bajra
-
సజ్జలతో వంటలు
సజ్జ ఉల్లిపాయ ముత్తియాస్ కావలసినవి: సజ్జ పిండి – ఒక కప్పు, సన్నటి ఉల్లి తరుగు – అర కప్పు, పసుపు – పావు టీ స్పూను, మిరప కారం – ఒక టీ స్పూను, ధనియాల పొడి – ఒక టీ స్పూను, జీలకర్ర పొడి – ఒక టీ స్పూను, అల్లం + వెల్లుల్లి + పచ్చి మిర్చి ముద్ద – అర టీ స్పూను, పంచదార – పావు టీ స్పూను, బేకింగ్ సోడా – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – తగినంత, ఆవాలు – అర టీ స్పూను, జీలకర్ర – అర టీ స్పూను, కరివేపాకు – నాలుగు రెమ్మలు, ఇంగువ – పావు టీ స్పూను, కొత్తిమీర – అలంకరించడానికి తగినంత, క్యారట్ తురుము – అలంకరించడానికి తగినంత తయారీ: ఒక పాత్రలో సజ్జ పిండి, ఉల్లి తరుగు, పసుపు, మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్ద, పంచదార, బేకింగ్ సోడా, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. నీళ్లు పోసి పిండిని ముద్దగా కలపాలి. చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి. ఒక్కో ఉండను పొడవుగా సన్నగా ఒత్తాలి. స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె పోసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి. తయారుచేసి ఉంచుకున్న రోల్స్‌ను వేసి జాగ్రత్తగా కలపాలి. అర కప్పు నీళ్లు జత చేసి, కొద్దిగా కలిపి, సన్నటి మంట మీద సుమారు పది నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో ఒకసారి నెమ్మదిగా కలపాలి. బాగా ఉడికాయా లేదా అని టూత్ పిక్‌తో గుచ్చి పరిశీలించాలి. ఉడికిన వెంటనే దింపేసి కొత్తిమీర, క్యారట్ తురుములతో అలంకరించి, వేడివేడిగా అందించాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? సజ్జలు (Pearl Millet) నియాసిన్ (Niacin)mg (B3) 2.3 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.25 థయామిన్ (Thiamine) mg (B1) 0.33 కెరోటిన్ Carotene)ug 132 ఐరన్ (Iron)mg 8.0 కాల్షియం (Calcium)g 0.05 ఫాస్పరస్ (Phosphorous)g 0.35 ప్రొటీన్ (Protein)g 11.6 ఖనిజాలు (Minerals) g 2.3 పిండిపదార్థం (Carbo Hydrate) g 67.1 పీచు పదార్థం(Fiber) g 1.2 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 55.91 సజ్జ పకోడీ కావలసినవి: సజ్జ పిండి – అర కప్పు, సెనగ పిండి లేదా గోధుమ పిండి – అర కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, క్యారట్ తురుము – పావు కప్పు, పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంత, మిరప కారం – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ఒక పాత్రలో సజ్జ పిండి, సెనగ పిండి లేదా గోధుమ పిండి, ఉల్లి తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరుగు, మిరప కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా వేయాలి. బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. సజ్జ పకోడీలను టొమాటో సాస్, చిల్లీ సాస్‌లతో తింటే రుచిగా ఉంటుంది. సజ్జ పెసరట్టు కావలసినవి: సజ్జలు – ఒక కప్పు, పెసలు – ఒక కప్పు, బియ్యం – గుప్పెడు, జీలకర్ర – అర టీ స్పూను, ఇంగువ – పావు టీ స్పూను, తరిగిన పచ్చి మిర్చి – 4, అల్లం తురుము – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె లేదా నెయ్యి – అట్లు కాల్చడానికి తగినంత తయారీ: ఒక పాత్రలో సజ్జలు, పెసలు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టి, ఒంపేయాలి. గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర, ఇంగువ జత చేసి, మూత పెట్టి, గంటసేపు