ఇంటిని కూల్చి వేస్తుండగా ప్రమాదవశాత్తు సజ్జ కూలి మీదపడి ఓ కూలీ మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం జరిగింది.
మొగుళ్ళపల్లి : ఇంటిని కూల్చి వేస్తుండగా ప్రమాదవశాత్తు సజ్జ కూలి మీదపడి ఓ కూలీ మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఇటీవల మొగుళ్లపల్లి-పరకాల ప్రధాన రహదారికి ఆర్ ఆండ్ బీ, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మార్కింగ్ చేశారు. దీంతో ఇంటి యజమానులు తమ ఇళ్లను కూల్చి వేస్తున్నారు.
ఈ క్రమంలో దాసరి శంకర్‌లింగం తన ఇంటిని కూల్చివేసేందుకు పిడిసిల్ల గ్రామానికి చెందిన కూలీలను పిలిచాడు. బుధవారం ఇంటి సజ్జపై నిలబడి కేతిరి తిరుపతి(40) అనే కూల్చివేత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు సజ్జ కూలడంతో అతడు కిందపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే సజ్జను తొలగించేందుకు ప్రయత్నించగా సజ్జ లేవకపోవడంతో జేసీబీ సాయంతో తిరుపతిని బయటకు తీశారు. కాగా అతడు అప్పటికే మృతిచెందాడు.
మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. కూలీ పనికి వచ్చి తిరుపతి మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటారుు. తహసీల్దార్ రాజ్‌కుమార్, టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తిరుపతి కుటుంబ సభ్యులు తమకు ఇంటి యజమాని శంకర్‌లింగం నష్టపరిహారం చెల్లించాలని శవంతో బైఠాయించి కొద్దిసేపు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై రాజమౌళి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.