క్వారీలో అదపాక ఈశ్వరరావు మృతదేహం మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్‌ఐ
తండ్రి పదేళ్ల కిందటే మృతి చెందాడు. ఇక తల్లి, ఇద్దరు అక్కచెల్లెల్ల భారం అతడిపై పడింది. కుటుంబపోషణను తనపై వేసుకుని ట్రాక్టర్ కూలీగా పగలూరాత్రి కష్టపడి తన ఇద్దరు సోదరిమణులకు వివాహం చేశాడు. తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ కాలం నెట్టుకొస్తున్న సమయంలో విధికి కన్నుకుట్టింది. రాయి రూపంలో అతడిని మృత్యువు కాటేసింది. తల్లికి ఆదారంగా ఉన్న కుమారుడిని అనంతలోకాలకు తీసుకెళ్లి ఆ మాతృమూర్తికి గర్భశోకాన్ని మిగిల్చింది. క్వారీలో బండరాయి తగిలి సంతకవిటి మండలంలోని సిరిపురం గ్రామానికి చెంది న ట్రాక్టర్ కూలీ మృతి చెందాడు. వివరాలు ఇలావున్నాయి.
పొందూరు:మండలంలో రాపాక గ్రామానికి సమీపంలోని గారకొండలో సోమవారం ప్రమాదం జరిగింది. సంతకవిటి మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన అదపాక ఈశ్వరరావు(29) మృతి చెందాడు. క్వారీలో ఉన్న చిన్న రాళ్లను ట్రాక్టర్‌లోకి ఎత్తుతుండగా కొండ పైనుంచి పడిన రాయి ఇతని తలకు బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయాలు పాలైన ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో ట్రాక్టర్ డ్రైవరు బూరాడ పోలినాయుడు దూరంగా ఉండటంతో అతడికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. మృతుడుకి తల్లి రమణమ్మ, అక్కచెల్లెల్లు చిత్తిరి బాలామణి, వసంత కుమారి ఉన్నారు. అక్కచెల్లెల్లుకు పెళ్లిల్లు జరగడంతో జి.సిగడాం మండలం అగ్రహారంలో ఉంటున్నారు. తల్లి వృద్ధురాలు కావడంతో ఆమె పోషణంతా ఈశ్వరరావు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఇతడు మృతి చెందడంతో తల్లిని చూసే దిక్కులేకుండా పోయింది. ఈశ్వరరావు తండ్రి పదేళ్ల క్రిత మే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ బాలరాజు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
మిన్నంటిన బంధువుల రోదనలు
మృతుడు ఈశ్వరరావు కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తమ గ్రామంలో ఈశ్వరరావుకు మంచి గుర్తింపు ఉంది. ప్రజలు ఏ పని చెప్పినా చేసే మనస్తత్వంతో మెలిగేవాడని చెబుతున్నారు. ఈశ్వరరావు మృతి చెందిన విషయం తెలియడంతో గ్రామంలోని అధిక సంఖ్యలో మహిళలు క్వారీకి చేరుకున్నారు.
బ్లాస్టింగ్ సమయాల్లో రాళ్లను ఝలిపించకపోవడమే...
బ్లాస్టింగ్‌లు సమయాల్లో కొండపై నుంచి రాళ్లు దూరంగా పడతాయి. కొన్ని అక్కడే పడిపోతాయి. మరికొన్ని రాళ్లు ఊడీఊడకుండా కొండకు అతుక్కొని ఉండిపోతాయి. అటువంటివి గుర్తించి కిందకు పడే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రాళ్ల పరికరాలతో ఝుళిపించాలి. అలా జరగకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని క్వారీ కార్మికులు పలువురు చెబుతున్నారు.
సిరిపురంలో విషాదం
సంతకవిటి: సిరిపురం గ్రామానికి చెందిన అదపాక ఈశ్వరరావు అనే ట్రాక్టర్ కూలీ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈశ్వరరావు మృతితో కుటుంబీకుల రోదన మిన్నంటింది. అయ్యో దేవుడా ఎంతపని చేశావంటూ మృతుడి తల్లి విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. మృతదేహం గ్రామానికి చేరుకోగానే ఆర్తనాదాలు మిన్నంటాయి. ఒంటరైన ఈశ్వరరావు తల్లి రమణమ్మను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment