవశేషం ఎక్కడుందో చూడండి’’ అన్నారు కౌన్సెలర్‌. తల్లి గర్భంలో.. అటు నుంచి గతజన్మలోకి వంశీ ప్రయాణం సాగింది. ఆ అవశేషం గురించి వంశీ చెబుతూ ‘‘నేను అంధుడిని. రోడ్డుదాటలేకపోతున్నాను. ఎవరో వచ్చి నన్ను రోడ్డు దాటిస్తామన్నారు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. అందరూ పరిగెడుతున్నారు. కనీసం నేను రోడ్డు కూడా దాటలేకపోతున్నాను. దేవుడు నన్ను ఎందుకిలా పుట్టించాడు. అన్నీ సక్రమంగా ఉంటే అందరి కన్నా ముందుండేవాడిని. జీవితమంతా ఆ బాధతోనే గడిపాను. అలాగే మరణించాను’’ చెబుతున్న వంశీ గుండె నీరైంది.  

పోటీ మీద అవగాహన
‘‘వంశీ ఈ జన్మకు రండి. ప్రస్తుత పరిస్థితికి గత సంఘటనలకు బేరీజు వేసుకొని చూడండి’’ అంటూ కౌన్సెలర్‌ సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ‘‘వంశీ, మీ జీవనప్రయాణంలోని స్పష్టత మీద దృష్టి పెట్టండి.

మొదటిది: ‘అన్నయ్య కన్నా నేను తక్కువ’ అనే భావన మీలో ఎనిమిదేళ్ల వయసులో పడిపోయింది. దీంతో మెప్పు కోసం పోటీ పడాలని నిర్ణయించుకొని కష్టపడటం మొదలుపెట్టారు. మీ కష్టంలో ‘నాలో సామర్థ్యం తక్కువ’ అనే ఆలోచన బలంగా పడిపోయింది. సామర్థ్యాన్ని మెరుగుపెట్టుకుంటే మీ అన్నకన్నా నాలుగు మార్కులు సంపాదించడం పెద్ద కష్టమయ్యేది కాదు. ఇప్పుడు మీరు చేస్తున్నపని కూడా సామర్థ్యంతో కాకుండా కష్టంతో లాక్కొస్తున్నారు.

రెండవది: నల్లగా పుట్టానని, అందంగా ఉన్నవారితో పోటీపడలేననే భయాన్ని పెంచుకున్నారు. నల్లగా ఉన్న వారెంతో మంది సాధించిన విజయాలు ఇన్నేళ్లలో మీకు కనిపిం^è లేదా! అవగాహనకు రండి. శ్రీకృష్ణుడు నల్లగానే పుట్టి, అవతారపురుషుడయ్యాడనీ మీకూ తెలుసు కదా.

మూడవది: అంధుడిగా గత జన్మ అంతా బాధపడ్డారు. బాగుంటే అందరితో పోటీ పడి, వేగంగా పరిగెత్తేవాడిని అనుకున్నారు. అంధులుగా ఉన్నవారు కూడా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. వాళ్లు సాధించిన విజయాలను ఒకసారి పరిశీలించండి. ‘నేను ఇలా కాకుండా ఇంకోలా ఉండి ఉంటే’ అనుకోకుండా ‘మేధస్సుతో సాధించగలను’ అని నిర్ణయం తీసుకోండి. అందరితో కాకుండా మీతో మీరు పోటీ పడండి. కష్టంగా కాదు, ఇష్టంగా జీవించండి’’ కౌన్సెలర్‌ మాటలతో ప్రశాంతంగా మేలుకొన్నాడు వంశీ! ఇప్పుడు అతడికి హాయిగా ఉంది. తుఫాను తీరిన సముద్రంలా ఉన్నాడతను.

జీవితం సమతూకం..
కాలింగ్‌బెల్‌ మోగడంతో వెళ్లి డోర్‌ తీసింది కీర్తి. ఎదురుగా వంశీ! నమ్మబుద్ధికాక గడియారం కేసి చూసింది, సాయంత్రం ఆరు. హోమ్‌వర్క్‌ చేసుకుంటున్న దినేష్‌  తండ్రి చూసి ఆనందంగా ‘డాడీ..’ అంటూ పరిగెత్తుకువచ్చి తండ్రిని చుట్టేశాడు. ‘పని ఎప్పుడూ ఉండేదే. ఇవాళ సినిమాకెళ్దామా’ అంటూ సరదాగా మాట్లాడుతున్న భర్తను ఆశ్చర్యంగా చూస్తూండిపోయింది కీర్తి. ‘‘ఇలాగే ఉంటే ఎలా సినిమాకు లేట్‌ అయిపోతుంది పద పద..’’ అని తొందరపెడుతున్న వంశీని చూసి  తమ జీవితాల్లోకి వసంతం వచ్చేసిందని సంబరపడిపోయింది కీర్తి.

