అంతరిక్షం గురించి అప్‌డేట్స్..!
అంతరిక్ష పరిశోధనల గురించి, ఇతర గ్రహాల గురించి పరిశోధనలు కొత్త ఆసక్తులను రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో... నట్టింట్లో అంతరిక్షాన్ని ఆవిష్కరించవచ్చు. చూపుడు వేలితో నక్షత్రాలను టచ్ చేయవచ్చు. ఖగోళాన్ని ఒళ్లోకి తీసుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన సరికొత్త అప్లికేషన్‌లతో అనుక్షణం అప్‌డేట్స్‌ను అందుకోవచ్చు. అంతరిక్ష పరిశోధన సంస్థల సహకారంతో ఇవి సాకారం అవుతాయి.
ఒకవైపు సోషల్‌నెట్‌వర్కింగ్ గురించి... దీనివల్ల ఉపయోగాలేమిటి? అనార్థలేమిటి? అని చర్చలు కొనసాగుతుండగానే... సోషల్‌సైట్లు తమ ప్రాధాన్యతను మరింత పెంచుకొంటున్నాయి. విశ్వం గురించి వివరాలు అందిస్తూ దూసుకెళ్తున్నాయి. టెక్ స్టూడెంట్స్, అంతరిక్ష పరి శోధనల గురించి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం కొన్ని సోషల్‌నెట్ వర్కింగ్ అకౌంట్లు అనుక్షణం నాలెడ్జ్‌ను అప్‌డేట్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని...
నాసా నుంచి... అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) విశ్వానికి సంబంధించిన అబ్బురాలను ఇన్‌స్టాగ్రామ్, ఫ్లికర్‌ల ద్వారా షేర్ చేస్తోంది. తమ టెలిస్కోప్‌లకు చిక్కిన అద్భుతమైన అంతరిక్ష ఛాయాచిత్రాలను, వీడియోలతో కూడిన విశ్లేషణలను వీడియోషేరింగ్, ఫోటో షేరింగ్‌లకు అవకాశమున్న ఈ సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా షేర్ చేస్తోంది నాసా. విశ్వాంతరాలపై ఆసక్తి ఉన్నవారు నాసా సోషల్‌నెట్‌వర్కింగ్ అకౌంట్‌లకు సబ్‌స్క్రైబ్ అయితే, నిరంతరం అప్‌డేట్స్ వస్తుంటాయి.
రోవర్ ను ఫాలో అవ్వండి... అరుణగ్రహంలో జీవి జాడ గురించి, నీటి వనరుల గురించి శోధిస్తున్న ‘క్యూరియాసిటీ’రోవర్‌కు సొంత ట్విటర్ అకౌంట్ ఉంది. రోవర్ పరిశోధనల గురించి అప్‌డేట్స్ ఇందులో ఉంటాయి. ఈ అకౌంట్‌ను ఫాలో కావడం ద్వారా అరుణగ్రహ పరిశోధన ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసే ఫొటోలు ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తాయి.
స్పేస్ ఎక్స్... అంతరిక్ష పరిశోధనలు సాగిస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ ఇది. సిటిజన్స్‌ను ఇది స్పేస్‌టూర్లకు తీసుకెళ్తుంటుంది. అదంతా లక్షల డాలర్లతో ముడిపడిన వ్యవహారం. అందుకు బదులుగా వీడియోల రూపంలో అంతరిక్షం గురించి ఎన్నో అనుభవాలను అందిస్తోంది ఈ సంస్థ. ఫేస్‌బుక్‌లోనూ, యూట్యూబ్‌లోనూ స్పేస్ ఎక్స్ పేజ్‌లు, వీడియో చానళ్లు అందుబాటులో ఉన్నాయి. స్పేస్ క్రాఫ్ట్స్‌తో చేసిన విన్యాసాలు, అంతరిక్ష వివరాలు, ఆసక్తికరమైన ట్రివియా ఈ చానళ్లలో లభిస్తాయి.
హబుల్ టెలీస్కోప్ అకౌంట్...అంతరిక్ష పరిశోధనల వివరాల పట్ల ఆసక్తి ఉన్న వారికి చిరపరిచితమైనది ‘హబుల్ టెలిస్కోప్’. విశ్వంలో ఈ టెలిస్కోప్ అన్వేషణలను ట్విటర్‌కు అనుసంధానించారు. హబుల్ టెలిస్కోప్ తీసే ఛాయాచిత్రాలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ఒక ట్విటర్ అకౌంట్‌ను ఏర్పాటుచేశారు.
ఆర్బిటల్ సెన్సైస్... ఇది కూడా ఒక ప్రైవేట్ ఖగోళ పరిశోధన సంస్థ. తన పరిశోధన వివరాలను ఫేస్‌బుక్, ట్విటర్‌ల ద్వారా అందుబాటులో ఉంచడం ద్వారా విజ్ఞాన వారధిగా ఉంటోంది.
నాసా అప్లికేషన్లెన్నో... ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పై విశ్వవిజ్ఞానాన్ని పంచడానికి ఎన్నో అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది నాసా. నాసా టెలివిజన్, ది నాసా ఆప్, త్రీడీ సన్, హబుల్ సైట్, నాసా స్పేస్ వెదర్ మీడియా వ్యూవర్, స్పేస్ షటిల్ క్రూ... వంటి అప్లికేషన్లను అందుబాటులో ఉంచింది. ఇవన్నీ ఐఫోన్, ఐప్యాడ్‌లపై పనిచేస్తాయి.