నాననివ్వాలి. స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేయాలి. గరిటెడు పిండి తీసుకుని, పెనం మీద సమానంగా పరచాలి. రెండు వైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి. సజ్జ హల్వా కావలసినవి: సజ్జ పిండి – ఒక కప్పు,బెల్లం పొడి లేదా పటిక బెల్లం పొడి – ఒక కప్పునెయ్యి – 2 టేబుల్ స్పూన్లుఏలకుల పొడి – అర టీ స్పూనుజీడి పప్పులు – తగినన్నికిస్మిస్ – తగినన్ని తయారీ: స్టౌ మీద బాణలిలో ఒక టీ స్పూను నెయ్యి వేసి కరిగాక సజ్జ పిండి వేసి దోరగా వేయించాలి. మూడు కప్పుల నీళ్లలో పటిక బెల్లం పొడి వేసి కరిగించి, వేయించుకుంటున్న పిండిలో పోసి కలుపుతుండాలి (బెల్లం పొడి వాడుతుంటే, మందపాటి పాత్రలో కొద్దిగా నీళ్లు, బెల్లం పొడి వేసి లేత పాకం పట్టాలి. ఆ పాకాన్ని వేయించుకుంటున్న పిండిలో వేసి కలియబెట్టాలి). బాగా ఉడుకుతుండగా ఏలకుల పొడి జత చేయాలి. కమ్మని వాసన వచ్చి హల్వాలా తయారయ్యేవరకు కలిపి దింపేయాలి. ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి పూసి, ఆ ప్లేట్లో హల్వా పోసి సమానంగా సర్దాలి. చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పులు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి. తయారుచేసుకున్న హల్వా మీద అలంకరించి వేడివేడిగా అందించాలి. సజ్జ తెప్లా కావలసినవి: సజ్జ పిండి – ఒకటిన్నర కప్పులు, గోధుమ పిండి – అర కప్పునూనె – 2 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి – చిటికెడు,పచ్చి మిర్చి + అల్లం + వెల్లుల్లి + ఉప్పు కలిపిన ముద్ద – 2 టీ స్పూన్లుకొత్తిమీర – 2 టీ స్పూన్లు, పంచదార పొడి – ఒక టీ స్పూనుపెరుగు – పిండి కలపడానికి తగినంత, ఉప్పు – తగినంత తయారీ: ఒక పెద్ద గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. నీళ్లు మరుగుతుండగా ఉప్పు వేసి కలిపి దింపేయాలి. ఒక పాత్రలో గోధుమ పిండి, సజ్జ పిండి, మెంతి పొడి, పంచదార పొడి, పచ్చిమిర్చి మిశ్రమం ముద్ద జత చేసి కలపాలి. వేడి నీళ్లు జత చేస్తూ పిండిని కలపాలి. పెరుగు జత చేస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలపాలి. పరాఠాల మాదిరిగా ఒత్తాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, ఒత్తుకున్న తెప్లాలను (పరాఠా మాదిరిగా) రెండు వైపులా దోరగా కాల్చి తీసేయాలి. కొత్తిమీరతో అలంకరించి చట్నీతో అందించాలి. -
త్వరలో అధిక దిగుబడులిచ్చే సజ్జ
- ఇక్రిశాట్ నేతృత్వంలో జన్యు పరిశోధనలు.. - కీలక జన్యువులను గుర్తించిన శాస్త్రవేత్తలు సాక్షి, హైదరాబాద్: అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటూనే అధిక దిగుబడులిచ్చే సజ్జ వంగడాల సృష్టికి మార్గం సుగమమైంది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సజ్జ మొక్కల జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా ఈ కీలక విజయాన్ని సాధించింది. సజ్జలు అతి తక్కువ నీటితో, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని మనగలవు. సాగుకయ్యే ఖర్చు కూడా తక్కువ కావడంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది చిన్న, సన్నకారు రైతులు సజ్జ పంటను సాగుచేస్తున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. దీనివల్ల ఇతర పంటల మాదిరిగానే సజ్జల దిగుబడులు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌తోపాటు చైనాలోని బీజీఐ షెన్జెన్, ఫ్రెంచ్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ తదితర పరిశోధన సంస్థలు సజ్జపై పరిశోధనలు చేపట్టాయి. సజ్జ జన్యుక్రమాన్ని ఆధునిక టెక్నాలజీల ద్వారా విశ్లేషించి మరింత ఎక్కువ వర్షాభావ పరిస్థితులను, 42 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలను తట్టుకోగల జన్యువులు, ఇతర మాలిక్యులర్ మార్కర్స్‌ను గుర్తించారు. ఈ క్రమంలోనే సజ్జల ద్వారా మరిన్ని ఎక్కువ పోషకాలు అందించడం ఎలాగో తెలుసుకున్నారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని మనగలిగే జన్యువులు, లక్షణాలను గుర్తించడం ద్వారా మెరుగైన దిగుబడులిచ్చే సజ్జ వంగడాల సృష్టి సులువవుతుందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ వార్‡్షణీ తెలిపారు. భవిష్యత్తులో ఈ పరిశోధనలను వరి, గోధుమలకూ విస్తరిస్తామని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బెర్గ్‌విన్సన్ తెలిపారు. పరిశోధన వివరాలు నేచర్ బయోటెక్నాలజీ మ్యాగజైన్ సంచికలో ప్రచురితమయ్యాయి. -
చిరు'చి '
సజ్జలు, జొన్నలు, రాగులు... ఇవి చిరుధాన్యాలు. చిరకాలం తినే రుచినిచ్చే ఆరోగ్యాన్ని సంరక్షించే.. ఆనందాన్ని అందించే కొన్ని చిరుధాన్యాలతో.. కొన్ని వంటకాలు ఈ చిరుచులు ఆస్వాదించండి. సజ్జ టిక్కా కావలసినవి: సజ్జలు – అర కప్పు; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు; తరిగిన క్యారెట్ – అర కప్పు; పచ్చి బఠానీలు – పావు కప్పు; కారం – అర టీ స్పూన్; జీలకర్ర పొడి – పావు టీ స్పూన్; చాట్ మసాలా – పావు టీ స్పూన్; గరమ్ మసాలా – చిటికెడు; తరిగిన కొత్తిమీర – కొంచెం; నూనె – తగినంత; ఉప్పు – సరిపడా. తయారి :సజ్జలను బాగా కడిగి 15–20 నిమిషాలు నాననివ్వాలి ∙బాణనిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తరిగిన ఉల్లిపాయముక్కలు, క్యారెట్, బఠానీలు వేసి కాసేపు వేగనివ్వాలి. దీనికి 1 కప్పు నీళ్లను పోసి సరిపడా ఉప్పు వేసుకోవాలి ∙నానపెట్టుకున్న సజ్జలను వేసి మూతపెట్టి చిన్న మంట మీద నీరు పూర్తిగా ఆవిరయ్యేంత వరకు ఉడకనివ్వాలి ∙పొడిపొడిగా వచ్చేలా చూసుకోవాలి. ఒకవేళ ఇంకా నీళ్లు ఉన్నట్టయితే ఇంకాసేపు మూతపెట్టి సన్నమంట మీద ఉంచుకోవాలి ∙కారం, జీలకర్రపొడి, చాట్ మసాలా, గరం మసాలా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ∙ఇలా తయారుచేసుకున్న దానిని ఉండలుగా చేసి అరచేతిలో టిక్కా మాదిరిగా ఒత్తుకోవాలి. (ఈ టిక్కాను బ్రెడ్ పొడిలో అద్దుకోవచ్చు) ∙స్టౌ మీద పెనం పెట్టి వేడయ్యాక నూనె వేసి ఒక్కొక్క టిక్కాను పెనం మీద వేసి సన్న మంట మీద బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా కాలనివ్వాలి ∙వీటిని టమోటో కెచెప్తో లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. మిల్లెట్ స్వీట్ పొంగల్ కావలసినవి : వరిగెలు – పావు కప్పు; సామలు – పావు కప్పు; పెసరపప్పు – 3 టేబుల్ స్పూన్లు; పాలు – పావు కప్పు; తరిగిన బెల్లం – అర కప్పు, లేదా బెల్లం పాకం – అర కప్పు; తురిమిన కొబ్బరి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 10; కిస్మిస్ – 15; యాలకులు – 6 (పొడి చేసుకోవాలి); నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు తయారి: ∙బెల్లంలో కొంచెం నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. తీగ పాకానికి దగ్గరగా ఉండగానే స్టౌ ఆఫ్ చేసి వడపోసి పక్కన పెట్టుకోవాలి ∙నెయ్యి వేడిచేసి జీడిపప్పు, కిస్మిస్ను వేయించుకోవాలి ∙వరిగెలు, సామలు, పెసరపప్పు ఈ మూడింటిని కలిపి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ∙ఉడికిన ఈ మిశ్రమానికి బెల్లం పాకం, కొబ్బరి తురుము, యాలకుల పొడి, పాలు పోసి మరో పది నిమిషాలు ఉడికించాలి ∙చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ∙ఈ పొంగలి వేడిగా కంటే చల్లారిన తర్వాత ఇంకా రుచిగా ఉంటుంది. మిల్లెట్ లడ్డు కావలసినవి: కొర్రలు – 3 టేబుల్ స్పూన్లు; సజ్జలు – 3 టేబుల్ స్పూన్లు; రాగులు – 3 టేబుల్ స్పూన్లు; సామలు – 3 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 10; పెసరపప్పు – 3 టేబుల్ స్పూన్లు, బార్లీ – 1 టేబుల్ స్పూను; తరిగిన బెల్లం – 1 కప్పు; యాలకులు – 4; నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు (కలపడానికి తగినంత). తయారి: ∙చిరుధాన్యాలు, పెసరపప్పు, బార్లీ, యాలకులు వేసి 10 నిమిషాల సేపు చిన్న మంటపై కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి ∙అన్నీ కలిపి కాకుండా ఒక్కొక్కటిగా కూడా వేయించుకోవచ్చు ∙ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా సన్న రవ్వలా పట్టుకోవాలి ∙చిన్న బాణలిలో నెయ్యి వేడిచేసి జీడిపప్పు వేయించాలి ∙పిండి ఉన్న జార్లో బెల్లం, జీడిపప్పు, నెయ్యి వేసి మళ్లీ ఒక్కసారి మిక్సీ పట్టాలి ∙ఈ పిండిని వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని కొంచెం కొంచెం నెయ్యి కలుపుతూ లడ్డూలు చేసుకోవాలి. (నెయ్యి వాడని వారు గోరు వెచ్చటి పాలతో కూడా లడ్డూలు చేసుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు) ∙వీటిని ఎయిర్‌టైట్ కంటెయినర్లో పెట్టుకోవాలి. వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి జొన్న ఉప్మా కావలసినవి: జొన్న రవ్వ 1 కప్పు; కరివేపాకు – 1 రెమ్మ; ఉడికించిన కూరగాయ ముక్కలు – 1 కప్పు (క్యారెట్, బీన్స్); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి – 2; అల్లం తరుగు – 1 చెంచా; నూనె – 2 చెంచాలు; కొత్తిమీర తరుగు – 2 చెంచాలు; ఆవాలు – 1 చెంచా; జీలకర్ర – అర చెంచా; శనగపప్పు – 2 చెంచాలు; మినప్పప్పు – 1 చెంచా; ఇంగువ – చిటికెడు; ఎండుమిర్చి – 2, జీడిపప్పు – 10. తయారి: ∙జొన్న రవ్వ దోరగా వేపుకుని పెట్టుకోవాలి ∙బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువతో పోపు పెట్టుకుని, దీనికి ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు చేర్చి, మూడు కప్పుల నీళ్లు పోసుకుని, తగినంత ఉప్పు చేర్చి, బాగా మరగనివ్వాలి ∙నీళ్లు బాగా మరిగేటప్పుడు, రవ్వ చేర్చి బాగా కలియపెట్టుకుని, మూత పెట్టు్టకుని, సన్నని సెగమీద బాగా ఉడికేవరకు ఉడకపెట్టుకోవాలి. నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుంటే కమ్మదనం పెరుగుతుంది. వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేయండి. ఈ ఉప్మా ఏ చట్నీతోనైనా తినవచ్చు. మార్పుచేర్పులు: పోపులో ఆకుకూర కూడా వేసుకోవచ్చు. కావాలకునేవాళ్లు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. దించబోయేముందు ఒక చెంచా నెయ్యి కలుపుకుంటే ఉప్మా రుచి పెరుగుతుంది. అన్ని రకాల చిరుధాన్యాల రవ్వలతో ఈ ఉప్మా తయారు చేసుకోవచ్చు. రాగి రొట్టె కావలసినవి: రాగుల పిండి – 1 1/2 కప్పు; ఉల్లిపాయ – 1; పచ్చిమిరపకాయలు – 2; కొత్తిమీర – 1 చిన్న కట్ట; ఆవాలు – 1 స్పూన్, జీలకర్ర – 1 స్పూన్; ఉప్పు – రుచికి సరిపడ, నూనె – తగినంత. తయారి : ముందుగా రాగుల పిండిని బాణలిలో వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించిన తర్వాత ఈ మిశ్రమాన్ని, ఉప్పును పిండిలో కలుపుకోవాలి ∙ఇప్పుడు వేరే గిన్నెలో నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి ఈ వేడి నీళ్లను కొంచెం కొంచెంగా పిండిలో పోస్తూ గరిటెతో కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా చేతితో రొట్టెలా ఒత్తడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి ∙ఈ పిండిని మనకు కావలసిన సైజులో ఉండలుగా చేసుకుని ఒక ప్లాస్టిక్ కవరుపై నూనె రాసి చేతితో రొట్టెలా చేసుకోవాలి ∙స్టౌ పైన పెనం పెట్టి వేడయ్యాక, 1 స్పూన్ నూనె వేసి, కవరుపై చేసిన రాగి రొట్టెను జాగ్రత్తగా పెనంపై వేసి రెండు వైపులా కాలనివ్వాలి ∙వేడి వేడి రాగి రొట్టెలకు కొత్తిమీర పచ్చడి లేదా కొబ్బరి పచ్చడి మంచి కాంబినేషన్. -
శక్తివనరులు... సజ్జలు
చూడటానికి సజ్జలు చిన్నగా అనిపిస్తాయేమోగానీ వాటి వల్ల సమకూరే శక్తి మాత్రం చాలా ఎక్కువ. పీచుపదార్థాలు ఇంకా ఎక్కువ. సజ్జలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకుంటే వాటితో చేసే వంటకాలను పదే పదే తింటారు. సజ్జలతో ఒనగూరే ప్రయోజనాల్లో కొన్ని... ♦ సజ్జల్లో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. వంద గ్రాముల సజ్జల్లో మూడు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే రక్తహీనత (అనీమియా) ఉన్నవారు సజ్జలతో తయారు చేసిన పదార్థాలు తినడం మేలు. ♦ సజ్జల్లో ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తి వనరు. కణజాలం అభివృద్ధి కోసం కూడా ఫాస్ఫరస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఇక వరి, గోధుమల కంటే సజ్జల్లో ప్రోటీన్లు ఎక్కువ. అందుకే కణజాలం రిపేర్లకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ♦ సజ్జల్లో పీచు పాళ్లు ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఇవి తోడ్పడతాయి. అంతేగాక ఈ పీచు వల్ల ఒంట్లోకి వచ్చే చక్కెర పాళ్లు చాలా నెమ్మదిగా విడుదలవుతుంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు సజ్జలతో చేసిన పదార్థాలు తినడం మంచిది. సజ్జల్లో ఉన్న పీచు పదార్థాలు మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి. ♦ సజ్జల్లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. అందుకే అవి ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. వయసు పెరిగే కొద్ది వచ్చే వ్యాధులను నిరోధిస్తాయి. -
ఇంటి సజ్జ కూలి ఒకరి దుర్మరణం
మొగుళ్ళపల్లి : ఇంటిని కూల్చి వేస్తుండగా ప్రమాదవశాత్తు సజ్జ కూలి మీదపడి ఓ కూలీ మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఇటీవల మొగుళ్లపల్లి-పరకాల ప్రధాన రహదారికి ఆర్ ఆండ్ బీ, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మార్కింగ్ చేశారు. దీంతో ఇంటి యజమానులు తమ ఇళ్లను కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో దాసరి శంకర్లింగం తన ఇంటిని కూల్చివేసేందుకు పిడిసిల్ల గ్రామానికి చెందిన కూలీలను పిలిచాడు. బుధవారం ఇంటి సజ్జపై నిలబడి కేతిరి తిరుపతి(40) అనే కూల్చివేత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు సజ్జ కూలడంతో అతడు కిందపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే సజ్జను తొలగించేందుకు ప్రయత్నించగా సజ్జ లేవకపోవడంతో జేసీబీ సాయంతో తిరుపతిని బయటకు తీశారు. కాగా అతడు అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. కూలీ పనికి వచ్చి తిరుపతి మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటారుు. తహసీల్దార్ రాజ్‌కుమార్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తిరుపతి కుటుంబ సభ్యులు తమకు ఇంటి యజమాని శంకర్లింగం నష్టపరిహారం చెల్లించాలని శవంతో బైఠాయించి కొద్దిసేపు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై రాజమౌళి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
చినుకు పడదే..!