మన వాస్తవ పరిస్థితులకు  మనమే సృష్టికర్తలం
‘యద్భావం తద్భవతి’ అంటే ఏది ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది. తమ వాస్తవ పరిస్థితులకు తామే సృష్టికర్తలం అని గ్రహిస్తే సమస్యలుగా అనిపించినవన్నీ పరిష్కారమవుతాయి. అన్నింటా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆలోచనలను నమ్మకాలవైపు పయనింపజేయాలి. అదెలాగంటే, చిత్రకారుడు తెల్లని కాన్వాస్‌పై అద్భుతమైన చిత్రం వేయడానికి ఎంతటి బాధ్యత తీసుకుంటాడో ఎవరికి వారు తమ జీవితాన్ని మలచుకోవడంలో అలా స్వీయ బాధ్యత తీసుకోవాలి.
– డాక్టర్‌ న్యూటన్, పాస్ట్‌లైఫ్‌ రిగ్రెషన్‌ థెరపిస్ట్‌

సామర్థ్యాల పెంపుకు కృషి అవసరం
చెడు ఆలోచనలకు బలం ఇస్తే అలాంటి వాస్తవమే మనం చూస్తాం. దీంతో మన చుట్టూ అలాంటి వాతావరణమే ఉందనుకుంటాం. వంశీ ఆలోచనలో ఎప్పుడూ ‘అందరికన్నా ముందుండాలి’ అనుకునే వాడు. అయితే, ఆ పోటీని సామర్థ్యంతో కాకుండా, సమయంతో లెక్కించాడు. దీంతో జీవితంలో బ్యాలెన్స్‌ కోల్పోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. మన ఆలోచనలను గమనించి, సరైనదారిలో సామర్థ్యాలను పెంచుకున్నప్పుడే విజయం.
– డాక్టర్‌ లక్ష్మి, పాస్ట్‌లైఫ్‌ రిగ్రెషన్‌ థెరపిస్ట్‌

అపనమ్మకాలను నమ్మకాలవైపుగా మళ్లించాలంటే...
ఏదైనా చెడు ఆలోచన, అపనమ్మకం వంటివి కలిగినప్పుడు దానికి పూర్తి వ్యతిరేక ఆలోచనను పేపర్‌మీద రాయండి. ఇది మీలో ఒక శక్తివంతమైన ఆలోచనవుతుంది.మీకు అనుకూలమైన నిర్ణయాలను రాస్తూ ఉండండి. ఉదాహరణకు: నేను చాలా బాగున్నాను. నేను చేయగలను. నేను సాధించగలను.. ఇలాంటివి స్వీయ ఆనందం, ఆరోగ్యం, చుట్టూ అనుబంధాలు ఏవిధంగా ఉంటున్నాయో గుర్తించివీటి పట్ల ఉంటున్న అపనమ్మకాలను నమ్మకం వైపుగా మల్లించాలి.సినిమా దృశ్యం మాదిరి జీవితాన్ని కళ్లతో అత్యద్భుతంగా ఉన్నట్టు దర్శించాలి. అనుకూలంగా లేని సంఘటనలను చిత్రాలుగా ఊహించుకొని అవన్నీ చాలా బాగవుతున్నట్టు ఊహించాలి.రోజూ 30–40 నిమిషాలు ధ్యానం చేయాలి. దీని వల్ల చెడు ఆలోచనలు మంచివైపుగా ప్రయాణిస్తాయి.విశ్రాంతి లేకపోవడం, ఆందోళనలు, భయాలు అన్నీ ధ్యానంలో కరిగిపోతాయి. పాజిటివ్‌ ఆలోచనలకు దారి తీసి, ఆత్మవిశ్వాసాన్ని, వికాసాన్ని ధ్యానం పెంపొందింపజేస్తుంది.
– నిర్మల రెడ్డి చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement