శక్తివనరులు... సజ్జలు
చూడటానికి సజ్జలు చిన్నగా అనిపిస్తాయేమోగానీ వాటి వల్ల సమకూరే శక్తి మాత్రం చాలా ఎక్కువ. పీచుపదార్థాలు ఇంకా ఎక్కువ. సజ్జలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకుంటే వాటితో చేసే వంటకాలను పదే పదే తింటారు. సజ్జలతో ఒనగూరే ప్రయోజనాల్లో కొన్ని...
♦ సజ్జల్లో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. వంద గ్రాముల సజ్జల్లో మూడు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే రక్తహీనత (అనీమియా) ఉన్నవారు సజ్జలతో తయారు చేసిన పదార్థాలు తినడం మేలు.
♦ సజ్జల్లో ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తి వనరు. కణజాలం అభివృద్ధి కోసం కూడా ఫాస్ఫరస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఇక వరి, గోధుమల కంటే సజ్జల్లో ప్రోటీన్లు ఎక్కువ. అందుకే కణజాలం రిపేర్లకు కూడా ఇవి ఉపయోగపడతాయి.
♦ సజ్జల్లో పీచు పాళ్లు ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఇవి తోడ్పడతాయి. అంతేగాక ఈ పీచు వల్ల ఒంట్లోకి వచ్చే చక్కెర పాళ్లు చాలా నెమ్మదిగా విడుదలవుతుంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు సజ్జలతో చేసిన పదార్థాలు తినడం మంచిది. సజ్జల్లో ఉన్న పీచు పదార్థాలు మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి.
♦ సజ్జల్లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. అందుకే అవి ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. వయసు పెరిగే కొద్ది వచ్చే వ్యాధులను నిరోధిస్తాయి.