సాక్షి, నెల్లూరు: వాన కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. జూన్ ముగుస్తున్నా ఎండలు మండిపోతున్నాయి. చినుకు రాలక మేఘాలు చాటేస్తున్నాయి. చెరువులు ఎండాయి. జలాశయాల్లో నీటి మట్టం తగ్గింది. మెట్ట ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో తాగునీరు అందక జనం నానా అవస్థ పడుతున్నారు. జూన్‌లో 56 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 5.6 మి.మీ. మాత్రమే నమోదైంది. దీంతో సోమశిల పరిధిలో లేట్ ఖరీఫ్ సైతం ఆశించిన స్థాయిలో సాగుకు నోచుకోలేదు. మరోవైపు జిల్లావాసులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. పదును వాన కురిస్తే జిల్లా వ్యాప్తంగా వేలాది హెక్టార్లలో జీలుగ, జనుము, పిల్లిపెసర, కంది, పెసర తదితర పంటలు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు 50 శాతం సబ్సిడీతో విత్తనాలను సిద్ధం చేసి ఉంచారు. ఎరువులను కూడా తగిన మోతాదులో సిద్ధంగా ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురిస్తే జిల్లా వ్యాప్తంగా 65 వేల హెక్టార్లలో పంటలు సాగుకానున్నాయి. 30 వేల హెక్టార్లలో జీలుగ, జనుము, పిల్లిపెసర, 1500 హెక్టార్లలో కంది, 900 హెక్టార్లలో సజ్జ, 170 హెక్టార్లలో మొక్కజొన్న, 5 వేల హెక్టార్లలో పత్తి తదితర పంటలు సాగుకానున్నాయి. ఇప్పటికే 12 వేల క్వింటాళ్లు జీలుగ, 3,500 క్వింటాళ్లు జనుము, 5 వేల క్వింటాళ్లు పిల్లిపెసర, 200 క్వింటాళ్లు కంది ,150 క్వింటాళ్లు పెసర విత్తనాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ నెల 6న వింజమూరు, దుత్తలూరు, ఆత్మకూరు, డక్కిలి, బాలాయిపల్లి ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లులు కురిశాయి. గత కొద్దిరోజులుగా ఆకాశంలో మబ్బులు వస్తున్నా చినుకు మాత్రం రాలడంలేదు. ఈ నెల చివరి నాటికైనా మంచి వర్షం కురవకపోతు రైతులకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 1800 చెరువులు ఎండిపోయాయి. శ్రీశైలం, కండలేరు జలాశయాల్లో నీటిమట్టం తగ్గుతోంది. ఈ పరిస్థితిలో సకాలంలో వర్షాలు కురవకపోతే జిల్లాలో పూర్తిస్థాయిలో పంటలు సాగయ్యే అవకాశంలేదు. ఇక జిల్లాలో డెల్టాప్రాంతాన్ని పక్కన బెడితే మెట్టప్రాంతాల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి తదితర ప్రాంతాల రైతులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే ఇక్కడ భూగర్భజలాలు అడుగంటాయి. బావులు ఎప్పుడో ఎండిపోయాయి. వర్షం సకాలంలో కురవక పోతే ఖరీఫ్సాగు సంగతి దేవుడెరుగు తాగునీటికి ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే జిల్లాలో వెంకటగిరి, ఉదయగిరి, కావలి, గూడూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో సాగులో ఉన్న అరటి, నిమ్మ, మామిడి, సజ్జ, పత్తి తదితర పంటలు వర్షంలేక ఎండుతున్నాయి. ఈ పరిస్థితిలో అన్నదాతలు వానల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు జిల్లా రైతాంగంలో ఆందోళన నెలకొంది. ఎన్నికల ముందు రుణమాఫీ అన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మెలికపెట్టి రుణమాఫీ అమలును తుంగలో తొక్కే ప్రయత్నానికి దిగాడు. ఈ నేపథ్యంలో రైతులకు ఖరీఫ్ రుణాలు సకాలంలో కాదుకదా అసలు అందేలా కనిపించడంలేదు. పాతరుణాలు చెల్లిం చందే బ్యాంకులు తిరిగి రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. మరోవైపు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు రైతులపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఈ సారి వ్యవసాయం సక్రమంగా సాగుతుందా అన్న అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి.